Home Telugu Articles గెలుపు దారిలో మలుపులెన్నో! నల్లధనంపై నిరంతర పోరాటం

గెలుపు దారిలో మలుపులెన్నో! నల్లధనంపై నిరంతర పోరాటం

0
SHARE

రూ.2000 నోటు వల్ల నల్లధనం మరింత పెరుగుతుందన్న వాదన అర్థంపర్థం లేనిది. ఈ నోటు తీసుకొచ్చిన ప్రభుత్వానిది మూర్ఖత్వం కాదు. ఆ మాటకొస్తే ఇక్కడి ప్రజలూ మూర్ఖులు కారు. bibike-debrayసమస్యను ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసు. ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తోంది. ఈ నోటు కారణంగా నల్లధనం ఏర్పడకుండా నిరోధించడానికి గట్టి చర్యలు చేపడుతోంది. అసలు ఈ నోటు ఎందుకు అవసరమైందో గమనించాలి. అధిక ముఖవిలువ గల ఈ నోటు ముద్రణ వ్యయం తక్కువ. పైగా ఇది చాలాకాలం మన్నుతుంది. అందుకే ఈ నోటుకు ప్రభుత్వం ఓటు వేసింది. అసలు పెద్దనోట్ల రద్దు అన్నదే అత్యంత రహస్యంగా చేపట్టిన చర్య. దీని అమలులో ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా, దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలు తథ్యం!

– బిబేక్‌ దేబ్రాయ్‌

డబ్బు కలిగి ఉండటం అక్రమం కాదు. భారతదేశంలో ఇప్పటికీ పెద్దయెత్తున నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. నగదు రహిత వ్యవస్థ వైపు పయనమన్నది క్రమానుగతంగా జరిగే ప్రక్రియ. నల్లధనం అనే పదాన్ని ఎడాపెడా వాడేస్తున్నారు. దీనికి రెండు భిన్న అర్థాలు ఉన్నాయి. మొదటిది- చట్ట విరుద్ధంగా అక్రమ మార్గాల ద్వారా ఆదాయం పొందితే- అది నల్లడబ్బు కిందకు వస్తుంది. ఉదాహరణకు మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా, అవినీతి ద్వారా పొందే డబ్బు. రెండోది- నల్లధనానికి కారణమయ్యే కార్యకలాపాలు అక్రమమైనవి కాకపోయినప్పటికీ, ఆ డబ్బు మీద పన్నులు చెల్లించకపోతే- అది నల్లడబ్బు కిందకే వస్తుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో నల్లడబ్బు పరిమాణానికి సంబంధించి సరైన అంచనాలు లేవు. జీడీపీలో సంఘటిత, అసంఘటితరంగ పరిమాణానికి సంబంధించే చాలా అంచనాలు ఉన్నాయి. జీడీపీలో నల్లధనం వాటా ఎంత అన్నదానిపై అంచనాలు లేవు. జీడీపీలో అసంఘటిత రంగం వాటా 40 శాతమని, నల్లధనం వాటా 20 శాతమని అంటున్నారు. అవన్నీ ఉజ్జాయింపు లెక్కలే. నల్లడబ్బు రెండు రకాలు. పాత నల్లడబ్బు. కొత్త నల్లడబ్బు. పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి మొన్న, నవంబరు ఎనిమిదిన చేసిన ప్రకటన కొత్తగా నల్లడబ్బు పేరుకుపోకుండా నిరోధించడానికి ఉద్దేశించినది కాదు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంది. మరికొన్ని చర్యలు తీసుకోనున్నది. ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇప్పటికే తీసుకున్న చర్యల వివరాలు వెల్లడించారు.

ఆరంభం మాత్రమే…

నల్లడబ్బు భరతం పట్టడానికి ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది. నవంబరు ఎనిమిది నాటి ప్రకటన అందులో ఒకటి. ఈ ఒక్క చర్య వల్లే నల్లడబ్బు సమస్య పరిష్కారమైపోదు. నల్లడబ్బు వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలన్నింటికీ ఇదొక్కటే పరిష్కారమూ కాదు. నల్లడబ్బు నిల్వలు నగదు రూపంలోనే ఉండాలనేమీ లేదు. స్థిరాస్తి, ఆస్తి, భూమి, బంగారం రూపంలో అది ఉండవచ్చు. ఆ తరహాలో కూడబెట్టిన నల్లధనాన్ని, పెద్దనోట్ల రద్దు వంటి ఒక్క చర్య ద్వారానే కాకుండా ఇంకా అనేక చర్యల ద్వారా అరికట్టవచ్చు. నేడు ప్రజల వద్ద చలామణీ అవుతున్న నగదు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అది తీవ్ర స్థాయిలో పెరిగింది. 85 శాతం నగదు పెద్దనోట్ల రూపంలోనే చలామణీలో ఉంది. ఎందుకిలా జరిగిందన్నది స్పష్టం కావడంలేదు. కోట్ల కొద్దీ నకిలీ కరెన్సీ ఏటా వ్యవస్థలోకి చేరుతున్నట్లు అంచనా. అందులో చాలావరకు రూ.500, రూ.1000 నోట్ల రూపంలోనే ఉంది. నకిలీ నోట్ల మీద ఉద్ధృతంగా పోరాడాల్సిందే. ఈ పోరాటం నిరంతరం సాగాల్సిందే. నోట్లలో భద్రతాపరమైన కట్టుదిట్టమైన అంశాలు ప్రవేశపెట్టేందుకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిందే. రూ.14 లక్షల కోట్ల మేరకు పెద్ద (రూ.500/ 1000) నోట్లు చలామణీలో ఉన్నాయని అనుకొందాం. అందులో సుమారు మూడు లక్షల కోట్ల వరకు రెండు విధాలా నల్లధనమే. అంటే చట్టవిరుద్ధ పద్ధతుల్లో అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయమూ; చట్టబద్ధంగా సంపాదించినప్పటికీ పన్ను చెల్లించకుండా కూడబెట్టిన ఆదాయమూ అందులో ఉందన్నమాట. తొమ్మిది లక్షల కోట్లు చట్టబద్ధమైన నగదు. మిగిలిన రెండు లక్షల కోట్లు దాచిపెట్టిన డబ్బు. అది బ్యాంకింగ్‌ వ్యవస్థలో చేరలేదు.

ఈ తొమ్మిది లక్షల కోట్లలో ఏడు లక్షల కోట్ల రూపాయల నగదును లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడిక పెద్దనోట్లు చెల్లవని ప్రకటించారు కనుక, వాటిని వ్యవస్థ నుంచి తొలగించి, కొత్త నోట్లు ప్రవేశపెడతారు. దీనివల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందన్న మాట నిజమే. బాధ్యతగల పౌరులుగా ఈ అసౌకర్యాన్ని భరించడానికి మనం సిద్ధపడాల్సిందే. లేకపోతే, ఆ మూడు లక్షల కోట్ల విషయంలో ప్రభుత్వం ఏమీ చేయరాదని అనాలా, అలా అనగలమా? ఈ మూడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి గట్టి చర్య తీసుకోవాలి. తద్వారా కొత్త నల్లధనాన్ని అరికట్టవచ్చు. ప్రజల వద్ద రెండు లక్షల కోట్ల రూపాయలు పేరుకుపోయి ఉన్నాయి. వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. ఆ డబ్బుగలవారికీ ఎలాంటి ప్రయోజనం కలగడంలేదు. అదంతా ఇప్పుడు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చి చేరుతోంది. బ్యాంకులు మరింత ద్రవ్యం కలిగి ఉంటాయి. ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి తీసుకునే డబ్బును ప్రజోపయోగ పథకాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనంలో దాదాపు రెండు లక్షల కోట్లు పన్ను చెల్లించకపోవడం వల్ల నల్లడబ్బుగా మారిందే. మరో లక్ష కోట్లు పూర్తిగా నల్లధనమే. (సుమారు రూ. 1.25 లక్షల కోట్ల నల్లధనం నవంబరు ఎనిమిదికి ముందే వ్యవస్థలోకి వచ్చి చేరింది). ఈ రెండు రకాల నల్లడబ్బు విషయంలోనూ పాతవాటికి కొత్తవి ఇవ్వడంపై మోసాలు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు, రూ.1000 నోటు ఇస్తే రూ.350 ఇస్తున్నట్లు కొందరు నాకు తెలిపారు. కొంతమంది చాలా ఎక్కువ రేటుపై బంగారం కొనుగోలు చేస్తున్నారు. తద్వారా నల్లడబ్బును మార్చుకుంటున్నారు. ఏ విధంగా చూసినా, నల్లడబ్బు కలిగి ఉన్నవారు తీవ్రంగా దెబ్బతిన్నారనడంలో సందేహం లేదు. వారు నూటికి నూరుశాతం నష్టపోయి ఉండకపోవచ్చు. కానీ, వారికి గట్టి శరాఘాతమే తగిలింది.

భారత్‌లో సత్ఫలితాలు

నేను మోదీకి పెద్ద అభిమానిని. గొప్ప గొప్ప నాయకులు మాత్రమే చేసే ఘనమైన పనులను ఆయన చేశారు. బ్రహ్మాండమైన లక్ష్యాలు నిర్దేశించారు. ఆ లక్ష్యాల సాధనకు గడువులు jim-yangవిధించారు. ఆ లక్ష్యాల విషయంలో సిబ్బందిని బాధ్యులను చేశారు. ఈ పద్ధతిలో మంచి ఫలితాలు సాధించవచ్చునని ఇప్పటికే నిరూపితమైంది. భారతదేశంలో ఫలితాలు రావడం ఇప్పటికే ఆరంభమైంది. సులభ వాణిజ్యానికి సంబంధించిన నివేదికలోనూ అదే ప్రతిఫలించింది. అందుకే మోదీ అంటే నాకెంతో అభిమానం!

– జిమ్‌ యాంగ్‌ కిమ్‌ (ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు)

 

చట్టబద్ధ నిర్ణయం

పరివర్తన దిశగా సాఫీగా ఎలా సాగిపోవాలన్నది పెను సవాలు. అంతకుముందు తెలుసుకోవలసిన విషయం మరొకటుంది. ఆర్‌బీఐ చట్టం ప్రకారం పెద్ద నోట్లను రద్దుచేసే అధికారం ఆర్‌బీఐకి ఉంది. అందుకోసం వేరే చట్టమేదీ అవసరం లేదు. (కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నందువల్ల ఇది చెప్పాల్సి వస్తోంది). బ్యాంకులపరంగానూ, ఏటీఎంల పరంగానూ ఈ పరివర్తన చోటుచేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) కింద 25.5 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. దేశంలో బ్యాంకు ఖాతాలు లేని వ్యక్తులు, కుటుంబాలకు సంబంధించి గణాంక వివరాలు రూపొందించినప్పుడు, పీఎంజేడీవై, బ్యాంకు మిత్రలు, మైక్రో ఏటీఎంలు, స్మార్ట్‌ఫోన్లను పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఈ పరివర్తన ప్రక్రియలో అత్యంత సులువైనది నోట్లను ముద్రించడం. తరవాత ఆ నోట్లను బ్యాంకులకు, ఆపై ఏటీఎంలకు తరలిస్తారు. ఈ ఏర్పాట్లన్నీ ముందు నుంచే మొదలుపెడితే, నోట్ల రద్దు గురించి బయటకు తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో అసలు లక్ష్యమే నీరుగారిపోతుంది. డబ్బు బ్యాంకులోని ఖాతాలో ఉంటేనే, సులువుగా ఉపసంహరించుకోవచ్చు. నోట్ల మార్పిడీ ఇప్పుడు సులభంగా జరుగుతోంది. ఒక్కొక్కరే పదే పదే డబ్బు మార్చుకొనకుండా చేతి వేలికి చెరగని సిరా చుక్క వేస్తుండటంతో, మోసగాళ్లు పేదలను స్వార్థం కోసం ఉపయోగించుకొనే పద్ధతికి అడ్డుకట్ట పడింది. ఏటీఎంలు ఒకదారికి రావడానికి మాత్రం కొంత సమయం పడుతుంది.

 

(ఈనాడు సౌజన్యం తో )