Home Uncategorized మహిళా హక్కులంటే లెక్కలేదా?

మహిళా హక్కులంటే లెక్కలేదా?

0
SHARE

‘తలాక్‌’ ప్రగతి నిరోధకం

కాలం మారుతోందని బాబ్‌ డైలాన్‌ అనేక ఏళ్ల క్రితమే గొంతెత్తి పాడారు. (2016సంవత్సరానికిగాను సాహిత్యంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి గెలుచుకున్న విశ్వ విఖ్యాత అమెరికా సంగీత స్రష్ట, గాయకుడు, గేయ రచయిత డైలాన్‌). దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వెంటవెంటనే ముమ్మారు తలాక్‌ చెప్పగానే పెళ్లి పెటాకులయ్యే సంప్రదాయం బాధితులైన వందలాది ముస్లిం మహిళలు- కాలంతోపాటు మారని, ప్రగతి వ్యతిరేక పురుషస్వామ్య సమాజం కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. ముమ్మారు తలాక్‌ చెప్పే దుస్సంప్రదాయాన్ని అనేక దేశాలు నిషేధించాయి. భారత్‌లో మాత్రం దానికి మద్దతు లభిస్తుండటం దిగ్భ్రాంతికరం. మతం లేదా ఖురాన్‌ ఈ సంప్రదాయాన్ని అనుమతించడంలేదని ఇస్లామిక్‌ పండితులు, మహిళా సంఘాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, సంస్కరణ చేపట్టడమంటే మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ, ఆ ప్రయత్నాన్ని అఖిలభారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) వ్యతిరేకిస్తోంది. ఏఐఎంపీఎల్‌బీకి ముస్లిం సమాజంలో గట్టి మద్దతు లభిస్తోందా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే, ముమ్మారు తలాక్‌ చెప్పడం వంటి ప్రగతి నిరోధక, నిరంకుశ సంప్రదాయాలను దుర్వినియోగం చేసేందుకు అనుమతించే బదులు మహిళలు తదితర బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సాగుతున్న కృషిలో ఇలాంటి సంస్థలు ముందువరసలో నిలబడాలి. తలాక్‌ తరహా కాలంచెల్లిన సంప్రదాయాల వల్ల బాధితుల బతుకుల్లో కల్లోలం చెలరేగుతున్నప్పటికీ, దీన్ని సమర్థిస్తున్నవారు ఈ తరహా సంప్రదాయాలను శాశ్వతీకరించేందుకు బూటకపు వాదనలు వినిపిస్తున్నారు. వారిలో కొందరైతే, ఉపశమనం కోరుతూ న్యాయస్థానం తలుపులు తట్టారు. భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ ముస్లిం మహిళలకు సమాన హోదా, గౌరవం దఖలుపడ్డాయి. బహుళత్వం, భిన్నత్వం పేరుతో వాటిని ఎలా నిరాకరిస్తారు?

ముస్లిం దేశాల మాటేమిటి?

అనేక ఇస్లామిక్‌ దేశాలు ముమ్మారు తలాక్‌ చెప్పడాన్ని, బహు భార్యత్వాన్ని రద్దుచేశాయి. ఇలాంటప్పుడు భారత్‌ వంటి లౌకిక దేశంలో రాజ్యాంగం ప్రకారం వర్తించే మౌలిక హక్కులను భారతీయ ముస్లిం మహిళలకు ఎలా నిరాకరిస్తారు? మత రాజ్యాలు సైతం విడాకుల చట్టాలను, బహుభార్యత్వాన్ని నియంత్రించినప్పుడు, తప్పనిసరి మత సంప్రదాయాల పేరిట యథాతథ పరిస్థితి కొనసాగించాలని వాదించడం సరికాదు. ఇస్లామిక్‌ దేశాల్లోనే వివాహ చట్టాలను క్రమబద్ధీకరించినప్పుడు, అది షరియాకు వ్యతిరేకం కాదని భావించినప్పుడు భారతదేశంలో మాత్రం ఈ కర్కశ సంప్రదాయాలను ఎలా అనుమతించగలం? ‘వైయక్తిక చట్టాలు విచక్షణకు తావీయరాదు, మానవ గౌరవం విషయంలో రాజీపడరాదు; మతమన్నది వ్యక్తుల హక్కులను శాసించజాలదు’ అంటూ నా సహచరుడు అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేయదలిచాను. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా హిందువులు, క్రైస్తవుల వైయక్తిక చట్టాలను ఇదివరకటి ప్రభుత్వాలు సవరించిన విషయాన్ని గమనించాలి. కేవలం ఒక్క మతాన్నే లక్ష్యంగా చేసుకొంటున్నారన్నది తప్పుడు ప్రచారం. ముమ్మారు తలాక్‌ చెప్పడమన్నది ఖురాన్‌ వ్యతిరేక సంప్రదాయమని, అందువల్ల చట్టం ద్వారా దాన్ని రద్దుచేయాల్సిన అవసరం ఉందని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ (బీఎంఎంఏ) సైతం అభిప్రాయపడింది. బీఎంఎంఏ సహ సంస్థాపకులు నూర్జహాన్‌ సఫియా నియాజ్‌, జకియా సోమన్‌ గతేడాది నవంబరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ మేరకు ఒక లేఖ రాశారు. జాతీయ స్థాయిలో జరిపిన పరిశోధన ఫలితాలను తాము ప్రచురించిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. ఆ పరిశోధనలో భాగంగా 10 రాష్ట్రాలకు చెందిన 4,710 ముస్లిం మహిళల అభిప్రాయాలను ప్రాథమిక నమూనాగా సేకరించారు. దాని ప్రకారం- నోటిమాటగా, ఏకపక్షంగా విడాకులు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించాలని 92.1 శాతం మహిళలు కోరగా, బహుభార్యత్వాన్ని 91.7 శాతం వ్యతిరేకించారు. ఈ విషయాన్ని వారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

‘ముమ్మారు తలాక్‌ చెప్పడమన్నది మతపరమైన తంతుకాదు. మతం పేరుతో పురుషస్వామ్యం, అధికారతత్వం రుద్దుతున్న బూటకపు సంప్రదాయమది. విడాకులకు సంబంధించి ఖురాన్‌లోని న్యాయ, ధర్మ సూత్రాల గురించి సాధారణ ముస్లిం మహిళలు, పురుషులకు అవగాహన కల్పించడం ముఖ్యం. ముమ్మారు తలాక్‌ చెప్పడమన్నది ఖురాన్‌కు వ్యతిరేకమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ప్రధానం. కొన్ని పిడివాద పురుషస్వామ్య సంస్థలు ఖురాన్‌కు వ్యతిరేకంగా, అన్యాయంగా తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచిన తీరును అప్పుడే ఎండగట్టగలం’- అని ఒక న్యూస్‌పోర్టల్‌లో రాసిన వ్యాసంలో వారు స్పష్టం చేశారు. ముమ్మారు తలాక్‌ చెప్పడాన్ని నిషేధించాలని ప్రముఖ ముస్లిం చట్టవ్యవహారాల నిపుణుడు తాహిర్‌ మెహమూద్‌ సైతం ఒక మీడియా ఇంటర్వ్యూలో అన్నారు. ‘మూలంలోకి వెళ్లి చూసినప్పుడు అది హేతుబద్ధంగా, వాస్తవికంగా, ఆధునికంగానే ఉంది. కానీ కాలప్రవాహంలో గుర్తుపట్టలేనంత వికృతంగా తయారైంది. తలాక్‌ అధికారాన్ని నిరంకుశంగా, నిర్హేతుకంగా ఉపయోగించుకొనే స్వేచ్ఛ భర్తకు ఉన్నట్లు ఇస్లామిక్‌ చట్టంలో ఎక్కడా లేదు. కానీ, ఇప్పటి ముస్లిం పురుషులు సరిగ్గా అదే చేస్తున్నారు’- తలాక్‌పై బీఎంఎంఏ ప్రచురించిన నివేదికకు ముందుమాట రాసిన ఆయన, విడాకులకు సంబంధించి ఇస్లామిక్‌ చట్టాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఒకేసారి ముమ్మార్లు తలాక్‌ అనడాన్ని ఖురాన్‌ అనుమతించడంలేదని ‘ఇస్లామిక్‌ ఫోరం ఫర్‌ ద ప్రమోషన్‌ ఆఫ్‌ మోడరెట్‌ థాట్‌’ సెక్రెటరీ జనరల్‌ ఎ.ఫైజుర్‌ రెహ్మాన్‌ అన్నట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. ‘ఇస్లామిక్‌ చట్టంలో దానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఉలేమా దాన్ని రద్దుచేయాల్సిన సమయమిది’ అని ఆయన అన్నట్టు తెలిసింది. ముమ్మార్లు తలాక్‌ చెప్పడంమీద పూర్తి నిషేధం విధించాలని కోరుతూ బీఎంఎంఏ సారధ్యంలో ఒక విజ్ఞాపనపత్రం మీద 50 వేలమందికి పైగా భారతీయ మహిళలు, పురుషులు సంతకాలు చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

14వ అధికరణ, 15వ అధికరణ భారత రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన, ముఖ్యమైన అంశాలని ఈ సందర్భంగా నొక్కి చెప్పదలిచాను. భారత ప్రజాస్వామిక వ్యవస్థలోని మౌలిక విలువలకు అవి అద్దంపడుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. ‘భారత ప్రాదేశిక పరిధికి లోబడి చట్టం ముందు సమానతను లేదా చట్టపరమైన సమాన రక్షణను ఏ ఒక్క వ్యక్తికీ ప్రభుత్వం నిరాకరించజాలదు’ అని అది అంటోంది. ‘మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వాటిలో ఏ ఒక్కదాన్నో ప్రాతిపదికగా తీసుకొని ఏ ఒక్క పౌరుడి పట్లా ప్రభుత్వం విచక్షణ ప్రదర్శించరాదు’ అని 15వ అధికరణ తేటతెల్లం చేస్తోంది. మహిళల్ని సామాజికంగా, ఆర్థికంగా లేదా మనోభావాలపరంగా కించపరచే ఏ ఒక్క సంప్రదాయమూ 14వ, 15వ అధికరణల స్ఫూర్తికి అనుగుణమైనది కాదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇదివరకే చెప్పుకొన్నట్లు, అనేక దేశాలు వైయక్తిక చట్టాలను సంస్కరించుకొన్న నేపథ్యంలో, వాటిమీద నిర్ణయాధికారం న్యాయస్థానాలకు లేదన్న వాదన అర్థరహితమైనది. మతపరమైన స్వేచ్ఛ పేరుతో ముస్లిముల హక్కుల పరిరక్షకులమని చెప్పుకొంటూ అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నవారు ఒక్క ముస్లిం మహిళలు అనేమిటి, యావత్‌ మహిళల పట్లా, మానవజాతి పట్లా మహాపచారానికి పాల్పడుతున్నారు. ముమ్మారు తలాక్‌ చెప్పడమన్నది షరియా నుంచి స్వీకరించిన సంప్రదాయమని అంటూ- మహిళల పట్ల అసమానతను, పీడనను సమర్థించుకొంటున్నవారు, నిస్సహాయ మహిళల్ని ఆదుకొనే అధికారం సుప్రీంకోర్టుకు కాని, భారత రాజ్యాంగానికి కానీ లేనేలేదని బహిరంగంగానే ప్రకటించారు. షరియా అన్నది అంతగా తాకరానిదై ఉంటే, పీడన నుంచి మహిళల్ని కాపాడటానికి ఉద్దేశించిన ఆధునిక చట్టాలను అనేక ముస్లిం దేశాలు ఎందుకు తీసుకువచ్చాయి?

కావాలనే దుష్ప్రచారం

ఇలాంటి వ్యవహారాల్లో నిర్ణయాధికారం సుప్రీంకోర్టుకు లేదన్న వాదన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యమైనది కాదు. దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే ఆదేశం- మతం, ప్రాంతం, లింగం, కులాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ శిరోధార్యం. న్యాయవ్యవస్థ గౌరవాన్ని భంగపరచే విధంగా ఎవ్వరూ మాట్లాడరాదు. తమ ఓటు బ్యాంకులను కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి దమన, తిరోగమన, మహిళా వ్యతిరేక సంప్రదాయాలను నిర్లజ్జగా సమర్థిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు, అది సరైన పనేనా అని ఒక్కసారైనా ఆలోచించకపోవడం దురదృష్టకరం. మత సంప్రదాయాల్లో నుంచే సంస్కరణలు పుట్టుకురావాలనడంలో సందేహం లేదు. రాజా రామ్‌మోహన్‌రాయ్‌, దయానంద సరస్వతి ప్రభృతులు హిందూమత సంప్రదాయాలను చాలావరకు సంస్కరించింది అందుకోసమే. గడచిన అనేక ఏళ్లలో హిందూమత సంప్రదాయాల్లో గణనీయమైన మార్పులు, సంస్కరణలు చోటుచేసుకొన్నాయి. ఇలాంటప్పుడు మన ముందున్న మార్గమేమిటి? దీనిమీద చర్చించడం, పీడన నుంచి మహిళల్ని విముక్తం చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవడమొక్కటే మన ముందున్న మార్గం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొన్న లా కమిషన్‌, దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంమీద సంబంధిత పక్షాలు, ప్రజానీకం అభిప్రాయం కోరింది. కమిషన్‌ తన ప్రశ్నావళిలో ముమ్మారు తలాక్‌ చెప్పే సంప్రదాయాన్నే కాదు, హిందూమహిళల వారసత్వ హక్కు, గుజరాత్‌లో పాటిస్తున్న మైత్రీ-కరార్‌ ఆచారం వంటివాటినీ ప్రస్తావించింది. ఇలాంటప్పుడు ఒకేఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకొన్నారని ఎవరైనా ఎలా వాదించగలరు? తలాక్‌ అంశాన్ని ఉమ్మడి పౌరస్మృతితో ముడిపెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి కొంతమంది కావాలనే ప్రయత్నిస్తున్నారు. లింగపరమైన విచక్షణను అంతం చేసి, లింగపరమైన న్యాయం, సమాన హక్కులకు భరోసా ఇవ్వడం తలాక్‌కు సంబంధించి ప్రధాన అంశం. సున్నితమైన ఈ అంశం మీద విస్తృతస్థాయిలో చర్చ అవసరం. భిన్నత్వం పేరుతో మతధర్మ శాస్త్రాలను వక్రీకరించడం, మహిళల పట్ల పీడనను సమర్థించుకోవడాన్ని తక్షణం ఆపాలి. ఈ అంశం విషయంలో ఒక్కుమ్మడిగా ముందుకు వెళ్లడం నేటి అవసరం. అందరూ సమానమేనన్న చట్టపరీక్షకు నిలబడలేని అన్ని సామాజిక, సాంస్కృతిక, మత సంప్రదాయాలు మారాల్సిందే. భారతదేశం ఆధునిక, భాగ్యవంతమైన జాతిగా పరివర్తన చెందాలంటే ఇదొక్కటే మార్గం.

ఎం. వెంకయ్య నాయుడు

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ , పట్టణ పేదరిక నిర్మూలన , సమాచార ప్రసార శాఖల మంత్రి

(ఈనాడు సౌజన్యంతో)