Home News భగ్గుమన్న భారతం

భగ్గుమన్న భారతం

0
SHARE
Pic Courtesy Twitter

ఎస్ సి , ఎస్ టి వేధింపుల (నిరోధక) చట్టం లో కొన్ని మార్పులు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దేశంలోని పలు ప్రాంతాల్లో హింసకు, ఉద్రిక్తతలకు దారితీసింది. పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్  లలో అల్లర్లు చెలరేగి అవి హింసాత్మకంగా మారడంతో 9మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. అల్లర్ల తీవ్రత మధ్య ప్రదేశ్ లో ఎక్కువగా ఉంది.

ఎస్ సి, ఎస్ టి చట్టంలో కీలకమైన కొన్ని మార్పులు చేయాలని సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలపై పలు ప్రాంతాలలో ప్రచారమైన అపోహలు, పుకార్లే ప్రధానంగా అల్లర్లకు కారణమయ్యాయి. ఒక చట్టంలో కొన్ని మార్పులు చేయాలని కోర్టు పేర్కొనడం సర్వసాధారణమైన విషయం. అది సాధారణంగా ఎవరు పట్టించుకోరు. కానీ ఈ చట్టం దళితులకు సంబంధించినది, సున్నితమైన విషయానికి సంబంధించినది కావడంతో దీనిపై ప్రజలను తప్పుదోవపట్టించడానికి, రెచ్చగొట్టడానికి కొందరికి అవకాశం చిక్కింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుప్రీం కోర్ట్ తన ఆదేశాలను పునః సమీక్షించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తరువాత కూడా అల్లర్లు చెలరేగడం. ఇది పలు సందేహాలకు తావిస్తోంది. ముఖ్యంగా హింస బాగా చెలరేగిన ప్రాంతాలలో ఇతర మతవర్గానికి చెందినవారు కూడా ఆయుధాలతో కనిపించడం, గుజరాత్ కు చెందిన దళిత నాయకుడినని చెప్పుకునేవాడు, ఇటీవల శాసనసభకు ఎన్నికైన నాయకుడి అనుచరులు ఆయుధాలతో వీధుల్లో భయభ్రాంతులు సృష్టించడానికి ప్రయత్నిస్తూ మీడియా కళ్ళకు చిక్కడం ఈ సందేహాలకు  మరింత బలం చేకూరుస్తోంది. అలాగే ఉత్తర్ ప్రదేశ్ లో బి ఎస్ పి కి చెందిన మాజీ ఎమ్మెల్యే యోగేశ్ శర్మను మీరట్ లో అల్లర్లకు ప్రధాన కుట్రదారుగా గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలాచోట్ల ఆందోళనకారులకు తాము అసలు ఎందుకు రోడ్లపైకి వచ్చామన్న సంగతి కూడా తెలియదంటే అపోహలు, పుకార్లు ఏ స్థాయిలో వ్యాపించాయో అర్ధం చేసుకోవచ్చును. ఎస్సీ, ఎస్టీ చట్టంలో కొన్ని మార్పులు చేయాలని సుప్రీం కోర్ట్ చెపితే కేంద్రం ఏకంగా ఎస్ సి, ఎస్టీ లకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దుచేయనుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారమే ఆందోళనలు అంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణమంటున్నారు. బీహార్ లో చాలా చోట్ల ఆందోళనకారులు `వోట్ హమారా, హక్ తుమ్హారా …నహి చెలేగా ..నహి చెలేగా’ అంటూ నినాదాలు చేశారు. ఒకప్పుడు బీహార్ లో ఎన్నికలు గెలవడానికి లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన పార్టీ ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. సమాజంలో కొన్ని కులసముదాయాలు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలను పొందుతున్నాయని, తాము కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పరిమితమయ్యామని దళితులలో ప్రచారం చేయడం ద్వారా లాలూ అధికారంలోకి వచ్చారు. దళితులలో తమకు అన్యాయం జరుగుతోందన్న భావనను రెచ్చగొట్టడం ద్వారా రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారం సాధించవచ్చని ఆశిస్తున్న కొన్ని పార్టీలు మళ్ళీ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక చట్టంలో కొన్ని మార్పులు చేయాలని సుప్రీం కోర్ట్ చెపితే రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని ప్రచారం చేయడం వెనుక ఈ వ్యూహం కనిపిస్తోంది. ఇంతకీ ఎస్ సి, ఎస్టీ చట్టం చెప్పినదేమిటి? దానికి సుప్రీం కోర్ట్ సూచించిన మార్పులు ఏమిటి?

ఎస్ సి, ఎస్టీ వేధింపుల(నిరోధక) చట్టం

కులం పేరిట సమాజంలో వివక్ష, అవమానాలకు గురవుతున్న వర్గాలకు రక్షణ కల్పించడం కోసమే ఈ ఎస్ సి, ఎస్టీ చట్టాన్ని తెచ్చింది ప్రభుత్వం. ఇటువంటి అమానవీయ ధోరణులను తొలగించడానికి 1955లో పార్లమెంట్ `అంటరానివారిపై నేరాల నిరోధక చట్టం’ ను ఆమోదించింది. ఆ తరువాత దీనికే 1976లో `పౌరహక్కుల చట్టం’గా పేరు మార్చారు. అయితే చట్టం అమలు అనుకున్న రీతిలో జరగకపోవడం, ఎస్ సి, ఎస్టీ ల సామాజిక, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడకపోవడంతో 1989లో ప్రస్తుతం అమలులో ఉన్న `ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం’ రూపొందించారు. కులం పేరున ఇతరులు ఎస్సీ, ఎస్టీలపై సాగించే దూషణలు, వేధింపులు, దాడులు, అత్యాచారాలను అడ్డుకోవడమే ఈ చట్టపు ప్రధాన లక్ష్యం. ఈ చట్టానికి మరింత పదును పెడుతూ 2015లో కొన్ని సవరణలు చేశారు. శిరోముండనం, మీసాలు తొలగించడం వంటి అమర్యాదకర చర్యలను కూడా వేధింపులుగానే పరిగణిస్తూ చట్టపరిధిలోకి తెచ్చారు.

ఈ చట్టం ప్రత్యేకత ఏమిటంటే దీని కింద కేసు నమోదు చేస్తే వెంటనే అరెస్టులు చేసి, ఆ తరువాత రిమాండుకు పంపుతారు. ఇది చాలా కీలకమైన నిబంధన. నిందితులకు జామీను కూడా లభించదు. వేధింపులను పూర్తిగా అరికట్టడానికి ఈ కఠినమైన నిబంధనను చట్టంలో చేర్చారు.

సుప్రీం కోర్ట్ సూచించిన మార్పులు ఏమిటి?

ఎస్సీ, ఎస్టీలపై వేధింపులను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టం దుర్వినియోగమవుతోందని, కొన్ని సందర్భాలలో వ్యక్తిగత, ఇతర చిన్న కారణాలకే ఈ చట్టాన్ని ఆశ్రయిస్తున్నారనే ఫిర్యాదుల మధ్య సుప్రీం కోర్ట్ చట్టంలో కొన్ని మార్పులను సూచించింది. `నిర్దోషులైన ప్రభుత్వోద్యోగులను బెదిరించేందుకు, ప్రైవేటు వ్యక్తులపై కక్ష తీర్చుకునేందుకు, స్వప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు’ తరచుగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా అమాయకులపై తప్పుడు కేసులు పెట్టడానికి చట్టాన్ని ఉపయోగిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అమాయకులను `నిందితులుగా’ నిలబెట్టడం చట్టపు ఉద్దేశ్యం కాదని, వేధింపుల నిరోధక చట్టం కులభావనలను పెంచిపోషించేదిగా ఉండకూడదని, అలా జరిగితే అది సమాజ సమైక్యతకు, రాజ్యాంగ విలువలకు విఘాతంగా మారుతుందని అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలో మార్చ్ 20న జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం చట్టంలోని అరెస్టు, బెయిల్ మంజూరుకు సంబంధించిన నియమాలకు కొన్ని సవరణలు సూచించింది –

– చట్టం కింద నేరం చేసినట్లు ఆరోపిస్తూ ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ సేవకులపై కేసు నమోదైనప్పుడు వారి నియామకాధికారులు లేదా ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వకమైన అనుమతి ఉంటేనేగానీ అరెస్ట్ చేయడానికి వీలులేదు. అలాగే ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు అయినప్పుడు సంబంధిత జిల్లా సీనియర్ పోలీసు అధికారి అనుమతించిన తరువాతనే అరెస్ట్ చేయాలి.

– చట్టం కింద ముందస్తు జామీను తీసుకునేందుకు వీలేలేదన్న నిబంధనకు కూడా సడలింపు చేసింది. ఆరోపణలు దురుద్దేశంతోగానీ, మరేదైనా కారణంతోగానీ చేసినవని ప్రాధమిక దర్యాఫ్తులో తేలితే ముందస్తు జామీను ఇవ్వకూడదన్న నిబంధన వర్తించదు.

సుప్రీం కోర్ట్ సూచించిన ఈ రెండు మార్పులు అసలు చట్టన్నే నిర్వీర్యం చేసేట్లుగా ఉన్నాయని కొన్ని రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

కేంద్రం ప్రతిస్పందన ఏమిటి?

ఎస్సీ , ఎస్టీ చట్టానికి సుప్రీం కోర్ట్ సూచించిన మార్పుల పట్ల దళిత సంఘాలు, వర్గాలలో ఆందోళన వ్యక్తమవుతున్న నేపద్యంలో తమ తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరుతూ కేంద్రం సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. మార్పులు చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై పునరాలోచించాలని కోరింది. కోర్టు తీర్పు రాజ్యాంగంలోని అధికరణం 21 ను ఉల్లంఘించేలా ఉందని అభ్యంతరం చెప్పింది. చట్టంలోని పాత నిబంధనలు యధాతధంగా కొనసాగనివ్వాలని కోరింది. ఈ విషయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. మరోవైపు కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని, పునః సమీక్షించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ సంస్థల అఖిలభారత సమాఖ్య పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను అత్యవసర ప్రాతిపదికన వెంటనే విచారణకు చేపట్టాలన్న సమాఖ్య విజ్ఞప్తిని మాత్రం సుప్రీం కోర్టు నిరాకరించింది. అలాగే చట్టంలో మార్పులను సూచిస్తూ తాము వెలువరించిన తీర్పుపై కూడా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తాము సూచించిన మార్పులవల్ల చట్టపు నిబంధనలు ఏమాత్రం పలుచబడవని, కేవలం నిర్దోషులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే మార్పులు సూచించామని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టానికిగానీ, ఫిర్యాదుదారులకుగానీ తాము వ్యతిరేకం కాదని ఏ.కె. గోయల్, యు.యు లలిత్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. చట్టంలో ప్రస్తావించిన నేరాలకు సంబంధించి మాత్రమే తీర్పులో ప్రస్తావించామని ధర్మాసనం వివరించింది. ఇతర చట్టాల మాదిరిగా నిర్దోషులకు ఉపశమనం కలిగించే ఏర్పాటు ఏది లేనందువల్లనే ముందస్తు జామీను నిబంధనలను జోడించామని, నివారణ మార్గాలేవీ చూపకుండా నిరపరాధుల హక్కులను హరించలేమని పేర్కొంది. ఏడు రోజుల లోపు  ఫిర్యాదును దృవపరుచుకుని  ఆ తరువాతనే ఎఫ్ ఐ ఆర్ నమోదుచేయాలని నిబంధన విధించడం వెనుక నిర్దోషులకు శిక్ష పడరాదనే ఆలోచన మాత్రమే ఉన్నదని ధర్మాసనం స్పష్టంచేసింది. అంతేకాని ఫిర్యాదు నమోదు అయినవెంటనే అరెస్ట్ చేయరాదని మరోసారి చెప్పింది.

ఆర్ ఎస్ ఎస్ పై దుష్ప్రచారం

ఇదిలా ఉంటే ప్రతి చిన్న విషయానికి ఆర్ ఎస్ ఎస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు సుప్రీం కోర్ట్ తీర్పు కూడా ఆర్ ఎస్ ఎస్ కుట్రలో భాగమేనంటూ నిందారోపణలు చేశాయి. దళితులకు అన్యాయం చేయడానికి చేసిన కుట్రలో ఇది భాగమని ఆరోపించాయి.

అయితే ఈ ఆరోపణలను కొట్టివేస్తూ ఆర్ ఎస్ ఎస్ ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది.  సర్ కార్యవాహ్ సురేశ్ జోషి జారీచేసిన ప్రకటనలో సంఘం మొదటి నుంచి కుల వివక్ష, అణచివేతలను వ్యతిరేకిస్తూ వస్తున్నదని, సుప్రీం కోర్ట్ తీర్పుతో సంఘానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై కొందరు సంఘంపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, ఖండించదగినవని ఆయన అన్నారు. అణచివేత, వివక్షలను నిరోధించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. తీర్పుపై సమీక్షను కోరుతూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం సరైన చర్య అని అభిప్రాయపడ్డారు. అలాగే సమాజంలో పరస్పర విశ్వాసం, స్నేహాలను పెంపొందించేందుకు మేధావులు, ఆలోచనాపరులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు తీర్పు విషయంలో హింస చెలరేగడం దురదృష్టకరమని, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు.

– ఖండవల్లి కేశవనాథ్