Home News పశ్చిమ బెంగాల్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిఎంసి కార్యకర్తల అరాచకత్వం, మహిళలపై దాడులు, అత్యాచారాలు

పశ్చిమ బెంగాల్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిఎంసి కార్యకర్తల అరాచకత్వం, మహిళలపై దాడులు, అత్యాచారాలు

0
SHARE

ఏప్రిల్‌ 7న టిఎంసి గుండాల దుర్మార్గాలు తారాస్థాయికి చేరాయి. ఆరాంబాగ్‌ ఎస్‌డిఓ కార్యాలయం దగ్గర టిఎంసి గూండాలు ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన మహిళా కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడిచేశారు. మహిళా అభ్యర్థి, ఆమె కోడలి వస్త్రాలను తొలగించడమే కాక వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా కెమెరాల్లో రికార్డ్‌ అయింది.

పశ్చిమ బెంగాల్‌లో పూర్తిగా అరాచక పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. పంచాయతీ ఎన్నికల్లో తణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులకు పోటీగా ఎవరు నామినేషన్‌లు వేయకుండా చూసేందుకు భయపెట్టడమేకాక కొద్దిమంది బిజెపి కార్యకర్తలను చంపేశారు కూడా.

లోక్‌సభ ఎన్నికలు ఏడాది దూరంలో ఉండడంతో వివిధ విపక్ష పార్టీలు విపక్షాల కూటమి లో తమదే ప్రధాన పాత్ర అని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మార్చి 20న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విపక్ష కూటమికి మమతా బెనర్జీ తిరుగులేని నాయకురాలని పేర్కొన్నారు. ములాయం సింగ్‌ తరువాత ముస్లింల ‘రక్షకుని’ పేరు సాధించాలని మమతా బెనర్జీ చాలా ప్రయత్నిస్తున్నారు. కొన్ని నెలలుగా ఆమె బెంగాల్‌ బయట బిజెపికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. నామినేషన్‌ల దశలోనే హింస చెలరేగింది. రాజకీయ రంగు పులుముకున్న పోలీసు యంత్రాంగం, చేష్టలుడిగిన జిల్లా పరిపాలన యంత్రాంగం వల్ల ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది.

ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినా బెంగాల్‌లో టిఎంసి అరాచకాలు, అకకృత్యాలకు పాల్పడుతుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తాయి. 2017 నవంబర్‌ 15న బీర్భుమ్‌ జిల్లా టిఎంసి అధ్యక్షుడు అనుబ్రత మొండల్‌ స్థానిక పోలీసు అధికారి కాశీనాథ్‌ మిస్త్రీ (డిఎస్‌పి) ని బహిరంగం గానే బెదిరించాడు. టిఎంసి కార్యకర్తల అరాచకాల గురించి బొల్పూర్‌ రైతులు తమ నిరసన తెలిపినప్పుడు అనుబ్రత ‘వెంటనే రైతులందరిని అరెస్ట్‌ చేయండి. లేకపోతే సాయంత్రానికల్లా వాళ్ళ ఇళ్లన్నీ తగలబెడతాం’ అని హెచ్చరించాడు. ఈ సంఘటన మీడియా కెమెరాలకు చిక్కింది కూడా. ఈసారి కూడా అనుబ్రత రంగంలోకి దిగి ‘మనకు వ్యతిరేకంగా పోటీ చేసే వారికి తగిన విధంగా బుద్ధి చెబుదాం’ అంటూ కార్యకర్తలకు కర్తవ్యాన్ని ఉద్బోధించాడు. ‘సిపిఐ, కాంగ్రెస్‌, బిజెపి తదితర ఏ పార్టీ వాళ్ళు రాకుండా అడ్డుకుంటాం’ అని బాహాటంగా ప్రకటించాడు. అయితే సిపిఐ, కాంగ్రెస్‌ వాళ్ళు తనకు ఫోన్‌ చేస్తే వాళ్ళను మాత్రం నామినేషన్‌ వేసుకునేందుకు అనుమతిస్తానని కూడా చెప్పాడు.

చెప్పినట్లుగానే టిఎంసి దుండగులు అభ్యర్ధుల ఇళ్లపై దాడులు చేశారు, దోచుకున్నారు. తమ నామినేషన్‌లు ఉపసంహరించుకునేట్లు బెదిరించారు. వీరి అరాచకాలకు భయపడి చిత్రలేఖా రాయ్‌ అనే అభ్యర్ధి తన నామినేషన్‌ వెనక్కు తీసుకున్నారు. ఏప్రిల్‌ 23న టిఎంసి కార్యకర్తలు షేక్‌ దిల్దార్‌ అనే బిజెపి కార్యకర్తను ప్రభుత్వ కార్యాలయం ఎదుటే దారుణంగా చంపేశారు. ఈ భయోత్పాతాల వల్ల అనుబ్రత మొండల్‌ 42 జిల్లా పరిషత్‌ సీట్లను ఎలాంటి పోటీ లేకుండా గెలుచుకున్నాడు. 19 పంచాయతీ సమితుల్లో 16 స్థానాలను టిఎంసి చేజిక్కించుకుంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీ నియోజక వర్గాల్లో కేవలం 27 స్థానాల్లో మాత్రమే విపక్షానికి చెందిన అభ్యర్థులు నామినేషన్‌ వేయగలిగారు.

ఏప్రిల్‌ 10న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందే రాష్ట్ర మంత్రి ఆశిష్‌ బెనర్జీ ప్రతాపాన్ని మీడియాతోపాటు సమస్త ప్రజానీకం చూసింది. మూడు అంచెల్లో అవరోధాలు ఏర్పాటు చేశారు. మొదటిది పోలీసుల ద్వారా ఏర్పాటు చేసిన బారికేడ్‌. ఇది దాటి నలుగురిని మించి కలెక్టర్‌ ఆఫీస్‌ వైపు వెళ్లనివ్వలేదు. ఆ బారికేడ్‌ దగ్గరకి వెళ్ళేందుకు బిజెపి కార్యకర్తలు ప్రయత్నించినప్పుడు టిఎంసి గూండాలు వాళ్లపై విచక్షణా రహితంగా దాడిచేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్‌ కాగితాలు గుంజుకోవాలని ఆశిష్‌ బెనర్జీ తమ అనుచరులను ఆదేశించారు.

మమతా బెనర్జీ మార్కు ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో బిర్భూమ్‌ను చూస్తే తెలుస్తుంది. బక్నూర, ముర్షిదాబాద్‌, బీర్భూమ్‌లలో అన్ని జిల్లా పరిషత్‌ స్థానాలను టిఎంసి కైవసం చేసుకుంది. ఇతర చోట్ల కూడా దాదాపు ఇదే స్థితి. అజిత్‌ ముర్ము అనే ఎస్‌టి అభ్యర్థి ఏప్రిల్‌ 4న నామినేషన్‌ దాఖలు చేయడానికి రానిబంధ్‌ బిడివో కార్యాలయానికి వెళ్ళాడు. అతన్ని అక్కడ అడ్డగించిన టిఎంసి గూండాలు మారణాయు ధాలతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అజిత్‌ జిల్లా ఆసుపత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ప్రాణాలు విడిచాడు. కేసు (ఎఫ్‌ఐఆర్‌ 17/18 తేదీ ఏప్రిల్‌ 4) నమోదైనప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.

మహిళలపై దుర్మార్గాలు

ఘోరాలియా జోలపారాకు చెందిన జయశ్రీ బిశ్వాస్‌ అనే మహిళ 29 జెడ్‌పిలో 220 బూత్‌ అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేసింది. కానీ అప్పటి నుంచి స్థానిక టిఎంసి కార్యకర్తల బెదిరింపులు మొదలయ్యాయి. ఏప్రిల్‌ 30 అర్ధరాత్రి కొందరు టిఎంసి గూండాలు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో సామాను అంతా ధ్వంసం చేశారు. ఆమె కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇంట్లో విలువైన వస్తువులను దోచుకున్నారు. ఆ సమయంలో జయశ్రీ అక్కడ లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. అక్కడితో ఆగని దుండగులు జయశ్రీ బంధువుల ఇంటిపైన కూడా దాడి చేశారు. ప్రీతిక అనే 6 నెలల గర్భిణీపై అత్యాచారానికి పాల్పడటమే కాక కొట్టారు. ఆసుపత్రిలో బాధితురాలికి గర్భస్రావం అయింది. శాంతిపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు (ఎఫ్‌ఐఆర్‌ 138/18) నమోదయింది.

ఏప్రిల్‌ 7న టిఎంసి గుండాల దుర్మార్గాలు తారాస్థాయికి చేరాయి. ఆరాంబాగ్‌ ఎస్‌డిఓ కార్యాలయం దగ్గర టిఎంసి గూండాలు ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన మహిళా కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడిచేశారు. మహిళా అభ్యర్థి, ఆమె కోడలి వస్త్రాలను తొలగించడమే కాక వారిపై అత్యా చారానికి పాల్పడ్డారు. ఇదంతా కెమెరాల్లో రికార్డ్‌ అయింది. అలాగే 24 పరగణాల జిల్లాలో బిజెపి మహిళా అభ్యర్ధి పైన కూడా టిఎంసి గూండాలు పాశవికంగా దాడిచేశారు. ఈ సంఘటన వీడియోను స్థానిక టివి ఛానళ్ళు, జాతీయ ఛానళ్ళు కూడా ప్రసారం చేశాయి. అయినప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ‘ఇదంతా నాటకం’ అంటూ కొట్టిపారేశారు.

పోలీసుల పాత్ర

మొదట్లో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఎన్నికల విధులను నిర్వహిస్తున్న సిబ్బంది తమకు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని పదేపదే అభ్యర్ధించినా పట్టించుకోలేదు. పోలీసుల ముందే టిఎంసి కార్యకర్తలు ఇతర పార్టీల వారిపై దాడులకు తెగబడ్డారు.

టిఎంసి దాడిలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు చనిపోయినా పోలీసుల ధోరణి ఏమాత్రం మారలేదు. పైగా బాధిత కుటుంబాలకు చెందిన వారిని స్వయంగా తీసుకువెళ్లి టిఎంసి గుండాలకు అప్పచెప్పారు. వాళ్ళు భయపెట్టి, బెదిరించి బాధితుల వాఙ్మూలాన్ని మార్చేశారు. అజిత్‌ ముర్ము, షేక్‌ దిల్దార్‌ల విషయంలో ఇలాగే జరిగింది.

కోర్టులే శరణ్యం

పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడ వలసినది కోర్టులేనని తేలిపోయింది. టిఎంసి దాడు లపై దాఖలైన పిటిషన్‌ను పరిశీలనకు స్వీకరించిన కలకత్తా హైకోర్ట్‌ పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.

– జిష్ణు బసు

(జాగృతి సౌజన్యం తో)