Home News మతం ముసుగులో కేథలిక్‌ చర్చి దేశంలో నడుపుతున్న విభజన రాజకీయాలు

మతం ముసుగులో కేథలిక్‌ చర్చి దేశంలో నడుపుతున్న విభజన రాజకీయాలు

0
SHARE
Representative image

దేశంలో కేథలిక్‌ చర్చి నడుపుతున్న విభజన క్రీడ అత్యంత హేయమైనది, దుర్మార్గమైనది. అనిల్‌ కౌటో అన్నట్లు ఉపవాసాలు, ప్రార్థనలు చెయ్యడం నాకూ సమ్మతమే. అయితే ఇది ఏ రాజకీయ కారణాల కోసమో కాకుండా మతపరంగా మన సమాజంలో విభజన తేవాలనుకునేవారికి వ్యతిరేకంగా జరగాలి. – సేవియో రోడ్రిగ్స్‌

ఢిల్లీ రోమన్‌ కేథలిక్‌ ఆర్చియోసిస్‌కి చెందిన ఆర్చిబిషప్‌ అనిల్‌ కౌటో దేశంలోని కేథలిక్కులందరికీ ఆదేశాలిస్తూ ఒక లేఖ రాశారు (మే 8, 2018). ఢిల్లీ ఆర్చియోసిస్‌ ఆధీనంలో గల దేశంలోని అన్ని చర్చ్‌ విభాగాలకూ ఈ లేఖ చేరింది. భారతదేశంలోని కేథలిక్కులంతా 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి శుక్రవారం ఉపవాసాలు చెయ్యాలనీ, తదనంతరం ఒక గంట ప్రత్యేక ప్రార్థనలు చెయ్యాలనీ, దేశమంతటా ఈ విషయమై విస్తృతంగా ప్రచారాలు చెయ్యాలనీ ఈ లేఖ సారాంశం. ‘దేశం కోసం, మన రాజకీయ నాయకుల కోసం ఎల్లవేళలా ప్రార్థనలు చేయడం ఆర్చియోసిస్‌ యొక్క పవిత్ర కర్తవ్యం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రార్థనలు చేయాల్సిన అవసరం మరింత ఎక్కువగా ఉంది’ అని అనిల్‌ కౌటో తన లేఖ ప్రారంభంలో అన్నారు.

ఢిల్లీ ఆర్చియోసిస్‌ భారతదేశంలోని కేథలిక్కులకు అత్యంత ప్రధానమైనది. కేథలిక్కులపై ఆర్చిబిషప్‌ ప్రభావం ఎంతో ఉంటుంది. 2013లో ఢిల్లీ ఆర్చిబిషప్‌ కాక ముందు అనిల్‌ కౌటో జలంధర్‌లో బిషప్‌గా ఉండేవారు. ఉపవాసాలు, ప్రార్థనలు, ప్రాయశ్చిత్తాల ద్వారా క్రైస్తవులందరూ భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రగతికి పాటుపడాలని ఆయన తన లేఖలో పిలుపునిచ్చారు.

దేశంలో జరిగే ఎన్నికల పట్ల ఒక మతాధికారికి అంత ఆసక్తి ఎందుకు అనుకునే వారికి అనిల్‌ కౌటో రాసిన లేఖలో అభ్యంతరకరమైనది ఏదీ కనిపించక పోవచ్చు. కానీ The Vatican News (https://www.vaticannews.va)  వెబ్‌సైట్‌లో అనిల్‌ కౌటో రాసిన లేఖను వేరేగా అన్వయించి ప్రచురించారు. అనిల్‌ కౌటో లేఖను ప్రస్తావిస్తూ ఈ వెబ్‌సైట్‌ ఇలా అంటుంది..

భారతదేశంలో ఐదేళ్ళ అధికారంలోకి వచ్చిన హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2019 మే నాటికి ముగుస్తుంది. పరోక్షంగా హిందూమత శక్తులకు సహకరిస్తున్న మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వంపై క్రైస్తవ నాయకుల నుండి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే ఉద్దేశ్యంతో ఈ ప్రభుత్వం భారతదేశంలోని మైనారిటీలను ఉపేక్షిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చాక క్రైస్తవు లపై, క్రైస్తవ సంస్థలపై దాడులు ఎక్కువయ్యాయి. భారతదేశంలో దౌర్జన్యపూరితమైన రాజకీయం నెలకొని ఉందనీ, రాజ్యాంగము ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విలువలకు, లౌకిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందనీ, సువార్త ప్రతిపాదించిన విలువలను పునఃప్రతిష్ఠించడానికి అందరూ ప్రార్థనలు చేయాలనీ అనిల్‌ కౌటో తన లేఖలో పిలుపునిచ్చారు’.

మనదేశంలోని సెక్యులర్‌ వ్యవస్థ గురించి మాట్లాడేవారు బిజెపిపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ద్వేషభావాన్ని పెంచుకోవడం, వివిధ సందర్భాలలో వారి ద్వేషాన్ని బహిరంగంగానే వెళ్ళగక్కడం మనం స్పష్టంగా గమనించవచ్చు.

లోక్‌సభ ఎన్నికలప్పుడే కాదు, వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల సమయంలో కూడా మనదేశంలోని చర్చిలు బిజెపికి వ్యతిరేకంగా గోల చేస్తూంటాయి. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సమయంలో గాంధీనగర్‌ ఆర్చిబిషప్‌ ‘జాతీయవాద శక్తుల నుండి దేశాన్ని రక్షించాలి’ అని అధికారికంగా విజ్ఞప్తి చేశారు. నాగాలాండ్‌ శాసనసభ ఎన్నికల సమయంలో నాగాలాండ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ కౌన్సిల్‌ ‘త్రిశూలం లేదా శిలువ.. వీటిలో ఏది కావాలో తేల్చుకోండి!’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒక సందర్భంలో యోగా అనేది హిందూ విశ్వాసాలకు సంబంధించినది అనీ, క్రైస్తవులు దానికి దూరంగా ఉండాలనీ క్రైస్తవ మతాధికారులు పిలుపునిచ్చారు కూడా. గోవా ఎన్నికల సమయంలో బిజెపికి ఓటు వెయ్యడం ద్వారా దేశాన్ని మారణహోమానికి బలిచేయవద్దని ఆ రాష్ట్ర ప్రజలకు ఒక కేథలిక్‌ పత్రిక విజ్ఞప్తి చేసింది.

కొత్తేమీ కాదు

తమకేదో అన్యాయం జరిగిపోతోందంటూ గోల చెయ్యడం అనిల్‌ కౌటోకు కొత్తేమీ కాదు. వివిధ సందర్భాలలో క్రైస్తవులపైన, చర్చిలపైన దాడులు జరుగుతున్నాయనీ, దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోతోందనీ ఆయన పెడ బొబ్బలు పెట్టారు కూడా. వీరికి మీడియా కూడా బాగా వత్తాసు పలికింది. వసంత్‌ కుంజ్‌ చర్చి ఘటనలో, దిల్షాబ్‌ గార్డెన్‌ ఘటనలో భారతదేశంలో క్రైస్తవులకు రక్షణ లేదంటూ అనిల్‌ కౌటో చేసిన గొడవ ఇంతా అంతా కాదు.

చర్చిలపై దాడులు జరిగాయంటూ చెప్తున్న కథనాల వెనుక వాస్తవాలు వేరేగా ఉన్నాయి. వీథిలో చిన్న పిల్లలు ఆడుకుంటుంటే బంతి తగిలి చర్చి కిటికీ అద్దాలు పగిలిపోవడమో, ఓ ఆకతాయి కుర్రాడు చర్చిలో దొంగతనం చేయడానికి ప్రయత్నించగా జరిగిన గలభానో ఈ సంఘటనలకు కారణం. ఇందులో మతపరమైన గొడవ ఎక్కడుంది? నిజంగా తమపై దాడులు జరిగాయని కేథలిక్‌ చర్చి ఏ రకమైన అధికారిక ప్రకటనా చెయ్యలేదు. ఇదంతా వాస్తవాలను వక్రీకరించి హిందువులపై అనిల్‌ కౌటో చేసిన దుష్ప్రచారం మాత్రమే. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్‌ గెలిస్తే క్రైస్తవంపై దాడులు చేయడం వల్లనే బిజెపి ఓడిపోయిందంటూ ఆయన సంబరాలు చేశారు.

స్వలాభం కోసమే

చర్చిలపై దాడులు జరుగుతున్నాయంటూ క్రైస్తవ మతాధిపతులు చేస్తున ఆర్భాటమంతా ఒక అసత్య ప్రచారం మాత్రమే. స్వలాభాల కోసం ఇలాంటి అసత్య ప్రచారాలు మనదేశ రాజకీయాలలో కొత్తేమీ కాదు. మనదేశంలో ఎస్‌.సి.లూ, దీన జనుల ఉద్ధరణ గురించి, సామాజిక సమానత గురించి క్రైస్తవ మిషనరీలు గొప్పగా కబుర్లు చెప్తారు. కానీ ఎస్‌.సి. పసిపిల్లలపై క్రిస్టియన్‌ పాస్టర్లు అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువగానే వెలుగు చూస్తున్నాయి. దేశంలో మతసామరస్యాన్ని పరిరక్షించడానికి ప్రార్థనలు చేయాలని ఢిల్లీ ఆర్చిబిషప్‌ అనిల్‌ కౌటో పిలుపునిచ్చారు కదా. మరి పసిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడే పాస్టర్ల మనసులు బాగుపడడానికి ప్రార్థనలు చేయాలని ఆయన ఎప్పుడైనా పిలుపునిచ్చారా? మనదేశ రాజకీయాలపై రకరకాల ప్రకటనలు చేసే అనిల్‌ కౌటో పేద బాలికలపై అత్యాచారాలు చేస్తున్న పాస్టర్ల చర్యలను ఖండిస్తూ ఏనాడైనా ప్రకటనలు జారీ చేశారా? లేదు.

ఎవరిది మతతత్వం ?

భారతదేశంలో ఎక్కడైనా బిజెపి ప్రభుత్వ ప్రోద్బలంతో మతపరమైన దాడులు జరిగిన ఉదంతాలున్నాయా? లేదు. 1984లో వేలాదిగా సిక్కుల ఊచకోత జరిగింది కాంగ్రెస్‌ పాలనలోనే కదా ! వేలాదిగా కాశ్మీరీ పండిట్లు తమ సర్వస్వం వదులుకుని కాశ్మీరును వదలి ఇతర ప్రాంతాలకు పారిపోయింది కాంగ్రెస్‌ పాలనలోనే కదా ! మరి బిజెపిపై మతతత్వ ముద్ర వేస్తారెందుకు ? ఏదో ఒక మతానికి చెందినవారే ప్రజాస్వామ్య హక్కులు అనుభవించాలని రాజ్యాంగంలో రాసిపెట్టి ఉందా? లేదే !

అది అభ్యంతరకరం

హిందూ వ్యతిరేక శక్తులు, జాతి వ్యతిరేక శక్తులు ముందు ముందు తమ ఆటలు సాగవేమోనని భయపడుతున్నాయి. సామాజిక మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత, యువతరంలో రాజకీయ పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో టివి చానెళ్ళు ప్రచారం చేసే అసత్య కథనాలను అందరూ తెలుసుకుంటున్నారు. అందుకేనేమో కొత్త మాటలు, డ్రామాల కోసం వెదుకులాటలో పడ్డారు మనదేశంలోని కుహనా మేధావులు.

ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఉపవాసాలుండ వచ్చు, ప్రార్థనలు చేయవచ్చు. కానీ ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడానికో, మరొక పార్టీని గెలిపించడానికో ఉపవాసాలు, ప్రార్థనలు చేయాలని పిలుపునివ్వడం అభ్యంతరకరమైన విషయం. మనదేశంలోని క్రైస్తవులు ఇలాంటి మత-రాజకీయ మాయాజాలంలో పడకుండా విజ్ఞతతో నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.

సేవియో రోడ్రిగ్స్‌ ఖండన

ఇదిలా ఉండగా అనిల్‌ కౌటో లేఖకు ఘాటుగా స్పందిస్తూ గోవా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యె అయిన సేవియో రోడ్రిగ్స్‌ ఒక బహిరంగ లేఖలో ఇలా రాశారు :

కేథలిక్కులు ఉపవాసాలు, ప్రార్థనలు చెయ్యాలని ఢిల్లీ ఆర్చిబిషప్‌ కోరడం చాలా పక్షపాతపూరితమైనది. దీనిపై మీడియా ఏమాత్రం స్పందించకపోవడం విచారకరం. హిందూ శక్తులను ఓడించండని అనిల్‌ కౌటో పిలుపునిచ్చారు. హిందువులు మంచివారు కారనీ, వారివల్ల భారతదేశానికి ముప్పు ఉందనీ ఆయన భావిస్తున్నారా?

జీవితంలో నేను శాంతి, ప్రేమలను జీసస్‌ పట్ల విశ్వాసము వల్ల పొందాను. అలాంటిది కేథలిక్‌ చర్చి క్రైస్తవులకు ఈ విధంగా పిలుపునివ్వడం జీసస్‌ చూపిన మార్గానికి విరుద్ధంగా వెళ్ళడమే. ఢిల్లీ రోమన్‌ కేథలిక్‌ ఆర్చియోసిస్‌ పట్ల ఎంతో గౌరవం కల నాకు ఇది ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ దేశంలో మతపరమైన సంక్షోభం నెలకొని ఉందనీ, మతపరమైన దాడులు ఇటీవల పెరిగి పోయాయనీ, ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నా యనీ ఆర్చిబిషప్‌ తన లేఖలో అన్నారు. ఆయన ఉద్దేశ్యం ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని తప్పుపట్టడం మాత్రమేనా? అసలు ఆయన దృష్టిలో ఎమర్జెన్సీ అంటే ఏమిటి? గతంలో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే ప్రజలు ఆమెకు గట్టిగా గుణపాఠం చెప్పారు. అప్పటికి నేను పుట్టలేదు. మరి ఆ సమయంలో కేథలిక్‌ చర్చి ఏం చేసిందో అనిల్‌ కౌటో కాస్త వివరించాలి.

కాశ్మీరులో ముస్లింల అత్యాచారాలను భరించలేక వేలాదిగా హిందూ కుటుంబాలు ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టుబట్టలతో కాశ్మీరును వదలి పారిపోయి నప్పుడు కేథలిక్‌ చర్చ ఏం చేసింది? హిందువులపై ముస్లింలు జరిపే అత్యాచారాలను అనిల్‌ కౌటో కనీసం ఖండించారా ? ఆ రోజుల్లో అది రాజకీయ సంక్షోభం కాదా? మరిప్పుడు ఏ రాజకీయ సంక్షోభం గురించి ఆయన మాట్లాడు తున్నారు ?

అంతెందుకు, ఇటీవలి కాలంలో దేశంలో హిందువులపై జరుగుతున్న మతపరమైన దాడులను కేథలిక్‌ చర్చి ఖండిస్తూ ఒక్క ప్రకటన చేసిందా ? నేనొక క్రైస్తవుడిని కాబట్టి హిందువులపై జరిగే అత్యాచారాల పట్ల కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోవాలా ? కేథలిక్‌ చర్చి కేవలం క్రైస్తవులపై జరిగే దాడులకే స్పందించాలా ?

దేశంలోని వివిధ ప్రాంతాలలో మైనర్‌ బాలికల పట్ల అత్యాచారాలు చేసిన క్రైస్తవ పాస్టర్లపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. దేవుని ప్రతినిధులమని చెప్పుకునేవారు ఇలా చేయడం దారుణం కాదా ? ఈ అమానుషకాండ పట్ల కేథలిక్‌ చర్చి ఏమనుకుంటోందో ప్రజలకు స్పష్టం చేయాలి.

దేశంలో కేథలిక్‌ చర్చి నడుపుతున్న విభజన క్రీడ అత్యంత హేయమైనది, దుర్మార్గమైనది. ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలు ఒక్క మైనారిటీల కోసమే కాదు, మెజారిటీ వర్గాలవారి కోసం కూడా!

ఒక హిందూ కుటుంబంతో వంశ పారంపర్య అనుబంధం ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇది జీసస్‌ సందేశాన్ని, జీవితాన్నీ అర్థంచేసుకోడానికి దోహదం చేసింది.

అనిల్‌ కౌటో అన్నట్లు ఉపవాసాలు, ప్రార్థనలు చెయ్యడం నాకూ సమ్మతమే. అయితే ఇది ఏ రాజకీయ కారణాల కోసమో కాకుండా మతపరంగా మన సమాజంలో విభజన తెవాలనుకునేవారికి వ్యతిరేకంగా జరగాలి.

‘నిన్ను నా అరచేతులలో మలిచాను’ అని దేవుడు చెప్పినట్లుగా బైబిల్‌ అంటోంది. ఇది దేవుని బిడ్డలందరికీ వర్తిస్తుంది. కేథలిక్‌ చర్చిని అనుసరించే వారికి మాత్రమే కాదు.

‘వివిధతలో ఏకత’ భారతదేశ ప్రత్యేకం. మనం మతపరంగా కన్నా జాతిపరంగానే ఎక్కువ ఆధ్యాత్మికతను సంతరించుకోగలం’.

ఈవిధంగా సేవియో రోడ్రిగ్స్‌ తన నిర్దుష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

– డా|| దుగ్గిరాల రాజకిశోర్‌,
8008264690

(జాగృతి సౌజన్యం తో)