Home Telugu Articles ఎమర్జెన్సీ(1975-77).. ఒక శాశ్వత గుణపాఠం

ఎమర్జెన్సీ(1975-77).. ఒక శాశ్వత గుణపాఠం

0
SHARE

‘నాకు నిస్పృహ కలిగినప్పుడల్లా చరిత్రలో ఎప్పటికీ సత్యం, ప్రేమలదే విజయమని గుర్తుకు వస్తుంది. నిరంకుశులు, హంతకులను జయించడం కష్టమని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది కానీ అంతిమంగా వారంతా పతనమయ్యారు. ఆలోచించండి. వారెప్పుడూ విజయం సాధించలేదు..’

శాంతికి ప్రతిరూపమైన మహాత్మాగాంధీ ముందు చూపుతో చెప్పిన పై వాక్యాలు నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీ సమయంలో రుజువయ్యాయి. తమ స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను తొక్కి వేసినప్పుడు, భారత ప్రజాస్వామ్య పునాదిపై నిరంకుశ దాడి జరిగినప్పుడూ ప్రజలంతా ఒక్కటై తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్యానికి నిరసన, విభేదించడం ప్రాణప్రదమైనవి. వాటి స్థానంలో అణిచివేత, వంధిమాగధత్వం చోటు చేసుకున్నాయి. దాదాపు 21 నెలల పాటు నియంతృత్వం దేశంలో రాజ్యమేలింది.

అంతర్గత కల్లోలాల ద్వారా భారత దేశ భద్రతకు ముప్పు ఏర్పడిందనే కారణంతో రాజ్యాంగంలోని 352 అధికరణ క్రింద ఎమర్జెన్సీ విధించారు. 1975 జూన్ 25న అప్పటి రాష్ట్రపతి ఈ ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేయడంతో ఆధునిక భారత చరిత్రలో చీకటి అధ్యాయం ప్రారంభమైంది. రాజ్యాంగ ప్రకారం కేబినెట్ సిఫారసుతో మాత్రమే రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించాల్సి ఉండగా, నాటి ప్రధాని ఇందిరాగాంధీ కేబినెట్‌ను కూడా సంప్రదించకుండా ఎమర్జెన్సీ విధించాల్సిందిగా రాష్ట్రపతికి ఒక లేఖ ద్వారా సిఫారసు చేశారు. మరుసటి రోజు మాత్రమే గత్యంతరం లేని పరిస్థితుల్లో కేబినెట్ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది. ఒకే ఒక్క సీనియర్ మంత్రి మాత్రం తన అభ్యంతరాలను వెలిబుచ్చారని అంటారు.

‘అంతర్గత కల్లోలాల ద్వారా దేశ భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని మాకు వచ్చిన సమాచారం సూచిస్తున్నది. ఈ విషయానికి తక్షణ ప్రాధాన్యత ఉన్నది.’ అని 1975 జూన్ 25న శ్రీమతి గాంధీ రాసిన లేఖలో పేర్కొన్నారు. 1978లో జనతా ప్రభుత్వ హయాంలో భారత రాజ్యాంగానికి చేసిన 44వ సవరణ ద్వారా భవిష్యత్తులో అంతర్గత కల్లోలం పేరుతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నం చేయకుండా నిరోధించారు. దీని ఫలితంగా ఇకనుంచి రాష్ట్రపతి కేవలం విదేశీ దాడులు, లేదా సాయుధ తిరుగుబాట్లు జరిగినప్పుడే కేబినెట్ సిఫారసుపై రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అంతర్గత కల్లోలం అన్న పదం స్థానంలో సాయుధ తిరుగుబాటు అన్న పదాన్ని చేర్చారు. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఉభయ సభలు నెలరోజుల్లో తప్పని సరిగా ఆమోదించేలా నిబంధనలు మార్చారు.

గుజరాత్‌లో నవనిర్మాణ్ ఆందోళన్‌గా పేరొందిన అవినీతి వ్యతిరేక ఉద్యమం వల్ల ప్రజా వ్యతిరేకత పెరగకుండా శ్రీమతి ఇందిరా గాంధీ తప్పుడు సలహాలతో ఎమర్జెన్సీ విధించారు. ఈ ఆందోళన మూలంగా గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ రాజీనామా చేశారు చివరకు అసెంబ్లీని రద్దు చేశారు. అదే సమయంలో బీహార్ లో అవినీతి పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం తీవ్రతరమైంది. దేశంలో మిగతా చోట్ల కూడా ప్రజలు అధిక ధరలు, అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలుపడం మొదలైంది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి పిలుపుకు దేశ ప్రజలంతా తమ శాంతియుత నిరసనల ద్వారా స్పందించారు. జెపీ వారికి ఉద్యమ సారధిగా మారారు.

ఎమర్జెన్సీ విధించడానికి 15 రోజుల క్రితం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగమోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడినందువల్ల ఆమె ఎన్నిక చెల్లనేరదని తీర్పు నిచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. అయితే సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసేందుకు ఆయన ఆమెకు 20 రోజుల సమయం ఇచ్చారు. ఈ తీర్పు నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయవలిసిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందిరాగాంధీ అప్పీల్‌పై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై షరతులతో కూడిన స్టేను మంజూరు చేశారు. అయితే ఎంపిగా ఇందిరాగాంధీ పార్లమెంట్ చర్చల్లో పాల్గొనడం కానీ, ఓటు వేయడం కానీ చేయకూడదని ఆయన ఆంక్షలు విధించారు. అనంతరం ఈ కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించారు. మరుసటి రోజు రాంలీలా మైదానంలో జెపి ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభను నిర్వహించి ఇందిరాగాంధీ రాజీనామాను డిమాండ్ చేశారు.

దీనితో దేశంలో శాంతిభద్రతల పరిస్థితి సవ్యంగా ఉన్నప్పటికీ అంతర్గత కల్లోలాల పేరుతో జూన్ 25 రాత్రి ఎమర్జెన్సీని విధించారు. అర్థరాత్రి పూట జరిగిన దాడుల్లో జెపి, మొరార్జీ దేశాయ్, వాజపేయి, ఆడ్వాణీ, మధు దండావతే, రామకృష్ణ హెగ్డే, చంద్రశేఖర్, చరణ్ సింగ్, నానాజీ దేశ్‌ముఖ్, దేవెగౌడ, నితీష్‌కుమార్‌తో పాటు అనేకమంది ఉన్నతస్థాయి నేతలను, పలువురు ఆర్ఎస్ఎస్ నేతలను ఎలాంటి కారణాలు చూపకుండా అరెస్టు చేశారు. వేలాదిమందిని నిరంకుశమైన అంతర్గత భద్రతా చట్టం (మీసా) క్రింద, భారత రక్షణ నిబంధనలు (డిఐఆర్) క్రింద అరెస్టు చేశారు.

ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి ప్రధాన అంగంగా తోడ్పడే పత్రికా స్వాతంత్ర్యాన్ని సెన్సార్ షిప్ విధించడం ద్వారా పూర్తిగా తొక్కి పెట్టారు. ప్రాథమిక హక్కులను రద్దు చేయడం, న్యాయవ్యవస్థను ఉల్లంఘించడం, పలు సంస్థలను నిషేధించడం, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరపడం, వేలాదిమందిని నిర్బంధించి చిత్రహింసల పాలు చేయడం మొదలైన అసాధారణమైన పరిణామాల గురించి తెలుసుకుని మొత్తం ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. పౌర, ప్రజాస్వామ్య సమాజపు అత్యంత న్యాయపూరితమైన హక్కులకు తీవ్ర విఘాతం కలిగింది. ఎటువంటి నిరసనలను, ర్యాలీలను అనుమతించలేదు. దేశమంతటా అన్ని వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎటువంటి ఆరోపణ లేకున్నా తమను నిర్బంధిస్తారన్న భయంతో ఎవరూ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయారు.

ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో పలువురు జర్నలిస్టులు సమావేశమై ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ మీడియా అత్యధిక భాగం సెన్సార్ నిబంధనలకు లొంగిపోయింది. నిర్భయంగా వ్యవహరించిన రాంనాథ్ గోయెంకా ఇండియన్ ఎక్స్‌ప్రెస్, స్టేట్స్‌మన్, మెయిన్ స్ట్రీమ్ వంటి కొన్ని పత్రికలు మాత్రమే ఈ పరిస్థితిని బలంగా ఎదుర్కొన్నాయి. అరెస్టయిన వారిలో ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ కూడా ఒకరు. మీడియా పట్ల ప్రభుత్వం దాన, దండోపాయాల్ని ప్రయోగించింది. స్నేహపూర్వకంగా వ్యవహరించే పత్రికలకే అది ప్రకటనలు ఇచ్చింది. వ్యతిరేకంగా, తటస్థంగా వ్యవహరించే పత్రికలను గుర్తించి వాటికి ప్రకటనలను నిలిపివేసింది. ఆకాశవాణి, ఫిల్మ్ డివిజన్‌లను దుర్వినియోగపరిచింది. ప్రముఖ నేత అద్వానీ ప్రసిద్ధి చెందిన మాటల్లో చెప్పాలంటే ‘పత్రికారంగాన్ని వంగమంటే సాష్టాంగ పడేందుకు కూడా సిద్ధమైంది.’ ఇంకా ఎన్నో దారుణాలు జరిగాయి. సుప్రీంకోర్టు ఎన్నికల పిటిషన్లను వినకుండా నిరోధించేందుకు 39వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టారు.

రాజ్యాంగానికి చేసిన ఏ సవరణనైనా ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీలు లేకుండా 42వ రాజ్యాంగ సవరణ చేశారు. చట్టసభల కాలపరిమితిని కూడా 5 నుంచి 6 సంవత్సరాలకు పొడిగించారు. అంతా బాగుంది అంటూ, తన వందిమాగధ బృందాలు రహస్య నివేదికలు ఇవ్వడం, మరొకవైపు ప్రజల నుంచి ఒత్తిడి, ప్రపంచ నిరసనల వల్ల నాటి ప్రధాని 1977లో సాధారణ ఎన్నికలకు సిద్ధమైనారు.

అయితే, ప్రజాస్వామ్యం గొంతు నొక్కడానికి నియంతృత్వ హయాం చేసిన అన్ని ప్రయత్నాలను ప్రజలు ఎదిరించి, ఒక అలలా ఎగిసి 1977 ఎన్నికల్లో జనతాపార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎమర్జెన్సీ హయాంలో జరిగిన అత్యాచారాలపై విచారణ జరిపించేందుకు నియమించిన షా కమిషన్ ఎమర్జెన్సీ విధించడానికి ఎలాంటి కారణాలు లేవని తేల్చి చెప్పింది. శాంతి భద్రతల సంక్షోభం ఏర్పడిందన్న వాదన బూటకమైనదిగా స్పష్టీకరించింది. నేను ఆ సమయంలో ఆంధ్రాయూనివర్సిటీలో విద్యార్థి నాయకుడుగా ఉన్నాను.

యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా జెపిని ఆహ్వానించినందుకు ఎమర్జెన్సీ సమయంలో నన్ను 17 నెలల పాటు నిర్బంధించారు. ఏబివిపి కార్యకర్తగా నేను మొదటి 2 నెలలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో అజ్ఞాతంలో పనిచేస్తూ ముఖ్యమైన నేతలకు ఎమర్జెన్సీ వ్యతిరేక సమాచారాన్ని చేరవేస్తుండేవాడిని. తొలుత నన్ను విశాఖపట్టణం జైలులో నిర్బంధించారు. తర్వాత హైదరాబాద్‌లోని ముషీరాబాద్ జైలుకు మార్చారు. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన దారుణ ఘట్టాల్ని నేను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రధాన కారణం ప్రజలకు ముఖ్యంగా నేటి యువతరానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో ప్రేరణ కలిగించాలనుకోవడం.

భారత ప్రజలు శాంతి కాముకులైనప్పటికీ నియంతృత్వాన్ని ఏనాటికీ సహించరనేది ఎమర్జెన్సీ నేర్పిన ముఖ్యమైన గుణపాఠం. ప్రజలు శాంతియుతంగా ఒక నియంతృత్వ పాలనకు బుద్ధి చెప్పిన తీరు భారత ఓటర్ల పరిపక్వతను మాత్రమే కాకుండా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పటిష్టతను చాటిచెప్పింది. స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య జీవనాడి. దాన్ని అణిచివేసే ఏ ప్రయత్నమైనా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల హననానికి దారితీస్తుంది. ఇది మన నేటి తరాలు తెలుసుకోవలసిన జీవన సత్యం.

అందుకే ఈ వ్యాసం.

 -ముప్పవరపు వెంకయ్యనాయుడు
(భారత ఉపరాష్ట్రపతి)
జూన్‌ 25: ఎమర్జెన్సీ విధించిన రోజు

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

(ఈ వ్యాసం మొదటిసారి 24 జూన్ 2018 నాడు ప్రచురితమైంది)