అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయ౦ (AMU) మైనారిటీ సంస్థా? విశ్వవిద్యాలయ నిర్వహణ, నియంత్రణల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా ఉండదా? రాజ్యాంగం వెనుకబడిన, బలహీనవర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను ముస్లిం విశ్వవిద్యాలయం అమలుచేయాల్సిన అవసరం లేదా? ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇది మైనారిటీ సంస్థ కాదని స్పష్టం చేసింది. అంతేకాదు నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లను ఎందుకు అమలు చేయడంలేదో వివరించాలంటూ విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీచేసింది కూడా. ఆగస్ట్ 8 వరకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ హోదాకి సంబంధించి ఎన్నో అపోహలు, వివాదాలు ప్రచారంలో ఉన్నాయి. సమాజంలో ఒక వర్గం ఇది ‘మైనారిటీ’/ అల్పసంఖ్యాక వర్గ’ సంస్థ అనుకుంటే, ఇంకొక వర్గం `పార్లమెంట్ చట్టం’ ద్వారా ఏర్పాటైన విశ్వవిద్యాలయంగా భావిస్తోంది. ఇతరులకి ఈ విషయం గురించి తెలియదు కాబట్టి వారికి ఏ అభిప్రాయము లేదు.
1920లో AMU స్థాపనకు ముందు చరిత్ర (1872-1920)
- 1872లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ `మహమ్మదీయ ఆంగ్ల- ఓరియంటల్ నిధి కమిటీ’ ని ఏర్పాటు చేసారు.
- ఆయన 1873లో ఒక విద్యాలయం ప్రారంభించారు.
- 1875లో అది ఉన్నత పాఠశాలగా రూపొందింది.
- 1877లో `మహమ్మదీయ ఆంగ్ల- ఓరియంటల్ కళాశాల’ కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రారంభమై, తర్వాత 1887లో అలహాబాద్ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మారింది.
- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1898లో మరణించారు. .
- ముస్లిం విశ్వవిద్యాలయo స్థాపనకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
- ముస్లిం విశ్వవిద్యాలయo సంఘం 1911లో ఏర్పాటైంది.
- ఆంగ్ల- ఓరియంటల్ కళాశాల సంఘం, విశ్వవిద్యాలయo స్థాపన కమిటీ కూడా ముస్లిం విశ్వవిద్యాలయ స్థాపనకు ప్రయత్నం చేసాయి.
ముస్లిం సముదాయం కొన్ని డిమాండ్లు /కోరికలు బ్రిటిష్ ప్రభుత్వo ముందుంచింది. అవి –
- విశ్వవిద్యాలయం ప్రదానం చేసే డిగ్రీలు/ పట్టాలు ప్రభుత్వం గుర్తించాలి
- AMU నియంత్రణ, నిర్వహణ పూర్తిగా ముస్లింల చేతుల్లోనే ఉండాలి.
- వేలాది పాఠశాలలు కళాశాలలు AMUకి అనుబంధంగా, AMU నియంత్రణలో నడుస్తాయి.
బ్రిటిష్ ప్రభుత్వo పై డిమాండ్లు నిరాకరించి, అలీగడ్ విశ్వవిద్యాలయ౦ ఏర్పాటుకు కొన్ని నియమ నిబంధనలు పొందుపరిచింది.
- విశ్వవిద్యాలయం ఏర్పాటు చెయడమే జరిగితే, అది కేంద్ర శాసన పరిషద్ (పార్లమెంట్) చట్టం ద్వారా మాత్రమే సాధ్యం.
- విశ్వవిద్యాలయ నిర్వహణ పూర్తిగా చట్టంలోని నిబంధనలకి అనుగుణంగా జరుగుతుంది, నిర్వహణ కూడా భారత ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది.
- విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వేలాది పాఠశాలల నిర్వహణను అనుమతించం.
1913-1915 మధ్య కాలంలో సంఘటనలు
బ్రిటిష్ ప్రభుత్వానికి ముస్లిం సముదాయానికి మధ్య చర్చలు కొనసాగాయి. ముస్లిం సముదాయ౦ రెండు కూటములుగా విడిపోయింది.
అ. మితవాద వర్గం – బ్రిటిష్ ప్రభుత్వ౦ నియంత్రణలోనైనా సరే AMUని స్థాపించాలి అనే ఈ వర్గానికి షేక్ అబ్డుల్లా నాయకుడు
ఆ. అతివాద వర్గం – ముస్లిం సముదాయ౦ నియంత్రణలేకుండా AMU ఏర్పాటు చేయకూడదనే ఈ వర్గానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్, మొహమ్మద్ షఫీ, మౌలానా మొహమ్మద్ అలీ నాయకులు.
బ్రిటిష్ ప్రభుత్వానికి ముస్లిం సముదాయానికి మధ్య అన్ని చర్చలు విఫలమయ్యాయి.
BHU, 1915 చట్టం కింద 1916లో బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించబడింది
1916లో బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపన తరువాత, ముస్లిం సముదాయ౦ మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వoతో చర్చలు ప్రారంభించింది. హర్కోర్ట్ బట్లర్ ( వైస్రాయ్ ఎక్సిక్యుటివ్ కమిటి కౌన్సిల్ విద్యాశాఖ సభ్యుడు) రాజా మహ్ముదాబాద్ (ముస్లిం స్థాపన కమిటీ)తో BHU స్థాపన, నిర్వహణకు సంబంధించిన అన్ని నిబంధనలు AMUకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసారు.
1916-17లో విశ్వవిద్యాలయంపై బ్రిటిష్ భారత ప్రభుత్వం నియంత్రణకు ముస్లిం సముదాయ౦ ఒప్పుకుంది.
పార్లమెంట్ (అప్పటి కేంద్ర శాసన పరిషద్) ద్వారా జారీ అయిన AMU చట్టం 1920 క్రింద అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపన జరిగింది.
విశ్వవిద్యాలయంఫై పూర్తి నియంత్రణ ముస్లిం సముదాయానికి మాత్రమే ఉండాలన్న వర్గం ఢిల్లీకి వెళ్లి 1921లో జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని తమంతట తామే ఏర్పాటు చేసుకున్నారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన సంగతి ఏమంటే, ప్రైవేటు వ్యక్తులు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చుగానీ, ఆ విశ్వవిద్యాలయం ప్రదానం చేసే డిగ్రీలను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం లేదు. కాబట్టి, ప్రతిభ కల్గిన విద్యార్థులు అక్కడ ప్రవేశించరు. అందుకని, ముస్లిం సముదాయ౦, డిగ్రీల గుర్తింపుకై బ్రిటిష్ భారత ప్రభుత్వం నిబంధనలకు ఒప్పుకుంది.
ముస్లిం ప్రతినిధులకి ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం
- కేంద్ర శాసన పరిషద్ (పార్లమెంట్) చట్టం ద్వారా AMU విశ్వవిద్యాలయం స్థాపన.
- AMU విశ్వవిద్యాలయం నియంత్రణ, నిర్వహణ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది.
- ముస్లిములు నిర్వహిస్తున్న మూడు సంస్థలు మూసివేస్తారు. వాటికున్న ఆస్తులు, అప్పులు, ఇతరాలు కొత్త విశ్వవిద్యాలయం తీసుకుంటుంది.
- పాఠశాలలు, కళాశాలలు AMU నియంత్రణ క్రింద ఉండవు.
హిందువులు ముస్లిములు కూడా AMUకి సహాయం చేసారు, ధన౦తోపాటు భూమి విరాళాలుగా ఇచ్చారు. భారీ విరాళాలు ఇచ్చిన వారిలో విజయనగర౦ మహారాజు, ఠాకూర్ గురుప్రసాద్ సింగ్ (బెస్వాన్), కున్వర్ జగ్జిత్ సింగ్ (బిజ్నోర్), రాయ్ శంకర్ దాస్ (ముజఫర్ నగర్), పటియాల మహారాజు ( ఆ కాలంలో అయన 58000 రూ. విరాళం ఇచ్చారు), రాజా హరికిషన్ సింగ్, దర్భంగా మహారాజు, మహేంద్ర ప్రతాప్ సింగ్ మహారాజు మొదలైనవారు ఉన్నారు.
ఆ విధంగా పార్లమెంట్ జారీ చేసిన చట్టం ద్వారా AMU స్థాపన జరిగింది, ఈ చట్టo భారత ప్రభుత్వానికి విశ్వవిద్యాలయ నిర్వహణలో పూర్తి నియంత్రణ కల్పిస్తుంది. ఈ చట్టంలో మార్పులు చేయడానికి ముస్లిం సముదాయానికి ఏ విధమైన హక్కు లేదు. అన్ని హక్కులు పార్లమెంట్ కి మాత్రమే ఉన్నాయి.
భారత సంవిధాన సభ మరియు AMU
- భారత సంవిధాన సభ, AMUకి `కేంద్ర విశ్వవిద్యాలయం’ హోదా ఇచ్చి, `జాతీయ ప్రాముఖ్యత’ కలిగిన సంస్థగా గుర్తించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.
- భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ క్రింద `కేంద్ర జాబితా’ (Union List)లో AMU చేర్చబడింది. కేంద్ర జాబితా క్రింద ఉన్న ఏ సంస్థా మైనారిటీ (అల్పసంఖ్యాక వర్గ) సంస్థ కాదు.
- భారత సంవిధాన సభలో ఎంతోమంది ముస్లిం ప్రతినిధులు ఉన్నారు; AMU ఏర్పాటుకి కృషి చేసిన మౌలానా ఆజాద్ కూడా ఉన్నారు.
- BHU మరియు AMU `జాతీయ ప్రాముఖ్యత’ కలిగిన సంస్థలుగా డా. బి. ఆర్. అంబేద్కర్ పేర్కొని వాటిని సరియైన పద్ధతిలో కేంద్ర జాబితాలో చేర్చారు.
- ఇదే చట్టంక్రింద ఏర్పాటు చేయబడ్డ ఇతర విశ్వవిద్యాలయాలు – కలకత్తా విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, ముంబై విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం మొ. వాటిని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించారు.
- సంవిధాన సభలో ఉన్న ముస్లిం ప్రతినిధులు ఎవరూ AMU `మైనారిటీ హోదా’ అంశాన్ని లేవనెత్తలేదు. అసలు AMU విషయంలో `మైనారిటీ సంస్థ’ అనే ప్రస్తావన కూడా రాలేదు.
- AMU నిర్వహణ పార్లమెంట్ చేతుల్లోనే పెట్టారు.
- పార్లమెంట్ ఎప్పుడూ `మైనారిటీ సంస్థలను’ నిర్వహించదు.
- భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ క్రింద `కేంద్ర జాబితా’ (Union List)లో, 63వ సంఖ్యగా AMU నమోదు చేయబడింది.
- కేంద్ర జాబితా’ (Union List)లో ఉన్న సంస్థను ఆ జాబితానుంచి తొలగించాలంటే, రాజ్యాంగ సవరణ అనే క్లిష్టమైన ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.
AMU చట్టానికి 1951 సవరణ
- నెహ్రూ ప్రభుత్వంలో విద్యామంత్రిగా ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ AMU చట్టానికి 1951లో రెండు సవరణలు చేసారు.
- ముస్లిం విద్యార్థులు తప్పనిసరిగా ముస్లిం మతబోధనలు నేర్చుకోవాలి’ అనే నిబంధనను తొలగించారు.
- విశ్వవిద్యాలయం కోర్టులో ముస్లింలు తప్ప ఇతరులు సభ్యులుగా ఉండరాదు’ అనే నిబంధనను తొలగించారు.
(BHU చట్టానికి కూడా ఈ విధమైన సవరణలు చేశారు)
సెక్షన్ (విభాగం) 8 చేర్చారు; AMU అన్ని మతాల విద్యార్థులకి, జాతి, మత, కులం, లింగం, వర్గం, తరగతులకి అతీతంగా ప్రవేశం కల్పిస్తుంది. పార్లమెంట్లో చర్చలో పాల్గొంటూ డా. జాకీర్ హుస్సేన్ ఈ తీర్మానానికి మద్దతు తెలిపి ఇది `స్వాగతించవలసిన ముందడుగు’ గా పేర్కొన్నారు.
AMU చట్టానికి 1965 సవరణ
ఈ సవరణ 2/9/1965 తేదిన అప్పటి విద్యామంత్రి మొహమ్మద్ కరీం చాగ్ల పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఆయన అంతకుముందు బొంబాయి ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి అప్పటి ప్రధానమంత్రి. విద్యామంత్రి పార్లమెంట్లో ఈ విధంగా పేర్కొన్నారు- `AMU మైనారిటీ సంస్థ కాదు. `ముస్లిం సముదాయం AMUని స్థాపించలేదు, దానిని నిర్వహించలేదు. AMUని పార్లమెంట్ ఏర్పాటు చేసింది, ఇది `కేంద్ర జాబితా’ (Union List)లో, 63వ సంఖ్యగా నమోదు చేయబడింది. కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను, పార్లమెంట్ శాసనం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. AMU నిర్వహణ మైనారిటీల చేతుల్లో ఉందని ఇపుడు ఎలా అంటున్నారో,నాకు అర్ధం కావట్లేదు’. (పార్లమెంట్ చర్చలు – 2/9/1965 పేజి 3490). అలిగడ్, బెనారస్, ఢిల్లీ. విశ్వభారతి –నాలుగు విశ్వవిద్యాలయాలు అన్నీ తనకు సమానమే అని ఆయన అన్నారు. (పార్లమెంట్ చర్చలు – 2/9/1965 పేజిలు 3449- 3503)
AMU హోదా పై సుప్రీమ్ కోర్ట్- అత్యున్నత న్యాయస్థాన౦
అజీజ్ బాషా మరియు ఇంకొక వ్యక్తి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం
తీర్పు తేది : 20 సెప్టెంబర్ 1967
బెంచ్: కె.ఎన్.వాంచూ (ప్రధాన న్యాయమూర్తి), న్యాయమూర్తి ఆర్.ఎస్.బచావత్, న్యాయమూర్తి వి. రామస్వామి, న్యాయమూర్తి జి. కె. మిట్టర్, న్యాయమూర్తి కె. ఎస్. హెగ్డే
భారత పార్లమెంట్ 1951 మరియు 1965లో AMU చట్టంలో చేసిన సవరణలను ప్రశ్నిస్తూ ముస్లిం ప్రతినిధులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
భారత రాజ్యాంగం 31వ అధికరణ (Article ) ప్రకారం AMU మైనారిటీ సంస్థ అని, అందువల్ల AMU చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని వాళ్ళు తమ వాదన వినిపించారు. 31వ అధికరణo మతం లేక భాషాపరమైన మైనారిటీలకు, వారి ఇష్టప్రకారం విద్యాసంస్థలు స్థాపించుకునే హక్కు కల్పిస్తుంది.
గౌరవనీయ అత్యున్నత న్యాయస్థానo 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు ప్రకారం:
- AMU మైనారిటీ సంస్థ కాదు, ఈ కేంద్ర విశ్వవిద్యాలయానికి 31వ అధికరణo వర్తించదు.
- AMU పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడింది, AMUచట్ట ప్రకారం దాని నిర్వహణ జరుగుతోంది.
- ముస్లిం మైనారిటీ సముదాయం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే, వారి పట్టాలను ప్రభుత్వం గుర్తించే పరిస్థితి అసలు ఎపుడూ లేదు కాబట్టి, AMUని మనుగడలోకి తెచ్చింది అప్పటి కేంద్ర విధానసభ మరియు భారత ప్రభుత్వం అనే చెప్పవలసి ఉంటుంది. (AIR 1968 SC 662 పారా 26)
- AMUకి 31వ అధికరణo అసలు వర్తించదు, AMUచట్టానికి సవరణలు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు.
- AMUచట్టానికి సవరణలు చేసే హక్కు పార్లమెంట్ కి ఉంది.
- ముస్లిం ప్రతినిధుల 5 ఆర్జీలను (petitions) న్యాయస్థానం తోసిపుచ్చింది.
AMUచట్టంలో చేసిన మూడు సవరణలను అప్పటి ప్రధానులు శ్రీ నెహ్రూ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీమతి ఇందిరా గాంధీ పూర్తిగా సమర్థించారు. అప్పటి విద్యామంత్రులు మౌలానా ఆజాద్ మరియు శ్రీ మొహమ్మద్ కరీం చాగ్ల AMUచట్టంలో ఈ సవరణలు చేసారు. అంతేకాక ప్రభుత్వం న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించినప్పుడు శ్రీ చాగ్లకు, శ్రీమతి ఇందిరా గాంధీ పూర్తి మద్దతు ఇచ్చారు.
1972లో శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు, అప్పటి విద్యామంత్రి శ్రీ నూరుల్ హసన్ AMUచట్టంలో సవరణలు చేసారు, ఆయన పార్లమెంట్లో ఈ విధంగా ప్రకటించారు: `ఇది జాతీయ విశ్వవిద్యాలయo. ఇది మైనారిటీ సంస్థ కాదు, అలాగే మతపరమైన సంస్థ కూడా కాదు. గతంలో కాని, ప్రస్తుతం కానీ AMUకి మతపరమైన విద్యాసంస్థ హోదా ఇవ్వాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు’.
1979లో జనతా పార్టీ ప్రభుత్వంలో శ్రీ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు, శ్రీ ప్రతాప్ చంద్ర చందర్ విద్యా మంత్రిగా AMU చట్టంలో కొన్ని సవరణలు చేసారు. శ్రీ చందర్ `1968 నాటి అత్యున్నత న్యాయస్థానం తీర్పు మనం గౌరవించాలి’ అని పేర్కొన్నారు. (30/4/1979 న పేర్కొన్నారు)
1981లో AMU చట్టంలో సవరణ: కాంగ్రెస్ ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధమైన చర్య
AMU చట్టం సెక్షన్ 2(1)`విశ్వవిద్యాలయo’ అంటే అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయo అని పేర్కొంటుంది. 1981లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్వచనం పూర్తిగా మార్చేసి `విశ్వవిద్యాలయo’ అంటే `భారత ముస్లిములు వారి ఇష్ట ప్రకారం ఏర్పరుచుకున్న విద్యా సంస్థ, ఇది మహమ్మడన్ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల నుంచి ఉద్భవించింది, ఇదే తరువాత అలీగడ్ విశ్వవిద్యాలయoగా రూపొందించబడింది’ అంటూ కొత్త రాగం అందుకుంది.
ఈ కొత్త నిర్వచనం 1968నాటి అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఉల్లంఘించడమే కాక, ముస్లిం సముదాయాన్ని పూర్తిగా తప్పుదోవపట్టించేదిగా ఉంది. విశ్వవిద్యాలయo పనిచేసిన 61సంవత్సరాల తరువాత, దానిని 30వ అధికరణo (Article) పరిధిలోకి తెచ్చే ప్రయత్నం జరిగింది. ఇది రాజ్యాంగం పట్ల చేసిన మోసం, దగా. అంతేకాదు ఈ మోసపూరిత చర్యను మరింత పొడిగిస్తూ ఈ చట్టంలో 5(2)(c) సెక్షన్ చేర్చబడింది. అందులో `ముస్లింల విద్యా సాంస్కృతిక పరమైన అభ్యున్నతి’ ఈ విశ్వవిద్యాలయo ఉద్దేశం’ అని పేర్కొనబడింది.
1981లో పార్లమెంట్ చర్చల్లో, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు శ్రీ సోమనాథ్ చటర్జీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ-విరుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూ `అసలు మీరు ఏమి చేస్తున్నారు?1920లో తీసుకున్న నిర్ణయాలను 1981లో చట్టం ద్వారా రద్దు చేయగలరా?’ అని ప్రశ్నించారు. (పార్లమెంట్ చర్చలు 22/12/1981 పేజి 381.)
1989 ఆగష్టు 20 న, AMU కోర్టు 50% సీట్లు ముస్లిం విద్యార్థులకి కేటాయించాలని ఒక తీర్మానం చేసి, భారత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. (రాష్ట్రపతి AMU సందర్శకుడు (visitor) కూడా). ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి తిరస్కరిస్తూ `ఇది రాజ్యాంగ విరుద్ధమని, AMU చట్టం సెక్షన్ 8ని ఉల్లంఘిస్తోందని’ పేర్కొన్నారు. సెక్షన్8 మతం ఆధారంగా ఎటువంటి వివక్ష ఉండకూడదని స్పష్టంగా చెప్తుంది. భారత ప్రభుత్వం UGC ద్వారా AMUకి పూర్తి స్థాయిలో నిధులు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ తీర్మానం, భారత రాజ్యాంగంలోని అధికరణ (Article) 29(2) `ప్రభుత్వం నిర్వహించే /లేక ప్రభుత్వం నుంచి నిధులు పొందే ఏ విద్యా సంస్థ అయినా మతం, జాతి, కులం, భాష ప్రాతిపదికన ఏ పౌరునికి ప్రవేశం నిరాకరించకూడదు’ అనే సూత్రాన్ని ఉల్లంఘిస్తోంది.
ముస్లింలకు ప్రత్యేక సీట్ల కేటాయింపు /రిజర్వేషన్స్ కోసం 2005లో తిరిగి ప్రయత్నం
15సంవత్సరాల తరువాత, మళ్ళీ AMU అడ్మిషన్ కమిటీ, వైద్య కళాశాలలో 50% సీట్లు ముస్లిం విద్యార్థులకి కేటాయిస్తూ తీర్మానం చేయగా, AMU కార్యనిర్వాహక కమిటీ దానిని అంగీకరించి, శ్రీ అర్జున్ సింగ్ మంత్రిగా ఉన్న మానవ వనరుల అభివృద్ధి శాఖకి (HRD) ఆమోదం కోసం పంపించింది. HRD మంత్రిత్వ శాఖ తరపున సంయుక్త కార్యదర్శి 25/2/2005 తేదిన వ్రాసిన లేఖలో, AMU వైద్య కళాశాలలో 50% సీట్లు ముస్లిం విద్యార్థులకి కేటాయిoచడంపై మంత్రిత్వ శాఖకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలియచేసింది. దానితో ముస్లిమేతర విద్యార్థులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యపై అలహాబాద్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
నరేష్ అగర్వాల్ వర్సెస్ భారత ప్రభుత్వం 2005 అలహాబాద్ ఉన్నత న్యాయస్థానo.
న్యాయమూర్తి అరుణ్ టాండన్ తమ తీర్పులో ఈ విధంగా పేర్కొన్నారు:
- AMUలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము.
- 1968 నాటి అజీజ్ బాషా కేసులో గౌరవనీయ అత్యున్నత న్యాయస్థానo ఇచ్చిన తీర్పును పాటించాలి.
- రాజ్యాంగంలోని అధికరణ (Article)30 మైనారిటీ సంస్థ నిర్వచనం క్రిందకి AMUరాదు.
- పార్లమెంట్ చట్టం ద్వారా AMU స్థాపించబడింది, మైనారిటీ వర్గం ద్వారా కాదు.
- అత్యున్నత న్యాయస్థానo (Supreme Court) ఇచ్చిన తీర్పును తలక్రిందులు చేయడానికి పార్లమెంట్ ప్రయత్నించింది, ఇది రాజ్యాంగ విరుద్ధం.
భారత్ ప్రభుత్వం, పైన పేర్కొన్న న్యాయమూర్తి తీర్పును, అదే అలహాబాద్ న్యాయస్థానం డివిజన్ బెంచ్ ముందు సవాలు చేసింది.
అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఏ.ఎన్. రే మరియు న్యాయమూర్తి అశోక్ భూషణ్ 22/12/2005 న తమ తీర్పు వెలువరించారు.
- న్యాయమూర్తి అరుణ్ టాండన్ తీర్పును ధృవపరుస్తూ AMU మైనారిటీ సంస్థ కాదని పేర్కొన్నారు.
- 1968 నాటి అజీజ్ బాషా కేసులో గౌరవనీయ అత్యున్నత న్యాయస్థానo ఇచ్చిన తీర్పును పాటించాలి.
- AMU పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడింది, AMUచట్ట ప్రకారం దాని విధి నిర్వహణ జరుగుతోంది.
- అత్యున్నత న్యాయస్థానo (Supreme Court) 1968లో ఇచ్చిన తీర్పును, పార్లమెంట్ 1981లో ఉల్లంఘించి, ఆ తీర్పును నీరుగార్చి వ్యర్థం చేసింది.
- పార్లమెంట్ మైనారిటీ సంస్థను ఏర్పాటు చేయడానికి వీలులేదు. వాటిని మైనారిటీలు మాత్రమే ఏర్పాటు చేసుకోగలరు.
- మైనారిటీ విద్యార్థులకి 50% సీట్ల కేటాయింపులు/ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము, వాటిని తోసిపుచ్చడం అయినది.
- భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ వ్రాసిన 25 /2/2005 తేదినాటి లేఖ కొట్టివేయడమైనది
- రాజ్యాంగానికి సంబంధించి ఎటువంటి రాజకీయాలు అనుమతించబడవు.
- భవిష్యత్తులో ముస్లిం విద్యార్థులకి విశ్వవిద్యాలయoలో సీట్ల కేటాయింపులు/ రిజర్వ్ చేయడానికి AMU ప్రయత్నించకూడదు.
- అన్ని అర్జీలు (Petitions) తోసిపుచ్చడమైనది.
అయితే తిరిగి భారత ప్రభుత్వం మరియు AMU, అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ 2005 డిసెంబర్ 22వ తేదిన, అత్యున్నత న్యాయస్థానo (Supreme Court)లో కేసు వేసింది. 5/1/2006 తేదిన అత్యున్నత న్యాయస్థానo తీర్పునిచ్చింది.
ముస్లిం విద్యార్థుల సీట్ల కేటాయింపులు/ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము. అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం తీర్పుపై స్టే నిరాకరణ. యధాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వు జారీ చేయడమైనది.
AMUలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకి రిజర్వేషన్లు కల్పించాలని 2014లో అర్జీలు (petitions) వేయడం జరిగింది. గౌరవ అత్యున్నత న్యాయస్థానo (Supreme Court) ముందు ఇవి విచారణకు ఇంకా రాలేదు.
షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల (SC, ST and OBC) వారి తప్పేమిటి?
AMUని కేంద్ర విశ్వవిద్యాలయoగా స్థాపించిన 1920 AMUచట్టం జారీచేయబడి 98సంవత్సరాలు గడిచాయి. అజీజ్ బాషా కేసులో AMU మైనారిటీ సంస్థ కాదని, పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడి, కేంద్ర జాబితాలో 63వ సంఖ్యగా నమోదు చేయడిన కేంద్ర విశ్వవిద్యాలయమని అత్యున్నత న్యాయస్థానo తీర్పు వచ్చి 50 సంవత్సరాలు గడిచాయి. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ.
సంవిధాన సభలో డా. బె. ఆర్. అంబేద్కర్ మొదలుకొని, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పం. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, తరువాత మొరార్జీ దేశాయ్- అందరూ AMU మైనారిటీ సంస్థ కాదనే తేల్చి చెప్పారు. కాని 2005 శ్రీ అర్జున్ సింగ్ విద్యామంత్రిగా ఉన్నప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సంతుష్టికరణ కోసం భారత రాజ్యాంగాన్ని దగా చేసింది. అయితే ఈ మోసపూరిత సవరణలను రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించి అలహాబాద్ న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానo కొట్టివేసాయి.
అయినప్పటికీ షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల (SC, ST and OBC) వారు తమకి రావాల్సిన చట్టపరమైన వాటాకోసం దాదాపు 100 సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ముస్లిం విశ్వవిద్యాలయంలో వీరికి రిజర్వేషన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. రాజ్యాంగం పొందుపరిచిన రిజర్వేషన్ల హక్కు AMUలో పొందడంకోసం వారు ఎంత కాలం ఎదురు చూడాలి? డాక్టర్లు, ఇంజనీర్లు కాగల లక్షలాది అవకాశాలు, లేక కేంద్ర విశ్వవిద్యాలయoలో ఉపాధ్యాయులుగా నియామకాలు మొదలైనవెన్నోఇప్పటికే కోల్పోయినవారికి, ఎవరు నష్టపరిహారం ఇప్పించగలరు?
-మోనికా అరోరా , సుప్రీమ్ కోర్ట్ న్యాయవాది
అనువాదం: పి. శైలజ
(విశ్వా సంవాద్ కేంద్ర )