Home News `భవిష్యత్తులో భారతం : ఆర్ ఎస్ ఎస్ దృష్టి కోణం’ ఉపన్యాస కార్యక్రమం (2 వ...

`భవిష్యత్తులో భారతం : ఆర్ ఎస్ ఎస్ దృష్టి కోణం’ ఉపన్యాస కార్యక్రమం (2 వ రోజు)

0
SHARE

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ. మోహన్ భాగవట్ ఉపన్యాస సారాంశం

సంఘ ద్వారా సంస్కారాలను, జాతియభావనను అలవరచుకున్న స్వయంసేవకులు వివిధ సంస్థలను ప్రారంభించారు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇలా వివిధ సంస్థల్లో పనిచేసే స్వయంసేవకుల ఆలోచన, పనిచేసే విధానం సహజంగా ఒకటే ఉంటుంది. వీరి మధ్య సమన్వయం, సహకారం కూడా ఉంటుంది. అంతమాత్రాన సంఘమే ఈ సంస్తలన్నింటిని నడుపుతోందని భావించరాదు.

రాజకీయ రంగంతో సంఘానికి సంబంధం ఏమిటని తరచూ ప్రశ్నిస్తుంటారు. నిజానికి సంఘ స్థాపకులు డా. హెడ్గెవార్ కాలం నుండి సంఘానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొన్నప్పటికీ డా. హెడ్గెవార్ సంఘ స్థాపన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీనికి కారణం వివిధ సిద్ధాంతాలు, ఆలోచనల ఆధారంగా ఏర్పడే వేరువేరు పార్టీల మధ్య తేడాలు సహజంగానే వస్తాయి. హిందూ సమాజాన్ని మొత్తాన్ని సంఘటితం చేయాలనుకుంటున్న సంఘ అలాంటి విభేదాలతో సంబంధం లేకుండా పనిచేయాలని భావించింది. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే దేశానికి, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడటంలో, పరిష్కారాలను సూచించడంలో వెనకడుగు వేయం. సంఘ ద్వారా సంస్కారాలను పొందిన స్వయంసేవకులు తమకు తోచిన రాజకీయ పక్షంలో పనిచేసే స్వేచ్చ, అధికారం వారికి ఉంటాయి. అందుకు తగినట్లుగానే వాళ్ళు పనిచేస్తారు. ఈ విషయంలో సంఘ వారికి ఎలాంటి ఆదేశాలు, సూచనలు, సలహాలు ఇవ్వదు. కాబట్టి ఒక పార్టీని, లేదా ఆ పార్టికి చెందిన ప్రభుత్వాన్ని సంఘ ప్రభావితం చేస్తుందని, నాగపూర్ నుండే ప్రభుత్వం నడుస్తుందనే అభిప్రాయాలు, ఆలోచనలు నిరాధారమైనవి. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడానికి సంఘం ఎలాంటి ప్రయత్నం చేయదు. రాజ్యాంగబద్ధమైన పాలనా కేంద్రం (Power Centre) ఒక్కటే ఉండాలన్నది సంఘ విశ్వాసం. రాజ్యాంగేతర పాలనా కేంద్రం మరొకటి ఉండకూడదు.

మహిళల గురించి కుడా సంఘ ఆలోచన సనాతన ధర్మం ఆధారంగా ఏర్పడినదే. సమాజంలో స్త్రీ, పురుషులు అన్ని విషయాల్లోనూ సమాన భాగస్వాములు. ఆ విధంగానే మహిళలకు సమాన స్థానం కలిగించాలి. ఉద్దరణ పేరుతొ మహిళలకు మేలు చేస్తున్నామనే భావనను సంఘం అంగీకరించదు. మహిళలకు సహజంగా చెందవలసిన స్థానాన్ని, గౌరవాన్ని వారికి ఇవ్వాలి. నిజానికి అనేక విషయాల్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువ సమర్ధతను కలిగిఉన్నారు. సమాజ కార్యంలో ఇద్దరిది సమాన భాగస్వామ్యం అనేదే సంఘ ఆలోచన.

సర్వ సమ్మతమైన, సార్వజనినమైన విలువలతో కుడుకున్నదే హిందూ ధర్మం. దీని ఆధారంగానే సంఘ పనిచేస్తుంది. పరమ సత్యాన్ని వివిధ పద్దతులలో ప్రకటించినా అది మారదు అనే మౌలిక విలువను ఆధారం చేసుకునే సంఘం పనిచేస్తుంది. వివిధత్వాన్ని గౌరవిస్తుంది, అంగీకరిస్తుంది. ఈ ధర్మాన్ని కొందరు సనాతన ధర్మం అని, కొందరు భారతీయ సంస్కృతీ అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు. కాని `హిందూ’ అనే పదం బయటనుండి వచ్చినదే అయినా ఈ దేశంలో వికసించిన మౌలిక విలువలను గుర్తుచేయడానికి ఆ పదం ఎక్కువ ఉపయుక్తంగా ఉందనే భావంతో సంఘం హిందూ అనే పదాన్ని ఉపయోగిస్తోంది. ఏ పదాన్ని ఉపయోగించిన సర్వమానవాళి కళ్యాణాన్నికోరుకున్న ధర్మాన్ని గురించే అందరం మాట్లాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ధర్మం అంటే `రిలీజియన్’ కాదు. ధర్మం ఒక జీవన విధానం. ఈ జీవన విధానం ప్రకారం మనం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించాం. ఈ విలువలే మన రాజ్యాంగానికి ఆధారం. కాబట్టి భాష, ప్రాంతం, ఆచార వ్యవహారాలు మొదలైనవి విభేదానికి, విద్వేషానికి కారణం కావు, కాకూడదు. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు ఫ్రెంచ్ విప్లవం నుండి స్వికరించలేదని, అవి తథాగతుడు (బుద్దుడు) బోధించిన విలువలని ఒక సందర్భంలో  డా. అంబేద్కర్ స్పష్టం చేసారు. ఈ విలువల ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగం బందుభావనను పెంపొందించడానికే ప్రాదాన్యతనిచ్చింది. అది పీఠికలో స్పష్టం చేసారు. సనాతన విలువల ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగాన్ని సంఘం గౌరవిస్తుంది, దానికి అనుగుణంగానే నడుస్తుంది.

అందరిని కలుపుకుని పోయే, శోషణ లేని, సద్భావనా పూర్వకమైన సమాజాన్ని నిర్మించాలని సంఘ ఆశిస్తోంది. మన పూర్వులు కూడా ఇదే కోరుకున్నారు. వారి నుండే ఈ భావాన్ని, విలువలను సంఘం స్వీకరించింది, అనుసరిస్తోంది. రవీంద్రనాథ్ టాగోర్ , స్వతంత్ర వీర సావర్కర్, గాంధీజీ వంటి వారు ఇలాంటి సమాజాన్నే కోరుకున్నారు. కనుక సంఘం ఎవరిని వ్యతిరేకించదు. అందరితో కలిసి పనిచేస్తుంది.