Home News ఎన్జీవోల విదేశీ ధన ప్రవాహం, దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఎన్జీవోల విదేశీ ధన ప్రవాహం, దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

0
SHARE
ఇటీవలి కాలంలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన దాదాపు 18000 స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల లైసెన్సులు నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఎన్జీవోల దేశ వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి నిలిపింది.
ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కధనం ప్రకారం.. తమ పరిధిలోని స్వచ్చంధ సంస్థల విదేశీ నిధులపైనా మరియు అవి చేస్తున్న  కార్యకలాపాల పైనా దృష్టి నిలపాలని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ డేనియల్ ఇ రిచర్డ్స్ ద్వారా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
“కొన్ని స్వచ్ఛంద సంస్థలు దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్టు సమాచారం అందింది. అటువంటి సంస్థల మీద రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి. అదే విధంగా ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు కూడా ఎన్జీవోల విదేశీ ధనప్రవాహం, కార్యకలాపాల మీద దృష్టి ఉంచాలి” అంటూ డేనియల్ రిచర్డ్స్ జారీ చేసిన ఆదేశాలను ఉటంకిస్తూ ఆ పత్రిక కధనం ప్రచురించింది.
గత మే నెలలో తమిళనాడులోని తూతుకుడిలో జరిగిన నిరసనల్లో 11 మంది మరణించారు. దీని వెనుక ఒక స్వచ్ఛంద సంస్థ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. స్వచ్ఛంద సంస్థల దేశవ్యతిరేక కార్యకలాపాల విషయాన్నీ రాష్ట్ర డీజీపీ-ఐజీల సదస్సులో చర్చిస్తామని అధికారులు వెల్లడించారు.
దేశ ఆర్ధిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నట్టు 2014లో ఇంటెలిజెన్స్ నివేదిక అందింది. అనంతరం హోం శాఖ 13,000 పైగా స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల లైసెన్సులు రద్దు చేసింది. అందులో గ్రీన్ పీస్, కంపాషన్ ఇంటర్నేషనల్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఉండటం గమన్హారం.
అదేవిధంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్న సామజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, ఇస్లాం ప్రభోధకుడు జాకిర్ నాయక్ లకు చెందిన సంస్థలపై కూడా దర్యాప్తు నడుస్తోంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై గతవారం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ బెంగళూరు కార్యాలయం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.