Home Telugu Articles ఉపాధి సహిత వృద్ధికి బాసట!

ఉపాధి సహిత వృద్ధికి బాసట!

0
SHARE

పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనాలెన్నో…

పెద్ద నోట్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినప్పటి నుంచీ రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి ముందువెనకాల ఆలోచించకుండా, ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా ఈ నిర్ణయం తీసుకొన్నారని, ఇది చాలా దారుణమని ప్రతిరోజూ అదేపనిగా ఆడిపోసుకొంటున్నారు. ప్రధాని నిర్ణయం కారణంగా లక్షలాది భారతీయుల బతుకులు అస్తవ్యస్తమయ్యాయని, చిన్న వ్యాపారుల జీవన చిత్రాలు ఛిద్రమయ్యాయని వారు నిందారోపణలు చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో కష్టనష్టాలు తప్పవనీ జోస్యాలు చెబుతున్నారు.అవన్నీ అర్థంపర్థంలేని మాటలు. నవంబరు ఎనిమిది ప్రకటనకు ముందు ప్రధాని పలుమార్లు చేసిన వ్యాఖ్యలు, సూచనలు, హెచ్చరికలను వారంతా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొంటే మంచిది. అవి వారికి గుర్తుకు వస్తే ఇలాంటి ఆరోపణలు, విమర్శలూ ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యరు. 2004-2014 మధ్యకాలంలో దేశంలో నల్లధనం భారీయెత్తున మేట వేసింది. మన్మోహన్‌ తరహాలో చూసీచూడనట్లు వ్యవహరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే పరిస్థితులు తలెత్తాయి. ఈ స్థితిగతుల గురించి, ప్రధానమంత్రి కొన్ని నెలల ముందునుంచే ఆవేదన, ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. నల్లధనాన్ని కట్టడి చేయడానికి కఠిన చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి ఉత్పన్నమైందని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

ముందే హెచ్చరికలు

అడ్డదారులు తొక్కుతున్నవారి మీద, నల్లధనం భారీగా కూడబెట్టుకొని ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగా ఎదిగినవారిపైనా పోరు తప్పదని మొన్న మే22న ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ కుండ బద్దలుకొట్టారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటల్ని రేడియోలో విన్నవారికి నవంబరు ఎనిమిదినాటి చర్య ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించదు. కఠిన చర్య తీసుకోవాలని ప్రధానమంత్రి చాలాకాలంగా భావిస్తున్నారు. పెద్దనోట్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడానికి అయిదు నెలల ముందు అంటే మే నెల ఆరంభంలోనే దీనిమీద ఆయన ఒక స్పష్టతకు వచ్చారు, స్పష్టతనూ ఇచ్చారు. నగదు నుంచి నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా సాగిపోవాల్సిందిగా తన రేడియో కార్యక్రమంలో ఆయన ప్రజలను కోరారు.

ఆధునిక, పారదర్శక భారతదేశాన్ని నిర్మించాలంటే మనం మన పాత అలవాట్లు మార్చుకొనక తప్పదని ఆయన ఆనాడు విస్పష్టంగా చెప్పారు. చాలాకాలం క్రితం వస్తుమార్పిడి పద్ధతి అమలులో ఉండేది. తరవాతి కాలంలో నాణాలు, నోట్లు వచ్చాయి. ప్రపంచం ఇప్పుడు నగదు రహిత సమాజం దిశగా సాగుతోంది. డబ్బు తీసుకోవడం, ఇవ్వడం; వస్తువులు కొనుగోలు చేయడం, వాటికి చెల్లింపులు జరపడం- ఇదంతా ఎలక్ట్రానిక్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేయవచ్చు. తద్వారా నగదు రహిత వ్యవస్థను పాదుచేయవచ్చు. పైగా ఈ ప్రక్రియలో వాలెట్లు దొంగతనానికి గురయ్యే అవకాశమే లేదు. మొదట్లో ఇదంతా కొంచెం కష్టంగానే కనిపించవచ్చు. దీన్ని ఉపయోగించుకోవడం ప్రారంభించాక, అత్యంత సులువని అనిపిస్తుంది. భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపించేందుకు వీలు కల్పించే పలు పరిణామాలు ఇటీవలి సంవత్సరాల్లో చోటు చేసుకొన్నాయని ‘మన్‌కీ బాత్‌’ సందర్భంగా శ్రోతలకు మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనను మోదీ ప్రస్తావించారు. దీనివల్ల దేశంలోని దాదాపు ప్రతీ ఒక్క కుటుంబం బ్యాంకింగ్‌ వ్యవస్థ పరిధిలోకి వచ్చిందన్నారు. రూపే కార్డు ప్రాధాన్యం గురించి చెప్పారు. తన యోచనకు ఆధార్‌ కార్డు ముఖ్య ప్రాతిపదికగా ఉంటుందని పరోక్షంగా తెలిపారు. దేశంలోని ప్రతీ ఒక్కరి వద్ద మొబైల్‌ ఫోన్‌ ఉందంటూ, కొత్త వ్యవస్థలోకి మారడానికి అదే ప్రధాన సాధకం కాగలదని తెలియజెప్పారు. రూపే కార్డు, క్రెడిట్‌ కార్డుగాను, డెబిట్‌ కార్డుగానూ ఉపయోగపడుతుందన్నారు. ‘నేడు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) పేరిట చాలా చిన్న సాధనం అందుబాటులోకి వచ్చింది. మీ వద్ద ఆధార్‌ నంబరు ఉన్నా లేక రూపే కార్డు ఉన్నా సరే, దాని ద్వారా ఎవరికైనా డబ్బు చెల్లించవచ్చు. మీ పాకెట్‌లో నుంచి డబ్బు తీసి, లెక్కపెట్టి ఇవ్వాల్సిన పని లేదు. అసలు మీ వెంబడి డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. రెండోది బ్యాంక్‌ ఆన్‌ మొబైల్‌ అంటే యూనివర్సల్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) బ్యాంకింగ్‌ విధానం’ అని ప్రధాని ఆ రోజు తెలిపారు. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ (జెఎఎం-జామ్‌)… ఈ మూడింటిని అనుసంధానించడం ద్వారా నగదు రహిత సమాజం దిశగా సాగిపోవచ్చునని ఆయన చెప్పారు.

మున్ముందు చోటుచేసుకొనే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆయన ఆ రోజే శ్రోతలకు స్పష్టం చేశారు. తద్వారా వారిని సంసిద్ధులను చేశారు. ‘ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకొని, ఉపయోగించుకొంటే మనకిక నగదు అవసరం ఉండదు. వ్యాపార కార్యకలాపాలు అసంకల్పితంగానే సాగిపోతాయి. అక్రమ లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుంది. నల్లధనం ప్రభావం తగ్గిపోతుంది. అందుకే, ఆ దిశగా కనీసం ఒక అడుగు వేయాలని దేశవాసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నడక ఆరంభించడమే తరువాయి, సునాయసంగా ముందుకు దూసుకెళ్లగలం’ అని ప్రధాని ఆ రోజు తేటతెల్లం చేశారు. ఈ విషయంలో తెలియని భయాలేవో పెట్టుకోవద్దని ప్రధాని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజల వద్ద ఇన్ని మొబైల్‌ ఫోన్‌లు ఉంటాయని 20 ఏళ్లనాడు అనుకొన్నామా అన్నారు. ఇప్పుడు సెల్‌ఫోన్‌లు లేకపోతే పనే సాగని పరిస్థితి వచ్చిందని చెప్పారు. ‘ఈ నగదు రహిత సమాజం సైతం అలాంటిదే. ఎంత త్వరితంగా ఆ దిశగా సాగితే అంతమంచిది’ అని ఆయన అన్నారు.

నల్లధనం వెన్నువిరిచేందుకు, పెద్దనోట్ల చలామణీని రద్దుచేసి, నగదురహిత ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించేందుకు సిద్ధపడిన ఏ ప్రధానమంత్రి అయినా- తన ఉద్దేశమేమిటో, ఆలోచనలేమిటో ఇంతకన్నా విస్పష్టంగా విడమరచి చెప్పగలరా?

బలుపు కాదది వాపు

పెద్దనోట్ల రద్దు పూర్తిగా అనవసరమైన చర్య అని, దీని కారణంగా దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దిగలాగినట్లయిందన్నది ప్రధానిపై వస్తున్న మరో ఆరోపణ. ప్రముఖ రచయిత, ఆర్థిక, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత ఎస్‌.గురుమూర్తి దీనికి సరైన సమాధానం చెప్పారు. ఇదివరకటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ దేశ ఆర్థిక వ్యవస్థను దయనీయ స్థితికి దిగజార్చడంతో ప్రధానమంత్రి చేదుమాత్ర ఇవ్వక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. మోదీ ఇప్పుడు ఇంత కఠిన నిర్ణయం తీసుకొనకుండా ఉంటే, దేశ ఆర్థిక వ్యవస్థ పెనుసంక్షోభంలో చిక్కుకొనేది. ఇటీవల దిల్లీలోని వివేకానంద అంతర్జాతీయ కేంద్రంలో ప్రసంగించిన గురుమూర్తి, దేశ ఆర్థిక వ్యవస్థను మన్మోహన్‌ సింగ్‌ ఎంతలా ఛిద్రం చేశారో గణాంక సహితంగా వివరించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే… 2004-2010 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి రేటు పెరిగినప్పటికీ ఉద్యోగాల సృష్టి జరగలేదు. ఆస్తుల్లో పెరుగుదలవల్లే ఆ వృద్ధి నమోదైంది. అందుకే కొత్తగా ఉద్యోగావకాశాలు ఏర్పడలేదు. స్థిరాస్తి, బంగారం ధరలు నింగిని తాకడంతో వృద్ధిరేటు పెరిగినట్లు కనిపించింది. అది బలుపు కాదు, వాపు మాత్రమే. అందువల్లే జీడీపీలో ఏటా 8.4 శాతం పెరుగుదల నమోదైనా, కొత్త ఉద్యోగాల సృష్టి కేవలం 27 లక్షలకే పరిమితమైంది. నల్లధనం భారీయెత్తున మేటవేసింది. దాంతో ఆర్థిక వ్యవస్థ పెరిగినట్లు కనిపించింది. యావత్‌ ఆర్థిక వ్యవస్థనే దారితప్పించే స్థాయిలో నల్లధనం పేరుకుపోవడం వల్లే, దాన్ని అంతం చేయడానికి పెద్దనోట్ల రద్దు అనివార్యంగా మారింది. ప్రజల వద్ద భారీయెత్తున పెద్దనోట్లు జమకావడంతో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొంది. చలామణీలో ఉన్న పెద్దనోట్లు 2004లో 34 శాతం, 2010 నాటికి అవి రెట్టింపై 79 శాతానికి చేరాయి. 2016 నవంబరు ఎనిమిది నాటికి 87 శాతాన్ని తాకాయి. 2004-2013 మధ్యకాలంలో పెద్దనోట్ల చలామణీలో వార్షిక పెరుగుదల 51 నుంచి 63 శాతం దాకా నమోదైంది. రూ.1000 నోట్లలో మూడింట రెండు వంతులు, రూ.500 నోట్లలో మూడింట ఒకవంతు (అంటే, మొత్తం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల దాకా) జారీ తరవాత బ్యాంకులకే తిరిగిరాలేదని భారత రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఇది మరింత ఆందోళన కలిగించే విషయమే. ఎలాంటి పర్యవేక్షణా లేని ఈ పెద్దనోట్లు బ్యాంకుల వెలుపల నల్లధనంగా మేటమేసి బంగారం, భూముల ధరలు పెరగడానికి కారణమయ్యాయన్నమాట. బూటకపు వృద్ధికి కారణమవుతున్న పెద్దనోట్లను వదిలించుకొంటే తప్ప ఉపాధి అవకాశాలు లేని వృద్ధికి తెరపడదు. ఈ పరిస్థితి చక్కదిద్దడానికే మోదీ ఇప్పుడు కఠినచర్య తీసుకొన్నారు. 2004-2014 మధ్యకాలంలో పెద్దనోట్ల సంఖ్య భారీయెత్తున ఎందుకు పెరిగిందన్న ప్రశ్నకు మాత్రం నేటికీ సమాధానం లభించడంలేదు. వివిధ రాజకీయ పార్టీలతోపాటు నల్లడబ్బును భారీయెత్తున పేర్చుకొని పెట్టుకొన్నవారు ప్రధాని నవంబరు ఎనిమిదినాటి ప్రకటనతో ఎందుకు అవాక్కయ్యారన్న ప్రశ్నకు సమాధానం సూటిగానే, స్పష్టంగానే ఉంది. నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’ను వారు వినలేదు… అంతే!

మనసులో మాట…

ప్రధానమంత్రి అడ్డగోలుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్నారన్న ఆరోపణలో ఎంతమాత్రం పసలేదు. ఒక గట్టి చర్య తీసుకొంటున్నప్పుడు అందరికీ చెప్పి చేయాలా? అదే పనిగా సైరన్‌ మోగించి, దొంగలంతా తప్పించుకొన్నారన్న నిర్థారణ జరిగాకే రంగ ప్రవేశం చేయాలా? దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? పైగా మోదీ నైజం అదికాదు. ప్రధాని బాగా ఆలోచించి, వ్యూహాత్మకంగా తీసుకొన్న నిర్ణయమిది. నల్లకుబేరుల మీద, అక్రమార్కులపైన కొరడా ఝళిపించనున్నట్లు ప్రధాని అప్పటికే పలుమార్లు సూచనప్రాయంగా వెల్లడించారు. ఇ-వాలెట్లు, ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ గురించి నవంబరు ఎనిమిదికి ముందే చాలాసార్లు ప్రస్తావించారు. మే 22న ఆకాశవాణి (ఆలిండియా రేడియో)లో ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో పాలుపంచుకొంటూ మోదీ తన మనసులో మాటను అత్యంత స్పష్టంగా, అరమరికలు లేకుండా బయటపెట్టారు.

ఎ సూర్య ప్రకాష్

రచయిత

ప్రసారభారతి చైర్మన్

 

 (ఈనాడు సౌజన్యం తో)