Home News ఘోష్ సాధనతో చైతన్యం, ధైర్యం, సాహసం వస్తాయి – ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య పిలుపు 

ఘోష్ సాధనతో చైతన్యం, ధైర్యం, సాహసం వస్తాయి – ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య పిలుపు 

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తెలంగాణ ప్రాంత బాలల, యువకుల ఘోష్‌ శిబిరం సిద్ధిపేట జిల్లా పొన్నాలలోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 23,24,25 తేదీలలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 688 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. మొదటి రోజున జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య, తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ శ్రీ దక్షిణామూర్తి, తదితరులు మార్గదర్శనం చేశారు.

ఈ శిబిరం మన జీవితంలో గొప్ప అనుభూతిని మిగిల్చిందనీ, ప్రేరణగా ఉంటుందనీ, మన జీవితాలకు ప్రత్యేకతను తెచ్చి పెడుతుందని దక్షిణామూర్తి తన ఉపన్యాసంలో పేర్కొన్నారు.

డాక్టర్జీ సంఘాన్ని స్థాపించారు కాబట్టి మనం కలిశాం, మనందరం హిందువులమని భాగయ్య తన ఉపన్యాసంలో అన్నారు. డాక్టర్జీ సంఘాన్ని స్థాపించిన కొత్తలో 8,9,10 తరగతుల విద్యార్థులే శాఖలకు వచ్చేవారని, తరువాత ఘోష్‌ శిక్షణ సంఘంలో భాగమైందని ఆయన గుర్తు చేశారు. “ఆ రోజుల్లో స్వయంసేవకులు ఇతరుల ఇళ్లకి భోజనానికి వెళ్లి, వారిచ్చే దక్షిణను జమ చేసుకొని మొదటి శంఖ వాయిద్యాన్ని కొన్నార”ని తెలియజేశారు.

ఈ భూమి మన తల్లి. హిందూ సమాజం మనకు దైవం. హిందూ సమాజ సంఘటన అనే శక్తిని డాక్టర్జీ నిర్మించారని అన్నారు. స్వయంసేవక్‌ అంటే సంఘం కోసం పనిచేస్తాడనీ, సంఘం దేశం కోసం పని చేస్తుందని, మనం సంఘంలో చేరామా, మన జీవితంలో సంఘం చేరిందా అని ఆలోచించాలని ఆయన కోరారు.

కొందరు బాల స్వయంసేవకుల నిబద్ధత గురించి కూడా ఆయన గుర్తు చేశారు. ఒక బాలుడు సంఘ శిబిరానికి వెళతానని అన్నాడు. కుటుంబం తిరుపతి యాత్రకు వెళుతోంది. కానీ ఆ బాలుడు శిబిరం వైపే మొగ్గు చూపాడని భాగయ్య చెప్పారు.  ఇది స్వయంసేవకత్వం. సంఘం కోసం నేను అనే భావన ఉండాలి అని ఆయన అన్నారు.

భాగయ్య తన ఉపన్యాసంలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు. ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులను, దేశం కోసం కష్టపడే వ్యక్తులను డాక్టర్జీ తయారు చేశారు. సూర్యుడికి విశ్రాంతి, సెలవు, అహంకారం, అలసట, విసుగు, విరామం లేవు. తను మండుతూ వెలుగునిస్తున్నాడు. అందుకే సంఘ శాఖల్లో తు.చ. తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తారు. స్వయంసేవకులకు మంచి గుణాలు, నిస్వార్థ బుద్ధి కావాలి. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇతరులకు సేవ చేయాలి. శారీరక్‌ విభాగంలో ప్రతిరోజూ 5 నిమిషాలు సంచలన్‌ చేయాలి. అభిమన్యుడు, జోరావర్‌ సింగ్‌, ఫతేసింగ్‌ లాగా తయారుకావాలంటే సంచలన్‌ చేయాలి. సంచలన్‌ సరిగా నేర్చుకొనేందుకు సంఘంలో ఘోష్‌ ప్రవేశించింది. వ్యాయామ్‌ యోగ్‌ కలిసి చేస్తాం. అందుకు కూడా ఘోష్‌ ఉపకరిస్తుంది.

హిందూ సమాజంలో సంగీతానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. భారతీయ సంగీతం చాలా శ్రేష్ఠమైనది. సంగీతంతో మానవత్వం మేల్కొలపాల న్నారు భాగయ్య. యాదవరావ్‌జీ జోషీ గురించీ, బాల్యంలోనే వారికి అబ్బిన సంగీత పరిజ్ఞానం గురించి కూడా భాగయ్య వివరించారు. జోషీకి చిన్నప్పుడే బాల గంధర్వ బిరుదుండేది. ఆయన 9వ తరగతిలో ఉండగానే పాఠశాల వార్షికోత్సవానికి డాక్టర్జీ ముఖ్య అతిథిగా వెళ్లారు. యాదవ్‌రావ్‌జీ పాట పాడుతుంటే డాక్టర్జీ మంత్రముగ్దులై విన్నారు. అటు తర్వాత డాక్టర్జీ ఆయన భుజం తట్టి ప్రోత్సహించారు. యాదవ్‌రావ్‌జీ యం.ఎ., ఎల్‌.ఎల్‌.బి. పూర్తిచేసి, సంఘ ప్రచారక్‌గా వచ్చి, పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. ‘డాక్టర్జీ మూజే గీత్‌ గానేకేలియే బులాయా – లేకిన్‌ సంఘ్‌ మేరా జీవన్‌ గీత్‌ బన్‌గయా’ అని అన్నారని భాగయ్య తెలిపారు.

అలాగే విఖ్యాత హిందుస్తానీ సంగీత విద్వాంసుడు భీంసేన్‌ జోషీకీ, యాదవరావ్‌ జోషీకి ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా భాగయ్య గుర్తుచేశారు. భీంసేన్‌కు చాలా గొప్ప బిరుదులు వచ్చాయి. యాదవ్‌రావ్‌జీని కుర్చీలో కూర్చోబెట్టి ఆయన నేలపై కూర్చొనేవారు.

మన ఘోష్‌ వాయిద్యం యొక్క ప్రతిభను గమనించిన ఒకాయన వారింట్లో పెళ్లి కోసం ఘోష్‌ బృందాన్ని పంపవలసిందని డాక్టర్జీని కోరాడు. అయితే ‘ఇది బ్యాండ్‌ మేళం కాదనీ, వీరంతా ఉద్యోగులు, చదువుకునేవారేన’ని డాక్టర్జీ చెప్పి పంపేశారు. సంఘంలో ఒక్క ఘోష్‌ మాత్రమే ఉండదు. కానీ స్వయంసేవక్‌ దానిని సాధన చేస్తాడు. అది కూడా సంఘం కోసమేనని భాగయ్య గుర్తు చేశారు.  ప్రపంచాన్ని మరిచిపోయినప్పుడు సంఘం మనలో ప్రవేశిస్తుంది. నేను అనేది తొలగిపోతే మనలో భగవంతుడు ప్రవేశిస్తాడు. సంఘంలో నేను అనే అహంభావం తొలగిపోతే మనం ఏదైనా సాధించగలం. శ్రద్ధగా నేర్చుకోవాలి. సాధన చేయాలి అని భాగయ్య హితవు పలికారు.

నాదోపాసన సంగీతం వల్ల మన జీవితంలో ప్రసన్నత లభిస్తుంది. ఘోష్‌ విన్న తర్వాత చైతన్యం, ధైర్యం, సాహసం వస్తాయి. ఘోష్‌ వల్ల ఏకాగ్రత వస్తుంది. మన ప్రతిరక్త బిందువులో సంఘమే అనే భావన వస్తుంది. బాగా పని చేసే స్వయంసేవక్‌, కార్యకర్తలు అందరూ ఘోష్‌లో ఉండాలి. ప్రతి శాఖలో కనీసం 5 గురు అభ్యాసం చేయాలి. దాని ద్వారా హిందూ సంఘటనా కార్యం మరింత విజయవంతం చేయాలి. ఘోష్‌లో ఉన్న స్వయంసేవక్‌ మరింత సక్రియంగా ఉండాలి. ఆ విధంగా మనం అందరం ఇక్కడి నుండి తయారై వెళదాం. మనమంతా సాధన చేస్తూ రాబోవు 20, 30 సంవత్సరాల వరకు ఘోష్‌ వాదకులుగా నిలబడాలి. శారీరక్‌ బాగా చేయాలి. శరీరం శక్తివంతం కావాలి. మనం అభ్యాసం చేస్తూ గొప్ప వాళ్లం కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని భాగయ్య అన్నారు.

ఘోష్‌ శిబిరం రెండవ రోజు సిద్ధిపేట నగర పురవీధులలో పథసంచలన్‌ జరిగింది.

సార్వజనికోత్సవం
మూడు రోజుల ఘోష్‌శిబిరం సార్వజని కోత్సవం డిసెంబర్‌ 25న ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలోనే జరిగింది. డా|| ఆర్‌. నిహాల్‌ ముఖ్యఅతిథిగా, ఆర్‌.ఎస్‌.ఎస్‌.తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ పి.దేవేందర్‌ ప్రధానవక్తగా పాల్గొన్నారు. ప్రాంత సంఘచాలక్‌ దక్షిణామూర్తి, ప్రాంత సహ సంఘచాలక్‌ సుందర్‌రెడ్డి, క్షేత్ర ప్రచారక్‌ ప్రముఖ్‌ భాస్కర్‌, కార్యవాహ కాచం రమేశ్‌, సహ ప్రాంత ప్రచారక్‌ శ్రీధర్‌, ద్విప్రాంత వ్యవస్థా ప్రముఖ్‌ టి.ఎస్‌.ఆర్‌. మూర్తి, ప్రాంత సహ వ్యవస్థా ప్రముఖ్‌ సూర్యప్రకాశ్‌, ప్రాంత సంపర్క ప్రముఖ్‌ రామ్మూర్తి, సామాజిక సమరసత వేదిక సంఘటనా మంత్రి అప్పాల ప్రసాద్‌, ప్రాంత శారీరక్‌ ప్రముఖ్‌ ఎర్రం నర్సింగ్‌, ప్రాంత ఘోష్‌ ప్రముఖ్‌ యాదగిరి, ప్రాంత సహ ఘోష్‌ ప్రముఖ్‌ పుర్ణానందా శర్మ పాల్గొన్నారు. 930 మంది పుర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్‌ మాట్లాడుతూ ‘నిరంతరం హిందూ సమాజాన్ని జాగృతం చేసి,  దేశభక్తిని పెంపొందించి, బెనారస్‌ హిందు విశ్వవిద్యా లయం ఏర్పాటు చేసిన మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి రోజు మన ఘోష్‌ సార్వజనికోత్సవం జరగడం ఆనందంగా ఉందని అన్నారు. సంఘం ప్రారంభ సమయంలో  ఘోష్‌ ఆజ్ఞలు ఆంగ్లంలోనే ఉండేవని, స్వభాష, స్వభూష ద్వారా భారతీయ సంగీతంలో మనదైన దానిని మనం సంఘంలో ప్రవేశపెట్టామని వివరించారు. సమాజాన్ని జాగృతం చేయడానికి, సంచలన్‌ సమయంలో సంగీతాన్ని సంఘం ఉపయోగిస్తుందని అన్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. రచనలను ప్రస్తుతం మిలటరీ కూడా ఉపయోగిస్తున్నదని, దీనిని బట్టి సంఘంలో ఘోష్‌ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు నని ఆయన అన్నారు.

ముఖ్యఅతిథి డా|| ఆర్‌.నిహాల్‌ మాట్లాడుతూ, ‘ఎందరో మహానుభావులు పుట్టినగడ్డ ఇది. వారు భగవంతుని చేరడానికి నాదస్వరం ద్వారా ప్రయత్నిం చారు. ఇక్కడ ఇంత చిన్న వయస్సులో మీరు సాధన చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. డా|| నిహాల్‌ ప్రముఖ సీని గాయకులు, సంగీత దర్శకులు. మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకొన్నారు. కంచి పీఠం ఆస్థాన విద్వాంసులు కూడా. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో అన్నమయ్య భక్తి ప్రాజెక్టులో పనిచేశారు. ఫీల్మ్‌ఫేర్‌ అవార్డు, నంది అవార్డు కూడా పొందారు.