Home Telugu Articles దక్షిణాది అమరనాథ్.. సలేశ్వరం

దక్షిణాది అమరనాథ్.. సలేశ్వరం

0
SHARE

కాశ్మీర్ లో జరిగే అమరనాథ్ యాత్ర గురించి మనందరికీ తెలుసు, ఎంతో కష్టపడి ప్రయాణం చేస్తేగాని ఆ యాత్ర చేయలేము, అమరనాథ్ యాత్రలాగే మన తెలంగాణాలో కూడా ఒక యాత్ర ఉంది, అదే సలేశ్వరం యాత్ర, దీనిని తెలంగాణ అమరనాథ్ యాత్ర అని కూడా అంటారు, ఈ సలేశ్వరం ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది తరువాత వచ్చే పౌర్ణమికి జాతర నిర్వహిస్తారు, ఇది చెంచుల సాంప్రదాయ జాతర. ఈ జాతరని అక్కడ ఉండే చెంచు జాతి ప్రజలే నిర్వహిస్తారు, ఈ సలేశ్వరం జాతరని 5 రోజులు నిర్వహిస్తారు. శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో జరిగే ఈ జాతరకు మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు.

శ్రీశైలానికి వెళ్లే ఘాట్ రోడ్డులో మన్ననూర్ చెక్ పోస్ట్ నుంచి 20 కిలో మీటర్లు వెళ్తే.. ఫరహాబాద్ చౌరస్తా వస్తుంది. ఇక్కడి నుంచి ఇంకో 20 కిలోమీటర్లు అడవిలోకి పోతే అక్కడ సలేశ్వరం గుట్ట ఉంటుంది, సలేశ్వరం గుట్ట వరకే వాహనాలు వెళ్తాయి, అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లవలసిందే, సలేశ్వరం గుడిని చేరుకోవాలంటే దాదాపు 6 కిమీ గుట్టలు, లోయలలో నడవాలి, మధ్యలో మోకాళ్ళ పర్వతం అనే గుట్ట వస్తుంది దానిని ఎక్కడం చాలా కష్టమైన పని కానీ భక్తులంతా శివుని దయతో చాలా సులభంగా ఆ మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కేస్తారు, గుట్టల మధ్యలో అందమైన జలపాతాలు, గుహలు కనువిందు చేస్తాయి, గుడి దగ్గర ఒక పెద్ద గుట్ట మీదుగా జలపాతం కనువిందు చేస్తుంది, ఆ జలపాతం కింద స్నానం చేసి అందరు స్వామిని దర్శించుకుంటారు.

సలేశ్వరాన్ని ఒకప్పుడు సర్వేశ్వరం అనేవారు. చరిత్రకారులు సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దంలోని మల్లికార్జునపండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు. 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది. స్వామివారు మొదట చెంచులకు కనిపించారు. అడవిలో నీళ్ల కోసం వెతుకుతుంటే.. కుక్కలు సలేశ్వరాన్ని చూపించాయి. జలపాతం, గుండం, లింగం, కాలబైరవుడు, చెంచులకు కనిపించాయి. అప్పట్నుంచి నల్లమల అడవిలో చెంచులే ఈ గుడి దగ్గర పూజలు చేస్తున్నారు. ఉగాది పండగ తర్వాత వచ్చే చైత్ర శుద్ధ పున్నమికి ఏటా సలేశ్వరం జాతర చేస్తారు. దేవుణ్ణి లింగమయ్య అని పిలుస్తారు. లింగమయ్య ఎదురుగానే గంగమ్మ దూకుతుంటుంది. ఇదీ ఇక్కడి ప్రత్యేకత. అడవి చెట్ల వేర్ల నుంచి వచ్చే నీళ్లను భక్తులు తాగుతారు. అలాగే ఇక్కడ స్వామికి చెంచులు ఇప్ప పూవును నైవేద్యంగా సమర్పిస్తారు.

సలేశ్వరం జాతరకొచ్చే భక్తులకు చెంచులోకం స్వచంద సంస్థతో పాటు అనేక సంస్థలు అనేక సదుపాయాలు కలిగిస్తున్నాయి. కాలిబాటలో మంచినీళ్ళు అందించడంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాయి. లింగమయ్యను ఏడాదిలో ఈ ఐదు రోజులు తప్ప.. మిగతా రోజుల్లో చూడలేం. చుట్టూ అడవి ఉండటంతో చెంచులు కూడా ఇక్కడికి వెళ్లరు.