Home Telugu Articles మత రాజకీయంపై ‘వేటు’

మత రాజకీయంపై ‘వేటు’

0
SHARE

చట్టంలో ఉన్న నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం ధ్రువపరచింది. ప్రజాప్రాతినిధ్యపు చట్టం- రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్-లోని నూట ఇరవై మూడవ నిబంధన ఎన్నికల అవినీతి పద్ధతుల- కరప్ట్ ప్రాక్టీసెస్-ను గురించి వివరిస్తోంది. ఈ నిబంధనలోని మొదటి ఉప నిబంధన ప్రకారం వోటర్లకు లంచం ఇవ్వడం అవినీతి. అక్రమంగా వోటర్లను ప్రభావితం చేయడం రెండవ ఉప నిబంధన ప్రకారం మరో అవినీతి పద్ధతి. ‘మతం, వర్ణం, కులం, సముదాయం, భాషల ప్రాతిపదికగా తమకు వోటు వేయమని కాని తమ ప్రత్యర్థులకు వోటు వేయరాదని కాని వోటర్లను అభ్యర్థి కాని అతని అనుమతితో అతని ప్రతినిధి- ఏజెంట్- కాని ఇతర సహచరులు, అనుచరులు కాని కోరడం అవినీతి పద్ధతి’ అని ఈ నిబంధనలోని మూడవ ఉప నిబంధన నిర్దేశిస్తోంది. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం సప్తసభ్య ధర్మాసనం వారు సోమవారం చేసిన నిర్ధారణ చట్టంలోని నిబంధనలకు భాష్యం వంటిది, వివరణ వంటిది. ‘మతం’ అన్నది భగవంతునికీ భక్తులకు మధ్యగల వైయక్తిక అనుసంధాన మాధ్యమమని, మతాతీత సార్వజనిక సామూహిక సామాజిక రాజ్యాంగ ప్ర క్రియలలోకి మతం చొరబడరాదని సర్వోన్నత న్యాయస్థానం చేసిన విశే్లషణ- రాజ్యాంగ స్ఫూర్తికి మా త్రమే కాక యుగయుగాల తరతరాల జాతీయ జీవన స్ఫూర్తికి అనుకూలమైన పరిణామం.

పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలనా యంత్రాంగాల ఉద్యోగులు సర్వమత సమభావం స్వభావంగా విధులను నిర్వర్తించవలసిన వారు. అందువల్ల సర్వమత సర్వ భాషా, సర్వ సముదాయ, సర్వ ప్రాంత సర్వ వైవిధ్య సమాహారమైన జాతీయ జీవనం సమగ్రం. ఈ సమగ్ర తత్త్వం ఒక ‘శకలం’ ప్రభావానికి మాత్రమే గురికావడం వైపరీత్యం! జాతి-నేషన్- సకలం, ఈ ‘సకలం’లో మత ఒక ‘శకలం’ మాత్రమే. అందువల్లనే మన దేశంలో జాతీయతా సాంస్కృతిక వికాసానికి కేవలం మతం ప్రాతిపదిక కాలేదు. ఏక మత రాజ్యాంగ వ్యవస్థలు ఈ దేశంలో ఏర్పడలేదు. అనాదిగా ఈ దేశంలో అనేక వైదిక మతాలున్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం, స్కాందం వంటివి ఈ వైదిక మతాలు. మాధ్వ మతం, ఆర్య సమాజం వంటి వైదిక మతాలు కూడా ఉన్నాయి. సిక్కుమతం ఉంది. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని జైన, బౌద్ధ మతాలున్నాయి. కానీ ఏ ఒక్క మతమూ ఈ దేశపు అద్వితీయ జాతీయతకు ప్రాతిపదిక కాలేదు. ఈ మతాలన్నీ కూడ ఒకే భరత జాతిలో లేదా ఒకే హైందవ జాతిలో సమానత్వం ప్రాతిపదికగా పరిఢవిల్లడం అనాది చరిత్ర. అందువల్లనే సర్వమత సమానత్వం ఈ జాతికి స్వభావమైంది. విదేశాల నుంచి ఆధునిక యుగంలో వ్యాపించిన ఇస్లాం, క్రైస్తవ, పారశీక, యూదు మతాలకు ఈ జాతీయ వ్యవస్థలో శతాబ్దులుగా సమానత్వం లభించింది. రాజ్యాంగ వ్యవహారాలలోకి మతం చొరబడడం మన జాతీయ స్వభావానికి విరుద్ధం. మన రాజ్యాంగం ఈ జాతీయ స్వభావానికి ధ్రువీకరణ మాత్రమే.

రాజకీయాలలోకి, రాజ్యాంగ ప్రక్రియలోకి మతం చొరబడడం ‘ఏక మత రాజ్యాంగ వ్యవస్థ’లున్న విదేశాల జాతీయ స్వభావం. మన దేశాన్ని విదేశాల వారు నియంత్రించిన సమయంలో, విజాతీయులు మన దేశంలో దమనకాండ సాగించిన సమయంలో ఒక మతానికి ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన మతాలను అణగదొక్కే రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడినాయి. ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొగలాయిలు, పోర్చుగీసు వారు ఇంకా ఇతరేతర విదేశీయులు, విదేశీయ సంతతి వారు ఇలాంటి ఏకమత రాజ్యాంగ వ్యవస్థలను మన దేశంలో నెలకొల్పడానికి ప్రయత్నించారు. కానీ సమాంతరంగా కాకతీయులు, రాజపుత్రులు, విజయనగర రాజులు, మరాఠాలు, సిక్కులు వంటి స్వదేశీయులు పాలించిన భూభాగాలలో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థలు పరిఢవిల్లాయి. ఇది భారత జాతీయులకు, విజాతీయులకు మధ్య పరిపాలనలో కొనసాగిన చారిత్రక అంతరం! ఇదంతా 1947కి పూర్వం నాటి చరిత్ర! విదేశీయ పాలన నుంచి విముక్తమైన భరతజాతి అనాది సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసుకొంది. ఈ అనాది స్వభావం అడుగంటిపోయిన భారత భూభాగాలు 1947లో దేశం నుంచి విడిపోయాయి. పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. పాకిస్తాన్‌లో ఏకమత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం ఇందుకు కొనసాగుతున్న సాక్ష్యం! ఈ చరిత్ర పరిణామ క్రమం ప్రాతిపదికగా మన దేశంలో కొనసాగుతున్న ‘సర్వమత సమభావ వ్యవస్థ’కు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చెప్పిన తీర్పు విస్తృత భాష్యం..

పరిపాలన మతాతీతమైనదన్న ఈ అనాది జాతీయ స్వభావానికి సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు ఇలా కొనసాగింపు.. ‘ఎన్నికల ప్రక్రియ మతాలకు అతీతమైన సర్వమత సమభావ- సె క్యులర్- కార్యక్రమం’ అ న్న సర్వోన్నత న్యాయ నిర్ధారణ ఈ విస్తృతి! అం దువల్ల కులాల పేరుతో, మతాల పేరుతో వోటర్లను ప్రభావితం చేయాలన్న ‘అపవాదానికి’ సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు! కులాలు, మతాలు సామాజిక జీవనంలోని వైవిధ్యాలు, వృత్తులు, ప్రవృత్తులు, విశ్వాసాలు. వైవిధ్యాల మధ్య వైరుధ్యాలు ఏర్పడడం బ్రిటన్ వంటి విదేశాల ‘పరిపాలన’ ఫలితం. ఒక కులం వారు మరో కులం వారికి, ఒక మతం వారు మరో మతం వారికి న్యాయం చేయరన్న అవిశ్వాసం ఈ ఎన్నికల అవినీతికి ప్రాతిపదిక! అందువల్లనే తమ మతం వారు, తమ కులం వారు ఎన్నికైతే తప్ప తమకు మేలు జరుగదన్న భ్రమను కొందరు రాజకీయ జీవులు జనంలో వ్యాపింప చేశారు. కేవలం ఎన్నికల పదవుల విషయంలో మాత్రమే కాదు, అన్ని సామాజిక రంగాలలోను ఈ అవిశ్వాసాన్ని, ఈ భ్రమను విస్తరింప చేయడానికి జరుగుతున్న కుట్రకు అంకురార్పణ విదేశీయుల పాలనలో జరిగింది. సర్వోన్నత న్యాయ నిర్ణయం ప్రాతిపదికగా ఈ భ్రమను, అవిశ్వాసాన్ని జనం నుండి తొలగించడానికి ఉద్యమ స్ఫూర్తితో నిరంతర ప్రయత్నం సాగాలి. కుల మత ప్రాంత భాషా వైరుధ్యాలకు లోనుకాని మానసిక స్వచ్ఛత విస్తరించడం వల్ల మాత్రమే నిజమైన స్వచ్ఛ్భారత్ మళ్లీ ఏర్పడుతుంది. ఈ ‘వెలుగు’ విస్తరించడం వల్ల మాత్రమే ఎన్నికల్లో అవినీతి పద్ధతులకు పాల్పడేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. మతం కంటె మాతృభూమి, మాతృ జాతీయత, మాతృ సంస్కృతి ప్రాధాన్యం సంతరించుకోగలిగినపుడు మతం పేరుతో వోట్లను అడిగేవారు ఉండరు.

అన్ని మతాలకు చెందిన రాజకీయ వేత్తలు, సాధారణ ప్రజలు సర్వమత సమభావ జాతీయ వారసత్వాన్ని, సంస్కృతిని తమవిగా భావించి అలవరచుకొనడానికి వీలైన ప్రయత్నం జరగాలి. జాతీయతను మతంగాను, మతాన్ని జాతీయత గాను తారుమారు చేయడానికి బ్రిటన్ పాలకులు చేసిన కుట్ర ఫలితంగా గతంలో అనేక అనర్థాలు జరిగాయి. ఇస్లాం మతస్థులకు రాజ్యాంగ సభలో ప్రత్యేక నియోజకవర్గాలను కల్పించడం ద్వారా మతం పేరుతో వోటర్లను ప్రభావితం చేసే కుట్రను బ్రిటన్ దురాక్రమణదారులు రూపొందించారు. దేశం 1947లో ముక్కలు కావడానికి ఈ ‘మతం పేరుతో రెచ్చగొట్టిన రాజకీయం’ దోహదం చేసింది. అనాది జాతీయత అయిన ‘హిందుత్వం’ ఒక మతమని చిత్రీకరించడం కూడ బ్రిటిష్ వారి కుట్ర! ‘హిందుత్వం’ ఈ దేశపు జాతీయ జీవన విధానమని సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే స్పష్టం చేసింది. ఏది మతం? ఏది జాతీయత? అన్న విచక్షణ పెరగాలి.

(ఆంధ్ర భూమి సౌజన్యం తో )