Home Telugu Articles 35ఎ అధికరణం ఏమిటి? ఎలా ఏర్పడింది?

35ఎ అధికరణం ఏమిటి? ఎలా ఏర్పడింది?

0
SHARE

ఈ మధ్య  కశ్మీర్‌ తరచు చర్చకు వస్తోంది. కేంద్రం, అలాగే కశ్మీర్‌లలో బిజెపి ప్రభుత్వమే ఉన్నది కదా 370 అధికరణాన్ని ఎందుకు తొలగించటం లేదు; రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాలని చెబుతూ ఉంటారు కదా? ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అని అడిగేవారున్నారు. కశ్మీర్‌ గురించి అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలతో ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అనాలోచితంగా కశ్మీర్‌ సమస్యపై అనేక చిక్కుముడులు మనమే వేసుకొన్నాము. దశాబ్దాలుగా దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలలో లేని భావాలు; లేని భావోద్వేగాలు ఎట్లా ఎట్లా బిగుసుకుంటూ వచ్చాయో కశ్మీర్‌ పరిస్థితులే మనకు అర్థం చేయిస్తున్నాయి. 

కశ్మీర్‌లో వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు ఎటువంటి ఆలోచనలుఉన్నా దేశంలో మిగతా ప్రాంతాలలో ఎక్కడాలేని పోకడలు,ఆశలు అక్కడ ఎందుకు  ఉన్నాయి? కశ్మీర్‌ దేశంలోని మిగతా ప్రాంతానికి భిన్నంగా ఉండాలని కొందరు కోరుకంటూ ఉంటే; ప్రత్యేక దేశం కావాలని కొందరు, పాకిస్థాన్‌లో కలవాలని మరికొందరు కోరుకుంటూ ఉంటారు. కాని పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌ ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని ప్రశ్నించేవారు అరుదుగా కనబడుతూ ఉంటారు. కశ్మీర్‌ ఒక స్వతంత్ర దేశమైతే కశ్మీర్‌ కాపాడబడు తుందా? పాకిస్థాన్‌లో కలిస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఉంటాయా? ఇవేవీ ఏ మాత్రం ఆలోచించరు. అనేక చిక్కుముడుల మధ్య అనేక దశాబ్దాలు గడిచిపోయాయి. ఆలోచనలలో మార్పు రావటం లేదు. ఎప్పుడు ఏదో సమస్య రగులుతూనే ఉంటుంది. అట్లాంటిదే ఆర్టికల్‌ 35ఎ. ఇప్పుడు దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో ఎప్పుడు చర్చించకుండానే ఇలాంటి సవరణ చేయటాన్ని ప్రశ్నిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 35ఎ అధారంగా రాష్ట్రం చేసిన చట్టాల కారణంగా తమ పిల్లలు అనేక హక్కులు కోల్పోతున్నారంటూ కశ్మీర్‌కు చెందిన ఇద్దరు మహిళలు కూడా విడివిడిగా కేసులు దాఖలు చేసారు. దీనిపై విచారణకు కోర్టు సంసిద్ధమైన సమయంలో కశ్మీరు వివాద పరిష్కారానికి అన్ని వర్గాలతో చర్చించేందుకు ఒక ప్రతినిధిని నియమించినట్లు అటార్నిజనరల్‌  కె.కె. వేణుగోపాల్‌ తెలిపారు. సున్నితమైన ఈ అంశాల ముందుకు వెళ్ళటానికి ఇది సరియైన సమయం కాదని ఆరు నెలలు గడువు కోరింది.దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనము 35ఎ అధికరణముపై విచారణను మూడు నెలలు వాయిదా వేస్తున్నట్లు అక్టోబరు 30వ తేదీనాడు ప్రకటించింది. అసలు ఈ 35ఎ అధికరణం ఏమిటి? ఎట్లా ఏర్పడింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

1927 సంవత్సరంలో కశ్మీర్‌ రాజు హరిసింగ్‌ ఒక ప్రత్యేక పరిస్థితులలో డోగ్రాల అభ్యర్థన మేరకు ఒక ఉత్తర్వు జారిచేసారు; కారణం పంజాబీలు కశ్మీరును వలసలతో ముంచెత్తుతున్న సమయంలో తమ ఉద్యోగాలకు; తమ ఆస్థుల భద్రతకు ప్రమాదం వస్తుందని భావించారు. దానిపై స్థానిక హక్కులకు సంబంధించిన ఉత్తర్వులు జారిచేసారు. 1947 అక్టోబరు 26న కశ్మీర్‌ రాజు కశ్మీరును భారత్‌ యూనియన్‌లో విలీనం చేసారు. ఈ విలీనంలో ”రక్షణ; విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్‌లకు  పరిమితం చేశారు.” 1949 జూలైలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత షేక్‌ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ప్రధాని నెహ్రు 1952 సంవత్సరంలో షేక్‌ అబ్దుల్లా ప్రతిపాదించిన కొన్ని అంశాలు అంగీకరించారు; అందులో 1. కశ్మీరీలందరికి భారత పౌరసత్వం ఇస్తారు. 2. కశ్మీరీల కోసం ప్రత్యేక సౌకర్యాలు; హక్కులు కల్పించే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది. వీరిని శాశ్వత నివాసులుగా పరిగణిస్తారు. ఎవరు కశ్మీరు శాశ్వత నివాసి అన్న దానిని రాష్ట్ర రాజ్యంగము నిర్వచించింది. దాని ప్రకారము 1954 మే 14వ తేదీకన్నా ముందు తేదీనాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి; మరియు పదేళ్ళ పాటు కశ్మీర్‌లో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. అతను స్థిరాస్తులు కలిగి ఉండవచ్చు; ఉద్యోగం; స్కాలర్‌షిప్‌లు పొందవచ్చు; దానిని జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి 35ఎ అధికరణం కట్టబెట్టింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం 2/3 మెజారిటీతో మార్చవచ్చు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. కశ్మీరీ మహిళ కశ్మీరేతరుడిని వివాహం చేసుకొంటే రాష్ట్రంలో స్థిరాస్తులు కలిగి ఉండటానికి వీలులేదు; ఆమె పిల్లలకు శాశ్వత సర్టిఫికెట్‌ ఇవ్వరు. ఈ నిబంధన చట్ట వ్యతిరేకమని 2002లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ప్రకటించింది. 1956 నవంబరు 17వ తేదీన రాష్ట్ర రాజ్యాంగం ఆమోదించిన ప్రకారము కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదు. అంటే పోటీ చేసే అధికారం లేదు అని దాని అర్థం. ఆర్టికల్‌ 35ఎ రూపంలో ప్రత్యేక అధికారాలు ఇవ్వటం సమానత్వ హక్కు; ప్రాథమిక హక్కులు ఉల్లంఘించటమే. పైగా దానిని పార్లమెంట్‌లో చర్చ లేకుండ, ఆమోదించకుండానే రాజ్యాంగంలో చేర్చారు; ఇదే 370 అర్టికల్‌కు పునాది; అనాలోచితంగా చేసిన ఈ అధికారణాన్ని  తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించటానికి రాజ్యాంగం ప్రకారమే జరిగింది. రాజ్యాంగంలో 368 అధికరణము ప్రకారము ”రాజ్యాంగానికి ఏ సవరణ అయినా పార్లమెంట్‌లో చర్చ ద్వారానే జరగాలి. రెండవది, రాజ్యాంగంలోని అర్టికల్‌ 14 ప్రకారము చట్టం ముందు అందరూ సమానులే; అధికారణం 35ఎ మహిళపట్ల వివక్షత చూపుతున్నది కాబట్టే ఇది రాజ్యాంగ వ్యతిరేకం. దీనిని తొలగించాలంటూ 2015 జులైలో కోర్టు తలుపులు తట్టారు. కశ్మీరీ యువకులు బయట మహిళను వివాహం చేసుకొంటే అన్ని హక్కులు ఉంటాయి; అదే కశ్మీరీ మహిళ బయటవ్యక్తిని వివాహం చేసుకొంటే ఏ హక్కులు ఉండవు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీల ప్రాథమిక హక్కుల్ని ఇది కాలరాస్తున్నది. ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఇది తొలగించాలని కోర్టుకు వెళ్ళారు. దీనిపై చర్చకు అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనము ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మూడు నెలలు వాయిదా వేసింది.
ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. రాజ్యాంగం తయారు చేసే సమయంలో పరిస్థితులు; భావోద్వేగాలు అనేకం ఉన్నాయి. వాటి ప్రభావం రాజ్యాంగంపై పడింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వాటిలో ఏమి మార్పులు – చేర్పులు అవసరమో కనీసం చర్చించవలసి ఉంది. దేశహితం కోసం  ఈ చర్చ జరగాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలి. దేశంలో ప్రముఖులైన రాజ్యాంగ నిపుణులు ముందుకు రావాలి. దేశానికి ఒక దిశా-నిర్దేశనం చేయాలి. దీనిపై ఆలోచించాలి.  

(ఈ వ్యాసం మొదట జూన్ 8, 2019 నాడు ప్రచురితమైంది)