Home News సామాజిక పరివర్తన కోసం స్వయంసేవకులను క్రియాన్వితులను చేస్తుంది సంఘ్ – డా. మన్మోహన్ వైద్య

సామాజిక పరివర్తన కోసం స్వయంసేవకులను క్రియాన్వితులను చేస్తుంది సంఘ్ – డా. మన్మోహన్ వైద్య

0
SHARE
ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచలాక్ శ్రీ శ్రీనివాస్ రాజు, సహ సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ (ఎడమ నుండి కుడి)

సార్వత్రిక ఎన్నికల సమయంలో నిర్వహించిన జనజాగరణ కార్యక్రమంలో 11 లక్షల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వారు మొత్తం 4.5 లక్షల గ్రామాలలో ప్రజలను కలిశారు. అలాగే సంఘ కార్యంలో పాలుపంచుకునేందుకు `జాయిన్ ఆర్ ఎస్ ఎస్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2019 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 66835 రిజిస్టర్ చేసుకుని సంఘకార్యంలో  చేరేందుకు ఆసక్తిని వెల్లడించారు.

సమాజంలోని ప్రజలందరిని కలుపుకుని, వారి సహాయసహకారాలతో సంఘ్ పని చేస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్  సంఘ్ సహ సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య అన్నారు. ప్రతి స్వయంసేవక్ సమాజ పరివర్తన కార్యంలో భాగస్వామి అయ్యే విధంగా పని వేగాన్ని పెంచుతామని ఆయన తెలియజేశారు. భారతీయ సాంస్క్శృతిక విలువలు, జీవన పద్దతి ఆధారంగా సమాజంలో పరివర్తన తెచ్చేందుకు ప్రతి స్వయంసేవక్ ను ప్రోత్సహించి, ప్రశిక్షణ అందిస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జరిగిన ప్రాంత ప్రచారకుల బైఠక్ (సమావేశాలు)ల చివరి రోజున నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో డా. వైద్య మాట్లాడారు. స్వయంసేవకులు గ్రామ వికాసం కోసం కృషి చేస్తున్నారని, గ్రామ వికాస గతివిధి(కార్యవిభాగం) ద్వారా 300 గ్రామాల్లో సంపూర్ణ మార్పు తీసుకురాగలిగారని, మరో 1000 గ్రామాల్లో పని సాగుతోందని ఆయన తెలియజేశారు. సేంద్రీయ వ్యవసాయం, గో సంరక్షణ, సమాజంలో సద్భావనను పెంపొందించెందుకు సామాజిక సమరసతా కార్యం, కుటుంబ ప్రబోధన్ మొదలైన కార్యాలను స్వయంసేవకులు నిర్వర్తిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 100 శాతం ఓటింగ్ జరిగేట్లుగా చూడాలని సర్ సంఘచాలక్ పిలుపునిచ్చారని, దానికి అనుగుణంగా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి, జాతీయ విషయాల ఆధారంగా ఓటు వేయాలని నచ్చచెప్పడానికి స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లారు. అనేక చిన్నచిన్న సమావేశాలు నిర్వహించారు. దేశంలోని మొత్తం 5.5 లక్షల గ్రామాల్లో 4.5 లక్షల గ్రామాలకు స్వయంసేవకులు వెళ్లారు. సంఘ భౌగోళిక చిత్రం ప్రకారం మొత్తం 56 వేల మండలాలు ఉంటే వాటిలో 50 వేల మండలాలలో స్వయంసేవకులు జనజాగరణ నిర్వహించారు. ఇందులో మొత్తం 11 లక్షలమంది స్వయంసేవకులతోపాటు సమాజంలోని అనేకమంది పాల్గొన్నారు. వీరిలో లక్షమంది మహిళలు కూడా ఉన్నారు.

సమాజంలో సంఘ పట్ల ఆసక్తి, ఆదరణ పెరుగుతున్నాయని డా. వైద్య అన్నారు. సంఘాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 7రోజులపాటు నిర్వహించే ప్రాధమిక శిక్షావర్గలో ప్రతి సంవత్సరం ఒక లక్షమంది ప్రశిక్షణ పొందుతున్నారని ఆయన తెలియజేశారు. అలాగే సంస్థకు చెందిన వెబ్ సైట్ లోని జాయిన్ ఆర్ ఎస్ ఎస్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2014 సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో 36760 మంది, 2016లో 47200 మంది, 2018లో 56892మంది, 2019లో మొదటి ఆరు నెలల్లో 66835 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారే.

సంఘ పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త గతివిధి(కార్యవిభాగం) ప్రారంభించింది. దీనికోసం సంఘ శిక్షావర్గలో వివిధ ప్రయోగాల ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. నిత్యజీవితంలో పనులు చేసుకునేందుకు తక్కువ నీటిని ఉపయోగించడం, జల సంరక్షణకు అనుసరించవలసిన పద్దతులను ఈ శిక్షణలో నేర్పారు.

జాగరణ పత్రికల ద్వారా 1లక్ష 75వేల గ్రామాలకు జాతీయ భావాలను చేరవేసే కార్యక్రమం జరుగుతోందని కూడా డా. మన్మోహన్ వైద్య తెలియజేశారు. ఈ సంవత్సరం 80 స్థలాల్లో ప్రధమ వర్ష సంఘ శిక్షావర్గ జరిగిందని, అందులో మొత్తం 1లక్ష 75 వేల మంది శిక్షణ పొందారని ఆయన చెప్పారు.

విజయవాడలో జరిగిన ప్రాంత ప్రచారకుల సమావేశాలలో ప్రాంత, క్షేత్ర ప్రచారకులతో పాటు అఖిలభారతీయ అధికారులు, వివిధ సంఘ సంస్థలకు చెందిన సంఘటనామంత్రులు పాల్గొన్నారని డా. వైద్య తెలియజేశారు. అయితే ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు జరగవని, కార్యకారిణి సమావేశాలు, ప్రతినిధి సభ సమావేశాల్లో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని ఆయన వివరించారు. పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయనతో పాటు ఆంధ్ర ప్రాంత సంఘచాలక్ శ్రీ శ్రీనివాస రాజు, అఖిలభారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.