Home News 5,000 మంది పిల్లల అక్రమ రవాణా సూత్రధారి పన్నా లాల్ మహతో అరెస్టు

5,000 మంది పిల్లల అక్రమ రవాణా సూత్రధారి పన్నా లాల్ మహతో అరెస్టు

0
SHARE

కనీసం 5,000 మంది పిల్లల అక్రమ రవాణాకు సూత్రధారి అయిన పన్నా లాల్ మహతోను జార్ఖండ్‌లోని ఖుంతి తోలా వద్ద  పోలీసులు అరెస్టు చేశారు. మహతో వేలాది మంది బాలికలను అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను జార్ఖండ్ లోని గిరిజన బాలికలతో సహా కనీసం 5,000 మంది పిల్లలను న్యూ ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లోని యజమానులకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతిలోని 371, 366, 370 సెక్షన్ల కింద మహతోపై కేసు నమోదు చేశారు.

ఖుంతి తోలాలోని ఇంట్లో మహతో ఉన్నాడని సమాచారం అందడంతో  ఆ ఇంటిపై దాడి చేసి పట్టుకున్నామని పోలీసు సూపరింటెండెంట్ జైదీప్ లక్రా వివరించారు.

అక్రమ భూ ఒప్పందాలు, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పత్రాలను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

 ఖుంతి మానవ నిరోధక విభాగంలో ఏడు కేసులు, ముర్హు పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు, టోర్పా పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు, జగన్నాథ్‌పూర్, కమదారా, గుమ్లా, సుల్తాన్‌పురి (న్యూ ఢిల్లీ) లలో ఒకటి చొప్పున  మొత్తం 17 కేసులు పన్నా లాల్ పై ఉన్నాయి. అతనికి వ్యతిరేకంగా ఒక టైటిల్ సూట్ కూడా పెండింగ్‌లో ఉంది.

 పిల్లల సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) మహోతోకు  వ్యతిరేకంగా ఖుంతిలోని మానవ అక్రమ రవాణా నిరోధక  విభాగం (ఎహెచ్‌టియు)లో ఎఫ్‌ఐఆర్ ను  నమోదు చేసింది. ఖుంతి బ్లాక్ నుండి మైనర్ బాలికను అక్రమ రవాణాకు చేసినందుకు 2018 లో కేసు నమోదు చేసినట్లు పిల్లల సంక్షేమ కమిటీ సభ్యుడు బైద్యనాథ్ కుమార్ తెలిపారు. ఆ బాలికను గత సంవత్సరం అక్రమంగా ఢిల్లీకి తరలించారు. ఆమెను  ఢిల్లీ పోలీసులు రక్షించి సిడబ్ల్యుసికి అప్పగించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వాగ్ములాన్ని నమోదు చేశామని  కుమార్ చెప్పారు.

మానవ అక్రమ రవాణా ఆరోపణలపై మహతో, అతని భార్య సునీతా కుమారిని 2014 అక్టోబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అతను సెప్టెంబర్ 2016 నుండి బెయిల్ పై ఉన్నాడు. పోలీసుల రికార్డుల ప్రకారం, మానవ అక్రమ రవాణాతో సహా ఇతర కేసులకు సంబంధించి 2004,2006 లలో మహతోను అరెస్టు చేశారు.