కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో కమలం వికసించింది. బలపరీక్షలో భాజపాకు మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు అదనంగా రావడంతో యడియూరప్ప బలపరీక్షలో గెలుపొందారు. మూజువాణి ఓటు ద్వారా ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సంఖ్య 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 104. సొంత పార్టీ బలం 105తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతివ్వడంతో యడ్డీ విజయం లాంఛనమైంది. అనంతరం ఆర్థిక బిల్లుకు కూడా ఆమోదం లభించింది. ఆర్థిక బిల్లును ఆమోదించడానికి ఈ నెల 31 ఆఖరు తేది కాగా.. ఇప్పటి వరకు దీనిపై గందరగోళం నెలకొంది. ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.
విశ్వాస పరీక్ష ముగిసిన వెంటన స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా చేశారు. స్పీకర్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఆదివారం నుంచి కొనసాగుతోంది. ఇందుకు అనుగుణంగా స్పీకర్ తన రాజీనామా లేఖను సభలో చదివి వినిపించారు.
అంతకు ముందు బల పరీక్ష చర్చ కాసేపు వాడివేడిగా సాగింది. సీఎం యడియూరప్ప, సిద్ధరామయ్యల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో రైతులకు సాయం చేస్తానని సీఎం ప్రకటించారు. రైతులకు రెండు విడతలుగా ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం తెలిపారు. రైతులు తమకు ఆప్త మిత్రులని, ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైందని సీఎం అన్నారు.
మరోవైపు, స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్నిఆశ్రయించారు. తమపై 2023 వరకు అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.