Home Hyderabad Mukti Sangram ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు (భాగం-2)

ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు (భాగం-2)

0
SHARE

17 సెప్టెంబర్ ,1948 హైదరాబాద్ విమోచన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం  

హైదరాబాద్ సంస్థానాన్ని తన సొంత జాగీరుగా భావించిన నిజాం తెలంగాణా ప్రజలపట్ల చూపిన నిరంకుశత్వం, రజాకర్ ల ద్వారా చేయించిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. 15 ఆగస్ట్, 1947న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణా ప్రాంతం మాత్రం 17 సెప్టెంబర్, 1948నే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తమై స్వతంత్ర భారత రాజ్యంలో విలీనమైంది. ఈ విమోచన పోరాటం సుదీర్ఘమైనది. తెలంగాణా ప్రజానీకం అంతా తప్పక తెలుసుకోవలసింది.

భైరవునిపల్లి, లింగాపూర్ గ్రామాలపై జరిగిన రాక్షసదాడులను చూసి జనగామ ప్రజలు నిజాం ప్రభుత్వాన్ని విపరీతంగా అసహ్యించుకున్నారు. కాని నిజాం మాత్రం విదేశాల నుండి పత్రికా విలేఖరులను వేలరూపాలయలు ఖర్చుచేసి రప్పించి భైరవునిపల్లి సంఘటనలను మరోరకంగా వక్రంగా చిత్రించి విదేశాల్లో ప్రచారం చేశాడు. అసలు హిందువులే తిరగబడి దాడికి తలబడితే తాము శాంతి భద్రతలను కాపాడడానికి ఆ చర్య తీసుకున్నామని ప్రచారం చేశాడు. అయినా ప్రజల రక్తపాతం నిజాం అమానుష చర్యల నిజస్వరూపం ప్రపంచానికి బహిర్గతం కాక తప్పలేదు.

గోర్ట గ్రామంలో ఈనాటికీ సజీవంగా ఉన్న 80 సంవత్సరాల వృద్ధుడు శ్రీ ఇరశెట్టిప్ప వంకే మాటల్లో చెప్పాలంటే ఆనాడు నిజాం గ్రామాలను పీల్చి పిప్పిచేశాడు.1928 నుండి 1948 వరకు అంటే 20 సంవత్సరాలు హిందువులను బానిసలుగా చేసి వారి కష్టార్జితాన్ని దోచుకున్నాడు. ఎదురుతిరిగిన వాళ్ళను భూస్థాపితం చేశాడు. గోర్టలో జరిగిన మొదటి పోరాటంలో శ్రీ వంకే జుల్మానాతోపాటు సంవత్సరం జైలుశిక్ష అనుభవించాడు.నిజాం సర్వస్వతంత్రుడుగా ప్రకటించుకోగానే ప్రతి ముస్లిం తానే పాలకుడైనట్లు వ్యవహరించడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు గ్రామాల్లో నిరంకుశాధికారాన్ని వెలిగించారు. అనేక గ్రామాలతో పాటు హుయనాబాద్, కళ్యాణ్, బాల్కీ, రాజేశ్వర్, ఘోడవాడి, సాయిగావ్, మెహేకర్ మొదలైన గ్రామాల్లో ముస్లిం గ్రామాధికారులు ఇష్టానుసారం హిందువులను పీడించటం మొదలు పెట్టారు. ఎదురైన ప్రతి హిందువుని ఇంట్లోకి చొరబడి అమానుషంగా బయటకులాగి తలను నరికివేయటం మొదలైంది. ఆ ఘోర హింసాకాండను వర్ణించడం సాధ్యం కాదు. ఒక ఇంట్లోని మగవాళ్ళనందరిని లాగి నరకటం ప్రారంభించారు. మిగిలిన ఒక తమ్ముడ్ని కూడా బయటకు లాగి కిందపడవేసేసరికి గర్భవతియైన అతని అక్క అతనిపై బడి రోదించసాగింది. రాక్షసులైన హంతకులు పాశవికమైన పద్ధతిలో ఆమెను ఈడ్చి నడుముపై తన్నారు. ఆమె అక్కడే ప్రసవించి చనిపోయింది. ఆనాడు బ్రతికి బయటపడ్డ పిల్లవాడు ఈనాటికి “బాబు” అనే పేరుతో సజీవంగా ఉన్నాడు.గ్రామంలో ఆ రోజు పాశవిక పాలన సాగింది. రాక్షసమైన ప్రవృత్తితో కనబడిన ప్రతి స్త్రీపై అత్యాచారం చేశారు. ఎంతోమంది స్త్రీలు రజాకార్ల కామానికి బలైపోయారు. ఎవరూ ఆ రాక్షస చర్యలను అడ్డుకొనేవాళ్ళు కనపడలేదు. ఆ ఒక్కరోజు హత్యకావింపబడిన యాభైమందిలో కొంతమంది పేర్లు ఇవి  అనిరుద్దప్ప, ములుశెట్టి, జగబెట్టి, శివప్ప, ధన్‌గర్, శివప్పమైత్రి, మారుతి అప్పకొనే, ధూలప్ప కణజే, రామారావు పటజే, గురప్ప కణజే, భీమన్న రాజోలె, శరణప్ప కనకటీ, చిన్నప్ప బరాదర్, గురప్ప బరాదర్, కాశప్ప మధుకంటి, విరూపాక్షప్ప మఠపతి, బసవప్ప వంకే మొదలైనవాళ్ళు.

ఇస్లామ్ ఆసఫియా సామ్రాజ్యాన్ని (సల్తనతే – ఆసఫియా ఇస్లామియా) స్థాపించాలని కలలుగన్న నిజాం 1947 తర్వాత స్వతంత్రం ప్రకటించుకొని మహా ఘనత వహించిన (హిజ్ మెజెస్టీ) ప్రభువుగా మారిపోయాడు.సర్వ స్వతంత్రమైన భారతదేశం నడిబొడ్డులో స్వతంత్ర ప్రతిపత్తికోసం ప్రాకులాడిన నిజాం ప్రజలపై క్రూర దమనకాండను అమలు జరిపాడు. ముస్లిం మత ప్రాబల్యాన్ని పెంచి ఇత్తెహాదుల్ సంస్థ అండతో రజాకార్ల గూండా చర్యలతో తన అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించాడు. చివరికి బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ కూడా స్వతంత్ర హైదరాబాద్‌ను సమర్థించాడు. యూరప్‌లో బఫర్‌స్టేట్‌గా ఉన్న స్విట్జర్లాండ్ పద్ధతిలో హైద్రాబాద్ సంస్థానం ఉండవచ్చునని వాదించాడు. రజాకార్ల సైన్యాధిపతిగా ఖాసిం రజ్వీ చివరికి నిజాం తలపై భస్మాసురహస్తంలా పరిణమించాడు. రజ్వీ తనను తాను ఫీల్డ్ మార్షల్ రోమెల్ జుకాఫ్ మాంటే గుసరీలాంటి ప్రఖ్యాత సైన్యాధిపతిగా ఊహించుకొని విర్రవీగిపోయాడు.ఒకసారి రజ్వీ ఉక్కుమనిషి సర్దార్ పటేల్‌ను కలుసుకొని హైద్రాబాద్ స్వతంత్రంగా ఉంటుందని చెప్పాడు. సర్దార్ పటేల్ ఒకే ఒక్కమాటలో ఇలా అన్నారు “ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వాణ్ణి ఎవరూ ఆపలేరు”. తర్వాత రజ్వీ విషపూరితమైన ఉపన్యాసాలవల్ల ముస్లింలను రెచ్చగొట్టాడు. ఢిల్లీ రాజధానిని వశం చేసుకొని ఎర్రకోటపై ఆసఫియా జెండాని ఎగురవేస్తానని డంబాలు పలికాడు. కాని భారత సైన్యం ప్రవేశించిన మూడు రోజులకే నిజాం సైన్యం, రజాకార్లు ఆయుధాలు దించేసి మోకరిల్లారు.నిజాం తప్పునంతా రజ్వీపైన, రజాకార్లపైన మోపి తాను ధూర్తుడిగా లొంగిపోయాడు. పోలీసు యాక్షన్ తర్వాత ఖాసిం రజ్వీని ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. సవివరంగా హంతకుడిగా, దోపిడీ దొంగగా రజ్వీ న్యాయస్థానంలో నిలుచున్నాడు. న్యాయస్థానం రజ్వీకి ఏడు సంవత్సరాలు కఠిన కారాగారశిక్షను విధించింది. మామూలుగా ప్లీడరు నుండి ఫీల్డ్‌మార్షల్‌గా తనను తాను నిలుపుకొన్న రజ్వీ దోపిడీ దొంగగా నిజస్వరూపాన్ని చూపుకోక తప్పలేదు. గూఢచారి విభాగం అధికారి శ్రీ నర్సింగ్ ప్రసాద్ కృషివల్ల స్పష్టమైన ఆధారాలు, సాక్ష్యాలు దొరికాయి. ఫలితంగా ఖాసిం రజ్వీ తానుచేసిన నేరాలకు కఠిన శిక్షను అనుభవించాడు.

హైద్రాబాద్ సంస్థానం విలీనం కాకుండా ఉండాలని నిజాం, ముస్లిం మజ్లిస్, నియంత ఖాసిం రజ్వీ ఇక్కడ ప్రజలను మభ్యపెడుతూ నాటకం ఆడారు. హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్ళులాంటి వారని వాళ్ళిద్దరూ తన కళ్ళులాగానే ప్రీతిపాత్రులని హైద్రాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేసే పక్షంలో హిందువులు బాధపడతారు.  భారత్‌లో విలీనం చేయటం ముస్లింలకు ఇష్టం లేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో తన రాజ్యం స్వతంత్రంగా ఉండటమే మంచిదని నిజాం తెలివిగా ప్రకటించారు. తన రాజ్యకాంక్షను, మత దురహంకారాన్ని కప్పి పుచ్చి ఒక ప్రత్యేక ఫర్మానా ద్వారా స్వతంత్రాన్ని చాటుకున్నాడు.అయితే వాస్తవం మరోవిధంగా ఉంది. ఈ సంస్థానంలోని అత్యధిక సంఖ్యాకులైన హిందువులు తమ ప్రాంతాన్ని మత ప్రమేయంలేని స్వతంత్ర భారత్‌లో విలీనం చేసి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రగాఢంగా కోరుతున్నారు. హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఈ ఆశయ సాధనకోసం సంఘర్షణ జరుపుతూ ఉంది. ఈ ప్రజావాంఛను, వాస్తవాన్ని అణచిపెట్టాలని నిజాం శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. తనకు అన్ని విధాలా సహాయంగా ఉండాలని ఇత్తేహాదుల్ ముసల్‌మీన్ అనే మత సంస్థను పోషించాడు. ఖాసిం రజ్వీ దాని నాయకుడుగా అండగా ఉన్నాడు. నిజాం తన సైన్యాన్ని మరింత సాయుధం చేసి ప్రజా ఆందోళనలను నిరంకుశంగా అణచి వేయాలని సిద్ధంగా ఉన్నాడు.1947 ఆగస్టు 15 నాటి నుండి హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ తన ఆందోళనను తీవ్రతరం చేసింది. సత్యాగ్రహంలో పాల్గొన్న దళాలను నిజాం అరెస్టు చేయించాడు. తీవ్రమైన దమనకాండను జరిపించాడు. నిజాం పోలీసులు, రజాకార్ల దళాలు ఇష్టానుసారంగా అత్యాచారాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ జరుపుతున్న ఆందోళనను అమానుషంగా అణచివేయాలని అన్నిరకాల బల ప్రయోగాలు చేస్తున్నారు. జైళ్ళలో సత్యాగ్రహులపై లాఠీచార్జీ జరిపి అనేకమందిని గాయపరిచారు. 1948 జనవరి 11న నిజామాబాద్ జైలుకు బయటనుంచి గూండాలను తీసుకెళ్ళి రాజకీయ ఖైదీలను విపరీతంగా కొట్టించాడు.అప్పుడు లాయక్ ఆలీ మంత్రిమండలి నుండి శ్రీ రామాచార్య రాజీనామా చేశాడు. వేలాదిమంది రాజకీయ ఖైదీలు జైలు కటకటాల వెనుక క్రూర హింసలకు గురౌతున్నారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలని విద్యార్థులు విద్యాలయాలను బహిష్కరిస్తున్నారు. రజాకార్లు విచ్చలవిడిగా అభ్యుదయకాముకులైన ప్రజలపై, నాయకులపై అత్యాచారాలు జరుపుతున్నారు. ప్రాణ, మాన, ఆస్తి రక్షణ లేకపోవడం మూలాన ప్రజలు లక్షల సంఖ్యలో సంస్థానాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. వందలాది మంది తుపాకీ గుండ్లపాలై ప్రాణాలు వదిలారు. సజీవ దహనాలు, ఆడవాళ్ళ మానభంగాలతో సంస్థానం అల్లకల్లోలంగా ఉంది. ఈ అన్యాయాల్ని బయటపెట్టిన పత్రికల నోరు మూయించారు. ఈ దారుణ పరిస్థితుల్లో స్టేట్ కాంగ్రెస్ వెలుపలి నుంచి తన కార్యకలపాలను నిర్వహించటం ప్రారంభించింది.

రజాకార్ల కాలంలో కాకతీయ మహానగరంఒక ఇంటి ఆవరణలో పంక్తిబద్ధంగా నిలుచుని ఉన్నారు స్వయం సేవకులు. “విజయీ విశ్వతిరంగా ప్యారా, ఝండా ఊంఛా రహే హమారా” అని పతాక వందనం చేస్తున్నారు. ప్రాణాలు ధారవోసి నీ గౌరవాన్ని కాపాడుతామని జెండాకు అభివాదం చేస్తూ గీతం ఆలాపిస్తున్నారు. ధ్వజగీతం సమాప్తం కాగానే ఆ ఉదయం “ఇన్‌క్విలాబ్ జిందాబాద్‌”, “భారత్ మాతాకీ జై”, “మహాత్మా గాంధీకీ జై” అనే నినాదాలతో అక్కడి కోటలోని ప్రశాంత వాతావరణం మార్మ్రోగింది. 4, ఆగస్టు 1946, ఆదివారంనాడు వరంగల్ కోటలోని ఉత్తర భాగాన ఈ పతాక వందనం జరుగుతూ ఉన్నది. నిజాం సామంతుల సంస్థానంలో వరంగల్ ముఠాలో ఈ విధంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ స్వేచ్ఛాగీతాలు ఆలపించడం ఆనాడు ఎవరికైనా ఆశ్చర్యాన్ని గొలిపే అంశం.

మునిగే వాడికి పూచికపుల్ల సహాయమన్నట్లు ముస్లింలు “తామే సంస్థాన పాలకుల” మని ప్రకటించారు.నిజాం తమకు ప్రతీకమాత్రుడని, ఈ రియాసత్ సంస్థానంలో తమ ఆమోదం లేకుండా ఎలాంటి రాజకీయ సంస్కరణ లేదా మార్పు జరగడానికి వీలులేదని స్పష్టం చేశారు. ఈ ముస్లిం రాజకీయపక్షంగానే నవాబ్ బహదూర్ యార్‌జంగ్ నాయకత్వాన “మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్‌” సంస్థ ఏర్పడింది. నిజాం దృష్టిలో ఇది రాజకీయ సంస్థ కాదు. అందువల్ల నిషేధం లేదు. కొద్దికాలంలోనే, నవాబ్ బహదూర్ యార్‌జంగ్ ప్రాబల్యం పెరిగింది. అతని పలుకుబడికి భయపడి నిజాం అతనిని విషప్రయోగం చేసి చంపించాడనే వదంతి ఉంది. నిజమేదైనా సంపూర్ణ ఆరోగ్యవంతుడైన ఆ నవాబ్ 1944 జూన్ ఇరవైఐదున అకస్మాత్తుగా మరణించాడు.ఆ మరణం ఎలా జరిగిందో ఈనాటికీ ప్రశ్నగా నిలిచిపోయింది. నిజాం ఆ తర్వాత తన నిరంకుశాధికారాన్ని కాపాడుకోవటానికి ఈ మజ్లిస్‌నే ఉపయోగించుకున్నాడు. ఈ మత సంస్థ అంతర్గతమైన ఎన్నికలు, తదితర విషయాలపై నిజాం ఫర్మానాలు జారీ చేయడం మొదలుపెట్టాడు. సంస్థానంలో అల్పసంఖ్యాకులైన ముస్లింలు హిందువులపై అన్నివిధాల అధికారం చలాయించాలని ప్రయత్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ధనం అన్నీ తమ సొంత ఆస్తి వ్యవహరంలా ఉండేది. తాము పాలకులమని, హిందువులు పాలితులనే భావంతో వ్యవహరించేవారు. అధిక సంఖ్యాకులైన హిందువులను బానిసలుగా చూస్తూ వారి కార్యకలపాలను కనిపెట్టి ఉండేవాళ్ళు. అందువల్ల వరంగల్ కోటలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సహించలేకపోయాడు. ముఖ్యంగా సుబేదార్ హాబీబుల్లాఖాన్ మతోన్మాది. బహుక్రూరుడు. అందువల్ల తీవ్ర పరిణామాలు సంభవించాయి.

పోలీసు చర్యకు పూర్వం కొందరు యువకులు ఉద్‌గీర్ పరిసర గ్రామాలను కాపాడుతూ రజాకార్ల దుండగాలను ఎదిరించారు. సాహసంతో, క్రమశిక్షణతో, సంఘటిత శక్తిగా రూపొందిన ఈ యువకులే ఆరు నెలలపాటు సాయుధులైన రజాకార్లను, నిజాం సైనికులను, రోహిల్లాలను, పఠాన్‌లను వీరత్వంతో, ప్రతీకారవాంఛతో ప్రతిఘటిస్తూ అనేక గ్రామాలను రక్షించారు. చాకచక్యంగా, ధైర్యంగా శత్రువులను ఎదుర్కొని ఎంతోమంది రజాకార్లను, పోలీసు అధికార్లను మట్టుపెట్టారు. గ్రామీణుల మనోధైర్యాన్ని నిలిపారు. బీదర్ జిల్లాలోని రజాకార్లకు, పోలీసులకు ఈ రైతుదళం సింహస్వప్నంగా పరిణమించింది.అందువల్లనే పోలీసు చర్య జరిగాక జిల్లా మొత్తంలో ఆడవాళ్ళు దంపుడు దగ్గర ఈ రైతు గెరిల్లాల సాహసకృత్యాలను పాటలుగా పాడుకొనేవారు.


Read Also : ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు (భాగం-1)

This Arrticle Was Fiirst Published in 2019