Home Ayodhya ఉద్యమాలు చేయడం సంఘం పని కాదు, వ్యక్తినిర్మాణమే మా పని – డా. మోహన్ భాగవత్,...

ఉద్యమాలు చేయడం సంఘం పని కాదు, వ్యక్తినిర్మాణమే మా పని – డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, ఆర్ ఎస్ ఎస్

0
SHARE

అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతిస్పందనను సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన చేసిన ఆయన ఆ తరువాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ప్ర. అయోధ్య పై తీర్పు వచ్చేసింది కదా. ఇప్పటి వరకు ఉన్న రామజన్మభూమి న్యాస్ ఏమవుతుంది? అక్కడ దేవాలయం కోసం స్తంభాలు చెక్కే పని సాగుతోంది కదా. ప్రభుత్వం ఏర్పాటుచేసే ట్రస్ట్ కు ఆ పని అప్పగిస్తారా? ఏం చేస్తారు?

. పని ముందుకు సాగుతున్నకొద్ది ఏం చేయాలో తెలుస్తూ ఉంటుంది. ఇలాగే జరగాలి, ఇదే పద్దతిలో చేయాలని మేము చెప్పలేదు. కోర్ట్ రామజన్మభూమి న్యాస్ కు స్థలాన్ని ఇచ్చింది. అలాగే ప్రభుత్వాన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటుచేయమని చెప్పింది. అందరూ కలిసి మందిర నిర్మాణం పూర్తిచేయాలి కాబట్టి ఎలా చేయాలో ఆలోచిస్తారు.

ప్ర. వివాదిత స్థలం రామమందిరానిదేనని కోర్ట్ తేల్చిచెప్పింది. అలాగే మసీదు నిర్మాణం కోసం ముస్లిములకు అయోధ్యలోనే 5ఎకరాల స్థలం ఇవ్వాలని చెప్పింది. ఈ విషయంలో సంఘ్  ఏమనుకుంటోంది?

. అది సుప్రీం కోర్ట్ నిర్ణయం కదా. దానిని మేము అంగీకరిస్తున్నాము. ఇలాంటి విషయాల్లో కోర్ట్ ఏం నిర్ణయిస్తే దానిని అందరూ అంగీకరించాలని నేను విజయదశమి ఉపన్యాసంలో కూడా చెప్పాను. ఆ ప్రకారంగానే అంగీకరించాము. ఇక పని ముందుకు సాగుతున్నప్పుడు అన్నీ జరుగుతాయి. ఈ వివాదాలను అంతం చేయాలన్నది మాత్రం చెపుతున్నాము.

ప్ర: ఇక ఈ విషయంలో విశ్వహిందూ పరిషత్ పాత్ర ఏముంటుంది?

జ: విశ్వహిందూ పరిషత్ నిర్ణయాలు ఆ సంస్థ తీసుకుంటుంది.

ప్ర. ఈ వివాదం ఓ కొలిక్కి రావడానికి ఇంతకాలం పట్టింది. అనేకమంది ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. రెండు పక్షాలు సయోధ్యకు సిద్ధమై ఉంటే ఎప్పుడో సమస్య పరిష్కారమై ఉండేది కదా?

జ: ఇంతకు ముందు సయోధ్య కోసం ప్రయత్నాలు జరిగాయి కానీ ఎందువల్లనో అవి సఫలం కాలేదు. ఎందుకంటే ఎవరు కోరి వివాదాలు, ఘర్షణ కొనితెచ్చుకొరుకదా. అలాంటి ప్రయత్నాలు జరిగి ఉంటాయి. అప్పుడు నేను అఖిల భారతీయ బాధ్యతలో లేను కనుక నాకు వివరాలు తెలియవు. ఆ ప్రయత్నాలు విజయవంతం కాకపోవడంవల్లనే సమస్య ఇంతవరకు వచ్చింది. ఆలస్యమైనా మంచి ఫలితమే వచ్చింది.

ప్ర: వివాదం సాగుతున్నప్పుడు అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి కూడా స్థలం ఇవ్వాలన్న కొందరి సూచనను అప్పుడు హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పుడు అయోధ్యలోనే మసీదుకోసం స్థలం ఇవ్వాలని కోర్ట్ చెప్పింది. దీనికి మీరేమంటారు?

జ: కోర్ట్ తీర్పును అధ్యయనం చేయాల్సి ఉంది. అంతేకాదు ఆ స్థలం ఇచ్చేది ప్రభుత్వం. ఎక్కడ ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వివాదానికి ముగింపు పలికే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేం అన్నాము. ఒకే స్థలంలో పూజా జరుగుతోంది, దానితోపాటు ఇతర ప్రార్ధనలు జరుగుతున్నాయంటే మాకు ఏమి అభ్యంతరం లేదు. కానీ సమాజంలోని వర్గాల మధ్య అసంతృప్తి, ఉద్రిక్తతలు వస్తాయి. కాబట్టి ఆ వివాదం అంతంకావాలని కోరుకున్నాం. అది ఇప్పుడు జరిగింది. ఇక ముందు ఏం జరుగుతుందో ప్రభుత్వం చూసుకుంటుంది.

ప్ర; ముస్లింలకు కోర్ట్ కేటాయించిన 5ఎకరాల స్థలం అయోధ్య లోపల ఉండాలా, బయట ఉండాలా? మీరు ఏం కోరుకుంటున్నారు?

జ: మేము ఏది కోరుకోవడంలేదు. సుప్రీం కోర్ట్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. దానిని అమలు చేయవలసినవారు ఆ పని చేస్తారు. మేము మందిరం నిర్మిస్తాం. స్థలాన్ని కేటాయించవలసిన పని ప్రభుత్వానిది. కాబట్టి వారిని అడగండి.

ప్ర; కాశీ, మధురాల గురించి ఏమనుకుంటున్నారు? దేశంలోని ముస్లిములకు మీ సందేశం ఏమిటి?

జ: హిందువులైన, ముస్లింలైన ఈ దేశపు పౌరులే. కాబట్టి వారికి వేరుగా సందేశాలు ఏమి ఉండవు. అందరమూ కలిసిమెలిసి ఉండాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నది మా సందేశం. సంఘ్ ఎలాంటి ఉద్యమాలు నిర్మించదు, సాగించదు. సంఘం వ్యక్తినిర్మాణ కార్యం చేస్తుంది. కొన్ని చారిత్రాత్మక కారణాలు, నేపధ్యం మూలంగా, నేను అఖిల భారతీయ బాధ్యత తీసుకోవడానికి ముందు, సంఘ్ ఈ ఉద్యమంలో పాల్గొంది. దానివల్ల ఇలాంటి దురభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక ముందు సంఘ్ తన పని అయిన వ్యక్తినిర్మాణ కార్యంలో నిమగ్నమవుతుంది. కాబట్టి ఉద్యమాలు మా పని కాదు. కనుక దీని గురించి మేము ఏమి చెప్పలేము.

ప్ర; సుప్రీం కోర్ట్ తీర్పుపై పునస్సమీక్ష పిటిషన్ దాఖలు చేస్తామని జిలానీ అంటున్నారు. దీనికి మీరేమంటారు? కాశీ, మథురల గురించి ఏమంటారు?

జ: కాశీ, మథురల గురించి ముందే చెప్పాను. వ్యక్తి నిర్మాణం సంఘ్ పని. సంఘ్ అదే చేస్తుంది. ఇక జిలానీ పిటిషన్ విషయాన్ని గురించి ఆయన్నే అడిగితే బాగుంటుంది.