Home Rashtriya Swayamsevak Sangh కార్యదీక్షకు కరదీపిక

కార్యదీక్షకు కరదీపిక

0
SHARE

దత్తోపంత్‌ ఠేంగ్డేజీ  (నవంబర్‌ 10,1920- అక్టోబర్‌ 14, 2004)
శతజయంతి నివాళి

పవన్ కుమార్

భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, బీఎంఎస్‌ సహా పలు జాతీయవాద సంస్థలను స్థాపించి, పెంచి పెద్ద చేసిన దత్తోపంత్‌ ఠేంగ్డేజీ ఆరు దశాబ్దాల సామాజిక జీవితంలో ఆయా క్షేత్రాలలో హిమగిరి సమానులైన ఎందరో కార్యకర్తలను తయారుచేశారు. ముందు చూపు, మహన్నత కార్యశీలత, కార్యదక్షతలతో దేశమాత సేవలో తరించిన మహనీయులు ఠేంగ్డేజీ.

దత్తోపంత్‌ ఠేంగ్డేజీ పేరు వినగానే భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌), భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌), అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ (ఏబీవీపీ), స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్జేఎం), సంస్కార భారతి, సమరసత మంచ్‌, సర్వ పంత్‌ సమదార్‌ మంచ్‌ ఇలా అనేక జాతీయవాద సంస్థలు గుర్తుకొస్తాయి. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నుంచి స్ఫూర్తి, ప్రేరణ పొందిన ఠేంగ్డీజీ, తమ జీవితాన్ని దేశమాత సేవకు అంకితం చేశారు. ఆ స్పూర్తి, ప్రేరణతో వ్యక్తి నిర్మాణం పునాదిగా అనేక జాతీయవాద సంస్థల నిర్మాణం లోనూ కీలక పాత్రను పోషించారు.

ఠేంగ్డేజీ, మహారాష్ట్రలోని వార్ధా జిల్లా ఆరవి గ్రామంలో 1920 నవంబర్‌ 10వ తేదీన జన్మిం చారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) వ్యవస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ వ్యక్తిత్వ, వివేచనలకు ఆకర్షితులైన ఠేంగ్డేజీ 22 సంవత్సరాల వయసులో, 1942లో సంఘ్‌ ప్రచారక్‌గా భారత మాత సేవకు జీవితాన్ని అంకితం చేశారు. అలా మొదలైన ఠేంగ్డేజీ సామాజిక జీవనం ఆరుపదులకుపైగా దేశమాత సేవలో పునీతమైంది. ఈ ఆరుపదుల కాలంలో ఠేంగ్డేజీ, అన్య క్షేత్రాల్లోకి సంఘ్‌ భావజాలాన్ని విస్తరించారు. 1942లో సంఘ్‌ ప్రచారక్‌గా బాధ్యతలు స్వీకరించిన ఠేంగ్డేజీ, ముందు కేరళలో, ఆ తర్వాత మరో రెండేళ్లకు 1944లో బెంగాల్లో సంఘ్‌ కార్యాన్ని ప్రారంభించారు.

ఇక అక్కడ నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆరుదశాబ్దాల పాటు సంఘ్‌ కార్యంలో చురుకైన పాత్రను పోషించారు. ఠేంగ్డేజీ, ఎందరో కార్యకర్తలను తయారుచేశారు. వారే ఇప్పుడు బీఎంఎస్‌, బీకేఎస్‌, ఏబీవీపీ వంటి అనేక సంస్థలో పనిచేస్తున్నారు. నిజానికి, ఠేంగ్డేజీ సుశిక్షి తులైన జాతీయవాద ‘సేన’ను తయారుచేశారంటే మరింత సముచితంగా ఉంటుంది. ఇప్పుడా సైన్యం, అదే స్పూర్తితో వివిధ క్షేత్రాలలో విశేషసేవలు అందిస్తోంది. చిన్నతనం నుంచి చాలా చురుకైన, తెలివిగల విద్యార్థిగా గుర్తింపు పొందిన ఠేంగ్డేజీ, స్వగ్రామం ఆరవిలో మాధ్యమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత నాగపూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1936లో మురిస్‌ కాలేజీలో ఎంఎ, న్యాయ కళాశాలలలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. న్యాయ శాస్త్రంలో పట్టా పొందినా ఠేంగ్డేజీ న్యాయవాదిగా ప్రాక్టీసు మాత్రం చేయలేదు. నిజానికి, ఠేంగ్డేజీ స్కూల్లో చదవుతున్న రోజుల నుంచే నాయకత్వ లక్షణాలు అలవరచుకున్నారు. 1934లో కేవలం 14 సంవత్స రాల వయసులోనే ఆయన స్థానిక కాంగ్రెస్‌ ‘వానర సేన’ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అలాగే, 1935లో ఆరవి నగరపాలిక పాఠశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

కాలేజీ రోజుల్లో ఠేంగ్డేజీ, హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో క్రియాశీలక పాత్రను పోషించారు. నాగపూర్‌లో చదువుతున్న రోజుల్లోనే ఠేంగ్డేజీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)కు దగ్గరయ్యారు. సంఘ్‌ కార్యాన్ని విస్తరిస్తూనే భారత దేశచరిత్ర, తత్వశాస్త్రం, రాజకీయ, ఆర్థిక సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేశారు. అధ్యయన అంశాలు ప్రతిబింబించేలా అనేక రచనలు చేశారు. ఠేంగ్డేజీ, జీవితంలో రచన వ్యాసంగం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంత క్లిష్టమైన అంశాన్ని అయినా సామాన్యులకు సైతం చక్కగా, సులభంగా అరమయ్యే సరళమైన భాషలో చెప్పడం ఠేంగ్డేజీ రచనలు, రచనా శైలిలోని ప్రత్యేకత. ఆయన మాతభాష మరాఠి, అయినా సంస్కృతం, హిందీ, బెంగాలీ, మలయాళం, ఇంగ్లీష్‌ భాషల్లో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. ఠేంగ్డేజీ, రెండు వందలకు పైగా పుస్తకాలు రాశారు. ఇన్నేసి పుస్తకాలు ఎలా చదివారు, ఎలా రాశారు, ఆయనకు అంత సమయం ఎలా చిక్కేది అనేది ఇప్పటికి ఆశ్చర్యంగానే మిగిలిపోయింది. ఆయన రాసిన ఇంగ్లీష్‌ పుస్తకాల్లో ‘వై భారతీయ మజ్దూర్‌ సంఘ్‌?’, ‘హిస్‌ లెగసీ ఔర్‌ మిషన్‌’, ‘నేషనలైజేషన్‌ ఆర్‌ గవర్నమెంట లైజేషన్‌’, ‘కంపూటరైజేషన్‌, మోడరనైజేషన్‌ వితౌట్‌ వెస్టర్నైజేషన్‌’ వంటి విలువైన పుస్తకాలు అనేకం ఉన్నాయి. ఠేంగ్డేజీ అనేక పుస్తకాలకు ముందుమాట రాశారు. అందులో ఎన్నో పేజీల్లో ఎంతో వివరణాత్మకంగా రాసిన ముందు మాటలు ఉన్నాయి. భానుప్రతాప్‌ శుక్లా, గౌరినాథ్‌ రస్తోగి సంయుక్తంగా రాసిన ‘రాష్ట్ర’ కావ్యానికి ఠేంగ్డేజీ 94 పేజీల ముందుమాట రాశారు. అలాగే, డా.ఎంజీ బోకరే రచించిన ‘హిందూ ఎకనమిక్స్‌’ గ్రంథానికి 42 పేజీల ముందుమాట రాశారు. ‘పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ విచార్‌ దర్శన్‌’ కి 126 పేజీల ముందుమాట రాశారు. ఇలా ఇంకెన్నో పుస్తకాలకు ఠేంగ్డేజీ రాసిన ముందు మాటలను సంకలనం ‘ప్రస్థావన’ పేరిట 412 పేజీల గ్రంథంగా వెలువడింది.

ఇక ఠేంగ్డేజీ ట్రేడ్‌ యూనియన్‌ జీవితంలోకి వస్తే, కార్మికనేతగా ఆయన జీవితం ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఐఎన్టీయూసీ)లో ప్రారంభమైంది. పూజనీయ గురూజీ ఆదేశాల మేరకు ఆయన ఐఎన్టీయూసీలో చేరారు. 1949 నుంచి 51 వరకు పది పరిశ్రమల్లో ఐఎన్టీయూసీ అనుబంధ కార్మికసంఘాల్లో వివిధదాల్లో పనిచేశారు. ఐఎన్టీయూసీ నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. అలాగే, 1950 నుంచి 51 వరకు ఒక సంవత్సరం పాటు ఐఎన్టీయూసీ మధ్యప్రదేశ్‌ శాఖ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. 1952 నుంచి 55 వరకు అఖిల భారతీయ బ్యాంకు అసోసి యేషన్‌లో క్రియాశీల పాత్రను పోషించారు. ఠేంగ్డేజీ ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థపై ఆయన చెరగని ముద్రను వేశారు. ఠేంగ్డేజీ వివిధ రైల్వే కార్మికసంఘాల్లోనూ పని చేశారు. 1954నుంచి 55వరకు అఖిల భారతీయ రైల్వే మెయిల్‌ సేవా కర్మచారీ సంఘ్‌, మధ్య క్షేత్ర అధ్యక్షునిగా, విశ్రాంత రైల్వే ఉద్యోగుల సంఘం, అఖిల భారత రైల్వే టెలిగ్రాఫ్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియన్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ పోషకునిగా ఇలా అనేక సంస్థలో, అనేక ¬దాలలో సేవలు అందిచారు. అలాగే, మధ్యప్రదేశ్‌ కౌలుదారుల సంఘం కార్యదర్శిగా, డా.బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవ కమిటి సభ్యునిగా, ఇలా ఒకటని కాదు అనేక సంస్థలలో అవిశ్రాంతంగా పనిచేశారు. అంతేకాదు, ఠేంగ్డేజీ 1955 జూలై 23వ తేదీన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌’ స్థాపించారు. బీఎమ్మెస్‌తో పాటుగా ఠేంగ్డేజీ 1979 మార్చి 4 వ తేదీన భారతీయ కిసాన్‌ సంఘ్‌ను, 1983 ఏప్రిల్‌ 14న సామాజిక సమరసత మంచ్‌’ని, 1991 నవంబర్‌ 22న స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, 1991లో పర్యావరణ మంచ్‌, 1992లో సర్వపంత్‌ సమాదర్‌ మంచ్‌’ వంటి అనేక సంస్థలను స్థాపించారు. వాటిని సర్వోన్నత శిఖరాలకు తీసుకుపోవడంలో విశేషంగా కృషి చేశారు.

దత్తోపంత్‌ ఠేంగ్డేజీ నిర్మాణ, సంస్థాగత నిర్వాహణ నైపుణ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే, ఠేంగ్డేజీ కార్యదక్షత, నిర్మాణ, నిర్వాహణ నైపుణ్యాల గురించి ఓ రచయిత, ‘ఆయన (ఠేంగ్డేజీ) శూన్యం నుంచి ఎన్నో హిమాలయ శిఖరాలను నిర్మించారు’ అన్నారు. మన దేశంలో 1955కు ముందు కార్మిక సంఘాలు అయితే ప్రభుత్వ అడుగుజాడల్లో నడిచే జీ హుజూర్‌ సంఘాలు. కాదంటే కార్మికుల హక్కులు ప్రయోజనాల గురించి మాత్రమే అలోచించే సంఘాలు. అంతేగాని సమష్టి తత్త్వంతో కార్మిక ప్రయోజనాలతో పాటుగా దేశ, పరిశ్రమ ప్రయోజనాల గురించి ఆలోచన చేసే సంఘాలు లేవు.

లాలా లజపతిరాయ్‌ 1920లో అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) స్థాపించారు. కమ్యూనిస్టుల మద్దతుతో ఏఐటీయూసీ కార్మికుల గళాన్ని గట్టిగా వినిపిస్తే, కాంగ్రెస్‌ మద్దతుతో ఏర్పడిన భారత జాతీయ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఐఎన్టీయూసీ) ప్రభుత్వ అడుగుజాడలలో నడిచింది. ప్రభుత్వ వాణిని వినిపిస్తూ వచ్చింది. సోషలిస్ట్‌ భావజాల వ్యక్తులు స్థాపించిన హింద్‌ మజ్దూర్‌ సభను కమ్యూనిస్టులు హైజాక్‌ చేశారు. అలాంటి పరిస్థితులలో దత్తోపంత్‌ ఠేంగ్డేజీ సమగ్ర జాతీయ దృక్పథం, జాతీయ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యం ప్రధాన విధానాలుగా బీఎంఎస్‌’ను స్థాపించారు. అంతేకాదు అయన జీవితకాలంలోనే బీఎంఎస్‌’ను నెంబర్‌ వన్‌ కార్మిక సంఘంగా అభివృద్ధి చేశారు. అదుకే చైనా వంటి కమ్యూనిస్ట్‌ దేశాలు ఆయన్ని ఆహ్వానించి తమ దేశాలలోని కార్మిక, ఆర్థిక విధానాలపై చర్చలు జరిపాయి.

అఖిల భారతీయ అధివక్త పరిషత్‌, భారతీయ విచార కేంద్రం, అఖిల భారతీయ గ్రహాక్‌ పంచాయత్‌ వంటి అనేక ఇతర సంస్థల నిర్మాణంలోనూ ఠేంగ్డేజీ కీలక భూమికను పోషించారు. ఠేంగ్డేజీ కార్మిక, ఆర్థిక, సామాజిక, విద్యా రంగాలలోనే కాదు, రాజకీయ రంగంలోనూ క్రియాశీల పాత్రను పోషించారు. 1951 నుంచి 53 వరకు భారతీయ జనసంఘ్‌ మధ్యప్రదేశ్‌, దక్షిణాంచల్‌ అర్గనైజింగ్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితి కాలంలో 1975 నుంచి 77వరకు ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రజాందోళన వేదిక లోక్‌ సంఘర్ష్‌ సమితి కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు 1964 నుంచి 1976 వరకు రాజ్యసభ సభ్యునిగా రాజకీయ క్షేత్రంలో పనిచేశారు. అయితే, ఠేంగ్డేజీ ఎప్పుడూ కూడా కార్మిక సంక్షేమం, కార్మిక ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యం రాజకీయాలకు ఇవ్వలేదు. ఠేంగ్డేజీని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం, ‘డి.లిట్‌’ గౌరవ పట్టాతో సత్కరించింది.

ఠేంగ్డేజీ, ఎంత ఎత్తుకు ఎదిగినా నిరాడంబర జీవితాన్నే సాగించారు. కేంద్ర ప్రభుత్వం 2003లో అయన పేరును పద్మభూషణ్‌ పురస్కారానికి ప్రతిపాదించింది. అయితే, ఠేంగ్డేజీ, ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అప్పటి రాష్ట్రపతి ఎపీజీ అబ్దుల్‌ కలాంకు ఈ మేరకు రాసిన లేఖలో, ఠేంగ్డేజీ, ”పద్మభూషణ్‌ పురస్కారాని నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞలు. అయితే ఈ పురస్కారం అందుకునేందుకు నేను అర్హుడిని కానేమో, ఇది నాకున్న అనుమానం. మీరంటే నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం మీ ప్రస్తుత ¬దా కారణంగా ఏర్పడింది కాదు. మీ వ్యక్తిత్వ గొప్పదనం వలన ఏర్పడింది. అయితే, పూజ్య డాక్టర్‌ హెడ్గేవార్‌, పూజ్యశ్రీ గురూజీలకు పద్మభూషణ్‌ వచ్చే వరకు నేను ఆ పురస్కారాన్ని ఆమోదించడం సమానజసం కాదు” అని పేర్కొన్నారు.

ఆయన ఎప్పుడూ, ప్రతి ఒక్కరూ సంస్థ, సిద్ధాంతాలు, లక్ష్యాలకు నిబద్ధులై పనిచేయాలే గాని వ్యక్తులకు విధేయంగా పనిచేయరాదని చెప్పేవారు. అందుకే అయన ఎప్పుడూ, పాదాభివందనాన్ని అనుమతించ లేదు. అలా ఆయన్ని ఎరిగిన ప్రతి ఒక్కరికీ, ఆయన సామాజిక, వ్యక్తిగత జీవితం అనుసరణీయ, ఆదర్శం మార్గంగా నిలిచింది.

చాలా చిన్న వయసులో సంఘ్‌ ప్రచారక్‌’గా ఆయన కేరళ వెళ్లినప్పుడు అక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కున్నారు. కాంగ్రెస్‌, కమ్యునిస్టులు బలంగా ఉన్న రాష్ట్రంలో సంఘ్‌ కార్యాన్ని ముందుకు తీసుకుపోవడం అయ్యే పని కాదని అనేక మంది ఆయన్ని వచ్చిన దారిన వెనక్కి వెళ్లమని సలహా కూడా ఇచ్చారు. అయినా, ఠేంగ్డేజీ వెనకడుగు వేయలేదు, చివరకు ఎవరయితే అయ్యే పని కాదన్నారో వారే, ఠేేంగ్డేజీ అభిమానులుగా మారిపోయారు. ఆ తర్వాత అయన అడుగు పెట్టిన పశ్చిమ బెంగాల్‌ అస్సాంల లోనూ అదే పరిస్థితి. ఒకప్పుడు కేరళలో బీఎంఎస్‌ కార్యకర్తలు ‘భారతమాతాకీ జై’ అని నినదిస్తే కమ్యూనిస్టులు అభ్యంతరం చెప్పారు, అదే కమ్యూ నిస్టులు 2008లో ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌’లో అదే, ‘భారత్‌మాతాకీ జై’ నినాదాన్ని గొంతెత్తి ఆలపించారు.

ఠేంగ్డేజీ, జీవితకాలంలో కమ్యూనిస్ట్‌ చైనా సహా అనేక దేశాల్లో పర్యటించారు. అక్కడి కార్మిక సంఘాల పనితీరును అధ్యయనం చేశారు. ఆల్‌ చైనా ఫెడరేషన్‌ పఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఆహ్వానంపై 1985లో బీజింగ్‌లో పర్యటించిన ఠేంగ్డేజీ ‘బీజింగ్‌ రేడియో’ ద్వారా ఆ దేశ కార్మికులను, కార్మిక సంఘాల నాయకులనుద్దేశించి ప్రసంగించారు. అమెరికా, మెక్సికో, రష్యా సహా చాలా దేశాలలో పర్యటించారు.

ఆ విధంగా, భారతమాత సేవలో నియమబద్ద జీవితాన్ని సాగించిన ఠేంగ్డేజీ, 2004 అక్టోబర్‌ 14వ తేదీన 84వ ఏట పుణెలో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల ముందు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జీవితానికి సంబంధించిన పుస్తక రచన పూర్తి చేశారు.  ఠేంగ్డేజీ, చివరి వరకు సంఘ్‌ కార్యంలోనే ఉన్నారు. కన్ను మూయడానికి కొద్ది గంటల ముందు ఆయన స్వయంగా అక్టోబర్‌ 15 తేదీన సామాజిక సమరసత మంచ్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. కానీ, 14 తేదీనే తుదిశ్వాస విడచి వెళ్లిపోయారు. ఠేంగ్డేజీ భౌతికంగా మన నుంచి దూరంగా వెళ్లిపోయినా ఆయన మానస పుత్రికలను అనదగిన సంస్థలు, ఎందరో సమర్ధ, కార్యకర్తలు రూపంలో సజీవంగా ఉన్నారు. ఉంటారు.

(వ్యాసకర్త : బిఎంఎస్‌ జాతీయ నాయకులు)
– జాగృతి వార పత్రిక సౌజన్యంతో….