Home Telugu Articles విద్యాప్రదాయిని సరస్వతిదేవి

విద్యాప్రదాయిని సరస్వతిదేవి

0
SHARE

– పి. విశాలాక్షి

శివస్వరూపమైన సృష్టి సూర్యచంద్రుల గమనం మూలంగా ఋతువులుగా ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయి. ఈ షట్(ఆరు)ఋతువులలో మొదటిది, ప్రధానమైనది వసంత ఋతువు. వసంత ఋతువులో ప్రకృతి 16కళలతో వికసిస్తుoది. వాల్మికి మహర్షి శ్రీమద్ రామాయణంలో అతిసుందర మనోహరమైన వసంత ఋతువు చిత్రణ చేసారు.  జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో `ఋతూనాం కుసుమాకరః’ అని వసంతమును తన విభూతిగా లెక్కించెను. కవి జయదేవుడు వసంత వర్ణమును అత్యంత సుందరంగా అష్టపదులలో తెలిపారు.  

ప్రకృతి సుఖదుఃఖ ద్వంద్వములకి అతీతమైనది. శిశిరమందు ఆకురాలుట జీవనమున నిరాశయు మామూలే, కానీ వసంతమున తిరిగి సృష్టి పునఃనవ పల్లవితమైనట్లు, జీవుని మనస్సు వసంతమున జీవనగీతం నిరంతర ఆశచే పొంగిపొరలును. వసంతము కల్పనా వాస్తవాల సమన్వయము. జగన్మాతయైన సరస్వతీదేవి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో వసంతపంచమి రోజున ఉద్భవించింది. మాఘమాసము శుక్లపక్షపంచమి `వసంతపంచమి’ పర్వదినాన్ని, శ్రీ పంచమిగా ఉత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు, సిక్ఖులు, జైనులు అందరూ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహం కొరకు సరస్వతీపూజలు చేస్తారు. తెలుపు, పసుపుపచ్చ వస్త్రాలు ధరించి ప్రజలు సంతోషంగా వసంతోత్సవాలు జరుపుకుంటారు.

సరస్వతీదేవి స్వరూప వర్ణనలోనే నిజమైన సారస్వతులకు మార్గదర్శనం లభిస్తుంది.

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా…..
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా ….
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా….
సా మాoపాతు సరస్వతీ భగవతీ నిశేష  జాడ్యాపహాII

సరస్వతీమాత ధవళవస్త్రములు ధరించి, హస్తమున వీణావేదములతో శోభిల్లుచు, శ్వేతపద్మాసనముపై విరాజిల్లుచుండును. సారస్వతులనగా నిత్య ఉపాసకులు/విద్యార్థులు. నిర్మలమనస్సుతో చేయు సాధన, మన జీవనమున వీణాగానమువలె మనస్సు రంజింపచేస్తుంది.  అట్టి సారస్వతులు, ఇతర హృదయాలను జ్ఞానమువైపు, సామవేదమైన సంగీతమువైపు మరల్చెదరు. అనగా విద్యార్థులు జ్ఞానమనే సువాసనను వ్యాపింపచేసి, జనులను సన్మార్గవర్తనులుగా చేయడమే సరస్వతీమాత విద్య.  `విద్వాన్ సర్వత్ర పూజతే’ అని పెద్దలందురు. సరస్వతీదేవి వాహనం హంస, నెమలిగా కూడా వర్ణించబడింది. సరస్వతీదేవి కళలకు అధిదేవత, ఆమె ఉపాసకులకు 64కళలు ప్రాప్తించును.                

శారదామాత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని రాణి. బ్రహ్మ మొదట సృష్టి చేసినపుడు, మహర్షులందరూ సైగలతో విషయములు చెప్పుకొనుట చూసి, బ్రహ్మ సరస్వతిని ప్రార్థించగా, ఆమె వాక్కు ప్రసాదించి వాగ్దేవి అయినదని భవిష్య పురాణం చెప్పుచున్నది. శారదామాత నిత్యయౌవని, తన ఉపాసకులకు జీవము, శక్తి, విద్యలను ప్రసాదించును. అందుకే మనుషులు తమ పిల్లలకు శ్రీపంచమి నాడు, శ్రీ సరస్వతీ మందిరమున విద్యాభ్యాసము చేయిస్తారు. వసంత పంచమి మానవులందరికీ విద్యాప్రదాయినిగా, తద్వారా తమ వృత్తులలో ఉన్నత పధములనిచ్చు దేవి శారదామాత. భక్తి, శక్తి, విద్య, ఆశయసిద్ధి కలిగించు వసంతపంచమి ప్రజల జీవితాలకు శుభసంతోష ప్రదాయిని.