Home Telugu Articles ‘పండితుల’కు అండాదండా! జమ్ము కశ్మీర్‌లో అపూర్వ ఘట్టం

‘పండితుల’కు అండాదండా! జమ్ము కశ్మీర్‌లో అపూర్వ ఘట్టం

0
SHARE

‘జమ్ము-కశ్మీర్‌ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మానవతా దృక్పథం తప్పనిసరి. అశాంతితో అతలాకుతలమవుతున్న ఆ రాష్ట్రంలో వికాస్‌ (అభివృద్ధి), విశ్వాస్‌ (నమ్మకం) పునాదిగా ముందుకు వెళ్లడమే ప్రభుత్వాల లక్ష్యం కావాలి’- గతేడాది నవంబరు అయిదున దిల్లీలో తనను కలిసిన అఖిల జమ్ము-కశ్మీర్‌ పంచాయత్‌ సమ్మేళనానికి చెందిన ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న కశ్మీరీ పండితుల సమస్య పరిష్కారంలో రాష్ట్రప్రభుత్వం ఇదే స్ఫూర్తితో వ్యవహరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 1990 జనవరినాటి అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం వదలి వెళ్లిన పండితులను తిరిగి స్వస్థలాలకు రావాలని కోరుతూ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానించడం రాష్ట్ర చరిత్రలో అపూర్వఘట్టం అనడం అతిశయోక్తి కాదు. ఈనెల 19న ఉభయ సభలు చేసిన తీర్మానంతో సంక్షుభిత సరిహద్దు రాష్ట్రంలో శాంతిస్థాపనకు అడుగులు పడ్డాయి. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీపీ)-భారతీయ జనతా పార్టీ (భాజపా) సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వెనక ప్రధాని వ్యాఖ్యల ప్రభావాన్ని విస్మరించలేం. శాసనసభలోని మొత్తం 87 స్థానాల్లో 28 స్థానాలతో పీడీపీ అగ్రభాగాన ఉన్నప్పటికి, పాతిక స్థానాలతో ద్వితీయ స్థానంలో ఉన్న భాజపా- ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉందనడానికి ఈ నిర్ణయం నిదర్శనం!

వాస్తవానికి పండితులు లేని కశ్మీర్‌ అసంపూర్ణం. వారిని రాష్ట్రం నుంచి వేరుచేయడం అసాధ్యం. రాష్ట్రంలో వారు అవిభాజ్యం. అయిదువేల సంవత్సరాలకు పైగా చరిత్ర వారిది. మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు. పండితులు, ముస్లిములు, బౌద్ధుల ఉమ్మడి జీవనమే కశ్మీరీ సంస్కృతి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఈ వాతావరణం లేదు. ఈ నేపథ్యంలో పండితులు సగౌరవంగా తిరిగి రావాలని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయం. కేవలం తీర్మానంతోనే సరిపెట్టకుండా వారిని అన్నివిధాలా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. కశ్మీర్‌ లోయలోని పది జిల్లాల్లో వారి కోసం ప్రత్యేక కాలనీలు నిర్మించేలా ఎనిమిది ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. దీనికి వంద ఎకరాలను కేటాయించింది. ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధమవుతోంది. కేవలం పునరావాసంతోనే సరిపెట్టకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కేంద్రప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఆరువేల ఉద్యోగాల కల్పనకు కేంద్రం ముందుకు వచ్చింది. కశ్మీర్‌ లోయలోని అనంతనాగ్‌, బారాముల్లా, శ్రీనగర్‌, పుల్వామా, సోపూర్‌ తదితర ప్రాంతాల్లో జనాభాపరంగా ముస్లిములదే పైచేయి. పండితులు సైతం అక్కడ పెద్దసంఖ్యలోనే ఉన్నారు.

కశ్మీరీ పండితుల కడగండ్లు కోకొల్లలు. స్వదేశంలోనే వారు శరణార్థులుగా, కాందీశీకులుగా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. వారి సమస్య ఈనాటిది కాదు. నా అన్నవారు లేకుండా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు 1990నాటి ఘటనలను నేటికీ మర్చిపోలేకపోతున్నారు. 27సంవత్సరాలనాటి ఘటనను పీడకలగా భావిస్తున్నారు. ఆ ఏడాది జనవరి మూడోవారంలో ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కారణంగా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆగడాలతో పండిట్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడిపారు. ముష్కరులు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. వారిపై దాడులకు దిగారు. ­ఊచకోత కోశారు. దీంతో లక్షకు పైగా పండితులు తట్టాబుట్ట సర్దుకుని పొట్టచేత్తో పట్టుకుని భారంగా రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయారు. జమ్ము, ఉద్ధంపూర్‌, దిల్లీ తదితర ప్రాంతాల్లోని శరణార్థి శిబిరాల్లో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకాలం వారి గోడు పట్టించుకున్న నాథుడే లేడు. 2008 ఏప్రిల్లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాష్ట్రాన్ని సందర్శించి రూ.1618 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. శాసనసభ తీర్మానాన్ని పండితులు స్వాగతిస్తున్నప్పటికీ, అదే సమయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పలు సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికి అమలు దగ్గరకు వచ్చేసరికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయని కశ్మీరీ పండిట్‌ సంఘర్ష్‌ సమితి వంటి సంస్థలు గుర్తుచేస్తున్నాయి. ప్రత్యేక కాలనీల నిర్మాణానికి వ్యతిరేకంగా వేర్పాటువాదుల బంద్‌ పిలుపునకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం భావిస్తున్నంత సానుకూల పరిస్థితులు లేవని వారు అభిప్రాయపడుతున్నారు. శాంతిభద్రతలు ఇంకా సమస్యాత్మకంగానే ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తాత్కాలికంగా ప్రశాంతత నెలకొన్నప్పటికీ, ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న భరోసా లేదని అంటున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మైనార్టీల పేరుతో ముస్లిములు ప్రభుత్వపరంగా లబ్ధి పొందుతుండగా, కశ్మీర్‌లో తమకు మైనార్టీ హోదా ఇవ్వడంలేదని పండితులు గుర్తుచేస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తీసుకువచ్చిన ఫలితమే ఈ నిర్ణయమన్న వాదనను రాజకీయ విశ్లేషకులు తెరపైకి తీసుకువస్తున్నారు. ఎన్నికల ముందు ఎంత త్వరగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటారో ఎన్నికల అనంతరం అంతే త్వరగా మర్చిపోతారని కొందరు వాదిస్తున్నారు.

శాసనసభ తీర్మానాన్ని వేర్పాటువాదులూ స్వాగతిస్తున్నప్పటికీ, కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. పండితుల కోసం ప్రత్యేక కాలనీలు నిర్మించరాదని, వారికి రాష్ట్రంలో ఎక్కడైనా నివసించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రత్యేక కాలనీల నిర్మాణం ద్వారా ప్రజల మధ్య అంతరాలు అలాగే ఉండిపోతాయని వాదిస్తున్నారు. భాజపా హిందూత్వ అజెండాలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి వచ్చిన శరణార్థులకు గుర్తింపు పత్రాలు ఇవ్వడం ద్వారా ముస్లిం మెజారిటీ రాష్ట్రంలో హిందువుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. పండితులకు ప్రత్యేక కాలనీల నిర్మాణ నిర్ణయంపై పోరాడతామని జమ్ము కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌), హురియత్‌ తదితర సంస్థలు ప్రకటించాయి. ఈ కాలనీల్లో వారితో పాటు ముస్లిములూ నివసించవచ్చన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనను వారు విస్మరిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, దశాబ్దాల నాటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత!

– గోపరాజు మల్లపరాజు

(ఈనాడు సౌజన్యంతో)