Home News తెలుగు వారి జీవితంలో కథావస్తువు కరువైపోయింది – సిరివెన్నెల సీతారామశాస్త్రి

తెలుగు వారి జీవితంలో కథావస్తువు కరువైపోయింది – సిరివెన్నెల సీతారామశాస్త్రి

0
SHARE

“తెలుగు వారి జీవితంలో కథావస్తువు కరువైపోయింది” అని జాగృతి కథలు, నవలల పోటీ విజేతల బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ : కథకు వస్తువు దొరకనంతగా తెలుగువాళ్ల జీవితం సంక్లిష్టమైపోయిందని, ఆహార, భయ, మైధునాదులను మరచిపోతున్న ఈ జీవితంలో వాస్తవికతకు చోటెక్కడ మిగిలిందని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. సంతానానికి పేర్లు పెట్టడం దగ్గర నుంచి, మనుషుల మధ్య బంధాల వరకు వాతావరణం అంతా కృతకంగా మారిపోయిందని ఆయన అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాయంలోని ప్రొఫెసర్‌ రామిరెడ్డి దూరవిద్య విభాగ ఆడిటోరియంలో, మార్చి 1న జాతీయ తెలుగు వారపత్రిక ‘జాగృతి’ నిర్వహించిన కథలు, నవలల పోటీ విజేతల బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు.

మానవ జీవితానికీ, కథకీ విడదీయలేని బంధం ఉందని, కథ మనిషంత పాతది, మనిషంత కొత్తది కూడానని సీతారామశాస్త్రి అన్నారు. మన పురాణాలన్నీ కథల సమాహారాలేనని, చెప్పడం, చెప్పుకోవడం, చెప్పాల్సిరావడం అనే దశలు ఈ ప్రక్రియలో ఉంటాయని, ఒక కథకుడి స్థాయి ఎలాంటిదో ఈ దశలే నిరూపిస్తాయని అన్నారు. 20వ శతాబ్దం తెలుగు కథ మీద పాశ్చాత్య ప్రభావం ఎక్కువేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా చక్కని తెలుగులో వెలువడిన చందమామ వంటి పత్రిక నిలిచిపోవడం తెలుగు కథకు పెద్ద కుదుపు అని సీతారామశాస్త్రి అభిప్రాయపడ్డారు. రాసేవారందరికీ ఒక కర్తవ్యం ఉంటుందని అన్నారు. ఒకనాడు కలలు అనుకున్నవి నేడు అవసరాలుగా మారిపోయాయని, దీనితో పెద్ద పెద్ద వైభవాలను కోల్పోవడంతో పాటు, విషాదాలను సైతం పట్టించుకోలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు.

ప్రస్తుతం సమాజంలో నకారాత్మక (నెగెటివ్‌) దృక్పథం పెరిగిందనీ, అందుకే కథ లేదా సాహిత్యం దానినే ప్రతిబింబించవలసి వస్తున్నదని చెప్పారు. కొద్దికాంగా దైన్యమే కథలో రాజ్యమేలడం బాధ కలిగిస్తున్నదని అన్నారు. ఇక విద్యావిధానం చూస్తే నేర్చుకున్నది కూడా బడికి వెళ్లిన తరువాత కోల్పోవసివస్తున్నదని పేర్కొన్నారు. ఐటీ, రోబోటిక్స్‌, కృత్రిమ మేధ, అమెరికా యాత్రలు, వాటితో వచ్చిన పర్యవసనాలే ఇప్పుడు కథల నిండా కనిపిస్తున్నాయని, పెళ్లి, చావు, ఆనందం, విషాదం ఏదీ కూడా మనసును సహజంగా స్పందింపచేయలేకపోతున్నాయని అన్నారు. ఒక అనుభవాన్ని కథగా, నవలగా, కవితగా ఆవిష్కరించాలంటే భాష అవసరమని, కానీ ఇప్పుడు అంతా ఎస్‌ఎంఎస్‌ భాషను ఆశ్రయించడం కనిపిస్తోందని అన్నారు. మనసుకు హత్తుకునేటట్టు చేయడంలో కీలకంగా ఉండే భాషకు ఇలాంటి దుర్గతి పట్టిందని అన్నారు. జాతంతా జాగృతావస్థలోనే ఉన్నా సుషుప్తిని నటిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నవల గురించి మాట్లాడుతూ తెలుగు నవల పరిపూర్ణత సాధించుకోవసి ఉందని చెప్పారు. తన దృష్టిలో విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు ఒక్కటే పరిపూర్ణ నవల అని చెప్పారు.

సమాజంలో నానాటికీ విలువలు పడిపోతున్నాయని వీటిని కాపాడుకోవలసిన బాధ్యత అందరికీ ఉందని ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధిగా పాల్గొన్న సింహాద్రి సూర్యనారాయణ (చార్టర్డ్‌ అకైంటెంట్‌) అన్నారు. మనం చేసే ఖర్చుకూ, సమాజంలోని పరిస్థితులకు మధ్య ఒక స్వచ్చంద అన్వయం ఉండాని ఆయన చెప్పారు. మనమంతా సమానమేనని, ఈ దేశం, ఈ వనరులు అందరివీ అన్న విశ్వాసం, ఆచరణ అందరిలో ఉండాలని ఆయన కోరారు. మన దేహమే మన సమాజానికి ప్రతిబింబమని, ఇందులో ఏ ఒక్క భాగం నిరాదరణకు గురైన ఫలితాలు వేరుగా ఉంటాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రద్దుల ప్రభుత్వం నడుస్తున్నదని, మాతృభాషను రద్దు చేసి, అదొక ఘనతగా వేదిక మీద చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉన్నదని ఏపీ ఎంఎల్‌సి పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. మాధవ్‌ కూడా మరొక ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. తనకు చిన్నతనం నుంచి జాగృతి పత్రిక అంటే అభిమానమని, ఆ పత్రిక నిర్దేశించిన జాతీయతా స్ఫూర్తితోనే మేమంతా ఎదిగామని ఆయన అన్నారు. వేయి ఉపన్యాసాలు చేయలేని పనిని ఒక కథ, ఒక నవల, ఒక కవిత చేయగలవని ఆయన చెప్పారు. కానీ సమాజం కూడా కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలని, చదివే అలవాటు తగ్గడం ఎంతో విషాదమని ఆయన అన్నారు. గ్రంథాయాలు కాలగర్భంలోకి పోతున్నాయని, తంజావూరులోని సరస్వతీ మహల్‌కు తాము వెళ్లినప్పుడు ఎంతో బాధ కలిగిందని అన్నారు. అక్కడున్న ఆ గొప్ప గ్రంథాలయాన్ని తెలుగువారు అభివృద్ధి చేశారనీ,  కానీ అక్కడున్న 70 లక్షల గ్రంథాలను ఇప్పుడు రాష్ట్రానికి తెచ్చుకునే అవకాశమే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు కథ, నవల చరిత్ర గురించి జాగృతి సంపాదకుడు డాక్టర్‌ గోపరాజు నారాయణరావు పరిచయం చేశారు. సభకు జాగృతి ప్రకాశన్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ఆచార్య సి.సంజీవ అధ్యక్షత వహించారు. జాగృతి ప్రకాశన్‌ ట్రస్ట్‌ కార్యదర్శి సి.రాఘవేంద్ర స్వాగతం పలికి, అతిథును పరిచయం చేశారు. వాకాటి పాండురంగారావు దీపావళి కథ పోటీ విజేతలు ముగ్గురికీ, ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీ విజేతలు ఇద్దరికీ బహుమతు అందచేశారు.