Home News ఎస్ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్ అరెస్టు

ఎస్ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్ అరెస్టు

0
SHARE

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కింద గత రెండు రోజులుగా ఆయన్ని అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు జరిపారు. అనంతరం విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆదివారం వేకువజామున కపూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సహకరించని కారణంగానే అరెస్టు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు ఆయన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరతామని వారు పేర్కొన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. యెస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ పరిణామాల అనంతరం ”ఇప్పుడు యెస్‌ బ్యాంకు డెబిట్‌ కార్డుల ద్వారా యెస్‌ బ్యాంక్‌ సహా ఇతర ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు” అంటూ బ్యాంక్‌ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. కానీ, గత మూడు రోజులుగా బ్యాంకు ఖాతాదారులు నగదు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సహా ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి తీవ్ర ఇక్కట్లు పడ్డారు. యెస్‌ బ్యాంక్‌పై మారటోరియం విధిస్తూ.. విత్‌డ్రాలపై రూ.50వేల పరిమితిని విధించడంతో ఈ సమస్యలు తలెత్తాయి.

vskandhra.org సౌజన్యంతో