Home News చైనా నిర్లక్ష్యం వల్ల ప్రపంచం భారీ మూల్యం చెల్లిస్తోంది – ట్రంప్‌

చైనా నిర్లక్ష్యం వల్ల ప్రపంచం భారీ మూల్యం చెల్లిస్తోంది – ట్రంప్‌

0
SHARE

మహమ్మారి కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విమర్శించారు. కరోనా వైరస్‌ పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా మరోసారి చైనా తీరును తప్పుబట్టారు. చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడినట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ను ఆదిలోనే కట్టడిచేస్తే అది ఆ ప్రాంతానికే పరిమితమయ్యేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమని, ఇదే నిజమని తానుకూడా బలంగా నమ్ముతున్నానని ట్రంప్‌ స్పష్టం చేశారు.

ఈ వైరస్‌పై కొన్ని నెలలముందే సమాచారం తెలిసి ఉంటే ప్రపంచం మొత్తానికి ఇది విస్తరించేది కాదన్నారు. ఆ సమయంలో వైరస్‌ గురించి వారి దగ్గరున్న సమాచారాన్ని ప్రపంచదేశాలకు తెలపడంలో చైనా విఫలమైందని దుయ్యబట్టారు. కరోనా వైరస్‌ తీవ్రతను ప్రపంచానికి తెలియజేయకుండా అక్కడి వైద్యులు, జర్నలిస్టులపై చైనా చర్యలు తీసుకుందన్నారు. ఇలా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణమైన బీజింగ్‌ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే, దీనికి కారణమైన చైనాపై ప్రతిచర్యలు ఉంటాయా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు.

అంతకుముందు, కరోనా వైరస్‌ ప్రాథమిక నివేదికలను బహిర్గతం కాకుండా చైనా తొక్కిపెట్టిందని అమెరికా అధ్యక్షభవనం జాతీయ భద్రత మండలి(ఎన్‌ఎస్‌సీ)ఆరోపించింది. దీంతో ఈ వైరస్‌ తీవ్రతను అరికట్టగలిగే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కోల్పోయారని ట్వీటర్‌లో పేర్కొంది. ఎన్‌ఎన్‌సీ చైనాపై చేసిన ఆరోపణల నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ పైవిధంగా స్పందించారు.

ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి మరణించిన వారిసంఖ్య 200లకు చేరింది. అంతేకాకుండా మరో 14వేల మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. తాజాగా అమెరికాలో 50రాష్ట్రాలకు ఇది విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొవిడ్‌-19 బారినపడిన వారిసంఖ్య 2లక్షలు దాటగా..దీనికారణంగా దాదాపు 9వేల మంది మరణించారు. దీనిలో సగానికి పైగా చైనా వెలుపలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 150దేశాలకు పైగా వ్యాపించిన కరోనా వైరస్‌ చైనా వెలుపల అత్యంత వేగంగా విస్తరిస్తోంది.

ఈనాడు సౌజన్యంతో...

మరిన్ని వార్తలు, విశేషాల కోసం Samachara Bharati యాప్ ను క్లిక్ చెయ్యండి.