పరిశుభ్రత దైవత్వంతో సమానమైనదని అంటారు. ఇదివరకటి ప్రభుత్వాలు దురదృష్టవశాత్తు ఈ కీలక అంశాన్ని పట్టించుకోలేదు. మోదీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి ప్రజల ఆలోచనలో, ప్రవర్తనలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఇది ఇప్పుడొక ప్రజా ఉద్యమంగా మారింది. బహిరంగ కాలకృత్యాలనే జాడ్యం నుంచి పూర్తిగా బయటపడినట్లు 450 నగరాలు, 1.4 లక్షల గ్రామాలు, 77 జిల్లాలు, మూడు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించుకొన్నాయి.
ఒక సమాజం లేదా జాతి ప్రగతి సాధించాలన్నా, వృద్ధిపథంలో దూసుకెళ్లాలన్నా మార్పు అన్నదే కీలకం. ఎన్‌డీఏ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో వరస వెంబడి సంస్కరణలు చేపట్టడం ద్వారా నవోత్తేజ భారతదేశాన్ని ఆవిష్కరించడానికి అహరహం కృషి చేస్తోంది. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టడం మొదలుకొని అసలు సిసలైన ప్రతిభావంతులు, నిజమైన సంఘసంస్కర్తలకు మొట్టమొదటిసారిగా పద్మ అవార్డులు ప్రకటించడం, రాజకీయ పార్టీల నిధుల్లో పారదర్శకత వరకు పలు చర్యలు తీసుకొంటున్న ప్రధానమంత్రి- వ్యక్తుల ఆలోచనాధోరణి, వ్యవస్థల పనితీరులో సంపూర్ణ పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అంటూ దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానానికి స్వస్తి పలికి, ఏకైక, సర్వ సమగ్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు ఆ కృషినే ప్రతిఫలింపజేసింది. యథాతథవాదులకు మార్పు అంటే భయం. వారు బావిలో కప్పల్లాంటివారు. అదే లోకమనుకొంటారు. అక్కడే ఉండిపోవాలనుకొంటారు. దార్శనికత కలిగి ఉన్నవారే దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గొప్ప ధైర్యసాహసాలు, దృఢసంకల్పం, మొక్కవోని చిత్తశుద్ధి, గట్టి ఆత్మవిశ్వాసంతో పరివర్తనశీల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే- వారికి ఎలాంటి స్వార్థం ఉండదు. ఎవరిమీదో కక్ష సాధించాలన్న దుర్బుద్ధి వారి దరి చేరదు. యావత్ జనజీవన రంగాల్లో సంపూర్ణ పరివర్తన తీసుకువచ్చేందుకు; పరిశుద్ధ, పారదర్శక, నవోత్తేజ భారతదేశ పౌరులుగా దేశవాసులంతా గర్వపడేలా చూసేందుకు మోదీ తపన పడుతున్నారు, తపస్సు చేస్తున్నారు. ఆయన కృషిని దేశ ప్రజలంతా గుర్తించాల్సిన తరుణమిది.
త్రిసూత్ర విధానం
‘సంస్కరణ, కార్యాచరణ, పరివర్తన’ అనేది ప్రధానమంత్రి నినాదం, విధానం. పెద్దనోట్ల రద్దు సహా ఆయన తీసుకొస్తున్న మార్పులన్నీ అందుకు అనుగుణమైనవే. భారతదేశానికి భవ్యమైన భవిష్యత్తు కల్పించడమే సంస్కరణల అసలు ఉద్దేశం. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, భారతదేశ పరివర్తనకు ఉద్దేశించిన జాతీయ సంస్థ- (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా- నీతి ఆయోగ్) పేరుతో కొత్త వ్యవస్థకు రూపకల్పన చేయడం వంటి తొట్టతొలి నిర్ణయాలతోనే ప్రభుత్వం తన సంస్కరణాభిలాషను కళ్లకు కట్టింది. ఈ మేధో బృందం ప్రభుత్వానికి మార్గదర్శిగా వ్యవహరించడంతోపాటు విధానపరమైన సూచనలు, సలహాలు అందజేస్తోంది. స్పెక్ట్రం, బొగ్గు గనుల క్షేత్రాల వంటి సహజ వనరుల పారదర్శక వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేరాయి. ఇది మరో ప్రధానమైన చర్య. ఇదివరకటి యూపీఏ జమానాలో ఈ కేటాయింపుల్లో భారీ కుంభకోణాలు చోటు చేసుకొన్నాయి. ఇప్పుడు అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితిని ఆవిష్కరించారు. గడచిన రెండేళ్ల కాలంలో ప్రభుత్వం విచక్షణపూరిత విధానానికి పాతరేసి, పారదర్శక పద్ధతికి పట్టం కట్టింది. సహకార సమాఖ్య భావనను మోదీ గట్టిగా విశ్వసిస్తున్నారు. యావత్ భారతదేశం ఒక్క జట్టుగా, కలిసికట్టుగా ముందడుగు వేయాలని అభిలషిస్తున్నారు. విభాజ్య నిధి నుంచి రాష్ట్రాలకు 42 శాతం, స్థానిక సంస్థలకు అయిదు శాతం కేటాయించాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సును ఆయన యథాతథంగా ఆమోదించడమే ఇందుకు నిదర్శనం.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ- గురు గోవింద్‌సింగ్, భక్త వేదాంతి రామానుజాచార్యులు చూపిన సామాజిక పరివర్తన, సంస్కరణల పంథా ‘అందరికీ అనుసరణీయం, నా ప్రభుత్వానికి స్ఫూర్తిదాయకం’ అని అన్నారు. గ్రామాలు, పేదలు, రైతులు, యువత, మహిళలు, కార్మికులు-కర్షకుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకువచ్చిన జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి పథకాలు అట్టడుగు స్థాయిలో ఎంతో ప్రభావం ప్రసరించాయి. అసాధారణ స్థాయిలో కొత్తగా 26 కోట్లమందికి పైగా జన్‌ధన్ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్థికపరమైన అండాదండాలేని చిన్న వ్యాపారులకు ముద్రాయోజన ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా అందజేశారు. అందులో 70 శాతం వరకు రుణాలు మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలే తీసుకొన్నారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమం వల్ల ప్రజానీకంలో గొప్ప పరివర్తన వచ్చింది. దీని కింద ఇప్పటికే మూడు కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు తెచ్చే ఉద్దేశంతో చేపట్టిన మరో కార్యక్రమం- వంటగ్యాసు(ఎల్‌పీజీ) రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాల్సిందిగా కోరడం! ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకొన్న కుటుంబాలు ఎల్‌పీజీ సబ్సిడీని వదులుకోవాలంటూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు బ్రహ్మాండమైన ప్రతిస్పందన లభించింది. 1.2 కోట్లకు పైగా వినియోగదారులు ఎల్‌పీజీ సబ్సిడీలు స్వచ్ఛందంగా వదులుకొన్నారు. జన్‌ధన్-ఆధార్-మొబైల్ (జామ్) ద్వారా నేరుగా ఆర్థిక ప్రయోజనాలు బదిలీ చేయడాన్ని ప్రారంభించాక అక్రమాలకు అడ్డుకట్టపడి, ప్రభుత్వానికి భారీయెత్తున రూ.36,000 కోట్ల మేరకు మిగిలాయి. ఎల్‌పీజీ సబ్సిడీ సమకూర్చేందుకు ఉద్దేశించిన ‘పహల్’- ప్రపంచంలోనే అతిపెద్ద నగదు ప్రయోజన బదిలీ పథకం. ఈ పథకాన్ని అమలులోకి తేవడం ద్వారా ప్రభుత్వం గడచిన రెండేళ్లలో రూ.21,000 కోట్లు మిగుల్చుకోగలిగింది. ఛండీగఢ్, మరో ఎనిమిది జిల్లాలు కిరోసిన్ రహితమని ప్రకటించుకోవడం ఎంతో సంతోషదాయకం. 2022నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలని, అన్నదాతల ఆత్మహత్యలను నిరోధించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసమే, తక్కువ ప్రీమియంతో పంటలకు బీమా కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సాగునీటి సదుపాయాల విస్తృతికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వంటి రైతు కేంద్రక పథకాలు తెచ్చింది. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రైతులకు సులభంగా రుణాలు అందించడానికి వీలుగా నాబార్డు నిధి కోశాన్ని రెట్టింపు చేసి, రూ.41,000 కోట్లు కేటాయించింది. పప్పు ధాన్యాలకు కనీస మద్దతు ధరలు ఎనిమిది లక్షల టన్నుల మేరకు పప్పు ధాన్యాల సేకరణ వంటి చర్యల వల్ల వీటి ధరలు అదుపులోకి వచ్చాయి.
దేశంలో బాలికల జనసంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో ఆందోళన చెందిన ప్రభుత్వం, ఆ సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన మరో విప్లవాత్మక సంస్కరణ- బేటీ బచావో-బేటీ పఢావో పథకం. ఆడపిల్లల భద్రమైన భవితకు భరోసా ఇవ్వడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి సుకన్యా సమృద్ధి యోజన కింద కోటికి పైగా ఖాతాలు తెరిచి, రూ.11,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు. గర్భిణులకు ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడం మోదీ సర్కారు తీసుకొన్న మరో గణనీయ నిర్ణయం. అవినీతిని నిరోధించి, నల్లధనాన్ని వెలికితీసే ఉద్దేశంతోనే ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది. దేశాన్ని మేలుమలుపు తిప్పిన నిర్ణయమది. రూ.500, రూ.1000 నోట్ల ఉపసంహరణ దరిమిలా బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీయెత్తున డబ్బు వచ్చి చేరింది. దీంతో బ్యాంకుల వద్ద పుష్కలంగా డబ్బు ఉంటుంది. తద్వారా అవి సహజంగానే వడ్డీరేట్లు తగ్గించగలుగుతాయి. రుణాలు పెంచగలుగుతాయి. తగినంత డబ్బు అందుబాటులో ఉన్నందువల్ల, సంక్షేమ పథకాలపై వ్యయాన్ని ప్రభుత్వం పెంచగలుగుతుంది. పెద్దనోట్ల రద్దు తరవాత వృద్ధి కొంత మందగించినప్పటికీ, ఆర్థిక సర్వే సూచించిన విధంగా అది మళ్ళీ ఉవ్వెత్తున ఎగియడం తథ్యం. మొబైల్ యాప్ చెల్లింపులకు సంబంధించి భీమ్ (బీహెచ్‌ఐఎం- భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ) అద్భుత ప్రజాదరణ పొందడం ప్రస్తుత పరివర్తన అధ్యాయంలోని గొప్ప విజయగాథల్లో ఒకటి.
అన్ని వర్గాలకు ఆలంబన
ఒకే జాతి, ఒకే మార్కెట్‌కోసం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థను తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేని 18,000 గ్రామాల్లో 11,000 పల్లె సీమలను దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద విద్యుదీకరించారు. అందుబాటు ధరల్లో 20కోట్ల ఎల్‌ఈడీ బల్బులు సరఫరా చేశారు. దీనివల్ల వినియోగదారులకు రూ.10,000 కోట్ల మేరకు ఆదా అయింది. నివారించగలిగిన వ్యాధులబారిన పడకుండా బాలలను కాపాడేందుకు ప్రతి ఒక్క చిన్నారికి టీకా ఇవ్వడానికి ఇంద్రధనుష్ పథకం తీసుకొచ్చారు. యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, సాధికారత కల్పించేందుకు స్టాండప్ ఇండియా; అంకుర పరిశ్రమలకు అండదండ కల్పించేందుకు స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు చేపట్టారు. కాలం చెల్లిన 1,100 చట్టాలను ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. రానున్న కాలంలో ఇలాంటి మరో 400 చట్టాలను రద్దు చేయబోతున్నారు. కనీస పింఛనును రూ.1000కు పెంచారు. దేశాన్ని పరివర్తన పథంలోకి వేగంగా తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పట్టాలకు ఎక్కించిన మరికొన్ని పథకాలివి.
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమర్పించిన 2017-18 బడ్జెట్, ఎన్‌డీఏ ప్రభుత్వ పరివర్తన కాంక్షకే అద్దం పట్టింది. దేశంలో రాజకీయ నిధుల వ్యవస్థను ప్రక్షాళించనున్నట్లు ఆయన ప్రతిపాదించడంతో ఈ విషయంలో సుదీర్ఘ నిరీక్షణ ఫలించినట్లయింది. ఇప్పుడిక ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్కొక్కరి నుంచి గరిష్ఠంగా రూ.2000 వరకే నగదు రూపేణా విరాళం తీసుకోగలుగుతుంది. ప్రతి పార్టీ రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల బాండ్ల జారీకి వీలుగా ఆర్‌బీఐ చట్టం తేవాలన్న ప్రతిపాదనా ముఖ్యమైనదే. దేశంలో పరివర్తన తీసుకురావడం, దేశానికి నవ జవజీవాలు కల్పించడం, ప్రక్షాళన చేపట్టి పరిశుద్ధ భారతావనిని ఆవిష్కరించడం ప్రభుత్వ అజెండా. ప్రస్తుత బడ్జెట్ పూర్తిస్థాయిలో అందుకు అనుగుణంగానే ఉంది. గృహనిర్మాణ రంగానికి మౌలిక వసతుల స్థాయి కల్పించడం చాలా పెద్దచర్య. అందరికీ ఇళ్ల పథకానికి కేటాయింపును ప్రస్తుత రూ.15,000 కోట్ల నుంచి రూ.23,000 కోట్లకు పెంచారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయమన్న సంప్రదాయానికి స్వస్తి చెప్పారు. విద్యారంగ సంస్కరణలకూ శ్రీకారం చుట్టారు. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ)లో సంస్కరణలు చేపట్టనున్నారు. మంచి నాణ్యతా ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించనున్నారు. ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయన్నదాన్ని బట్టి వాటికి ర్యాంకులను కేటాయించనున్నారు.మాధ్యమిక విద్యాస్థాయి మెరుగుదల కోసం నవీకరణ నిధిని ఏర్పరచారు. ఎంతో కీలకమైన విద్యారంగంలో సంస్కరణలు తెచ్చే ఉద్దేశంతో చేపడుతున్న చర్యలివి. ఇలాంటి ప్రగతిశీల, విప్లవాత్మక చర్యల గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. ప్రతిదానికీ అడ్డుపుల్లలు వేసేవారు, యథాతథవాదులు ఎన్ని ఆటంకాలు కల్పిస్తేనేం- అన్ని రంగాల్లో సంస్కరణలకు తెరతీయడం ద్వారా నవనవోన్మేషితమైన, శుభ్రమైన-శుద్ధమైన భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న ఎన్‌డీఏ ప్రభుత్వ సంకల్పం స్థిరమైనది, దృఢమైనది, తిరుగులేనిది!
ఎం వెంకయ్య నాయుడు
కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన,
సమాచార ప్రసార శాఖల మంత్రి ,
ఈనాడు సౌజన్యం తో