Home Telugu Articles శ్రీరామం.. సదా ఆదర్శం

శ్రీరామం.. సదా ఆదర్శం

0
SHARE

– వై.రాఘవులు

తల్లిదండ్రుల మాటను తచ తప్పక పాటించడం, సోదరులను అత్యంత ఆదరంగా చూడటం, తన భార్యను అత్యంత ప్రేమించడం, తన పాలనలో ప్రజలను తన కన్న బిడ్డల్లా చూడటం, వారికి ఎటువంటి కష్టాలు లేకుండా పాలించడం; దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంతదూరమైనా వెళ్ళటం వంటి సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి; స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, పదవీ వ్యామోహం వంటి దుర్గుణాలు లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు. కానీ విలువలకు పట్టం కట్టే మన సనాతన భారతదేశంలో ఈ అన్ని గుణాలు కలిగిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. కానీ వారందరికీ ఆదర్శం నాటి శ్రీరాముడు.

ఒకానొక సందర్భంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని ‘ఈ భూమిలో ఈ క్రింది 16 లక్షణాలు లేక సద్గుణాలు కల్గిన ఆదర్శపురుషుడు ఎవరైనా ఉన్నారా?’ అని అడిగారు. ఆ 16 సద్గుణాలు ఇవి :

  1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మజ్ఞుడు, 4. కృతజ్ఞుడు, 5. సత్యాన్ని పలికేవాడు, పాటించేవాడు, 6. దృఢవ్రతుడు, 7. చరిత్రను లిఖింపగల యోధుడు, 8. సర్వప్రాణుల హితం కోరుకునేవాడు, 9. విద్వాంసుడు, 10. సమర్థుడు, 11. ఏకప్రియ దర్శగ అంటే వాస్తవాన్ని గ్రహించేవాడు, 12. ఆత్మను దర్శించేవాడు, 13. జితక్రోధ 14. ద్యుతిమాన్‌ 15. అసూయ లేనివాడు, 16. జాతి రోషస్య సంయాగే అంటే యుద్ధరంగంలో మూర్తీభవించిన ఆగ్రహం కలవాడు.

వాల్మీకి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారదుడు ‘ఉన్నాడు. అంతే కాదు మరో 67 గుణాలున్న మహానుభావుడు కూడా ఉన్నాడు. ఆయనే శ్రీరామచంద్రుడు’ అని చెప్పాడు.

రామో విగ్రహవాన్ధర్మః

అంటే ‘ధర్మం విగ్రహ రూపంలో అంటే రాముని రూపంలో ఉంది’ అని అర్థం. నాటి త్రేతా యుగంలో ఆదర్శ మానవ జీవితాన్ని గడిపి సామాన్య వ్యక్తిగా అసామాన్య ప్రజ్ఞ చూపించిన మహావ్యక్తి శ్రీరాముడు.

అంత పరాక్రమవంతుడు, ధర్మపరాయణుడు, తన రాజ్యంలో ధర్మాన్ని నాుగు పాదాల నిలబెట్టిన శ్రీరాముడు ‘రామం దశరధాత్మజం’ అంటే ‘నేను కేవలం దశరధ మహారాజు కుమారుణ్ణి’ అని చెప్పుకుంటాడు.

అందుకే స్నేహం దయాం సౌఖ్యం
యదిరాజోన కీమపి ` ఆరాధనాయ లోకస్య
మంచతే నాస్తి మేవ్యధాః

అంటే మానవజన్మలోని ముఖ్య ధర్మం లోక కల్యాణం. ధర్మాచరణలో స్నేహం, దయ, సుఖం కోరుకోరాదు. ధర్మాచరణ కోసం తాను అత్యంత ప్రేమించే తన భార్య జానకిని విడువడంలో సైతం కించిత్‌ వ్యధ చెందను అంటాడు శ్రీరాముడు. ధర్మాచరణలో అటువంటి గొప్ప సంక్పం గలవాడు. అందుకే ఆయనను రామో విగ్రహవాన్‌ ధర్మః అన్నారు పండితులు. అంటే రాముడు విగ్రహ రూపంలో ఉన్న ధర్మం వంటివాడు. అంటే ధర్మానికి రూపం అని అర్థం.

ధర్మం రాజ్యమేలిన యుగం

అది త్రేతాయుగం. ధర్మాచరణలో స్వయంగా శ్రీరాముడు తాను ఆదర్శంగా ఉండి, ఆ ఆదర్శాన్ని తన ప్రజలు, సోదరులు, తల్లిదండ్రులు, మిత్రులు, శత్రువులు, గురువులు కూడా ఆచరించేలా స్ఫూర్తిని కలిగించాడు. అటువంటి ఆదర్శవంతమైనది శ్రీరాముని చరిత్ర.

‘వజ్రాదపి ` కఠోరాణి
మృదూని ` కసుమా..’’

ధర్మాచరణలో వజ్రం వంటి కఠినత్వం, ప్రేమించడంలో పువ్వు వంటి సుకుమారత్వం ప్రదర్శించాడు శ్రీరాముడు.

మన రాజులు తాము ప్రతిజ్ఞ చేసేటప్పుడు శాస్త్రప్రకారం  ‘అదండ్యోస్మి అదండ్యోస్మి’ అన్నప్పుడు ‘ధర్మ దండోస్మి ధర్మ దండోస్మి’ అంటూ ధర్మ ధర్మదండతో కిరీటంపై తాకిస్తారు ఋషు లేక పురోహితు.

రాముని హయాంలో సాక్షాత్తూ ధర్మమే రాజ్యమేలుతోందా! అనుకునే స్థాయిలో రాజ్యపాలన ఉండేది. అటువంటి ఆదర్శ రాజ్యం  రామరాజ్యం.

ధర్మం రాజ్యమేలడమంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

రామ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తూ ఉంటుంది. ఏది జరిగినా ధర్మం ప్రకారం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరుగదు. ప్రజలందరిలో ఒకరి పట్ల ఒకరికి పరస్పర విశ్వాసం, ప్రేమ ఉంటుంది. భర్త పట్ల భార్య; అన్న పట్ల సోదరులు, ప్రజలపట్ల  రాజుకు, రాజుపట్ల ప్రజలకు, ప్రజల పట్ల గురువులకు నిష్కల్మషమైన ప్రేమ, ఆదరం ఉంటుంది. ఆ రాజ్యంలో ఎవరి ధర్మం వాళ్ళు పాలిస్తూ ఆదర్శంగా నిలిచారు. రాజ్యంలో అధర్మానికి తావే లేదు.

దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ:

అటువంటి ఆదర్శ రాజ్యంలో ఆ చక్కని వ్యవస్థను నాశనం చేయడానికి రాక్షస మూక విజృంభించింది. రావణాసురుని మాఫియాలైన వాలి, తాటకి, కరదూషణులు వంటి రాక్షసులు తమ పరివారంతో ఊళ్ళపై పడి విధ్వంసం సృష్టించేవారు. మేఘనాధుడు, కుంభకర్ణుడు, మారీచుడు వంటివాళ్ళు విజృంభించి ఋషి మునుల ఆశ్రమాలపై పడి వారి యజ్ఞ యాగాదులు విధ్వంసం చేసేవాళ్ళు. స్త్రీలను బలాత్కరించడం, ఋషులను, మునీశ్వరులను చంపి మాంసం తిని ఆ ఎముకలను కుప్పుగా పోయడం వంటి దుర్మార్గపు పనులకు పాల్పడేవారు.

ఈ రాక్షసుల దుష్ట చర్యలను చూసిన శ్రీరాముడు ‘నిశిచరహీన కరూంగా మహి’ అని శపథం చేసి యాగరక్షణకు సంకల్పించాడు. ఋషులకు మునులకు రక్షకుడిగా ఉండి, వారిలో విశ్వాసం కల్గించాడు. వనవాసులకు గిరివాసులకు భరోసా నిచ్చాడు. తన శౌర్యపరాక్రమాలతో జానకిని వివాహమాడి, పెద్ద రాజులను ఐక్య పరిచాడు. శివధనస్సును విరిచి అనేకమంది రాజులలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు.

తన వనవాస సమయంలో అధర్మపరులైన అనేకమంది రాక్షసులను నిర్మూలించాడు. ఇన్ని చేసినప్పటికీ ధర్మ స్థాపన పూర్తి కాలేదు. సాక్షాత్తూ తన భార్య సీత అపహరణకు గురైంది. అపహరించినవాడు అత్యంత పరాక్రమవంతుడు, అనంతమైన శక్తి సామర్థ్యాలున్న రావణాసురుడు. సంపూర్ణ ధర్మ రక్షణ కోసం రావణుడ్ని కూడా సంహరించాలనే క్ష్యం పెట్టుకోక తప్పలేదు శ్రీరాముడికి. ఆ క్ష్యం సాధించడం కోసం తగిన వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. వానరుల్ని ఏకం చేశాడు. అందరి సహకారంతో క్ష్యం సాధించాడు. రావణుడిని సంహరించాడు. ధర్మస్థాపన చేశాడు. ధర్మం నిలబెట్టడంలో, ఆచరించడంలోనూ ఉన్న ఆనంద అనుభూతిని మానవాళికి రుచి చూపించాడు.

మానవ ధర్మంలోకకళ్యాణం

మానవ జన్మ ‘శరీరం కొరకు జీవించడం కాదు సమాజ కళ్యాణం కోసం జీవించాలి, అలాగే ఈ శరీరం ధర్మకార్యసాధనకు ఉపయోగపడే ఒక సాధనం. దానిని అలాగే చూడాలి’ అని చెప్పి ఆచరించి చూపాడు.

శ్రీరాముడు తన సంకల్పానికి పితృవాక్య పరిపాన కూడా తోడై అంతఃపురం వదలి అరణ్యంలో ప్రవేశించాడు. నారబట్టలు కట్టుకున్నాడు. రాజకుమారుడు అయి ఉండీ పర్ణ కుటీరంలో గడిపాడు. రాజాంతఃపురంలో రోజూ పంచభక్ష్య పరమాన్నాలు తినేవాడు అడవిలో ఆకులు పండ్లు తిని ఉండడం అలవాటు చేసుకున్నాడు. రాజభవనంలో పట్టు పరుపులపై పవళించేవాడు అడవిలో నేలపై పడుకున్నాడు. బంగారు కిరీటం ధరించినవాడు తల వెంట్రుకనే జటాజూటంగా (కిరీటంగా) మలచుకున్నాడు. అతి సామాన్యుడిగా జీవితం గడిపాడు. ధర్మస్థాపన లక్ష్యం సాధించాడు. ఏదైనా లక్ష్యం సాధించాంటే నిరాడంబర జీవితం అవసరం అని సందేశం ఇచ్చాడు.

తన లక్ష్య సాధన కోసం తనకు ఉపయోగపడగల అనేక మందిని కలిశాడు. వాళ్లందరితో సంత్సంబంధాలు నెరపాడు. ఋషి మునుల ఆశీర్వాదం పొందాడు.

అగస్త్య మహర్షిని సేవించి ఆదిత్య హృదయం మహా మంత్రాన్ని పొందాడు. ఇది రావణుని శక్తిని నిర్వీర్యం చేయటానికి ఉపయోగ పడింది. భరద్వాజుణ్ణి సేవించి తపోమయ అస్త్రశస్త్రాలు సంపాదించాడు. సుగ్రీవునితో స్నేహం చేసి లక్షల సంఖ్యలో శక్తివంతమైన వానరసేనను సమకూర్చుకున్నాడు. నీలుడు, నలుడి సహాయంతో సేతునిర్మాణం చేసి, తన ససైన్యంతో లంక చేరాడు. అక్కడ యుద్ధంలో విజయం సాధించాడు.

ధర్మంఆచరణఆదర్శం

రావణ సంహారం అనంతరం శ్రీరాముడు రావణుని తమ్ముడు, సద్గుణ సంపన్నుడైన విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. ‘మరణాంతాని వైరాణి’ అంటే ‘మరణంతో శతృత్వం సమాప్తమైంది’ అని చెప్పి రావణుని మృత దేహానికి జరగవఈసిన అన్ని కర్మఈను అతని తమ్ముడైన విభీషణునితో చేయించాడు.

వాలిని చంపి కిష్కింధ గెలిచినా, రావణుని చంపి లంకను గెలిచినా అక్కడి వారసులకే రాజ్యాన్ని అప్పగించి ధర్మాచరణలో వారికి ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు.

తనను అరణ్యానికి పంపిన కైకేయిని గాని, మంథరనుగాని నిదించలేదు సరికదా! వాళ్ళను జాగ్రత్తగా చూసుకొమ్మని సోదరులైన భరత శతృఘ్నులను ఆదేశించాడు. భరతునికి రాజనీతి బోధించాడు.

‘అయోధ్య అయినా, అరణ్యమైనా మానవ జీవితంలో ఆచరించ వలసిన ధర్మాలు సమానమే’ అని చెప్పాడు. అందుకే అడవిలో శబరిని అనుగ్రహించాడు, గుహుణ్ని ఆలింగనం చేసుకున్నాడు,  జటాయువుకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. వానరుల చంచల బుద్ధికి అడ్డుకట్ట వేసి సమాజ కల్యాణానికి ఉపయోగించేలా మలచాడు. వీరుడు, సద్గుణ సంపన్నుడైన హనుమని అడుగడుగునా ప్రేమించాడు. ప్రేమ మానవునికి లభించిన గొప్ప వరం అని, అది ఎంతో విశాలమైందని నిరూపించాడు.

అనుశాసనం అందరూ సమానం

శ్రీరాముడు అనుశాసనం విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. చట్టం విషయంలో అందరూ సమానం అని చెప్పి, ఆచరించి చూపాడు. అనుశాసనం అంటే తను చేసిన శాసనాన్ని తన విషయంలో సైతం పాటించడం. అది లక్ష్మణుడి విషయంలో ఋజువైంది. యుద్ధ సమయంలో మూర్ఛపోయిన లక్ష్మణుని చూసి ‘ఈ ప్రపంచంలో అందరికీ సోదరుడు లభించడు. అందులోనూ తన కష్టాలను పంచుకునే లక్ష్మణుని వంటి సోదరుడు తనకు లభించడం తన అదృష్టం. అటువంటి నా సోదరునికి ఇంతటి కష్టం రావడం నేను తట్టుకోలేకపోతున్నాను’ ఎంతో దుఃఖించాడు శ్రీరాముడు. లక్ష్మణుని పట్ల అంతటి ప్రేమ గల శ్రీరాముడు తన పట్టాభిషేకం తరువాత జరిగిన ఒక అరుదైన సంఘటనలో లక్ష్మణునికి సైతం మరణ దండన విధించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. శ్రీరాముని పట్టాభిషేకం తరువాత అనేక సంవత్సరాలకు అంటే త్రేతాయుగ అంతంలో ఒకసారి కలి పురుషుడు శ్రీరాముని కలిశాడు. ఏకాంతంగా మాట్లాడాలని కోరతాడు. ఆమోదించిన శ్రీరాముడు కలితో ఏకాంతంగా మాట్లాడుతున్న ఆ గదిలోకి ఎవరినీ రానీయరాదని చెప్పి, ఆ పని లక్ష్మణునికి అప్పగించాడు. ఒకవేళ ఆ ఆజ్ఞను ఉల్లంఘిస్తే.. అంటే ఎవరినైనా లోనికి రానిస్తే మరణశిక్ష ఉంటుందని  లక్ష్మణునికి హెచ్చరించాడు. అయితే అదే సమయంలో దూర్వాస మహాముని వచ్చాడు. తాను శ్రీరాముని వెంటనే కలుసుకోవాని డిమాండ్ చేశాడు. అడ్డగించిన లక్ష్మణునితో దూర్వాసుడు ‘తనను అడ్డగిస్తే ఇక్ష్వాకు వంశం నాశనమయ్యేలా శాపం ఇస్తానంటూ ఆగ్రహించాడు. చేసేది లేక లక్ష్మణుడు దూర్వాసుని రామదర్శనానికి అనుమతించాడు. అంతే ఆజ్ఞ ఉ్లంఘించినందున శ్రీరాముడు లక్ష్మణునికి మరణదండన విధించాడు. సరయూ నదిలో లక్ష్మణుడు ప్రాణత్యాగం చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకే శ్రీరాముడు సైతం పుణ్య లోకాలకు వెళ్ళిపోయాడు.

వ్యామోహంకళంకం

కాంత, కీర్తి, కనకం.. అంటే స్త్రీ వ్యామోహం, పదవీ వ్యామోహం, ధనవ్యామోహం. ఈ మూడు మానవ జీవితానికి, మానవ ధర్మానికి కళంకం తెస్తాయని, వాటికి దూరంగా ఉండాలని చెప్పి, అచరించి చూపాడు.

బంగారుమయమైన లంక తన చేతికి దొరికినా దానిని తృణప్రాయంగా వదిలివేశాడు.

‘అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని లక్ష్మణునితో చెప్పి ధన వ్యామోహం నుంచి దూరంగా ఎలా ఉండాలో చెప్పాడు.

తన వనవాస సమయంలో 13 సంవత్సరా పాటు తన భార్య  జానకి తన వెంట ఉన్నప్పటికీ ముని వృత్తినే అవలంబించాడు. శూర్పణఖ అతి సుందరి రూపంతో వచ్చినా లొంగకుండా ఇంద్రియ నిగ్రహాన్ని చూపించి స్త్రీ వ్యామోహానికి దూరంగా ఎలా ఉండాలో చెప్పాడు. అయోధ్యను భరతునికి, కిష్కింధను సుగ్రీవునికి, లంకను విభీషణునికి అప్పగించి పదవీ వ్యామోహానికి దూరంగా ఉన్నాడు.

శ్రీ రాముని ఈ సద్గుణాలు నాటికి నేటికి మానవ సమాజానికి మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి.

శ్రీరామనవమి సందేశం

నాయకులను తయారుచేసేవాడే నిజమైన నాయకుడు. అనుచరులను తయారుచేసేవాడు వ్యాపారి మాత్రమే అవుతాడు. నాయకుడు కాదు.

“శరీరస్య గుణానాం , దూరమత్యంత మంతరం
శరీరం క్షణవిధ్యంసి, కల్పాంతస్థాయినో గుణాః”

శరీరానికి, గుణానికి చాలా భేదమున్నది. శరీరం ఏక్షణంలోనైనా పతనమౌతుంది. (తేలు కుడితే, దోమ కుడితే, అత్యంత సూక్ష్మక్రిమి దాడి చేస్తే నశించేది శరీరం). కాని సృష్టి చివరి వరకు నిలిచి ఉండేది వ్యక్తి గుణం మాత్రమే.

శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, వివేకానందుల శరీరాలు నేడు లేవు. కాని వారి గుణాలు శాశ్వతం అయ్యాయి. అందుకే శరీరం కోసం జీవించడం కాదు. లోకకళ్యాణం కోసం ఈ జీవితాన్ని అర్పించాలి. ఈ శరీరాన్ని ఉపయోగించి లోకకల్యాణ కారకమైన సద్గుణాలను సంపాదించుకోవాలి. మనం విగ్రహారాధకులం మాత్రమే కాదు, గుణారాధకులం. ఆ మహాపురుషుల విగ్రహాలు పెట్టుకున్న మనం వారి గుణాలనూ స్మరించాలి. అటువంటి ఆదర్శ జీవితం గడపాలని శ్రీరామనవమి మనకు గుర్తు చేస్తున్నది.

 This article was first published in 2020