Home Rashtriya Swayamsevak Sangh ప్రపంచానికి దారి చూపగలిగేది భారత్ మాత్రమే – డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ,...

ప్రపంచానికి దారి చూపగలిగేది భారత్ మాత్రమే – డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, ఆర్.ఎస్.ఎస్

0
SHARE

కరోనా సంక్షోభంతో భూభ్రమణం తప్ప మిగిలినవన్నీ ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. రైళ్లు, విమానాలు నడవడం లేదు. వాహనాల రాకపోకలు దాదాపుగా లేదు. దీనితో భూమి, ప్రకృతి కాస్త ఊపిరి  పీల్చుకోగలుగుతున్నాయి.

లాక్ డౌన్ కాలంలో వాతావరణ కాలుష్యం చాలామటుకు తగ్గిపోయింది. నదుల్లో నీళ్ళు స్వచ్ఛంగా మారాయి. జంతువులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగాయి. గాలి ఎంత శుభ్రపడిందంటే పంజాబ్ లోని జలంధర్ నుంచి హిమాలయాలు కూడా కనిపిస్తున్నాయి.

తాత్కాలికమే అయినా అసంభవమనుకున్నది అంతా ఈ కాలంలో జరిగింది. జీవన వేగం పెరిగితే ఏమవుతుంది అనేది తెలియాలంటే జీవనం పూర్తిగా స్థంభిస్తే ఏమవుతుందో తెలియాలి. శ్రీ ఎస్. కె చక్రవర్తి “Rising Technology and failing ethics” అనే తన వ్యాసంలో ఇలా వ్రాసారు :

“మనుష్య జాతి ఈ భూమి, ప్రకృతిలతో భావనాత్మక సంబంధాన్ని తెంచుకోవడం మొదలు పెట్టినప్పుడే ఆధునిక విజ్ఞానం, సాంకేతికపరిజ్ఞానాల వికాసం జరిగింది. ఈ సంబంధాన్ని నిలబెట్టి, బలపరచే గుణాలు, ఆచారవ్యవహారాలు, ప్రాచీన పద్దతులను వెనుకబడినతనం, మూఢవిశ్వాసాలు అంటూ కొట్టిపారేయడం వినియోగవాదం పెరిగిపోవడం వల్ల మనకు అలవాటయింది. భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం, జాగ్రత్త పడకపోవడం ప్రగతిశీలత, అభివృద్దిగా భావించాం. కానీ నిజానికి ఇదే ప్రమాదకర లక్షణం. దేని పట్లా శ్రద్ధ, నిష్ట లేకపోవడం సుగుణమా, దుర్గుణమా?

ప్రకృతి పట్ల మన వ్యవహారం ఎలా ఉండాలన్న నియమనిబంధనలు క్రమంగా సమసిపోవడమే మన ఈ నిర్లక్ష్యానికి, అశ్రద్ధకు సూచన. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మూలంగా భౌతికమైన సదుపాయాలు పెరిగిన మాట వాస్తవమే అయినా ప్రకృతితో మన సంబంధం దెబ్బతిన్నదన్న మాట కూడా అంతే నిజం. దీని వల్లనే మనం ప్రకృతి నుంచి బాగా దూరమయ్యాము.

“మనిషి, ప్రకృతి మధ్య ఏర్పడిన ఈ అంతరం పర్యావరణ కాలుష్యానికి ముఖ్య కారణమయింది. అంతేకాదు ఈ నిర్లక్ష్య భావన సమాజంలోని వివిధ రంగాలను కూడా ప్రభావితం చేసింది. దేశాల మధ్య, సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం, పరస్పర విశ్వాసం సన్నగిల్లాయి. అందుకనే అంతర్జాతీయ సమావేశాల్లో నిర్మొహమాటమైన చర్చ, నిర్ణయాలు తీసుకోవడం, వాటికి కట్టుబడి ఉండడం వంటివి కనిపించదు. ఆ సమావేశాలను రహస్యమైన రాజకీయ ప్రయోజనాలు, ఇతర స్వార్ధాలు ప్రభావితం చేస్తున్నాయి. ఎవరికివారు తామే ముందుండాలనే పోటీ పడుతుంటారు. దీనివల్ల నైతికత, నైతిక విలువల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోంది. ‘’

“యాంత్రీకరణ మూలంగా మనిషి క్రమ క్రమంగా మానవత్వానికి దూరమై పోతున్నాడు”.

ఈ ధోరణి వల్ల మనిషి ప్రకృతి నుంచేకాదు, సమాజం నుంచి, ఆఖరుకు సాటివారి నుంచి కూడా వేరైపోతున్నాడు. మొండివాడుగా, క్రూరంగా, హింసాత్మకంగా మారిపోతున్నాడు. ఇలాంటి ధోరణి కలిగిన సమాజాన్నే నేడు `అభివృద్ధి చెందిన, ఆధునిక’మైనదిగా పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి `ప్రగతిశీల, అభివృద్ధి చెందిన’ సమాజాల అపరిపక్వ జ్ఞానం, జీవనం ఆధారంగా ఏర్పడిన ఆలోచనలు, అభిప్రాయాలూ లోపభూయిష్టంగానే ఉంటాయని అర్ధమవుతోంది.

అవసరం లేని, ప్రమాదకరమైన వేగాన్ని జీవితంలో పెంచుకోవడం వల్ల ఇదంతా జరిగింది.

ఇప్పుడు ఆ వేగం తగ్గడంతో నదుల్లో నీళ్ళు శుభ్రంగా మారాయి, గాలి స్వచ్ఛంగా ఉంది, కుటుంబంతో కలిసి ఉండే సమయం పెరిగింది, మానవ సంబంధాలు మరింత గట్టిపడ్డాయన్న సంగతి అందరూ గుర్తిస్తున్నారు. ఎంత తక్కువ వస్తువులతో, వనరులతో ఆనందంగా జీవించవచ్చన్నది అర్ధమవుతోంది.

భారతీయ తత్వచింతనను గుర్తుచేసే `when you cannot go outside, go inside’ `బయటకు వెళ్లలేనప్పుడు, లోపలకు ప్రయాణించు’ అనే సూక్తి ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇలా లోపలకు ప్రయాణించే, చూసుకునే ప్రయత్నం మళ్ళీ ప్రారంభమయింది.

కానీ ఇకముందు ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించి పోయాయి. ఉద్యోగులకు బాకీపడిన వేతనాలు ఇవ్వాలి. అప్పులు తీర్చాలి. అనేకమంది నగరాలు వదిలిపెట్టి తమతమ గ్రామాలకు తరలిపోయారు. కొందరు అటు ఇటు వెళ్లలేక మధ్యలోనే ఉండిపోయారు. అలాంటివారిని ఇళ్లకు చేర్చే పని చేపట్టింది ప్రభుత్వం. బిల్లీ లిమ్ అనే రచయిత తన `dare to fail’ అనే పుస్తకంలో ఒక మంచి మాట వ్రాశాడు. `మనం ఏదైనా సమస్యను ఎదుర్కొనడానికి సిద్ధపడుతూ, మనల్ని మనం దానినుంచి దూరంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే, అప్పుడు అది పరిస్థితి అవుతుంది. అదే సమస్యను విశ్లేషించాలని చూస్తే అప్పుడది సవాలు అవుతుంది. కానీ ఆ సవాలును ఎదుర్కొనేందుకు మన దగ్గర ఏ వనరులు ఉన్నాయని ఆలోచిస్తే అప్పుడు అదే సమస్య అవకాశంగా మారుతుంది’ అని బిల్లీ అంటాడు. (When you face a problem and take yourself away from it, it becomes a situation. When you are to analyse it, it becomes a challenge. And when you think of your resources to meet the challenge, it becomes an opportunity – Billy Lim)

ప్రాచీన భారతీయ విద్యా విధానంలో కొత్తగా ఆలోచించడం, ప్రశ్నించడం అనేవి విశేషంగా కనిపిస్తాయి. వీటివల్ల ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు వెతికే లక్షణం అలవడుతుంది. జీవితంలో ఎలా నేర్చుకోవాలన్నది (Teaching how to learn) గురువు నేర్పితే ఎలా జీవించాలన్నది స్వానుభవంతో నేర్చుకునేవారు. కానీ నేడు డబ్బు సంపాదనకు మాత్రమే ఉపయోగపడే చదువులే చెపుతున్నారు. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు కావాలని కోరే వినియోగవాద, స్వార్ధపూరిత ధోరణి కలిగిన వారు తయారవుతున్నారు.

అభివృద్ధి అంటే నగరాలు అనే ధోరణి పెరగడం వల్ల, అన్నింటికీ నగరమే కేంద్ర కావడం వల్ల విద్య, ఉపాధి, వైద్యం మొదలైన అన్నీ సదుపాయాలకు నగరాలకే రావలసి వస్తోంది. దీని మూలంగా గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి నగరాలకు, నగరాల నుంచి మహా నగరాలకు, మహా నగరాల నుంచి విదేశాలకు వెళ్లాలనే ఆతృత, ఆసక్తి పెరిగిపోతున్నాయి. అందుకనే గ్రామాలు ఖాళీ అవుతున్నాయి, నగరాలు నిండిపోతున్నాయి. నగరాల్లో సౌకర్యాలు, సదుపాయాలు ఎక్కువ ఉన్నా నిరంతర పరుగు మూలంగా ఇక్కడ జీవనం మౌలిక విలువలకు దూరమైపోయి డొల్లగా మారుతోంది. కానీ ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదు.

అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలపై బలవంతంగా రుద్దిన వైశ్వికరణ (Globalisation) విధానపు దుష్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ దేశాలను ఆక్రమించుకోవడానికి (colonization), వనరులు వాడుకోవడానికి కొన్ని దేశాలు అనుసరించిన కొత్త మార్గమే ఈ వైశ్వికరణ అని ప్రపంచం తెలుసుకుంటోంది. ఈ ఊబి నుంచి బయటపడేందుకు అంతా మార్గం వెతుకుతున్నారు.  ఈ అన్వేషణ మూలంగానే ప్రస్తుతం ప్రపంచమంతా స్తబ్దంగా ఉంది. ఆలోచనలో ఉంది. సందేహంలో ఉంది. ప్రపంచపు ఈ సందేహాన్ని, అన్వేషణను భారత్ తీర్చగలదా అన్నదే ప్రశ్న.

భారత్ కు అలాంటి సామర్ధ్యం ఉన్నదనేదే ఆ ప్రశ్నకు సమాధానం. ఆ పని భారత్ చేయగలదు. సరిగ్గా చెప్పాలంటే భారత్ మాత్రమే చేయగలదు. ఎందుకంటే ఆ పని సాధించడానికి అవసరమైన మూడు విషయాలు భారత్ దగ్గరే ఉన్నాయి. మొదటిది, కనీసం 10 వేల సంవత్సరాల సామాజిక, జాతీయ జీవనానికి సంబంధించిన అపారమైన అనుభవం. రెండవది, ఈ సృష్టి పట్ల ఆధ్యాత్మికత ఆధారంగా ఏర్పడిన సర్వతోముఖమైన చింతన. మూడు, అటువంటి ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవన అనుభవం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచం చిన్నదైనా మత, జాతిపరమైన, భాషాపరమైన తేడాల మధ్య కలిసి జీవన సాగించాలంటే భిన్నత్వంలో ఏకత్వం చూడగలిగే దృష్టి, మితిమీరని వినియోగవాదం వంటివి చాలా అవసరం. ఇవన్నీ భారత్ కు తెలుసు. సంపద, సమృద్ధి శిఖరాలను భారత్ ఎప్పుడో సాధించింది. 18వ శతాబ్దం వరకు ప్రపంచ వ్యాపారంలో భారత్ వాటాయే అత్యధికం.

వ్యాపారం కోసం భారతీయులు ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్ళేవారని చరిత్ర చెపుతోంది. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఏకాత్మ దృష్టి మూలంగా `వసుధైవ కుటుంబకం’ అనే ఆలోచన కలిగి ఎక్కడ తమ సొంత సామ్రాజ్యాలు ఏర్పాటుచేసుకోవాలని ప్రయత్నించలేదు.  ఏ దేశ ప్రజానీకాన్ని పీడించలేదు, బానిసల్ని చేయలేదు. పైగా ఆయా దేశాల్లో ఉన్నత సంస్కృతిక విలువలు, వాటి ఆధారంగా జీవించే పద్దతిని అలవాటు చేశారు. వారిని కూడా సంపన్నులను చేశారు.

అందువల్ల ప్రపంచానికి దారిచూపడానికి తగిన దృష్టి (vision), సమర్ధత (expertise), అనుభవం(experience) భారత్ దగ్గరే ఉన్నాయి.