Home Telugu Articles కవిగా చెలామణీ అవుతున్న నక్సలైటు వరవరరావును విడుదల చేయాలా?

కవిగా చెలామణీ అవుతున్న నక్సలైటు వరవరరావును విడుదల చేయాలా?

0
SHARE

– శాన్ కశ్యప్

వరవరరావు కేవలం కవి మాత్రమే కాదు. కవి ముసుగులో ఉన్న మావోయిస్టు సిద్ధాంత కర్త. మరి అలాంటి వరవరరావు ను జైలు నుంచి విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్న వారికి, కుహనా మేధావులకు వరవరరావు అంటే అంత ప్రేమ ఎందుకో?

17 నవంబర్ ,2018 న భీమా కోరేగావ్ హింసాత్మక సంఘటనలకు సంబంధించి పుణె పోలీసులు వరవరరావును హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో  అరెస్ట్  చేసినప్పటి నుండి లెఫ్ట్ మీడియా అతన్ని  ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త అంటూ మరింతగా ఆకాశానికెత్తేయడం మొదలుపెట్టింది.  భారత దేశానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం తగదని  దశాబ్దాల పాటు బహిరంగంగానే ప్రకటించిన వరవరరావును   మావోయిస్టు కవిగా పేర్కొనటం మరిచి పోయారు  కొందరు రచయితలు, ఎడిటర్లు.
రీడిఫ్ కు చెందిన సందేశ్ ప్రభుదేశి కి  ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వరవరరావు  ” నక్సల్బరీ పోరాటం  పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తిరస్కరిస్తూ సాయుధ పోరాటానికి బాటలు వేస్తూ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ( మావోయిస్టు – లెనినిస్ట్)  CPIML ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఉద్యమం బలహీన పడిందా అనే విషయంలో స్పందిస్తూ వరవరరావు 90 వ దశకం తో పోలిస్తే ఉద్యమం  బలంగా ఉందనీ, ప్రస్తుతం దండకారణ్యం, ఉత్తర తెలంగాణాల్లో  గెరిల్లా జోన్ ల ఏర్పాటుతో మరింత బలంగా తయారైందనీ చెప్పారు. దండకారణ్యం ప్రాంతం మావోయిస్టు ఉద్యమానికి, ప్రజా సైన్యం ఏర్పాటుకు   ప్రధాన స్థావరంగా  ఉందనీ ఒక్కో దళంలో రెండు వందల మంది ఎర్ర  సిపాయిల తో  విస్తరిస్తూ ఉంటే ఉద్యమం ఎలా  కనుమరుగు అవుతుందని ఆయన  ప్రశ్నించారు. ఈ మాటలను బట్టి ఆయనకి ఈ దేశ రాజ్యాంగం పట్ల ఎంతటి అవిధేయత ఉందో అర్థమవుతుంది.

ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక మాటలు మాట్లాడటం వరవరరావుకిదేమి   కొత్త కాదు. 1970 లో జైలుకు వెళ్లి వచ్చిన సందర్భంలో, అలాగే రామ్ నగర్ కుట్ర కేసులో 1980 లో జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇదే రకమైన రాజ్య వ్యతిరేక పనులే చేశారు. అయితే 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2003 లో సరైన సాక్ష్యాలు లేని కారణంగా విడుదలయ్యారు. తిరిగి యూ పీ ఏ  మొదటి సారి  పాలన చేపట్టినప్పుడు కూడా 2005 లో  జైలుకు పంప బడ్డారు. వారి సుదీర్ఘ జైలు జీవిత రికార్డుల  చరిత్ర మరింకెవరికీ లేనంత   ఘనంగానే ఉంది. హింసా మార్గాన్ని దశాబ్దాల పాటు బహిరంగంగానే  ప్రచారం చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఆయన ఆగడాలను చూసిచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చింది.  ఘనత వహించిన పత్రికలు,  పేరొందిన మీడియా సంస్థలు వరవరరావు ను  కేవలం కవి గానే పేర్కొంటూ వస్తున్నాయి. మావో జెడాంగ్ , జోసెఫ్ స్టాలిన్, అయతుల్లా ఖోమేని, గడాఫీ లాంటి వారు కవిత్వం వ్రాసినా   వాళ్ళు పాల్పడిన  దారుణ మారణకాండలను ప్రపంచం మరచిపోలేదు.

విడుదల విజ్ఞప్తి వెనుక రాజకీయాలు , ప్రచారం

వరవరరావు మద్దతు దారులు, సానుభూతి పరులు అతడు ఒక కవి అనీ, పైగా 80 సంవత్సరాల వయసు మీద పడ్డ సీనియర్  పౌరుడనీ, కాబట్టి అతడిని జైలు నుండి విడుదల చేయాలని వాదనలు తెరపైకి తెస్తున్నారు. అయితే మూడు అంశాల ప్రకారం ఈ వాదనలు నిలబడవు.  మొదటగా ఒక వ్యక్తికి  వయసును బట్టి అతను నేరం చేశాడా, లేదా అన్నది నిర్ణయం కాదు. వయస్సు పెద్దది కాబట్టి క్షమించేయాలని ఎక్కడా లేదు.  2015 నాటి భారతీయ జైళ్ల శాఖ లెక్కల  ప్రకారం దేశం లోని జైళ్లలో  శిక్ష  అనుభవిస్తున్న మొత్తం 1, 34, 168   ఖైదీలలో 50 సంవత్సరాల పైబడిన వారు 24,035 ( 17.9%)మంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఉంటుంది.
ఒకవేళ కోవిడ్-19 వల్ల వరవరరావు ప్రాణానికి పెద్ద వయసు కారణంగా   ముప్పు పొంచి ఉంటే  అతనితో బాటే సుమారు  మరో 25, 000 మంది ఖైదీల ప్రాణాలకూ అంతే ముప్పు ఉంటుంది కదా? అలాంటప్పుడు వరవరరావుతోపాటు  జైళ్లలో ఉన్న 50 సంవత్సరాల వయసు పైబడిన పెద్దలందరినీ విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు ఎందుకు కోరట్లేదు? ఎందుకంటే ఆ  25,000 మంది ఖైదీలు వీరి లెక్క ప్రకారం  మేధావులూ, కార్యకర్త లు కాదు. కానీ వరవరరావు మాత్రం నక్సల్బరి మావోయిస్ట్ ల కీర్తి కిరీటంలో కలికితురాయి.  వారి ఉద్యమ వ్యాప్తికి పనికివచ్చే ప్రచార కర్త .

రెండవ అంశం, వరవరరావు అనారోగ్యానికి  గురైతే  ఇతర ఖైదీల లాగానే  చట్ట ప్రకారం వైద్య సదుపాయాలకు అర్హుడే. వరవరరావు భార్య  హేమలతారావు ,కుమార్తె భావనలు వరవరరావుకు సరైన వైద్యం చేయడం లేదనీ, అతడిని  “జైలులో నే  చంపవద్దని” అంటున్నారు.  ఇది మరో కమ్యూనిస్టు మార్కు  ప్రచారం.  నాజీల కాలంలో గోబెల్స్ ప్రచారం నుండి నేర్చుకున్న క్షుద్ర విద్యే ఇది.  వరవరరావుకు సరైన వైద్యం అందడం లేదనే  ఆరోపణపై వేరు వేరు సందర్భాల్లో వివరణ ఇస్తూ ముంబై లోని జే జే  హాస్పిటల్ డీన్  రంజిత్ మంకేశ్వర్ అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇటీవల వరవరరావుకు కరోనా సోకిందనే వాదనకు వస్తే అంత పెద్ద నేరచరిత్ర ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి ఆ కారణం సరిపోతుందా అన్నది ప్రశ్న.  దేశ వ్యాప్తంగా జైళ్లలో ఉన్న లక్షలాది మంది ఖైదీల కన్నా ఆయన ఏరకంగా ప్రత్యేకం? కేవలం అతడి ఒక్కడి  పైనే అంత శ్రద్ద ఎందుకు పెట్టాలి ?  మరే ఇతర ఖైదీలకు లేని  రాజకీయ మద్దతు వరవరరావుకు ఉందని దీనినిబట్టి అర్ధమవుతుంది.  ఒకవేళ వరవరరావును రాజకీయ ఖైదీగా పరిగణిస్తూ ప్రత్యేక శ్రద్ద చూపాలనుకుంటే అప్పుడు ఆయన సాగించే నక్సల్ రాజకీయాలను, వాటివల్ల ప్రజాస్వామ్యానికి ఏర్పడే ముప్పును కూడా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది,.

చివరగా, వరవరవు ఎవరు అని కాకుండా వరవరరావు ఏ కారణాల కోసం పనిచేస్తున్నాడు అనే విషయం గుర్తించాలి.

నిరుడు తూత్తుకుడి సంఘటనలో  కాల్పుల అనంతరం ఒక ఇంటర్వ్యూ లో వరవరరావు CPI( ML) నేతృత్వంలో  దండకారణ్యంలో జనతా సర్కార్ , జార్ఖండ్, ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ ప్రత్యేక ఎర్ర గెరిల్లా జోన్ లో ప్రాదేశిక తిరుగుబాటు కౌన్సిల్  వంటి సంస్థలు, ఇటువంటి సాయుధ తిరుగుబాటు ప్రయత్నాలు,  పడమర కనుమల్లోని జంగల్ మహల్ సంఘటన,1966-69 కాలంలో మూడు రాష్ట్రాల సరిహద్దు వద్ద జరిగిన పోరాటాలను ఆయన ఉటంకించారు. దీనినిబట్టి నక్సలైట్ హింసాయుత పోరాటాలకు ఈయనే వ్యూహకర్తని మనకు అర్థమవుతున్నది.

వరవరరావు కు,  హింసాయుత నక్సల్ ఉద్యమానికి ఉన్న  సంబంధం ప్రక్కనపెట్టి ఆయనను కేవలం కవిగానే చూడాలని చెప్పి ఆయన విడుదలకు పట్టుబడుతున్న ప్రజా సంస్థలకు ఈ విషయాలు  తెలియవా? వరవరరావు మద్దతుదారులు ,సానుభూతి పరులు ఇప్పుడు ముసుగుల్లోంచి బయటకు వచ్చి భారత ప్రజాస్వామ్యం, చట్టం, పోలీస్, సైనిక బలగాల పట్ల   వరవరరావు  ఆచరిస్తున్న విధానాలు  సరైనవో కావో   తమ వైఖరి స్పష్టం చేయాలి. అంతే కాకుండా వరవరరావు ప్రభోదిస్తున్న సాయుధ తిరుగుబాటు ద్వారా ఏర్పాటు చేయాలనుకునే జనతా సర్కార్ సిద్దాంతం పట్ల తమ వైఖరి తేటతెల్లం చేయాలి. మానవీయ కోణం ముసుగులో తమ  ఉద్దేశ్యాలను ఇంకెంతో వాళ్ళు కాలం దాచలేరు. వారు చెపుతున్న ‘ మానవ హక్కులు ‘ కేవలం  వరవరరావుకు మాత్రమే వర్తిస్తాయా లేక ఆయన ప్రచారం చేస్తున్న సాయుధ పోరాటం కారణంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు,  ఇన్ఫార్మర్ ల పేరిట చంపబడ్డ అమాయక గిరిజనులకు కూడా వర్తిస్తాయో లేదో బహిరంగంగా ప్రకటించాలి .

వరవరరావు ను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదు. భారత రాజ్యాంగం పట్ల అతనికి విశ్వాసం ,విధేయత లేకున్నా ఇతర భారతీయ పౌరులందరికీ ఉన్న ప్రాథమిక హక్కులు అతడికీ ఉంటాయి . వరవరరావుకు ఇతర ఖైదీలందరికీ అందించినట్టే వైద్య సదుపాయాలు  కల్పించాల్సిందే. అలాగే ఇతర  ఖైదీలు తాము చేసిన నేరాలకు జైలులో ఉన్నట్టే అతన్ని కూడా జైలుకే పరిమితం చేయాలి. విపరీత హింసను ప్రేరేపించే మావోయిస్టు సిద్దాంతం మినహా అతని విషయం ఏ రకంగానూ   ప్రత్యేకమైంది కాదు, కాకూడదు.

(రచయిత ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ పరిశోధనా విద్యార్థి)

Source: Organiser