Home Telugu Articles హిందూ జాగృతికి భక్తి బాట వేసిన గోస్వామి తులసీదాస్

హిందూ జాగృతికి భక్తి బాట వేసిన గోస్వామి తులసీదాస్

0
SHARE

–చంద్రమౌళి కల్యాణ చక్రవర్తి 

ఒక తుఫాను రాత్రి… నిండు గంగానదిని ఈది తన భార్యను కలవటానికి వెళ్ళాడు ఒక యువకుడు. ” ఈ దేహం మీద ఉన్న భక్తి, రక్తి ఆ రాముడి మీద చూపరాదా ” అని నచ్చ చెప్పింది భార్య. అంతే ఆ ఒక్క మాట ప్రపంచానికి ఒక అజరామరమైన సాహిత్య సంపదనూ. ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది. ఆ యువకుడే మహర్షి, దైవాంశసంభూతుడు, మహాభక్తుడు, వాల్మీకి అవతార అంశగా పేరుపొందిన గోస్వామి తులసీదాస్.
తులసీదాసు తండ్రి ఆత్మారాముడు, తల్లి హులసీ. తులసీదాసు జన్మించినప్పుడు అయిదు సంవత్సరాల బాలకుడివలే కనిపించాడట. తల్లితండ్రులాతని విలక్షణ రూపానికి భయపడి తమ యింటిదాసి మునియాకు పెంచుకొనడానికి ఇచ్చారు.  తరువాత కొద్దికాలానికి ఆతనిని పెంచుకొన్న మునియాదాసి కూడా చనిపోయింది. అపుడు బాబా నరహరిదాసు అనే సాధువు ఆ అనాథబాలుడైన తులసీదాసుని పెంచి విద్యనేర్పారు. తరువాత శేషసనాతనుడనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు వేద, వేదాంగాలు అభ్యసించాడు. తులసీదాసు అనాథబాలుడైనా ఆతని రూప, గుణ, శీల, స్వభావ, విద్వత్తులకు ముగ్ధుడై ఒక కులీన బ్రాహ్మణడతనికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. తన భార్యయైన రత్నావళి అంటే ఎంతో ప్రేమ చూపించేవాడు.  అయితే ఒకసారి ఆయన ఇంట్లో లేనప్పుడు  రత్నావళి పుట్టింటికి వెళ్ళింది. ఈవార్త తెలియగానే తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు బయలుదేరాడు. చిమ్మ చీకటి, దానికితోడు కుంభవృష్టి పడుతూవుంది. అటువంటి సమయంలో గంగానదిని దాటి భార్య ఇంటికి చేరుకొన్నాడు. అప్పుడు అతని భార్య రత్నావళి చేసిన హెచ్చరిక అతని జీవితాన్నే మార్చేసింది.

అస్థిచర్మమయ దేహ మను తామేజైసీప్రీతి తైసి జో శ్రీరామమహ హోత వతౌభవతి!

నాధా! ఎముకలు, చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరాముని మీద ఉంటే భవభీతియే యుండదుగదా! అన్న రత్నావళి మాటలే తులసీదాసుకు తారకమంత్రమయ్యాయి.  అప్పటి నుంచి తులసీదాసు విరాగియై శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడైనాడు. కాశీ, అయోధ్యలు ఆయనకు నివాసస్థానాలయ్యాయి. జీవిత చరమదశలో ఆయన కాశీలోనే ఉన్నారు.  లోకకల్యాణ కరమైన ‘రామచరితమానస్’ మహాకావ్యాన్ని వ్రాయడం తులసీదాసు అయోధ్యలోనే ప్రారంభించాడు. తరువాత కాశీలో ఉంటూ రెండున్నర సంవత్సరాలలో రామచరితమానస్ పూర్తి చేశాడు. తులసీదాసు సంస్కృతంలో మహాపండితుడైవుండి కూడా రామాయణగాధను అయోధ్య ప్రాంత భాషయైన అవధీలో వ్రాశాడు. దేశీయ చంధస్సులైన దోహా, చౌపాయి, కవిత్త మొదలైన చంధస్సులలో వ్రాయడం చేత, సరళమైన సంస్కృత, తత్త్సమశబ్దాలతో కూడిన అవధీభాషలో వ్రాయడంచేత తులసీ రామాయణం లోకప్రసిద్ధి పొందింది.

గోస్వామి తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు. భక్తిభావం, కావ్య రచన, తాదాత్మ్యత, భాష – వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు. తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి.

ఈయన కేవలం రచయితగానే ప్రసిద్ధుడు కాదు, కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా  మళ్ళీ ప్రజ్వరిల్లేట్లుచేసిన మహా భక్తుడు. ఈయన ఉత్తర భారతదేశమంతా పర్యటించి ” అఖాడా”ల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమను కలిగించారు.  క్రూర ముస్లిం దండయాత్రలు, మతమార్పిడి మౌఢ్యం నుంచి హిందూ సమాజం తననుతాను కాపాడుకోవడంలో ఈ మహత్ముడు పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది. ఈయన స్థాపించిన అఖాడాలు కులాలకతీతంగా నిర్వహించబడేవి. ఇప్పటికీ ఆ అఖాడాలు కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు ఈయన స్థాపింపజేశారు. ఈయన వారణాసిలో సంకటమోచన్‌ దేవాలయాన్ని కట్టించాడు. దీనిని రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా కట్టించాడని ప్రతీతి. ఈ దేవాలయం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి దక్షిణ దిక్కులో ఉంది.  తులసీదాసు విరచిత హనుమాన్ చాలీసా జగత్ప్రసిధ్ధి చెందిన సాధనామంత్రం. ‘ నాసై రోగ హరై సబ పీరా, జపత నిరంతర హనుమత వీరా’…… పవన తనయ సంకట హరణ మంగళ మూర్తి రూప, రామలఖనసీతా సహిత హృదయ బసహు సుర భూపా…..’

ప్రతీ భారతీయుడు తన సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఇలాంటి మహనీయుల జీవితచరిత్రలను తప్పక తెలుసుకోవాలి.