నిరసనగా తమ పుస్తక ప్రచురణలు వెనక్కి తీసుకుంటున్న రచయితలు
ఢిల్లీ అల్లర్ల వెనుక వాస్తవాలను వివరిస్తూ వచ్చిన “ఢిల్లీ రయట్స్ 2020: ది అన్ టోల్డ్ స్టోరీ” అనే పుస్తకాన్ని ప్రచురణ సంస్థ బ్లూమ్స్ బరి ఉపసంహరించుకోవడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ షాహీన్ బాగ్ జరిగిన నిరసన ప్రదర్శనల పేరిట జరిగిన అల్లర్ల గురించి వివరిస్తూ వ్రాసిన పుస్తకాన్ని ప్రచురించడమేకాక విశేష ప్రచారాన్ని కల్పించిన బ్లూమ్స్ బరి సంస్థ అనంతరం ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకుంది. ఇందుకు కారణం వామపక్ష, ఇస్లాం భావజాలం కలిగిన వ్యక్తుల ఒత్తిడే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా విదేశీ వామపక్ష రచయిత విలియం డార్ లింపుల్ వంటివారు ఈ వ్యవహారం వెనుక ఉన్నారని తెలుస్తోంది.
ప్రసిద్ధ న్యాయవాది మోనికా అరోరా, సోనాలి చితాల్కర్, ప్రేరణ మల్హోత్రా “ఢిల్లీ రయిట్స్(అల్లర్లు) ది ఆన్‌టోల్డ్ స్టోరీ” పుస్తకాన్ని రచించి, ఢిల్లీ అల్లర్ల వెనుక వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే తొలుత ప్రచురించిన పుస్తకాన్ని ప్రచురణ సంస్థ విరమించుకోవడాన్ని ఖండిస్తూ అనేకమంది రచయితలు ప్రకటనలు చేశారు. తమ పుస్తకాలను కూడా బ్లూమ్స్ బరి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కొందరు ఇప్పటికే ప్రకటించారు.
ఢిల్లీ అల్లర్లపై పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే వచ్చే నెలలో తన పుస్తకాన్నిబ్లూమ్స్ బరి ప్రచురించాల్సిన అవసరం లేదని, వాస్తవాలను తొక్కిపట్టే ప్రచురణ సంస్థకు తన పుస్తకాలు ఇవ్వలేనని జెఎన్‌యు ప్రొఫెసర్, శాస్త్రవేత్త, రచయిత ఆనంద్ రంగనాథన్ స్పష్టం చేశారు. తన పుస్తకం కోసం ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చివేస్తానని ఆయన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ఫాసిస్టుల బెదిరింపులకు లొంగి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రచయితలు, పాఠకులు ఖండించాలన్నారు.
మరో రచయిత సందీప్ దేవ్ కూడా తన పుస్తకాలన్నీ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే అనేక పుస్తకాలను ఈ సంస్థ ద్వారా వెలువరించిన సందీప్ దేవ్ త్వరలో రావలసిన తొమ్మిది పుస్తకాల ప్రచురణ బ్లూమ్స్ బరి నుంచి మాత్రం జరగదని ప్రకటించారు. వామపక్షాల ఒత్తిడి వల్ల ఢిల్లీ అల్లర్లపై వచ్చిన పుస్తకాన్ని సంస్థ ప్రచురించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఐఎఎస్ అధికారి, రచయిత సంజయ్ దీక్షిత్ కూడా తాను రచించిన “నల్లిఫైయింగ్ ఆర్టికల్ 370, ఎన్‌యాక్టింగ్ సీఏఏ” అనే పుస్తకాన్ని బ్లూమ్స్‌బరీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. వామపక్షాలకు అనుగుణంగా బ్లూమ్స్‌బరీ తీసుకున్న నిర్ణయం సరికాదని, సంస్థతో తన సంబంధాన్ని ముగించుకుంటున్నానని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా సంస్థ ప్రచురించిన హ్యారీ పాటర్ సిరీస్‌ను ప్రజలంతా బహిష్కరించాలని సంజయ్ దీక్షిత్ పిలుపునిచ్చారు. ఈ సిరీస్ ద్వారా సంస్థ ఏడాదికి 15కోట్ల లాభాలు పొందుతున్నట్టు తెలిపారు.
రచయిత నిత్యానంద మిశ్రా కూడా తన ”సునామా” అనే పుస్తకాన్ని ప్రచురించడాన్ని నిలిపివేయాలని బ్లూమ్స్‌బరీకి లేఖ రాసినట్టు ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటి వరకు తన 5 పుస్తకాలను సంస్థ ప్రచురించిందని కానీ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్‌లో తన పుస్తకాలను ప్రచురించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇతర రచయితలు కూడా తమ పుస్తకాలను సంస్థతో ఎప్పటికీ ప్రచురించవద్దని ఆయన కోరారు.
రచయిత, ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ కూడా తాను బ్లూమ్స్‌బరీతో తన పుస్తకాల్ని ప్రచురించబోనని ట్వీట్ చేశారు. సంస్థ నిర్ణయాన్ని ఖండిస్తూ, కొంత మంది దేశ వ్యతిరేకులు చేస్తున్న ఈ కుట్రని సంస్థ సమర్థించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రచయిత హర్ష మధుసూదన్ కూడా తన పుస్తకాల్ని బ్లూమ్స్ బరితో ప్రచురించనని ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పుస్తకాన్ని ప్రచురించడానికి “గరుడ ప్రకాశన్” అనే స్వదేశీ ప్రచురణ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ద్వారానే పుస్తకాన్ని వెలువరిస్తామని పుస్తక రచయిత మోనికా అరోరా వెల్లడించారు.
Source: OpIndia