Home Press Release భారత్ బంద్ లో పాల్గొనడం లేదు – భారతీయ కిసాన్ సంఘ్ ప్రకటన

భారత్ బంద్ లో పాల్గొనడం లేదు – భారతీయ కిసాన్ సంఘ్ ప్రకటన

0
SHARE

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హరియాణ, ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు ఢిల్లీ సరిహద్దులో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రైతు నాయకులు, ప్రభుత్వం మధ్య 5 దఫాలుగా జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు. కానీ చట్టాల్లో అవసరమైన సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్ 9న రెండు పక్షాలు తదుపరి చర్చల కోసం సమావేశమవుతాయి. తదుపరి చర్చలకు హాజరవుతామని రైతు నాయకులు చెప్పినా డిసెంబర్ 8 (రేపు) భారత్ బంద్ మాత్రం పాటిస్తామని ప్రకటించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రత్యామ్నాయ చట్టం రద్దు చేసిందని, జూన్ 5 కు ముందున్న స్థితినే కొనసాగించాలని పేర్కొన్నదనే సంగతి ప్రజలకు తెలుసు. అయినా పంజాబ్ కు చెందిన రైతు నాయకులు కేంద్ర చట్టాలు రద్దు చేయాల్సిందేనంటూ పట్టుబట్టడం ఎందుకో అర్ధం కాదు.

భారతీయ కిసాన్ సంఘ్ మాత్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నది. అయితే కనీస మద్దతు ధర లభించేట్లు చూడటం, రైతుకు అందవలసిన మొత్తం తప్పనిసరిగా అందే విధంగా చర్యలు చేపట్టడం, ప్రత్యేక వ్యవసాయ కోర్ట్ ల ఏర్పాటు వంటివాటితోపాటు అవసరమైన సవరణలు చేస్తే సరిపోతుంది. దేశంలో వివిధ పంటలు పండించే చిన్న, పెద్ద రైతులకు మేలు కలిగించేందుకు ఉద్దేశించిన ఈ చట్టాలను రద్దు చేయాలని కోరలేము.

ఇప్పటివరకు ఈ ప్రదర్శనలు శాంతియుతంగా, క్రమశిక్షణాయుతంగా జరిగాయి. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే ఈ ప్రదర్శనల్లో విదేశీ శక్తులు, దేశవ్యతిరేక శక్తులు, రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునే పార్టీలు ప్రవేశించి అరాచకత్వాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది. 2017లో మందసోర్ లో రైతు ఆందోళనల సందర్భంగా జరిగిన దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదు. అప్పుడు ఆందోనలు హింసాత్మకంగా మారి 6గురు రైతులు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. 32 వాహనాలు, అనేక దుకాణాలు మంటలకు ఆహుతయ్యాయి. ఆనాడు రైతులను రెచ్చగొట్టిన వారు ఆ తరువాత ఎమ్మేల్యేలు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. కానీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు మాత్రం వీధిన పడ్డాయి. అలాంటి ఆందోళనలవల్ల ఇటు రైతులకు, అటు దేశానికీ నష్టమేతప్ప ప్రయోజనం ఏమి ఉండదు.

డిసెంబర్ 8 న భారత్ బంద్ కు దూరంగా ఉండాలని భారతీయ కిసాన్ సంఘ్ నిర్ణయించుకుంది. ఈ బంద్ గురించి స్వయంగా అప్రమత్తంగా ఉండడమేకాక, ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, తద్వారా ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా నివారించాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నది.

కార్యకర్తలతోపాటు ప్రజలు కూడా ఈ పిలుపును మన్నించి సహకరిస్తారని భారతీయ కిసాన్ సంఘ్ ఆశిస్తున్నది.