Home News క్రైస్తవ పాఠశాల నుండి విద్యార్థి బహిష్కరణ ఘటనలో చర్యలేవి?: జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం 

క్రైస్తవ పాఠశాల నుండి విద్యార్థి బహిష్కరణ ఘటనలో చర్యలేవి?: జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం 

0
SHARE
అయ్య‌ప్ప మాల వేసుకున్ననాలుగో త‌ర‌గ‌తి విద్యార్థిని క్రైస్తవ పాఠశాల నుండి బ‌హిష్కరించిన ఘ‌ట‌న‌లో ఏడాది గ‌డుస్తున్నా తీసుకున్న చ‌ర్య‌లు వివరాలు సమర్పించనందుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరుకు కమిషన్ నోటీసు జారీ చేసింది.
వివ‌రాల్లోకి వెళితే..  2019 డిసెంబ‌ర్ 3న భ‌వ‌నగిరిలోని ఇండియ‌న్ మిష‌న్ స్కూల్లో నాలుగో త‌ర‌గ‌తి చదువుతున్న ప్రణీత్ రెడ్డి అనే విద్యార్థి అయ్య‌ప్ప దీక్ష స్వీకరించాడు. దీక్షా వస్త్రాలు ధరించి పాఠశాలకు వచ్చినందుకు పాఠ‌శాల యాజ‌మాన్యం విద్యార్థిని 41 రోజుల పాటు తరగతులకు హాజరుకాకుండా బ‌హిష్క‌రించింది.  ఈ ఘ‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తూ అయ్య‌ప్ప భ‌క్తులు పాఠ‌శాల ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

విద్యార్థి స‌స్పెండ్‌ విష‌యం‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లీగ‌ల్ రైట్స్‌ ప్రోటేక్ష‌న్ ఫోర‌మ్ డిసెంబ‌ర్ 3 2019లో జాతీయ బాలల హక్కుల కమిషనుకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి త‌క్ష‌ణ‌మే స‌రైన చర్య‌లు తీసుకోవవడంతో పాటు చర్యల వివరాలు తెలియజేయాల్సిందిగా అప్పటి భువ‌న‌గిరి డిప్యూటి క‌మిష‌న‌ర్ కుర్మా రావుకు ఆదేశాలు జారీ చేసింది. డెప్యూటీ కమిషనర్ నుండి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో  ఈ  2020 జూన్ 25న భువ‌నగ‌రి జిల్లాకు క‌లెక్ట‌ర్ అనితా రామ‌చంద్ర‌న్‌కు మ‌రోసారి ఉత్త‌ర్వులు జారీచేస్తూ మూడు వారాల్లో ఈ ఘ‌‌ట‌న‌కు సంబంధించి చ‌ర్య‌ల వివరాలు సమర్పించాల్సిందిగా కోరింది.
ఘటన జరిగి ఏడాది గడిచినా, రెండు సార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020 డిసెంబ‌ర్ 1న మ‌రో సారి జిల్లా క‌లెక్ట‌ర్‌కు రాస్తూ, రెండు వారాల్లో ఘ‌ట‌న‌ వివరాలు తెలియజేయని పక్షంలో  సీపీసీఆర్- 2005 చ‌ట్టంలోని సెక్ష‌న్ 14 ప్ర‌కారం తమ విశేష అధికారాలు వినియోగించుకోవాల్సి ఉంటుందని హెచ్చ‌రించింది.