Home News తీర్థ క్షేత్ర భూసేకరణలో ఎలాంటి అవకతవకలు జరగలేదు

తీర్థ క్షేత్ర భూసేకరణలో ఎలాంటి అవకతవకలు జరగలేదు

0
SHARE

అయోధ్య శ్రీరామజన్మభూమిలో మందిర నిర్మాణపు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మందిర నిర్మాణపు పనులు పర్యవేక్షిస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన భూసేకరణ అవినీతిమయమని కొందరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై సి బి ఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆరోపణలకు మీడియా కూడా తగిన ప్రచారం కల్పించింది. కానీ అసలు నిజానిజాలు ఏమిటి?

తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన భూసేకరణలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నది వాస్తవం. అయోధ్య రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక స్థలపు కొనుగోలు వ్యవహారంపై కొందరు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కాస్త పరిశీలిస్తే తెలుస్తుంది.

యాత్రికులకు తగిన సదుపాయాలు కల్పించేందుకు రామమందిర పరిసరాల్లో తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేక భవనాలు, రోడ్లు నిర్మించాలని తలపెట్టింది. అందుకు అవసరమైన భూసేకరణ చేపట్టింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తరువాత అయోధ్యలో భూముల క్రయవిక్రయాలు ఒక్కసారిగా ఊపందుకుంది. భూముల ధర పెరిగింది. అయినా మార్కెట్ ధర కంటే తక్కువకే భూమి కొనుగోలు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్ పై ఆరోపణలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న స్థలాన్ని ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేశారని, నిజానికి ట్రస్ట్ కొనుగోలు చేయడానికి సరిగ్గా 15నిముషాల ముందు అంతకంటే 6రెట్లు తక్కువ ధరకు ఆ స్థలం అమ్ముడుపోయిందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు చేసేవారు ఎప్పటిలాగానే కొన్ని నిజాలు దాచిపెట్టేశారు.

రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న స్థలం కుసుమ్ పాఠక్ అనే మహిళది. ఆమె ఆ స్థలాన్ని రూ. 2 కోట్లకు అన్సారీ అనే వ్యక్తికి అమ్మడానికి సెప్టెంబర్ 2019లో ఒప్పందం (sale agreement) చేసుకుంది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా కూడా తీసుకుంది. మిగిలిన మొత్తం(1.5కోట్లు) మూడేళ్లలో ఇవ్వాలని, అప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలన్నది ఒప్పందం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాకపోవడంవల్ల  స్థలంపై యాజమాన్య హక్కులు కుసుమ్ పాఠక్ వద్దనే ఉంటాయి.

మందిర నిర్మాణానికి వీలుగా భూసేకరణ చేయాలని తలపెట్టిన తీర్థ క్షేత్ర ఈ స్థలాన్ని కూడా కొనుగోలు చేయాలని భావించింది. అన్సారీని సంప్రదించినప్పుడు కుసుమ్ తో పాత ఒప్పందం విషయం తెలిసింది. అది పూర్తైతేనేగాని కొత్త విక్రయానికి అవకాశం లేదు. దానితో 2021 మార్చ్ 18న కుసుమ్ తో చేసుకున్న పాత ఒప్పందం(అప్పటి ధరను బట్టి) ప్రకారం 1.5 కోట్ల రూపాయలు చెల్లించి అన్సారీ ఆ స్థలాన్ని తన పేరున రిజిస్టర్ చేయించుకున్నారు. స్థలంపై యాజమాన్య హక్కులు పొందిన వెంటనే, అదే రోజున ప్రస్తుత ధరను బట్టి 18.5 కోట్ల రూపాయలకు ఆ స్థలాన్ని తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు విక్రయిస్తూ రిజిస్ట్రేషన్ చేయించారు.

ఆ విధంగా పాత ఒప్పంద ప్రక్రియను పూర్తి చేయడం, కొత్త ఒప్పందాన్ని అమలు చేయడం ఒకే రోజున జరిగింది. ఈ విషయాన్ని దాచిపెట్టిన కొందరు `మేధావులు’ భూ లావాదేవీల్లో అవకతవకలు జరిగిపోయాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. నిజానికి కుసుమ్, అన్సారీ ఒప్పందంతో తీర్థ క్షేత్రానికి ఎలాంటి సంబంధం లేదు. పైగా అది 2019నాటి ఒప్పందం.  అన్సారీ దగ్గర స్థలం కొనుగోలు చేసినప్పుడు కూడా తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుత మార్కెట్ కంటే తక్కువ ధరే చెల్లించింది. కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదు.

ఆరోపణలు చేస్తున్నవారికి విక్రయ ఒప్పందం (sale agreement), విక్రయ దస్తావేజు (sale deed)ల మధ్య తేడా తెలియకపోయి ఉండాలి లేదా తెలిసినా మందిర నిర్మాణ కార్యంపై బురదజల్లాలన్న రాజకీయ స్వార్ధంతో వ్యవహరించి ఉండాలి. అయితే ప్రజలు మాత్రం ఈ మొత్తం వ్యవహారం పూర్తి పారదర్శకంగా జరిగిందని విశ్వసిస్తున్నారు, గుర్తిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఒక ప్రకటన విడుదల చేసిన విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ ఆలోక్ కుమార్ దురుద్దేశపూరిత ఆరోపణలు చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.