దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేసి దేశ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికి కొంత మంది వ్యక్తులు కుట్రలు చేస్తూనే ఉన్నారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక మతంపై బురద జల్లే కుట్రలకు పాల్పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక ఘటనను కొంతమంది వ్యక్తులు తప్పుదోవ పట్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసి మతవిద్వేషాలను సృష్టించాలని ప్రయత్నించి చివరికి అడ్డంగా దొరికిపోయి పోలీసు స్టేషన్‌లో కేసుల పాలయ్యారు.
వివరాల్లోకి వెళితే… ” జై శ్రీరాం ” అనాలంటూ ఒక ముస్లిం వృద్ధుడిని కొంత మంది వ్యక్తులు కొడుతున్నారంటూ ఆల్ట్ (ALT) న్యూస్ సహవ్యవస్థాపకుడు మహ్మద్ జూబేర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్టు చేశాడు. ఈ పోస్టుకు కొంత మంది కుహాన మేదావులు స్పందిస్తూ దేశంలో మత విద్వేషాలు పెరిగిపోతున్నాయని హిందూ మతంపై విషం జల్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ దాడికి సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన జూన్ 5 జరిగిందని, బాధితుడు అబ్దుల్ సమద్ సైఫీ బులంద్‌షహర్ నుంచి లోని అనే ప్రాంతానికి వెళ్తుండగా కొంత మంది వ్యక్తలు అతన్ని ఒక ఇంటికి తీసికెళ్లి కొట్టినట్టు తెలిపారు.
బాధితుడు సైఫీ జీవనోపాధి కోసం తాయెత్తులు విక్రయించేవాడని, తాయెత్తు తమకు హానికరం అని తెలిసిన తర్వాత బాధితుడిపై నిందితులు దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు మొదట పర్వేష్‌ను అరెస్టు చేయగా తర్వాత ఆరిఫ్, ఆడిల్, ముషాహిద్ లను సోమవారం పట్టుకున్నారు. ఐపిసి లోని సంబంధిత సెక్షన్ల కింద వారిపై కేసు నమోదైంది.
ఇక్కడ అరెస్టైన వారిలో ఆరిఫ్, ఆదిల్, ముషాహిద్ అనే ముగ్గురు వ్యక్తులు ఇస్లాం మతానికి చెందిన వారే, అలాంటప్పుడు వీరు ఆ వృద్ధ ముస్లిం వ్యక్తిని జై శ్రీరాం అనాలని ఎందుకు ఒత్తిడి చేస్తారు. కాబట్టి అక్కడ దాడి జై శ్రీరాం అనడం పై జరగలేదని స్పష్టం అయింది.
ఈ విషయాన్ని తప్పుదొవ పట్టించి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆల్ట్ న్యూస్ సహావ్యవస్థాకుడు మహ్మద్ జుబైర్ పై, పోస్టును షేర్ చేసి విద్వేషాన్ని వ్యాప్తి చేసి రానా అయూబ్, సబా నఖ్వీ, కాంగ్రెస్ నాయకులు మస్కూర్ ఉస్మాని, షామా మొహమ్మద్, సల్మాన్ నిజామిలతో పాటు ది వైర్ వెబ్‌సైట్ పై, అసత్య ప్రచారాలు చేస్తున్న చర్యలు తీసుకోని ట్విట్టర్ సంస్థపై కూడా ఉత్తర ప్రదేశ్ పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తన తప్పుడు ప్రచారపు బండారం బయటపడిపోవడంతో ‘నిజాలు నిగ్గుతీసే’ ఆల్ట్ ఛానల్ మహ్మద్ జుబేర్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ వీడియో తొలగించాడు. అయితే తప్పుడు వీడియో వల్ల జరిగిన నష్టానికి అతనుగానీ, ట్విట్టర్ గానీ విచారం వ్యక్తం చేయలేదు, క్షమాపణలు చెప్పలేదు.
యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంపై స్పందిస్తూ ” తప్పుడు వార్తలు ప్రచారం చేసి ప్రజల్లో విద్వేషాలు సృష్టించాలనుకునే వారి ఆటలు ఇకపై కొనసాగవు ” అని ట్వీట్ చేశాడు.