Home News “మోప్లా ఘటనకు కారకులైన వారిని స్వతంత్ర వీరుల జాబితా నుండి తొలగించిన ICHR”

“మోప్లా ఘటనకు కారకులైన వారిని స్వతంత్ర వీరుల జాబితా నుండి తొలగించిన ICHR”

0
SHARE

– వాయు(నారి వినోద్ కుమార్)

“ఏ జాతి తన చరిత్ర గురించి తాను తెలుసుకోదో  ఆ జాతి అంతరించి పోతుంది”అన్న అంబేద్కర్ మాటలను మననం చేసుకుంటూ,మార్క్సిస్ట్,సూడో సెక్యులరిస్ట్ గాజు కళ్లద్దాలతో కాక భారతీయ నేత్రాలతో చరిత్రను అధ్యయనం చేయాలి.

“మోప్లా ఘటన” స్వాతంత్రోద్యమానికి సంబంధం లేదని,పక్కా ప్రణాళికతో లక్షల మంది హిందువులను ఊచకోత కోసారని ICHR తన నివేదికలో పేర్కొంటూ అందుకు కారకులైన 387 మందిని స్వతంత్ర వీరుల జాబితా నుండి తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని జాతీయవాదులంతా హర్షధ్వానాలతో స్వాగతిస్తున్నారు.

మోప్లా ఘటన జరిగిన వందేళ్ళకు ICHR తీసుకున్న ఈ నిర్ణయం వెనక అసలు చరిత్ర ఏముంది. 27 మార్చి 1972 లో స్థాపించబడి‌న “భారతీయ చరిత్ర, పరిశోధనా మండలి” ( ICHR – Indian Council of History and Research ) కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే స్వతంత్ర సంస్థ. ICHR రూపొందించిన “అమర వీరుల డిక్షనరీ” (భారతదేశ స్వాతంత్ర్య పోరాటం – 1857-1947 ) అనే పుస్తకం 2019లో ప్రధానమంత్రి నరేంద్రమోదీచే విడుదల చేయబడింది. ఈ పుస్తకం ఐదవ వాల్యూమ్‌లోని ఎంట్రీలను సమీక్షించి, పేర్లను నిర్ధారించి 387 మంది “మోప్లా అమరవీరులు”, అలీ ముస్లియర్, వరియంకునాథ్ అహ్మద్ హాజీ, వారి ఇద్దరు సోదరులను ఈ పుస్తకం నుండి తొలగించారు. మోప్లా ఘటన స్వాతంత్ర్య పోరాటమో‌,రైతు ఉద్యమమో కాదనీ మతపరమైన మార్పిడిపై దృష్టి సారించిన ఒక మౌలికవాద ఉద్యమం.అల్లరిమూకలు లేవనెత్తిన నినాదాలు ఏవీ జాతీయవాదానికి అనుకూలంగా లేవని హిందువు లనే లక్ష్యంగా చేసుకుంటూ మారణహోమం జరిగిందని ICHR తన నివేదికలో పేర్కొంది.

“మోప్లా (ముస్లిం) అల్లర్లు” అని కూడా పిలువబడే “మలబార్ తిరుగుబాటు” ఆగష్టు 20, 1921 న బ్రిటిష్ పాలకులు మరియు స్థానిక హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా ముస్లిం అద్దెదారులు లేదా కౌలుదారులు ప్రారంభించారు. ఈ తిరుగుబాటు 2,339 తిరుగుబాటుదారులతో సహా 10,000 మంది ప్రాణాలను కోల్పోయేలా చేసిందని కొన్ని చారిత్రక కథనాలు పేర్కొన్నాయి.

చరిత్ర వక్రీకరణ‌ను వెల్లడించిన ICHR :

ఇది దక్షిణ భారతదేశంలో మొదటి జాతీయవాద తిరుగుబాట్లలో ఒకటిగా గుర్తించబడింది.”దక్షిణ భారత జలియాన్ వాలాబాగ్ దురంతం” గాను‌ పేర్కొనబడింది.ఉత్తర కేరళలోని మలప్పురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి. అప్పటి కేరళ ప్రభుత్వం తిరుగుబాటులో పాల్గొన్నవారిని స్వాతంత్ర్య సమరయోధుల కోవలోకి చేర్చింది. ఇది రైతుల తిరుగుబాటుగా కూడా వర్ణించబడింది.

ICHR సభ్యుడు ఇసాక్ తన సమీక్ష నివేదికలో “దాదాపు అన్ని మోప్లా దౌర్జన్యాలు మతపరమైనవని పేర్కొన్నారు. వారు హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు మరియు పూర్తిగా అసహనంతో చేశారన్నారు.”వాగన్ విషాదం”లో మరణించిన వారిలో ఎవరూ భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు కాదు, ఎందుకంటే వారు ఖిలాఫత్ జెండాను ఎగురవేశారు మరియు కొంతకాలం ఖిలాఫత్ మరియు ఖిలాఫత్ కోర్టులను స్థాపించారు. అల్లర్లలో పాల్గొన్నందుకు వారిని సైన్యం అరెస్టు చేసింది. అల్లర్లలో పాల్గొన్న దాదాపు 10 మంది హిందువులు కూడా డిక్షనరీ నుండి తొలగించాల్సిన వ్యక్తుల జాబితాలో ఉన్నారు.

సరైన విచారణ తర్వాత బ్రిటిష్ వారు అల్లర్ల దోషులను నిర్ధారించారు, మరియు ఈ చనిపోయినవారు మరెక్కడా స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించబడలేదని ఆయన అన్నారు. తిరుగుబాటు అనేది “కాలిఫేట్” స్థాపించడానికి చేసిన ప్రయత్నమని కమిటీ సూచించింది. షరియా కోర్టును స్థాపించి, పెద్ద సంఖ్యలో హిందువులను శిరచ్ఛేదం చేసిన “వరియంకునాథ్ అహ్మద్ హాజీ” పాత్రను కేరళ ప్రభుత్వం గొప్పగా వర్ణించింది.

మోప్లాలు ఎవరు ?
మలబార్ ప్రాంతంలో వాణిజ్యంలో ముస్లిములు పట్టు సాధించారు. వారి ప్రోద్బలంతో, `చేర’ రాజు `చేరమాన్ పెరుమాల్’ ఇస్లాంమతం తీసుకున్నాడు. సా.శ. 825 ఆగస్టులో, చేరమాన్ మక్కాకి సముద్ర ప్రయాణం చేసి, అక్కడ ఆరబ్ మతప్రచారకులను మలబార్ కు  ఆహ్వానించాడు. మాలిక్-ఇబ్న్-దీనార్ నాయకత్వoలో 15మంది ప్రచారకులు కొడున్గల్లుర్ చేరుకున్నారు. పాలకులనుంచి అనుమతి పొంది, మలబార్, దక్షిణ కానరా జిల్లాలలో 10 మసీదులు కట్టి, యధేచ్చగా మతప్రచారం, మతమార్పిడిలు చేయసాగారు, దాని ఫలితమే ఈ `మోప్లా’ జాతి.

కాలికట్ జామోరిన్  (రాజు) అరబ్ ఓడల మీద పనిచేయాలనే నెపంతో, మతమార్పిడిలు విపరీతంగా ప్రోత్సహిస్తూ, మత్స్యకారుల కుటుంబాలలో, ఒక ఇంట్లో ఒకమగవాడినైనా ముస్లిముగా పెంచాలని ఆదేశాలు జారీ చేసాడు(జిల్లా గజెట్).  ఆగస్ట్ 1789 లో టిప్పు సుల్తాన్ ఆక్రమణలో బలవంతపు మతమార్పిడిలు విపరీతoగా జరిగాయి.

మలబార్ తీరప్రాంతమంతా నివసించే మలయాళ ముస్లిములనుద్దేశిoచి `మాప్పిల్లా’ (అసలు అర్ధం `అల్లుడు’, ఇంగ్లీషులో `మోప్లా’) అనే పదం వాడతారు. 1921నాటికి, మలబార్ లో ముస్లిములు అధికసంఖ్యాకులే కాక వేగంగా పెరుగుతున్న జనాభా కూడా, పదిలక్షల జనాభా అనగా 32% ఉన్నవీరు దక్షిణ మలబార్ ప్రాంతంలో మరింత ఎక్కువ. జిహాద్ కి కేంద్రమైన `ఎర్నాడ్’ తాలుకాలో వీరి జనాభా 60శాతానికి పైగా ఉన్నది.

ఎర్నాడ్ తాలూకాలోని “మంజేరి”లో 28 ఏప్రిల్ 1920న జరిగిన `మలబార్ జిల్లా సమావేశం’లో జారీ అయిన తీర్మానంతో లాంఛనంగా ఖిలాఫత్ ఉద్యమం మలబార్ జిల్లాలో ప్రవేశపెట్టబడింది. 1000మంది పైగా ప్రతినిధులు, వారిలో అధికశాతం మోప్లాలు, హాజరైన ఈ సమావేశం, `టర్కిష్ దేశం’ నుంచి రేకెత్తిన ప్రశ్నకి సమాధానంగా ప్రభుత్వం పరిష్కారం జరపించాలని కోరింది. అలా ప్రభుత్వం నిర్ణయం చేయని పక్షంలో “మౌలానా షౌకత్ అలీ అధ్యక్షతన అంతకు ముందు మద్రాసులో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో తీర్మానించినట్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయనిరాకరణ విధానం ప్రారంభించాలని ప్రజలను కోరుతున్నామని” ప్రకటించారు.

గాంధీ, షౌకత్ అలీ కలిసి 18ఆగస్ట్ 1920న కాలికట్ సందర్శించి, ఖిలాఫత్ మరియు సహాయనిరాకరణ గురించి ప్రసంగించారు, ఆ తరువాత మలాబార్ ప్రాంతమంతా ఖిలాఫత్ కమిటీలు ఏర్పాటు చేసారు. పూర్తిస్థాయిలో జిహాద్ అల్లర్లు ప్రారంభమైన కాలానికి కొంచెం ముందుగా, కొన్ని నెలలపాటు అన్ని మోప్లా కేంద్రాలలో భారీ ఎత్తున ఖిలాఫత్ సమావేశాలు నిర్వహించారు.

15 ఫిబ్రవరి1921న, మద్రాసు ఖిలాఫత్ నాయకుడు యాకుబ్ హసన్, కాలికట్లో ఖిలాఫత్ మరియు సహయనిరాకరణ సమావేశాలలో ప్రసంగించడానికి రాగా, అతనిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చర్య మోప్లాలకు ఆగ్రహం కలిగించింది

రకరకాల ఆయుధాలతో మోప్లాలు సాయుధులుగా తయారయారు. కొమ్ముల్లాగా మెలితిరిగి, మొనదేలిన, రెండువైపులా పదునున్న రెండడుగుల పొడవున్న కత్తులు; ఒకటిన్నర అడుగుల వేట కత్తులు, మోప్లా చాకులు, మూడడుగుల ఈటెలు, బల్లేలు, లాఠీలు, గొడ్డళ్ళు మొదలైనవన్నీ సమకూర్చుకున్నారు.
మలబార్ ప్రాంతమంతా చుట్టూరా, అంతర్భాగం కూడా  కొండలు గుట్టలతో నిండిఉంటుంది, అందువల్ల జిహాదీలను పట్టుకోవడం చాలా కష్టం. జిహాదీలు గుంపులుగా విడిపోయి, గెరిల్లా పద్ధతుల్లో జిహాద్ జరుపుతూ ఉండడంతో, వారిని పట్టుకోవడం దుర్లభమైపోయింది.

స్థానిక పోలీసులు కూడా చాలామంది మోప్లాలు అవడంతో, పరిస్థితిని అదుపులోకి తేలేకపోయారు. జిహాదీలు పోలీసు స్టేషన్లపై దాడి చేసి, పోలీసులనుంచి ఎటువంటి ఎదురుదాడి లేకపోవడంతో, అక్కడినుంచి ఆయుధాలు ఎత్తుకెళ్ళిపోయేవారు.

చివరిగా, అతిముఖ్యంగా, హిందూ-ముస్లిం ఐక్యత అనే శుష్క నినాదాలతో, హిందువులు స్తబ్దుగా నిద్రాణంగా ఉండేవారు. టోట్నహాంమ్ వ్రాస్తూ, “మహాత్మాగాంధీ అహింస అనే ఒరలో, ఇస్లాం హింసాత్మక ఖడ్గం ఖణఖణమని వినిపించేలా మ్రోగింది.  మాపిల్లాలు నిదానంగా ఇళ్ళకెళ్ళి తమ నాగళ్ల మొనలను ఇస్లామియా కత్తిలోకి, రంపాలను యుద్ధ-చాకులలోనికి ఎలా జొప్పించాలో ఆలోచించేవారు. అల్లర్లు చెలరేగగానే, అహింస అనే ముసుగు తొలగిపోయేది. అయితే ఈ మాపిల్లాల మనస్తత్వం అర్థం చేసుకోలేని హిందూ యువకులు మాత్రం ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఉద్యమం కొనసాగిస్తూ ఉండేవారు.

20ఆగస్ట్ 1921న జిహాద్ అల్లర్లు ప్రారంభమైనాయి. 26ఆగస్ట్ న సైనిక శాసనం విధించి, తిరిగి 25పిబ్రవరి 1922న దానిని ఎత్తివేశారు. చివరి మోప్లా నాయకుడు అబూబక్ర్ ముసలియార్ పట్టుబడడంతో, 30జూన్ 1922న ఎట్టకేలకు జిహాద్ ముగిసిందని చెప్పవచ్చు. సెప్టెంబర్-డిసెంబర్ 1921మధ్యకాలంలో జిహాద్ తీవ్రంగా సాగింది. కేంద్ర శాసనసభ చర్చల్లో, అప్పటి హోం సెక్రెటరి `సర్ విలియం విన్సెంట్’ సమాధానమిస్తూ “మద్రాసు ప్రభుత్వ నివేదిక ప్రకారం, బలవంతపు మతమార్పిడిలు కొన్నివేలల్లో జరిగాయని తెలుస్తోంది, అయితే అందరికీ విదితమైన కొన్ని కారణాల వల్ల, ఖచ్చితమైన సంఖ్య ఎప్పటికీ తెలియదు” అన్నారు ”(Pakistan or the Partition of India, B.R. Ambedkar, Thacker and Company Limited, 1945, p. 148).

మొత్తం 20,800హిందువులు హత్యచేయబడ్డారు, 4000మందిని కత్తులతో భయపెట్టి ముస్లిములుగా మతమార్పిడి చేయడం జరిగింది.  లక్షలాదిమంది హిందువులు ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.  2,339 మోప్లాలు చంపబడగా,  1,652మంది బ్రిటిషు తూటాలకు గాయపడ్డారు. 39,338 జిహాదీలపై కేసులు నమోదు చేయబడగా, 24,167 జిహాదీలపై విచారణలు జరిగాయి.

చాలామంది ముస్లిం నాయకులు తమను తాము ఖిలాఫత్ రాజులుగా, గవర్నర్లుగా ప్రకటించుకుని, హిందువుల ఊచకోతను నిర్దేశించి నిర్వహిస్తుండేవారు. అలీ ముసలియార్, వరియంకునాథ్ అహ్మద్ హాజి రాజా, సి.ఐ.కోయతంగల్ వీరిలో ముఖ్యులు.

చరిత్ర వక్రీకరణ ఇలా‌ సాగింది :
బ్రిటిషు పాలన, వారి హిందూ మద్దతుదారులకి వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమoగా, లేక హిందూ జమీందారులకి వ్యతిరేకంగా జరిగిన ముస్లిం రైతాంగ పోరాటంగా వర్ణించారు. “`జన్మి’(భూమిపై ఏకైక హక్కుదారులు) లపై జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా, ఎర్నాడ్-వల్లువనాడ్ తాలూకాలలో మొట్టమొదట జరిగిన పోరాటంగా, వెనకబడిన నిరక్షరాస్యులైన మోప్లాలకు ఈ ఖ్యాతి దక్కుతుంది” అని కమ్యునిస్టు నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ అభిప్రాయపడ్డారు. భారతప్రభుత్వ గృహ మంత్రిత్వ కార్యాలయంలో `స్వతంత్రతా సేనానుల సహాయనిధి’ కూడా ‘మోప్లా తిరుగుబాటు’ను, ఖిలాఫత్ ఉద్యమకారులను స్వాతంత్ర సేనానులుగా గుర్తించి గౌరవించడం హేయనీయం.

చరిత్ర వక్రీకరణతో తీసిన  “1921” సినిమా కు జాతీయ అవార్డు :

రచయిత టి. దామోదర్, దర్శకుడు ఐ.వి.శశి, నిర్మాత మన్నిల్ మహ్మద్ ఇంకా ఎంతో మంది చరిత్ర పరిశోధకులు సంయుక్తంగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో  తీసారు‌ 1921 చలన చిత్రం. 1921 నాటి మోప్లా తిరుగుబాటును ‘1921’ గా తెరకెక్కించారు. ఇది 1988లో వెలువడింది. 1920లలో మలబార్ ప్రాంతంలో ఎక్కువ మంది రైతు కూలీలు ముస్లింలే! ఈ ముస్లిం సమూహానికే ‘మోప్లా’ అని పేరు. వీరి మీద హిందూ అగ్ర వర్ణాల వారు అజమాయిషీ చేసేవారు. అన్ని రకాలుగా దోచుకునేవారు. హింసించేవారే.వీరికి బ్రిటిష్ వారు తోడు‌కావడంతో మోప్లాలు తిరగబడ్డారంటూ సినిమాలో‌కలరింగ్ ఇచ్చారు. అందుకే,జాతీయ స్థాయిలో ‘1921’ ఉత్తమ మలయాళ చిత్రంగా ఎన్నికైంది. ఫిలింఫేర్ అవార్డు సాధించిందిఓటు బ్యాంకు రాజకీయాల మోజులో ఉన్న నాటి ఏలికలు ఈ చిత్రానికి జాతీయ అవార్డును ఇవ్వడం సిగ్గుచేటు.

మోప్లా ఘటన 1921 లో జూన్‌ నుండి నవంబర్ వరకు ఆరు నెలలపాటు హిందువులపై సాగిన దమనకాండ.ఇది జరిగిన వందేళ్లకు నిజమైన చరిత్రను ICHR తిరగరాయడం అభినందించదగ్గ విషయం.ఇంకా భారత చరిత్రలో ఉన్న మరకలను,అసత్య,అభూత కల్పనలను తొలగించి నిజమైన చరిత్రను‌ భావితరాలకు అందించాలని యావత్తు సమాజం ఆకాంక్షిస్తోంది.

-ఏబీవీపీ తెలంగాణ వర్కింగ్ కమిటీ సభ్యులు