Home News ప్రత్యేక ఆహ్వానితులగా TTD ధర్మ కర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యం ఏంటి...

ప్రత్యేక ఆహ్వానితులగా TTD ధర్మ కర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యం ఏంటి ?

0
SHARE

ప‌త్రికా ప్ర‌క‌ట‌న – తిరుమల తిరుపతి సంరక్షణ సమితి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీ.ఓ.నె.245, 568, 569ల ద్వారా 24 మంది ధర్మ కర్తలను, 52 మంది ప్రత్యేక అహ్వానితులను, 4 ఎక్స్ అఫిషియో సభ్యులను TTD ధర్మ కర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. TTD నియమావళిలో ప్రత్యేక అహ్వానితులనే పదమే లేదన్నది ఒక వాదన. 2005లో తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతున్న వివాదాస్పద వేళ ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి , శ్రీ పి.వి.అర్.కే ప్రసాద్ గారిని TTD ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ధార్మిక నియమాలకు అనుగుణంగా అనేక క్లిష్ట సమస్యలను పరిష్కరించిన ఘనత వారిది. టి.టి.డి. ఈ.ఓ.గా వారు అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టి.టి.డి. ధర్మ కర్తల మండలి సభ్యులలో ప్రత్యేక అహ్వానితుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నవి. ఒక పాత సినిమాలో శాసన సభ్యులు అందరూ ముఖ్య మంత్రులే! అలాంటి స్థితి టి.టి.డి.లో రానున్నదా? ధర్మా చార్యుల మార్గదర్శనంలో ధార్మిక నియమాలకు అనుగుణంగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కలుగ చేస్తూ టి.టి.డి.. హిందూ శ్రద్దా కేంద్రంగా, ధర్మ ప్రచార కేంద్రంగా ఉండాలని సాధు, సంతులు, భక్తులు కోరుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రభుత్వంలో పదవులు ఇవ్వలేని వారికి టి.టి.డి. బోర్డ్ సభ్యులుగా (ఉద్యోగాలు) స్థానం కల్పిస్తున్నది. ధ‌ర్మాచార్యుల, భక్తుల ఆశయాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నియామకాలకు ఏమి సంబంధం లేకుండా పోతున్నది. తాము తితిదే ధర్మ కర్తల కావడం ఒక గొప్ప అదృష్టంగా సభ్యులు భావిస్తున్నారు. స్వామి వారి దర్శనం పలుమార్లు తాము తమ కుటుంబ సభ్యులతో చేసుకోవచ్చు, తమ మిత్రులకు దర్శన భాగ్యం కల్పించవచ్చు అన్నది పలు సభ్యుల భావన. ఇప్పడికే టి.టి.డి లోని ఉద్యోగస్తులు తాము ఒక గొప్ప దేవాలయంలో పనిచేసే భక్తులమని మరిచారు. నిర్జీవమైన ప్రభుత్వ ఉద్యోగస్తుల వలె భావిస్తూ, వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో నియమితులైన ఈ ధర్మ కర్తలకు వారి రాక సందర్భంగా సేవలు చెయ్యడం, వారు పంపే భక్తులకు దర్శనాలు చేయించే పని అనేక రెట్లు పెరుగుతుంది. భక్తులకు, దేవునికి సేవ కాక ధర్మ కర్తలసేవ మరింత పెరుగనుంది.

వివిధ పార్టీల, రాష్ట్ర ప్రభుత్వాల నాయకుల అభిప్రాయాలను మన్నించి ధర్మ కర్తలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ పని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం టి.టి.డి ద్వారా చేసే అనుచిత నిర్ణయాలను విమర్శించే వారు లేకుండా చేసుకుంటున్నానీ ఆనంద పడుతూ ఉండవచ్చు. ఈ సభ్యులలో ఎంతమంది టి.టి.డి. సరిగ్గా నడవడానికి ఇ.ఓ. కాళ్ల కు అడ్డు పడకుండా ఎందరు ఉంటారు? ఇప్పటికే టి.టి.డి నిధులు ధార్మికేతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారు. ఈ అంశాల పట్ల ఆవేదన చెందే ధర్మ కర్తలు ఎందరు? TTD లాంటి మిని రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో నిపుణులుగా ఉన్న సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి అనుచిత నిర్ణయాలు జరుగుతున్న వేళ దేవాలయాల నిర్వహణా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి భావిస్తోంది. దేవాదాయ శాఖను రద్దు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్నది.పెద్దలు,భక్తులు ఈ దిశలో కార్యాచరణ చేయాలి.