రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్), విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) సంస్థలను తాలిబన్లతో పొల్చినందుకు బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్‌పై ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై స్పందించిన థానే హైకోర్టు నవంబర్ 12న విచారణకు హాజరు కావాలని జావెద్ అక్తర్‌కు సోమవారం నోటీసు జారీ చేసింది.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త థానే సివిల్ కోర్టులో అడ్వకేట్ ఆదిత్య మిశ్రా , అడ్వకేట్ స్వప్నిల్ కాలే ద్వారా సివిల్ పరువు నష్టం దావా వేశారు. “ఆర్.ఎస్.ఎస్ సంస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా జావేద్ అక్తర్ వ్యాఖ్యలు చేయడంపై తాను బాధపడ్డానని, అందువల్ల అతనిపై పరువు నష్టం దావా వేసినట్టు పిటిషనర్ తెలిపారు.”
అక్తర్ ఆరెస్సెస్ ప్రతిష్ట దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని, ఆయన రూ కోటి పరిహారం చెల్లించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఆదిత్య మిశ్రా వాదించారు. హిందువుల కోసం పనిచేస్తున్న సంస్ధను అరాచక తాలిబన్లతో పోల్చడం ప్రజల్లో ఆరెస్సెస్ ప్రతిష్టను మసకబార్చే ఉద్దేశంతోనే అక్తర్ మాట్లాడారని ఆరోపించారు.
జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రౌత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సంస్థలను తాలిబాన్‌లతో పోల్చడం ఖండించదగినదని అలాంటి పోలిక హిందూ సంస్కృతికి అగౌరవమని సంజయ్ రౌత్ అన్నారు. అక్తర్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ముంబైలోని తన నివాసం బయట నిరసనకు దిగారు.
Source : OEGANISER