గీతాజయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన గీతాపారాయణ కార్యక్రమం సుసంపన్నమయింది. భాగ్యనగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లక్ష యువగళ గీతార్చనతో మారుమ్రోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాల నుండి వచ్చిన యువతీయువకులు కూడా ఇందులో పాల్గొన్నారు.
పూజ్య సాధుసంతులు, స్వామీజీలు, విశ్వహిందూ పరిషత్ అఖిల భారత అధికారులు అశేష ప్రజానీకం దీనికి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలైంది. పూజ్యులు త్రిదండి చినజీయ్యర్ స్వామీజీ, విశ్వప్రసన్న స్వామీజీ, గోవిందగిరి మహరాజ్ లతోపాటు అనేకమంది సాధుసంతులు, విశ్వహిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ మిళింద్ పరాండే, జాతీయ సంయుక్త కార్యదర్శి శ్రీ వై రాఘవులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ. గంగాధర శాస్త్రి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఓంకార నాదంతో సభా కార్యక్రమం ప్రారంభమైంది. విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు గారు గీతా పారాయణ కార్యక్రమ ప్రణాళిక, ప్రధాన ఉద్దేశ్యాలను తెలియజేశారు. భగవద్గీత ఎవరైనా చనిపోయినప్పుడు వినిపించే మృత్యుగీత కాదని జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఉపకరించే జీవన గీత అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మరోసారి అందరికీ గుర్తుచేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలియజేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు రమేశ్ నివేదిక సమర్పించారు.
ఆ తరువాత అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మిళింద్ పరాండే మాట్లాడుతూ రాగల వారం రోజులలో దేశం మొత్తంలో ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతాయని తెలిపారు. శ్రీకృష్ణుడు అర్జునిడికేకాక మనందరికీ కర్తవ్య బోధ చేశాడని అన్నారు. హృదయదౌర్బల్యాన్ని వదలి ధర్మ రక్షణకు సన్నద్ధం కావాలని గీత మనకు చెపుతుందని ఆయన అన్నారు. ధర్మాచారణ, ఆ ధర్మాన్ని పరిరక్షించేందుకు పూనుకోవడం ధార్మిక జీవనానికి ప్రధాన అంశాలని ఆయన గుర్తుచేశారు. నేడు దేశవ్యాప్తంగా హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని ఎదుర్కునేందుకు అందరూ సన్నద్ధులు కావాలన్నదే మనకు భగవద్గీత చేసే కర్తవ్య బోధ అని అన్నారు. తనను చేరుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉన్నదని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడని, కనుక సమాజంలో కుల, వర్గ, ప్రాంత, భాషా భేదాలు మరచి అంతా భగవద్భక్తులు కావాలని, సమరస భావం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. భగవద్గీతాచారణ ద్వారా సమతతో కూడిన, శోషణముక్త సమాజాన్ని నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆ తరువాత భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి గీతా పారాయణ నిర్వహించారు. ఎంపిక చేసిన 40 శ్లోకాలను ఆయన ఆలపిస్తుండగా సభికులందరూ ఆయనతోపాటు కలిసి పఠించారు.
ఆ తరువాత పూజ్య త్రిదండి చినజియ్యర్ స్వామి ఆశీ ప్రసంగం చేశారు. భగవద్గీతా సందేశం నిత్య నూతనమైనదని, మన బాధ్యతలను గుర్తుచేసేదని అన్నారు. మహోన్నతమైన ఈ దేశంలో పుట్టినందుకు ఇక్కడి సంస్కృతి సభ్యతలు, సంస్కారాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని స్వామీజీ ఉద్బోధించారు. భారతదేశం ఎప్పటికీ విశ్వగురువేనని, మనం మరచిపోయిన జ్ఞాన, విజ్ఞాన పరంపరను గుర్తుచేసుకుని, దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. గీతా శ్లోకాలను కేవలం వల్లెవేయడం మాత్రమే కాకుండా వాటిని ఆచరించాలని అప్పుడే ఇప్పుడున్న గందరగోళ, విచిత్ర పరిస్థితి నుండి మనం బయటపడగలుగుతామని, అప్పుడే గీతా జయంతి ఉత్సవాలకు సార్ధకత అని చిన జియ్యర్ స్వామీజీ తమ ప్రసంగాన్ని ముగించారు.
ఉడిపి పెజావర్ పీఠాధిపతి పూజ్య విశ్వప్రసన్న స్వామీజీ మాట్లాడుతూ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడని, ఉంటాడని, కానీ ఇప్పుడు అర్జునుడే అవసరమని, దైవభక్తి ఎంతో దేశభక్తి కూడా అంతే ముఖ్యమని అన్నారు. లక్ష యువగళ గీతార్చనకు వచ్చిన అశేష ప్రజానీకంతో లాల్ బహదూర్ స్టేడియం నిండిపోయింది. స్టేడియం అన్ని వైపులా ఏర్పాటు చేసిన పురాణ పురుషుల చిత్రాలతోపాటు దేశ భక్తుల చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్టేడియం మొత్తం కాషాయ జెండాలతో కళకళలాడింది.