హిందువులపై ఇస్లాం మతోన్మాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 7న ధర్మ జాగరణ జిల్లా ప్రముఖ్ రవిపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే .. RSS కార్యకర్తలు, హిందూ మున్నాని తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు కుంబమ్ ప్రాంతానికి చెందిన రవి ఆటో విడి భాగాల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రవి గత 10 సంవత్సరాలుగా ఆర్.ఎస్.ఎస్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు. అలాగే తన పరిసర ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఉచిత పథకాలను వివరిస్తూ వారికి సాయం చేస్తున్నాడు. అయితే రవికి చెందిన ఒక స్థలంలో కూడలూరుకు చెందిన అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి జంతువుల కళేబరాలు, వ్యర్థాలను పారేస్తున్నాడు. వాటిని తన స్థలంలో వేయవద్దని రవి చెప్పాడు. తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని రజాక్, అతని వ్యక్తులు రవిని బెదిరించారు. దీంతో ఈ విషయంపై రవి నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రజాక్‌ను పిలిపించి రవికి చెందిన స్థలంలో వ్యర్థాలను వేయవద్దని గట్టిగా చెప్పారు.
అయితే ఇన్‌స్పెక్టర్ హిందువుల పక్షం వహిస్తున్నారని ఆరోపిస్తూ ముస్లింలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ జనవరి 7న రవి తన దుకాణం తెరవడానికి వెళ్తుండగా.. రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు ఇనుప రాడ్‌లు, కొడవళ్లు, కర్రలతో రవిపై దాడి చేశారు. రవి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి నేలపై కుప్పకూలిపోయే వరకు వారు అతన్ని కొడుతూనే ఉన్నారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాల పాలైన రవిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవి పరిస్థితి నిలకడగా ఉందని, ఇంకా స్పృహలోకి రాలేదని వైద్యులు తెలిపారు.
రవిపై దాడిని ఖండిస్తూ ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మున్నానీ, వీహెచ్‌పీ సంస్థలు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనలు నిర్వహించి, నిందితులను చట్టం ముందు నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.