Home News భారతదేశంలో మహిళా సాధికారత…

భారతదేశంలో మహిళా సాధికారత…

0
SHARE

-వాణి సక్కుబాయి

స్త్రీమూర్తి కి ఇచ్చే స్థానాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి,ఆ దేశ  నాగరికత, చరిత్ర  సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం  తెలుస్తుంది. స్త్రీ తత్వానికి యుగయుగాలనుండి ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ.. ఆరాధనా భావంతో సముచిత స్థానమే భారతీయ స్త్రీకి ఉందనేది నిజం. భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో, భారతీయ సనాతన చరిత్ర వాస్తవ ఆధారాలు మనకు మనదేశంలో స్త్రీకి కల్పించిన అతి ఉన్నతమైన సాధికారక స్థానం వర్ణింపనలవి కాని అనుభూతిని కలిగిస్తుంది.

సనాతన భారతీయ చరిత్ర … ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలలో స్త్రీ స్థానం ఉన్నత మహిళ సాధికారత వైపుకే నడిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ,రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా  స్త్రీలు బలోపేతంగానే ఉన్నారని చరిత్ర అధ్యయనం ద్వారా మనకు అవగతమవుతుంది.

కాలానుగుణంగా సనాతనం నుండి నేటి వరకు  విదేశీ మూకల ఎన్నో దాడులకు గురి అవుతూ మన దేశం పరిపాలన పరంగా ,ఆర్థికంగా, ధార్మిక ,సామాజికంగా మార్పులకు లోను కావడం వల్ల.” భారత స్త్రీ స్థానంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి” ఆ పరిస్థితులను తట్టుకొని తన శక్తి యుక్తులకు అనుగుణంగా, అస్తిత్వాన్ని, జ్ఞానాన్ని స్త్రీలు చాటుతూనే ఉన్నారు.

ప్రాచీన భారతం నుండి  మహిళలు పురుషులతో సమానంగా అన్ని విభాగాలలో సమాన హోదా గౌరవాన్ని పొందారు, పొందేలా వారు తమ వ్యక్తిత్వాన్ని, తమ శక్తిని అనుసరించి తమ ప్రతిభను ప్రదర్శించారు.
అలా మన దేశానికి మూల భారతీయ నాగరికతగా చెప్తున్న సింధు నాగరికత ప్రపంచానికి పట్టణ నాగరికత ను పరిచయం చేసి మాతృస్వామిక సామాజిక వ్యవస్థగా నిలవటానికి స్త్రీల భాగస్వామ్యం ఎంతో ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అనగా స్త్రీకి సంపూర్ణమైన సాధికారత ఈ దేశం లో పూర్వం నుండే వెల్లివిరిసింది అని అంచనా వేయవచ్చు. ఆ తర్వాత వైదిక సంస్కృతికి మూలమైన వేద నాగరికత గ్రామీణ జీవన సౌశీల్యం ను ప్రపంచానికి తెలియపరిచి రాజకీయ పాలనా రంగంలో “సభ- సమితి” అనబడే ప్రజా పాలన సంఘాలలో మహిళలకు ప్రముఖ పాత్ర ఉందని, వారి నిర్ణయానికి ప్రాధాన్యత కల్పించాలని తెలుస్తోంది.

పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్త ల రచనల ప్రకారం వేదకాలపు ప్రారంభంలోనే ఋషి పరంపర కలిగిన మన దేశం. స్త్రీ మూర్తులు రిషికలు గా సమాజంలో గౌరవాన్ని పొందుతూ విద్యాధికులుగా సమాజంలో అన్ని రంగాలలో నిర్ణయాలు తీసుకునే విధంగా సామాజిక జీవనం ఉండేది. దీనికి ధార్మిక తార్కాణంగా ఋగ్వేదం, ఉపనిషత్తుల సాక్షిగా మహిళా సాధికారతకు నిదర్శనంగా “గార్గి ,మైత్రేయి “వంటి రిషిక లు మంత్రద్రష్టలుగ అపార జ్ఞాన సముపార్జనతో స్త్రీ సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారని చెప్పవచ్చు.

తదనంతరం జైన ,బౌద్ధ సిద్ధాంతాలు వ్యాప్తి చెందుతున్న సమయంలో సైతం స్త్రీలకు సమాజంలో అన్ని రకాలుగా ఆర్థిక, సామాజిక ,సాంస్కృతిక, ఆలోచన పరంగా సంపూర్ణ స్వేచ్ఛ ఉందని జైన త్రిపీటకాలు, బౌద్ధ జాతక కథల ద్వారా అవగతమవుతోంది.

ఉత్తర భారతంలోని మగధ, మౌర్య గుప్తుల పాలనా కాలంలో సైతం మహిళలు తమ అస్తిత్వాన్ని చాటుకున్నారు. తల్లి పేరుతో చక్రవర్తి పేరును సంబోధించే చారిత్రక సంప్రదాయానికి దక్షిణ భారతంలోని శాతవాహన పాలకుల పాలన వేదికగా నిలుస్తోంది. ఇంతటి సంపూర్ణ స్వేచ్ఛ స్వతంత్ర తో స్త్రీ ఆలోచనలకు అస్తిత్వానికి సాధికారతకు భారత చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోంది.

తదనంతర విదేశీ మూకల ఆక్రమిత భారత మధ్యయుగ పాలనాకాలంలో సైతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తప్పని ఆంక్షలను పరిమితులను, సంపూర్ణంగా స్వీకరిస్తూ సమయానుసారంగా స్త్రీలు తమ వ్యక్తిత్వాన్ని ఆలోచనను, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రదర్శిస్తూ, సాధికారతను తన ఉనికిని చరిత్రలో నిలుపుకున్న ఘనత భారత నారీ శక్తిది అని చెప్పవచ్చు.
పరాయి పాలకుల పాలనలో సైతం మహిళలు మొదటి చక్రవర్తులుగా రాజ్యపాలన చేస్తూ రజియా సుల్తానా భారతీయ సనాతన స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలిచారు. గోండు రాణి దుర్గావతి మొగల్ పాలకులను ధీటుగా ఎదుర్కొన్నది. దక్షిణ భారతదేశంలో కాకతీయుల పాలనకు ఎంతో వన్నె తెచ్చిన రాణి రుద్రమదేవి ఎంతో రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తూ దౌత్య పరంగా పాలనాపరంగా, ఆర్థికంగా రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతూ తన రాజ్యంలోని మహిళలను కూడా ధీరోదాత్తులుగా మలిచారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విద్య ,సామాజికం, రాజకీయం సాంస్కృతిక రంగాలలో మహిళలు తమదైన శక్తియుక్తులతో నేటికి భారతీయ మహిళలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

“మాత సమాజ నిర్మాత “కావున భారతీయ వనిత తనకున్న కుటుంబ బాధ్యతలతో పాటుగా. ఆర్థికంగా కుటుంబానికి వెన్ను దన్నుగా ఉండే ఉద్యోగ జీవితంలో సైతం రాణిస్తూ, వృత్తిపరమైన నైపుణ్యాలు ప్రదర్శిస్తూ, అందరికీ ఆదర్శంగా ఉన్నారు. కొన్ని దురదృష్ట పరిస్థితులు నేడు విదేశీ భావజాలంతో కూడిన సైద్ధాంతిక పోకడలు, మితిమీరిన స్వేచ్ఛ, స్వాతంత్రం అనే ముసుగులో ఎన్నో అనర్థాలకు దారితీస్తూ స్త్రీ భద్రతకు సాధికారత కు ముప్పు వాటిల్లుతోంది. నేటి ఆధునిక భారత స్త్రీలు అంగారక గ్రహంపైకి తమ జ్ఞానాన్ని చేరేలా తమ శక్తిని ప్రదర్శించిన స్వాతి మోహన్, వందనల ఆలోచనలు  మేధాశక్తి ఆదర్శం. నేటి భవిష్యత్ తరాలకు “ఆధునికత అనేది ఆహార్యంలో కాదు, ఆలోచనలో, ఆచరణలో ఉండాలంటూ… భారత మహిళా సాధికారతకు విశ్వమే హద్దుగా తెలియజేశారు.

భారత స్వాతంత్రానంతరం రాజ్యాంగపరంగా మహిళలందరికీ సమానత్వం, సాధికారత, గౌరవాన్ని పెంపొందించే విధంగా భద్రత కల్పించడం జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా, స్త్రీలను స్వశక్తులను చేయుటకై ఎన్నో ప్రభుత్వ పరమైన చట్టాలను, ప్రత్యేక పథకాలను భారత ప్రభుత్వాలు కల్పిస్తూనే ఉన్నాయి. అలా 2001 నుండి మహిళా సాధికారత సంవత్సరం స్వశక్తి గా ప్రకటించబడింది. అలా మహిళా అధికార జాతీయ విధానం అమలులోకి వస్తూ, భారత మహిళ సంపూర్ణ సర్వతోముఖాభివృద్ధికి భారత ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేసింది.

ఇలా సనాతన భారత చరిత్ర నుండి నేటి ఆధునిక స్వతంత్ర భారతంలో సైతం…. అన్ని రంగాల్లో మహిళలకు రక్షణ కల్పిస్తూ వారి సంపూర్ణ అభివృద్ధికి చేయూత అందిస్తూ భారత సమాజంలో స్త్రీ స్థానానికి పదిలమైన గౌరవమైన ఆరాధనా భావంతో కూడిన సుహృద్భావ వాతావరణం మన భారత దేశంలో మహిళా సాధికారతకు ఆస్కారం కల్పిస్తున్నాయి. కానీ ఆధునికంగా, విజ్ఞానపరంగా సాంకేతికంగా , ఎంత అభివృద్ధి చెందినా అంతే ఎక్కువగా మహిళా రక్షణ విషయంలో ఆందోళనలు కూడా నేటి మహిళా సమాజానికి ప్రశ్నగానే మిగిలి పోతోంది. కాబట్టి !!! ఆలోచిద్దాం. సరైన విధంగా, మన స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ. సంపూర్ణంగా మన ఆలోచనలకు తగినవిధంగా అభివృద్ధిని సాధిస్తూ సామాజిక విలువల పరంగా మహిళాలోకం తమ గౌరవాన్ని నిలుపు కోవాల్సిన బాధ్యత. విద్యుక్త ధర్మం. నేటి నారీ శక్తి భుజస్కంధాలపై ఉందనేది ముమ్మాటికీ ఇది ఎవరూ కాదనలేని వాస్తవం.

కాబట్టి “భారత నారీ సాధికారతకు మూలమైన ఆధునిక మహిళా మేలుకో.. పాశ్చాత్య సిద్ధాంతపరమైన ముసుగులో కొట్టు మిట్టఆడకుండా సనాతనధర్మ చారిత్రక వాస్తవాలలోని స్త్రీ శక్తిని తెలుసుకుంటూ భారత మహిళ అబల కాదు, సబల నంటూ. నేటి ఆధునిక యుగానికి సంపూర్ణ సాధికారతతో కూడిన బాటను మలుచుకోవాలి. అని కోరుకుంటూ.

వ్యాస‌క‌ర్త‌: ఉపాధ్యాయురాలు, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా