అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు సంత్ తుకారామ్ పరోక్షంగా ఊతమిచ్చారు. ధర్మ నిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడటంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారామ్. తాను రచించిన అభంగాల్లో విఠలేశ్వరుని కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించే మార్గానికి దారి చూపారు. భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు అజన్మాంతం పాటుపడిన నామ్‌దేవ్ ఏకనాథ్, జ్ఞానేశ్వర్ తదితర మహాత్ముల సరసన సంత్ తుకారామ్ నిలిచారు.