Home News సామాజిక మార్పులో సోషల్ మీడియా ప్రధాన భూమిక

సామాజిక మార్పులో సోషల్ మీడియా ప్రధాన భూమిక

0
SHARE
  • జాతిని నిర్వీర్యం పరిచే కుట్రలను తిప్పికొట్టాలి
  • ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ ప్రచారక్ దేవేందర్ జి

ప్రచార ప్రసార మాధ్యమాలు ప్రస్తుతం తమ విశ్వసనీయతను కోల్పోయినట్టు ప్రజలు భావిస్తున్న తరుణంలో సోషల్ మీడియానే సామాజిక మార్పులో కీలక భూమిక పోషిస్తుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ చామర్ధి దేవేందర్ రాజు అన్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో సోషల్ మీడియా సంగమం కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక కృషి భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సుమారు 150 మంది సోషల్ మీడియా కార్యకర్తలు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త గా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ దేవేందర్ రాజు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రేరణతో ప్రారంభమైన సమాచార భారతి ద్వారా జాతీయ భావాలను పెంపొందించడమే కాకుండా జాతి వ్యతిరేక శక్తుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నాగరికత, సంస్కృతి కలిగిన భారత దేశం ఎన్నో విదేశీ దురాక్రమణలు, దాడులు జరిగినప్పటికీ వాటిని తట్టుకుని నిలబడ్డ ఏకైక జాతి భారత జాతి అని అన్నారు. కుల, మత, ప్రాంత,వర్గ, భాషా భేదాలు ఉన్నప్పటికీ జాతీయత అనే ఏకాత్మత భావంతో భారతజాతి అన్ని దాడులకు తట్టుకొని కూడా నిలబడిందన్నారు. అయితే ఈ జాతిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా విదేశీ శక్తులు కుల, మత, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టడం వల్లే మన అఖండ భారతదేశం ముక్కలైంద న్నారు మెకాలే విద్యా విధానం వల్ల అసలైన భారత జాతి చరిత్రను,మహాపురుషుల గాథలను కాకుండా విదేశీ చరిత్రను,విదేశీ దురాక్రమణ దారుల జీవితాలను నేటి మన విద్యార్థులు అధ్యయనం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కుల, మత, వర్గ,ప్రాంత భేదాలతో సామాజిక పరంగా జాతిని నిర్వీర్యం చేయడమే కాకుండా.. ఆధ్యాత్మిక భావనలను కూడా ప్రజల్లో క్రమ క్రమంగా తగ్గించడం కోసం అనేక కుట్రలు చేశారన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాల పై దాడులు చేయడం.. దేవి దేవతలను, ఆధ్యాత్మిక గ్రంథాలను కించపరచడం లాంటి చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. జాతీయ భావాలు, ఆధ్యాత్మిక భావాలను కోల్పోయిన జాతి నిర్వీర్యం కాక తప్పదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా ఇలాంటి దుష్ప్రచారాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ సరైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.సోషల్ మీడియా వేదికగా జాతీయ భావాలను పెంపొందించాలన్నారు. హిందూ సమాజం సంఘటితం కావడం వల్లే శక్తివంతమైన ప్రధాని భారతదేశానికి దొరికాడని కొన్ని విదేశీ పత్రికలు ప్రచురించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు.శక్తి వంతమైన సమాజ నిర్మాణం కోసం సోషల్ మీడియా కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

సోషల్ మీడియా సంగమం కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ చక్రవర్తుల రమణాచారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ అధ్యక్షుడు చిలక మారి సంజీవ ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథిగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు శ్రీరామ్ శ్రీకాంత్ హాజరై సోషల్ మీడియాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. సమాజంపై సోషల్ మీడియా ప్రభావం… సామాజిక మార్పుకు సోషల్ మీడియా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలపై పలువురు వక్తలు అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ ప్రచార ప్రముఖ్ తడిగోప్పుల శంకరయ్య, జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీ గీకూరీ శ్రీనివాస్, జిల్లా సోషల్ మీడియా ప్రముఖ్ శ్రీ పురాణం రాము, మాసం శ్రీనివాస్, రాజేశ్ శర్మ, సుధా వైష్ణవి, శారద, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.