Home Telugu Articles అది సంకుచిత ‘హిందూరాష్ట్ర దర్శనం’ కాదు

అది సంకుచిత ‘హిందూరాష్ట్ర దర్శనం’ కాదు

0
SHARE

మే 28, వీర సావర్కర్‌ జయంతి

భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో బ్రిటిష్‌ ‌పాలన చివరి దశాబ్దంలో (1937-1947) అఖండ భారత్‌ను  ఇండియా, పాకిస్తాన్‌లుగా విభజించే ఉద్దేశ్యంతో ద్విజాతి సిద్ధాంతం తలెత్తింది. ఆ అనైతిక, అరాచక రాజకీయ పరిణామాలకు భారత జాతీయ కాంగ్రెస్‌, ‌ముస్లింలీగ్‌లదే బాధ్యత.  ముస్లింలీగ్‌ ‌మత రాజ్యకాంక్ష, గాంధీజీ చెప్పిన హిందూ-ముస్లిమ్‌ ఐక్యతను ముస్లింలు తమ మత రాజ్య నిర్మాణానికి అనుకూలంగా మలుచుకోవడం విభజనకు బలాన్ని చేకూర్చాయి. ఈ రెండు సంస్థల నేతల అధికార కాంక్ష కూడా అఖండ భారతావని రెండుగా చీలిపోయే దుస్థితిని తెచ్చిపెట్టింది. అటు జాతీయ కాంగ్రెస్‌ ‌తొలితరం అగ్రనేతలలో అంతర్లీనంగా ఉన్న హిందుత్వ, జాతీయాభిమానం సన్నగిల్లిపోవడం, ఇటు ముస్లింలీగ్‌లో ముస్లిం రాజ్య స్థాపనే ధ్యేయంగా రాజకీయ దుర్నీతి ప్రబలడం కూడా చరిత్రలో కనీవినీ ఎరుగని రక్తపాతం మధ్య దేశం చీలిపోవలసిన స్థితిని తెచ్చిపెట్టాయి.

అలాంటి తాత్త్విక, సామాజిక, రాజకీయ చారిత్రక సంఘర్షణలో హిందూ జాతీయతావాద ప్రవక్తగా నిలిచిన వారే వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కార్‌ (‌మే 28,1883-ఫిబ్రవరి 26,1966). తొలి నుంచి గాంధీజీ సిద్ధాంతాలతో విభేదించిన స్వాతంత్య్ర సమరయోధుడు. నిరుపమాన త్యాగశీలి. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం వేసిన రెండు జీవితకాలాల (యాభై ఏళ్లు) ద్వీపాంతరవాస శిక్షతో జైళ్లపాలైన ఆ సమరయోధునికి 24 ఏళ్ల తర్వాత కొంత స్వేచ్ఛ లభించింది. కానీ రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఇంకొంత కాలం కొనసాగింది. హిందుత్వ రాజ్య భావోత్తేజితుడైన వీర సావర్కర్‌ అఖిల భారత హిందూ మహాసభలో ప్రవేశించారు. ఆ సంస్థ అధ్యక్షునిగా 1937 నుండి ఆరేళ్లు పాటుపడ్డారు. హిందూరాష్ట్ర (దేశం) ఆవిర్భావం ఆయన కల. 1937 కర్ణావతి (అహ్మదాబాద్‌), 1938 ‌నాగపూర్‌ (‌మహారాష్ట్ర), 1939 కలకత్తా (బెంగాల్‌), 1940 ‌మధురై (తమిళనాడు), 1941 భాగల్పూర్‌ (‌బిహార్‌), 1942 ‌కాన్పూర్‌ (ఉత్తరప్రదేశ్‌) ‌వార్షిక సమావేశాలలో, ఇతర ప్రసంగాలలో, అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్ష హోదాలో వీర  సావర్కార్‌ ‌తన అభిప్రాయా లను వెలువరించారు. బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని దేశం నుండి పారదోలవలసిందే. ఏది ఆ దేశం? ఏది హిందుస్తాన్‌? ‌వంటి అంశాల గురించి ఆయనకు పూర్తి స్పష్టత ఉంది. సింధు నదీ ప్రాంతం నుంచి ప్రాచీన భారత ఆర్యావర్త సముద్ర పర్యంతం విలసిల్లిన పవిత్రభూమి హిందుస్తాన్‌ అన్న నిర్వచనాన్ని ఆయన ముందుకు తీసుకువచ్చారు. హిమాలయోన్నత శిఖరాలపై హిందుత్వ విజయ పతాకను ఎగుర వేసేందుకు జరిపే పోరాటం కోసం  భారతజాతికి పిలుపు ఇచ్చారు.

ఆ సింధు సింధు పర్యంతా యస్య భారత్‌ ‌భూమికా ।

పితృ భూః పుణ్య భూయైశ్చైవ స వై హిందురితిస్శృతః ।।

కర్ణావతి హిందూ మహాసభ వేదికపై నుంచి, సావర్కార్‌ ‘‌హిందూ’ పద నిర్వచనానికి ‘ఆ సింధు, సింధు పర్యంత’ శ్లోకాన్ని ఉదాహరించి, హిందూ రాజ్యస్థాపన లక్ష్యాన్ని చెప్పారు. అయితే  హిందూ మహాసభ కేవల మత సంబంధి కాదని, జాతీయ సంస్థగా, హిందుస్తాన్‌లో నివసించేవారందరి కోసం హైందవ రాజ్యాన్ని స్థాపిస్తుందని అన్నారు. భారత స్వరాజ్యం లేదా స్వాతంత్య్రం అంటే హిందువులు యావన్మందికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధింప చేయడమేనని ఆయన భావన.హైందవ సామ్రాజ్య విజేతగా ఛత్రపతి శివాజీ  మొగల్‌ ‌పాలనను తుద ముట్టించాడని, బ్రిటిష్‌ ‌పాలనాధిపత్యం కూడా అనతికాలంలోనే తుడిచిపెట్టుకు పోగలదని చెప్పేవారు. ముస్లిమ్‌ ‌లీగ్‌ ‌లక్నో సమావేశం గురించి ప్రస్తావిస్తూ, జిన్నా, ఇతర నాయకులు జాతి వ్యతిరేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారాయన. అనుమానాస్పదంగా ఉండే మిత్రులకంటే, బాహాటంగా వ్యవహరించే శత్రువు నయమని వ్యాఖ్యానించారు.

నాగపూర్‌ ‌మహాసభలో…

1938 నాగపూర్‌ అఖిల భారత హిందూ మహాసభ 20వ వార్షిక సమావేశ అధ్యక్షునిగా వీరసావర్కార్‌ ‌గళం విస్ఫులింగాలు విరజిమ్మింది. అచంచల హిందుత్వ తత్త్వవేత్తగా సావర్కార్‌, ‌మహాయోధ పృథ్విరాజ్‌, ‌రాణా ప్రతాప్‌, ‌ఛత్రపతి శివాజీ, గురుగోవింద్‌ ‌సింగ్‌, ‌నానా ఫడ్నవీస్‌, ‌మహద్‌జి షిండే వంటి హైందవ యోధుల చారిత్రక జీవిత విశేషాలకూ, భారత జాతీయతకూ ఉన్న బంధాన్ని తన ప్రసంగంలో పేర్కొన్నారు. నిజాం సంస్థానంలో మరాఠా దౌత్యవేత్త గోవిందరావు కాలే, హిందూ సమరయోధుడు నానా ఫడ్నవీస్‌కు 1793లో రాసిన ఉత్తరంలో ప్రస్తావించిన హిందూ సామ్రాజ్య ప్రాభవాన్ని కూడా సావర్కార్‌ ఈ ‌మహాసభలో  ప్రస్తావించారు. ‘‘అట్టక్‌ (‌పాకిస్తాన్‌లో ఉంది) నుంచి హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన భూమి హిందువుల మాతృభూమి. అదే హిందుస్తాన్‌. అది తుర్కస్తాన్‌ ‌కానే కాదు. పాండవుల పాలన నుంచి విక్రమాదిత్యుని వరకు అక్కడ హిందూ సామ్రాజ్యాలు విలసిల్లాయి. తర్వాత ముస్లిమ్‌ ‌రాజ్యమైనా పేష్వాలు, మహద్‌జీ షిండే హిందూ సామ్రాజ్య విజేతలుగా మళ్లీ వాటిపై విజయ పతాకం ఎగురవేశారు’’ అని చెప్పారాయన.

శతాబ్దాల పర్యంతం హిందూ, ముస్లిమ్‌, ‌క్రైస్తవ, పార్శీ తదితరులు కలసి మెలిసి నివసిస్తున్న హిందుస్తాన్‌ ‌మతం, భాష, సంస్కృతి, ఇతర చారిత్రక విభేదాలు ఉన్నా, ఒకే పునాది మీద విస్తరించిన జాతిగా పునురుజ్జీవనం పొందాలని  నాగపూర్‌లో వీరసావర్కార్‌ ‌తన జీవన వాంఛీతాన్ని ఆవిష్క రించారు. కాంగ్రెస్‌ ‌నేతలు సృష్టిస్తున్న కుహనా జాతీయవాదం కారణంగా మలబార్‌ ‌నుంచి పెషావర్‌ ‌వరకు, సింధ్‌ ‌నుంచి అస్సాం వరకు తమ జన్మ భూమిలోనే హిందువులు నిస్సహాయంగా ఉండిపోతు న్నారని ఆక్రోశించారు. ‘‘రామేశ్వరం నుంచి పెషావర్‌ ‌వరకు  హిందువుల మీద జరుగుతున్న ఘోరకలికి మూల కారణం ఏమిటి?’’ అని ప్రశ్నిస్తూ, ప్రస్తుత సమాధి స్థితి నుంచి హిందుత్వాన్ని పునరుజ్జీవింపచేసి, ప్రజ్వరిల్ల చేయగల శక్తి ఈ జాతిలో నిక్షిప్తమై ఉందని గుర్తు చేశారు కూడా. ఆర్యావర్తపు మహర్షుల హోమాగ్ని జ్వాలలే సంకేతంగా హిందూ సామ్రాజ్యం ఎన్నో విజయ పరంపరలు సాధించిందనీ, హిందూ సంఘటనవాదులు ఐక్య హిందూ జాతీయ వేదికపై ధర్మపతాకను ప్రతిష్ఠించి, ఆత్మాభిమానంతో, అచంచల విశ్వాసంతో సగర్వంగా తల ఎత్తుకొనే హిందుస్తాన్‌ ఆవిర్భవించాలనీ పిలుపునిచ్చారు. హిందూధర్మానికీ, రాష్ట్రానికీ (దేశానికి) విజయం సిద్ధించాలని నినదిస్తూ, వందేమాతరం అంటూ సావర్కార్‌ అధ్యక్షోపన్యాసం ముగించారు.

1939-1945 మధ్యకాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం మన స్వాతంత్య్ర పోరాట దిశను మలుపు తిప్పింది. అప్పటివరకు గాంధీజీ నాయ కత్వంలో సాగుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పోరాట సంస్థగా హిందూ మహాసభకు స్వాతంత్య్ర వీర సావర్కార్‌ ‌తన కలం, గళం అందించి ప్రాణ ప్రతిష్ఠ చేసారు. మరాఠాలు, సిక్కుల త్యాగాలతో నిలిచిన చారిత్రక హిందూ రాజ్య వైభవాన్ని గుర్తు చేస్తూ, మహమ్మదీయుల ఢిల్లీ సామ్రాజ్య పతనాన్ని చారిత్రక ఆధారాలతో సహా ప్రస్తావించారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరోత్తేజాన్ని ఆయన గుర్తు చేశారు. మే 10, 1942న హిందూ మహాసభ స్వాతంత్య్రదినంగా జరిపింది. ఆ రోజు హిందూ సంఘటనవాదుల పాకిస్తాన్‌ ఏర్పాటు పిలుపును వ్యతిరేకించే ప్రదర్శనలతో యావత్‌ ‌హిందూదేశం సావర్కార్‌ అడుగుజాడలలో నడిచింది.

కలకత్తా హిందూ మహాసభలో…

1939లో కలకత్తాలో జరిగిన హిందూ మహాసభ వార్షిక సమావేశంలో సావర్కార్‌ ఇచ్చిన అధ్యక్షోపన్యాసంలో నైజాంలో హిందువుల పరిస్థితులను వివరించారు. అక్కడ సాగుతున్న హిందూ వ్యతిరేక విధానాలు, అణిచివేతలపై ఆర్యసమాజం, హిందూ మహాసభ, ఇతర హిందూ సంఘటనవాదుల పౌర ప్రతిఘటన, ఉద్యమ నైతిక విజయం వంటి అంశాలను ప్రస్తావించారు. స్వరాజ్య అంటే స్వత్వ, కలిసిన హిందుత్వంగా పేర్కొంటూ, ఔరంగజేబ్‌ ‌లేదా టిప్పు వంటి వారి పాలన హిందూ స్వరాజ్యం కాలేదని స్పష్టీకరించారు. ఆర్యావర్తం, భారతభూమి వంటి ప్రాచీన పదాలు ఉన్నా, హిందువుల మాతృభూమిగా హిందుస్తాన్‌, ‌దేశభాషగా సంస్కృతం గుర్తింపు పొందాలన్నారు. స్వచ్ఛమైన సంస్కృత నిష్ఠంగా ఉన్న హిందీకీ, వార్ధా విద్యా విధానంలోని హిందుస్తానీకీ సంబంధం లేదన్నారు. హిందూ మహాసభ హిందూ ధర్మ మహాసభ కాదని, హిందూ జాతీయ మహాసభగా సర్వజాతి హిందూ జీవన సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పూర్ణ స్వరాజ్య స్వాతంత్య్ర సాధనకు కట్టుబడి ఉందన్నారు. హిందూ సంఘటనను కోరుతున్న పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌ ‌కుహనా జాతీయవాదులు మతతత్వ పార్టీగా ప్రచారం చేయడంపై వీర సావర్కార్‌ ‌తీవ్రంగా స్పందించారు. గాంధీజీ నియంతృత్వంలో కాంగ్రెస్‌ ‌హిందూ నాయకులు హిందూ జాతికి ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రానున్న రెండేళ్ల నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగంగా హిందూ మహాసభ కార్యకర్తలకు సావర్కార్‌ ‌కలకత్తా సమావేశ అధ్యక్షునిగా అంటరానితనం నిర్మూలన, యువతకు తప్పనిసరి సైనిక శిక్షణ, హిందూ సంఘటన వాదులకు ఎన్నికలలో విజయం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయవలసిందిగా నిర్దేశించారు.

మధురై హిందూ మహాసభ

అఖిల భారత హిందూ మహాసభ వార్షిక సమావేశాలలో మధురైలో నాల్గవసారి అధ్యక్షునిగా సావర్కార్‌ ‌బాధ్యతలు చేపట్టారు. తీవ్ర అస్వస్థత కారణంగా అధ్యక్ష బాధ్యత నిర్వహణలో డా।। పి.వరదరాజులు నాయుడుకు తన నిస్సహాయతను వ్యక్తం చేసినా ప్రయోజనం లేకపోయింది. మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీకి సంబంధించి హిందూ సంఘటన ఉద్యమం సేలంకు చెందిన విజయరాఘవ చారియర్‌ ‌వంటి పెద్దల అండదండతో త్రివేండ్రం నుంచి రాజమండ్రి  వరకు ఊపందుకుంటున్న తరుణమది. ధర్మవీర్‌, ‌డా।। మూంజే, ఎం.ఎన్‌. ‌ముఖర్జీ, డా।। శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ, ధర్మవీర్‌ ‌భోపట్కర్‌ ‌వంటి నాయకుల సారథ్యంలో జాతీయ స్థాయిలో ఎన్నికల రంగంలో హిందూ సంఘటనోద్యమానికి లక్షలాది కార్యకర్తలు భారత జాతీయ కాంగ్రెస్‌తో తలపడుతున్న రోజులవి. హిందూ మహాసభ, హిందూ సంఘటనిస్ట్ ‌పార్టీగా రూపొందింది. కాంగ్రెస్‌, ‌ముస్లింలీగ్‌ల రాజకీయ కుతంత్రాలను తిప్పి కొట్టాలని సావర్కార్‌ ‌దృఢ కార్యాచరణ నిర్దేశించి చేపట్టారు. సావర్కార్‌ ‌రచనలు హిందుత్వ, హిందూ-పద్‌-‌పాద షాహి (హైందవ స్వరాజ్య సమరగాధ), హిందూ సంఘటన్‌, ‌మహాసభ చరిత్ర, భాగనగర్‌ ‌సంఘర్షణ (ఇందప్రకాశ్‌, ఎస్‌.ఆర్‌.‌డాటే రచనలు) నాడు హిందువులను కదిలించి సంఘటిత పోరాటానికి సంసిద్ధం చేస్తున్నాయి. మధురై సభాధ్యక్షునిగా, సావర్కార్‌ ‌నాటి ద్వితీయ ప్రపంచ సంగ్రామ స్థితిని సమీక్షించారు. యుద్ధమే సదవకాశంగా హిందువులు అత్యధికంగా సైనికి శిక్షణ పొందాలని, పారిశ్రామికీకరణ సాధించాలని మహాసభ తీర్మానించింది. కళాశాలలు, పాఠశాలలో సైనిక శిక్షణ తప్పనిసరిగా ఉండాలని, రామ్‌సేన ఏర్పాటు, పౌర రక్షణ దళాలు, నూతన పరిశ్రమలు, విదేశీ వస్తు బహిష్కరణ, జనగణన వంటి 8 ప్రధాన అంశాల ప్రచారానికి హిందూ సంఘటిస్ట్‌లు దేశ వ్యాప్తంగా దృష్టి కేంద్రీకరించాలని వినాయక దామోదర్‌ ‌సావర్కార్‌ ‌మహాసభ అధ్యక్షునిగా ఉత్తేజవంతమైన సందేశంలో భారత జాతిని ప్రభావితం చేశారు.

భాగల్పూర్‌ 23‌వ జాతీయ మహాసభలో…

1941లో నిషేధపు ఉత్తర్వులు ఉన్నప్పటికీ బీహార్‌లోని భాగల్పూర్‌లో సావర్కార్‌ అధ్యక్షతన జరిపిన హిందూ మహాసభ సదస్సు విజయవంత మైంది. ‘హిందువులదే హిందుస్థాన్‌’, ‘‌హిందూ ధర్మానికే విజయం’ నినాదాలతో బ్రిటిష్‌ ఇం‌డియా  హిందూ సమాజం నినదించింది. అంతకు ముందుటి ఏడాది మహాసభ చేపట్టిన సామాజిక సంస్కరణలలో భాగంగా అంటరానితనంపై పోరాటం, ఎన్నికల రంగంలో విజయాలు, హిందూ రాష్ట్ర ఆశయ వ్యతిరేక శక్తులను ప్రతిఘటించడం వంటి అంశాలలో మహాసభ ఇంకొన్ని అడుగులు ముందుకు వేసింది. హిందువుల ప్రతీ ఓటు  హిందూ మహాసభ అభ్యర్థులకే లభించాలని, కాంగ్రెస్‌, ‌ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీల కుహనా జాతీయతావాదాన్ని పరాజితం చేయాలని సంఘటనవాదులకు సావర్కార్‌ ‌తక్షణ కర్తవ్యాలుగా ప్రబోధించారు. రెండవ ప్రధాన అంశంగా సావర్కార్‌, ‌పారిశ్రామికీకరణ, సైనిక శక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

కాన్పూర్‌ 24‌వ వార్షిక మహాసభలో…

మహాసభ భాగల్పూర్‌లో నిర్వహించిన పౌర ప్రతిఘటనోద్యమంలో హిందూ జాతి నలుమూలల నుంచి వచ్చిన సంఘటనవాదులు ధర్మయుద్ధంలో లాఠీలు, తుపాకులు నిర్భంధాలకు ఎదురొడ్డి హిందుత్వ పతాకను విజయధ్వజంగా, వీర సావర్కార్‌ ‌స్ఫూర్తి ప్రదాతగా ఆమోదించారు. స్వాతంత్య్రం వెంటనే ప్రకటించాలని, సంపూర్ణ అధికారయుతంగా జాతీయ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన శాసనాధికారం కోసం 1942 కాన్పూర్‌ ‌సమావేశం డిమాండ్‌ ‌చేసింది. వీర సావర్కార్‌, ‌డా।। శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ, డా।। మూంజే, బారిష్టర్‌ ‌ఛటర్జీ, రాజా మహేశ్వర్‌ ‌దయాల్‌ ‌సేఠ్‌, ‌రాయ్‌ ‌బహదూర్‌ ‌మెహర్‌ ‌చంద్‌ ‌ఖన్నా, ప్రొ.దేశ్‌పాండేలతో ప్రత్యేక కమిటీ ఏర్పడింది. బ్రిటిష్‌ ‌ప్రధాని చర్చిల్‌కు మహాసభ అధ్యక్షుడు సావర్కార్‌ ‌తంతి పంపించారు. 1942లో సావర్కార్‌ ‌స్వతంత్రం సాధించే దిశలో హిందుస్తాన్‌ ‌భవితవ్యానికి చరిత్రాత్మకమైన మహాదార్శనికుగా సారథ్యం వహించి కీర్తి శిఖరం అధిష్ఠించారు. హిందూ మహాసభకు వరుసగా ఆరుసార్లు అధ్యక్ష బాధ్యత నిర్వర్తించి 1954 నాటికి డా।। శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీకి అప్పగించారు. సుదీర్ఘ పోరాటంలో ఒక ఉజ్జ్వల ఘట్టమది.

బొంబాయి ప్రచురణ సంస్థ ‘వీరసావర్కార్‌ ‌ప్రకాశన్‌’ ఆయన రచించిన ‘హిందూ రాష్ట్రదర్శన్‌’ ‌ప్రచురించింది. ఈ గ్రంథానికి మహాసభ ప్రముఖ నేత ఎస్‌.‌టి. గాడ్గిల్‌ ‌ముందుమాట రాశారు. అందులో, గాంధీజీ నాయకత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్‌ ‌కారణంగా హిందూమతానికీ, జాతికీ,  సంస్కృతికీ, ప్రధానంగా హిందుత్వ జాతీయ సంస్థాపక మహదాశయానికి ఎదురైన స్థితిగతులను సావర్కార్‌ ఏ ‌విధంగా ప్రతిఘటించినదీ ప్రస్తావించారు.

(భారత స్వాతంత్య్ర సమర చరిత్రలోని ఆఖరి అంకంలో అత్యంత కీలకమైన ‘అఖండ భారత్‌ ‌విభజన’ పతాక సన్నివేశం సందర్భంలోని కొన్ని ముఖ్యాంశాలను ఈ వ్యాసకర్త ‘హిందూ రాష్ట్ర దర్శన్‌’ ‌గ్రంథం నుంచి అనువదించి అందచేసారు. వీరసావర్కార్‌ 139‌వ జయంతి (28 మే 1883) పురస్కరించుకొని ఈ విశేష వ్యాసం ‘జాగృతి’ అందచేస్తోంది.)

– జయసూర్య, సీనియర్‌ ‌జర్నలిస్ట్

జాగృతి సౌజ‌న్యంతో…