దశాబ్దాల పరాయి పాలనలో ఎంతో పోగొట్టుకున్న భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న తరుణమిది. అలాగే చారిత్రక తప్పిదాలను సరిచేసుకుంటున్న దేశం కూడా. ఇంతకు ముందు ఆ తప్పిదాలను సరిదిద్దుకోవడంలోనూ అలసత్వమే కనిపించింది. ఇప్పుడు అది మారింది. దేశ భవిష్యత్తును శాసించే, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను నిలిపే కొత్త విద్యా విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆధునిక దృష్టిని కోల్పోకుండానే, భారతీయ మూలాలను విస్మరించకుండానే రూపొందించిన విధానమిది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యాభారతి సూచనలతో రూపొందిన కొత్త భారతీయ విద్యావిధానం వైపు ప్రపంచ దేశాలు దృష్టి మళ్లించాయి. ఐదేళ్ల తపస్సుతో సిద్ధమైన కొత్త విద్యావిధానాన్ని జూలై 29, 2020న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దేశంలో రాష్ట్రాలు దశలవారీగా అమలు చేయడం మొదలయింది. 1986లో చివరిసారి వచ్చిన విద్యా విధానం స్థానంలో దీనిని అమలు చేస్తున్నారు. కొత్త విధానంలో కనిపించేదే సానుకూల దృక్పథం కలిగిన పెను మార్పు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు, వృత్తి విద్యా కోర్సుల వరకు, సంస్కృతి, గ్రామీణ దృక్కోణం, వ్యక్తిత్వ వికాసం, విద్యార్థులలో సృజనాత్మక దృష్టి, మాతృభాషలో బోధనలకు కొత్త విధానం ప్రాధాన్యం ఇచ్చింది. నాలుగేళ్ల ఉపాధ్యాయ శిక్షణతో ఉపాధ్యాయ వ్యవస్థకు కొత్త రూపును సంతరింపచేసింది. ఇక ఉపాధ్యాయునిగా జీవించాలని కోరేవారే ఆ ఉద్యోగానికి వస్తారు.
పుస్తకాల బరువు తగ్గించి, నేర్చుకునే సామర్థ్యాన్ని ఈ విధానం పెంచబోతున్నది. ఈశాన్య రాష్ట్రాల వారు సహా, దేశం మొత్తం మీద రెండు లక్షల గ్రామాల వారు ఈ విధానంలో భాగస్వాములయ్యారు. ఎన్నో సంస్థలు సలహాలు ఇచ్చాయి. ఈ దేశంలోని 40 కోట్ల మంది విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన విధానమిది. కోటిన్నర ఉపాధ్యాయులు దీనిని అమలు చేయబోతున్నారు. ఈ విధాన రూపకల్పనలో కీలక పాత్ర వహించిన విద్యాభారతి జాతీయ అధ్యక్షులు దూసి రామకృష్ణ కొత్త విద్యా విధానం గురించి జాగృతికి ఇచ్చిన ముఖాముఖిలోని కొన్ని అంశాలు:
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా తర్జని ఎత్తడానికి ఎందరో నిరీక్షిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ‘నూతన విద్యావిధానం 2020’ వచ్చింది. దీనికంటే ముందు ఈస్టిండియా కంపెనీ మొదలు, రాణి పాలనలో, స్వతంత్ర భారతదేశంలో చాలా విద్యా విధానాలు రూపొందాయి. కొన్ని ప్రత్యేక కమిషన్లు- సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్, మహిళా విద్యా కమిషన్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కమిషన్, మరో రెండు మహిళా విద్యా కమిషన్‌లు వచ్చాయి. హన్సా మెహతా కమిటీ, భక్తవత్సలం కమిటీ, కొఠారీ కమిషన్… ఇవన్నీ. వాటికీ ‘నూతన విద్యా విధానం 2020’కీ మధ్య ప్రధాన భేదం ఏమిటి?
చాలా ఉంది. ఆ విధానాలూ, ఆయా కమిషన్లూ కేవలం విద్యలో ఒక్కొక్క విషయానికీ, దశకీ పరిమిత మైనవే. వాటి నివేదికలు ఆ మేరకే ఉన్నాయి. అంతేతప్ప సమగ్రం కావు. రాధాకృష్ణన్ కమిషన్ ఉన్నత విద్యావ్యవస్థకు సంబంధించినంత వరకే పట్టించుకుంది. మొదలియార్ కమిషన్ మాధ్యమిక విద్య గురించి నివేదిక ఇచ్చింది. ‘నూతన విద్యా విధానం 2020’ వాటికంటే ఎంతో సమగ్రంగా రూపొందింది. సమగ్రం అని ఎందుకు చెప్పవచ్చు నంటే- ఈ విధాన రూపకర్తలు మొట్టమొదటే ఒకటి మనసులో పెట్టుకున్నారు. అన్ని ప్రాంతాలక•, అన్ని భాషలకు, మనకు అందుబాటులో ఉండే అనేక విద్యా విషయాలు, పాఠ్యాంశాలు, మన ప్రాచీన పరంపర లకు ప్రాతినిధ్యం వహించే, భారతీయ చింతన ఆధారంగా ఒక సమగ్రమైన విద్యా విధానం రావాలని ఆదిలోనే సంకల్పించుకున్నారు. అందుకే కొత్త విద్యావిధానం రాబోతున్నదని 2015 జనవరిలో ప్రకటించగానే విస్తృత చర్చ జరిగింది.
విధాన రూపకల్పనలో ఎవరెవరు భాగస్వాము లయ్యారు?
ఈ ప్రస్థానంలో ఎంతెంత మందిని సంప్రదించారు అని ప్రశ్నించుకుంటే – మామూలుగా చెబుతారన్నమాట. రెండున్నర లక్షల గ్రామాల నుంచి సూచనలు పంపించారు. అంటే మామూలు వ్యక్తులు కూడా భాగస్వాములయ్యారు. 650 పైగా జిల్లాలు ఇందులో ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి. అనేక సంస్థలూ భాగం పంచుకున్నాయి. ఈ మథనం ఎన్నాళ్లు జరిగింది? సుమారు 5 సంవత్సరాలు. 2015 జనవరిలో కొత్త విధానం గురించి ప్రకటించారు. విధానం సిద్ధమై, ఆమోదం పొందిన జూలై 29, 2020 వరకు సంప్రదింపుల పక్రియ సాగింది. బహుశా భారతీయ విద్యారంగ చరిత్రలో ఇంత సమగ్రంగా, ఇందరి ప్రాతినిధ్యంతో ఉన్న విద్యా విధానం ఇంతవరకు తయారు కాలేదనే చెప్పుకోవాలి.
కొత్త విద్యావిధానంలో బోధన అనే అంశంలో మౌలికంగా కనిపించే మార్పు ఏమిటి?
దీనికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యని పిల్లలకి చేర్చే పద్ధతుల్లో పెద్ద మార్పు తీసుకువచ్చారు. అంటే, మనం అమలు చేస్తున్న విద్యాబోధన విధానాన్ని మార్చారు. ఇంతవరకు ఉన్న పద్ధతి ఏమిటి? సర్వశిక్షపైన దృష్టి పెట్టాం. ఇప్పుడు సమగ్రశిక్షపైన దృష్టి పెట్టాలన్న యోచన ఉంది. ఈ సర్వశిక్ష అభియాన్‌లన్నీ అందుకే వచ్చాయి. అంటే అందరిని అక్షరాస్యులను చేయాలనే కాన్సెప్ట్‌తో వెళ్లారు. దాని పర్యవసానాలను పరిగణన లోనికి తీసుకుని ఈ మార్పు చేశారు. మొత్తంగా చూస్తే ఒక పరిపూర్ణ వికసిత వ్యక్తిత్వం గురించి కొత్త విద్యా విధానం ప్రతిపాదించింది. ఇంతకు ముందు వ్యక్తిత్వ వికాసానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు తగినంత ఇచ్చారు. దానికోసమే పక్రియలన్నిటికీ కూడా, గతివిధులు, చర్యలకీ, పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నిటికీ ఒక సమగ్రత తీసుకొచ్చారు. అంటే, ఇంతవరకు ఉన్న కర్రికులర్, కో కర్రికులర్, ఎక్స్‌ట్రా కర్రికులర్ లాంటి పదాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే అన్నీ కర్రికులరే (విద్యా విషయికాలే). ఆడినా, పాడినా, గెంతినా, ఏదైనా మాట్లాడినా, విన్నా – అన్నీ కూడా పాఠ్యప్రణాళికలో భాగమే. జ్ఞానార్జన పక్రియలో ఇక ప్రతిదీ భాగమే. తర్వాత రెండు పదాలను రూపకర్తలు పదే పదే ప్రయోగించారు. ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్, రెండు క్వాలిటీ యాక్సెస్. అసలు కొత్త విద్యావిధానానికి యాక్సెస్ (అందుబాటు), ఈక్వాలిటీ (సమానత్వం), క్వాలిటీ (నాణ్యమైనది), అకౌంట్‌బిలిటీ (జవాబుదారీతనం) అనేవి మూల స్తంభాలుగా ఉన్నాయి. ‘క్వాలిటీ క్వాలిటీ’ అని పదేపదే చెప్పడంతో మొత్తం ప్రపంచమంతా దీనివైపు దృష్టిపెట్టింది. మొదటిసారిగా మన విద్యావిధానాన్ని ప్రపంచంలో అందరూ మెచ్చుకునే వాతావరణం వచ్చింది. ఇంతకుముందు కంటెంట్ పైన దృష్టి ఎక్కువ. ఇప్పుడు కాంపిటెన్సీ పైన దృష్టి ఎక్కువ. సామర్థ్ధ్యాన్ని వికసింపచేయడమే ప్రధానం. నేర్చుకోవడానికి కావలసింది అదే. అందుకే ఏం చేశారు? చిన్న చిన్న మాడ్యూల్స్ (విభాగాలు) తయారు చేసుకొని, దాని ఆధారంగా నేర్పే పద్ధతికి నాంది పలికారు. దీంట్లో ఇంకొక విశేషం ఉంది. గతం పునాదిగా, భవిష్యత్‌కు బాట వేసుకోవడానికి ఈ వర్తమానంలో చేసే ప్రయోగాలు కీలకంగా ఉంటాయి. అందుకే కొత్తకొత్త పదాలు వచ్చాయి. జ్ఞానార్జన పక్రియకు అనుభవమే ప్రధానమవుతుంది. చిన్న అయినా పెద్ద అయినా అందరూ అనుభవించి నేర్చుకోవాలి. ఒక విధంగా ఇది లైఫ్ ఛేంజింగ్, మైండ్ క్రాఫ్టింగ్.
వ్యక్తి నిర్మాణం అనే కీలక అంశాన్ని ఈ విధానం ఎలా స్వీకరించింది?
వ్యక్తి నిర్మాణానికి అవకాశం కల్పించే విద్య అంటూ మనం ఎన్నాళ్లుగానో గోల పెట్టాం! అలాంటి వ్యక్తి నిర్మాణమే కేంద్ర బిందువుగా ఉన్న విద్యా విధానం ఈ రోజు వచ్చింది. ఇంతవరకు భారతీయ మైన లక్షణాలు, సంస్కృతిని ప్రతిబింబించే విద్యా విధానం లేదు. అది ఇందులో వివిధ రూపాలతో కనిపించింది. భారతీయ శిక్షణ పద్ధతులక• స్థానం కల్పించింది. భారతీయ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చింది. భారతీయ దర్శనం- ఫిలసాఫికల్ ఫౌండేషన్స్‌కు చోటు కల్పించారు. భారతీయ మనోవిజ్ఞానాన్ని కూడా మొదటిసారి పరిచయం చేశారు. మన సామాజిక పునాదులు ప్రత్యేకమైనవి. ఇంతవరకు జరిగినది అనుకరణ. కానీ మన వ్యవస్థ ప్రత్యేకమని చెప్పి, దానిపైన కూడా ఆలోచన మొదలుపెట్టి, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టే పని అద్భుతంగా జరుగుతున్నది. అలాగే విద్య అందరికి అందు బాటులో ఉండేటట్టుగా, తరతమ భేదాలు లేకుండా అందరూ ఒకేచోట ఉండేటట్టుగా, డ్రాపౌట్స్‌ను తగ్గించుకుంటూ, విద్యార్థి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్లే పద్ధతి ఇది.
సమాజాన్నీ, పాఠశాలనీ కొత్త విద్యావిధానం ఎలా అనుసంధానం చేస్తుంది?
పాఠశాల అంటే ఏమిటి? సామాజిక పరివర్తనకు అదొక కేంద్రం. అది సమాజంలో విడిగా ఉండే ఒంటి స్తంభం మేడ కాదు. అలాగే సమాజానికి సుదూరంగా ఉండే ద్వీపం కాదు. బడి అంటే సమాజంలో భాగంగా ఉంటూ, సమాజాన్ని తన దగ్గరకు తీసుకొంటూ, సమాజంలో మార్పునకు కృషి చేసే విస్తృత వ్యవస్థ అని మొదటి నుంచి మనదైన భావనలో ఉంది. దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, పునరుద్ధరించే పని ఇందులో చేశాం. అసలు విద్యాభారతిలో ఇలాంటి ప్రయత్నం చిరకాలంగా సాగుతున్నది కూడా. ఇది స్వాగతించదగ్గది, సంతోషించదగ్గది. ఒక పెద్ద పాఠశాల అంటే 5, 6 దశలలో విద్యాలయాలకు నెలవై ఉండాలి. అందులో సెకండరీ స్కూల్స్ ఉండాలి, మిడిల్ స్కూల్స్ ఉండాలి. మధ్యలో ఉండే ప్రిపరిటరీ స్కూల్స్ ఉండాలి. అంతకంటే కింద ఉండే ఫౌండేషన్ లెవల్ క్లాసెస్ ఉండాలి. అలా ఉండే నాలుగైదు పాఠశాలలు తీసుకుని, వాటి వికాసం కోసం ఇక్కడ ఉన్న వనరులలో భాగస్వామ్యం ఇవ్వాలి. వనరులు రెండు రకాలు. మానవ సంపాదన, భౌతిక సంపాదన. వీటితో కార్యక్రమాలు, ప్రశిక్షణ ఇవన్నీ ఆలోచించా లనే కాన్సెప్ట్ మనం ఇచ్చాం. దానిపైన వ్యాసాలన్నీ రాసి అందజేశాం. కాబట్టి అలాంటి ఆలోచనకు ఈ రోజున ఒక చోటు దొరికింది. ఈ విద్యావిధానం లోనే నాలుగు రకాలైన పదాలున్నాయి. ఒకటి: సింపుల్ ఛేంజ్, రెండు: రిఫార్మ్, మూడు: మోడిఫికేషన్, నాలుగు: ట్రాన్స్‌ఫర్మేషన్. ఒక చిన్న మార్పు, ఒక చిన్న సంస్కరణ, చిన్న రూపాంతరం అనే పరిధులకు పరిమితం కాకుండా, ఆమూలాగ్ర పరివర్తన దిశగా వెళ్లే కొత్త విద్యావిధానమిది.
ఉపాధ్యాయుడు లేదా ఆచార్యుడు… వీరిని కొత్త విద్యావిధానం ఎలాంటి స్థానంలో ఉంచుతుంది?
ఆచార్యుడే కదా మొత్తం విద్యా వ్యవస్థకి మూలస్తంభం వంటివారు! ఒకవిధంగా చెప్పుకోవా లంటే ఫ్రంట్‌లైన్ వారియర్. మొదటి పంక్తిలో నిలబడిన యోధుడు. ఇంత పెద్ద విధానాన్ని అమలు చేయాల్సింది ఆయనే. కాబట్టి ఉపాధ్యాయ శిక్షణ మీద నిశిత దృష్టి పెట్టాలి. మొత్తం మన దేశంలో 1.5 కోట్ల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అంత మంది గురువులను కలిగిన దేశాలు ప్రపంచంలో లేవు. ఇంత పెద్ద అధ్యాపక శక్తిని మనం సరిగా ఉపయోగించినట్లయితే ఎంత పెద్ద మార్పు వస్తుందో ఊహించలేం. కానీ ఇంతవరకు.. ఉపాధ్యాయ శిక్షణ మీద సరైన దృష్టి పెట్టలేదు. ఆ కారణంగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ప్రీ సర్వీస్ ట్రైనింగ్; ఈ రెండూ పెద్దగా విజయవంతం కాలేదు. విద్య వ్యాపారం అయిపోతున్నది, కమర్షియల్‌గా ఆలోచిస్తున్నారు అనే దానికి టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఒక తార్కాణం. ఇప్పుడు మనం ప్రతిపాదించింది- సమగ్ర బోధకుడు. ఉపాధ్యాయ శిక్షణ నాలుగేళ్లు ఉండాలి. ఎందుకు? ఎవరైతే టీచర్ కావాలని అనుకుంటాడో అతనే టీచర్ అవ్వాలి. అంతేకాదు. ఆ శిక్షణ కాలంలో 9 నెలలు ఇంటెర్న్‌షిప్ ఉండాలి. అది కూడా ‘మెంటర్’ పర్యవేక్షణలో ఉండాలి. అనుభవజ్ఞులైన టీచర్ల ద్వారా ఆ మెంటర్‌షిప్ లభించాలి. లేకపోతే ఏమౌతుంది? బోధన అవసరమైనంత పటిష్టంగా ఉండదు. ఇక ఉపాధ్యాయులు చెప్పకపోవటం ఒకటైతే, కోర్సు మెటీరియల్ కూడా అలాగే ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణం. వ్యవస్థలో ఉండే బలహీనతలు ఒకవైపు, నేర్పే ఆచార్యుల్లో బలహీనతలు మరొకవైపు. వీటన్నిటిని అధిగమించడానికి 4 సంవత్సరాల శిక్షణ అనివార్యమవుతుంది. అది సమగ్రంగా ఉంటుంది. 1.5 కోట్లు ఉన్న మన ఉపాధ్యాయులకు రెండు రకాలుగా తర్ఫీదు ఉండాలి. ఒకటి Continuous Professional Development. ఇవాళ వాళ్లకేదో చెప్పి వదిలేయటం కాదు. వారి వ్యక్తిగత ప్రగతి మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి. అందుకే ఇలా చెప్పారు- Every Teacher must be made Accountable, Answerable, Responsible. ఈ మూటింటి గురించి ఆరా తీయకపోతే కుదరదు. అతని ప్రగతిని మానిటర్ చేయడం కోసం, తాహతను పెంచేందుకు Continuous Professional Development కోసం మాడ్యుల్స్ అని ఇప్పుడు తయారవుతున్నాయి. దానివల్ల మార్పు వస్తుంది. ఇదొక నిరంతర పక్రియ. కొంతకాలం తర్వాత ఈ విధానం అమలులోకి వచ్చాక సంగతి. టీచర్స్ అందరికి పరీక్ష పెడతారు. వారిలో కనీస సామర్థ్యం ఉన్నదా? లేదా? వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూస్తారు. ఫలితాన్ని బట్టి కొంతమందిని తప్పకుండా ఎలిమినేట్ చేస్తారు.
జనాభాలో మనది ప్రపంచంలోనే రెండో స్థానం. ఆ మేరకు విద్యార్థి జనాభా కూడా ఉంటుంది. అంటే రేపటి జాతి సంపద. కాబట్టి సంఖ్యను బట్టి అయినా గురుశిష్య బంధాన్ని కొత్త కోణం నుంచి చూడాలి. కొత్త విద్యావిధానం దాని గురించి ఏం చెబుతున్నది?
మన విద్యా వ్యవస్థలో మొత్తం 40 కోట్ల మందికి పైగా విద్యార్థులున్నారు. అందులో 29 కోట్ల మంది సెకండరీ ఎడ్యుకేషన్‌వారే. అంగన్‌వాడీలలో 7 కోట్ల మంది ఉన్నారు. 4 కోట్ల మంది హయ్యర్ ఎడ్యు కేషన్‌లో ఉన్నారు. వీళ్లు 4.5 కోట్లు ఉంటారన్నా ఆశ్చర్యం లేదు. ఇందులో చదువు పూర్తి చేసుకున్న వారు, ఇతరత్రా వ్యాపకాలలోకి వెళ్లిన వారు..అంటే విద్యాలయాలు వీడి వెళ్లిన వారు 2 కోట్ల మంది విద్యార్థులు ఉంటారని అనుకుందాం.
అయినా 38 కోట్ల మంది విద్యార్థులు మన బడులలో ఎప్పుడూ చదువుతూనే ఉంటారు. వీళ్లకి ఎంతమంది టీచర్స్ కావాలి? అందుకనే నూతన విద్యావిధానం నివేదికలో ‘ నో టీచర్.. నో క్లాస్’ శీర్షికతో ఓ అంశం విడుదల చేశారు. దాంట్లో 10 పాయింట్స్ ఇచ్చారు. అద్భుతంగా ఉన్నాయి. టీచర్స్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన విషయాలూ ఉన్నాయి. ఉపాధ్యా యుడి పని, సామర్థ్యానికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో వచ్చే దశాబ్ది ఉపాధ్యాయుల దశాబ్ది కావాలి(Next decade should be the decade of Teacher’s). అప్పుడే కొత్త విద్యావిధానం అమలు చేయడం సాధ్యం అవుతుంది. ఇందుకోసమని చెప్పి National proficiency Test for Teachers అని నిర్వహించాలి. దీనికోసం సచ్ఛీలురుగా పేరున్న విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రముఖులను మెంటార్స్‌గా ఉపయోగించి ఉపాధ్యా యులకు కావల్సిన ప్రేరణ, సమాచారం, కావల్సిన సూచనలు ఇస్తే విద్యావ్యవస్థ మెరుగు పడుతుంది.
అంగన్‌వాడీలలో చదివే పిల్లలను కూడా ప్రధాన స్రవంతి విద్యా వ్యవస్థలోకి తెచ్చామని అన్నారు. అక్కడ ఏడు కోట్ల మంది చదువుతున్నారంటే చిన్న విషయం కాదు. దీనితో కలిగే ప్రయోజనం ఏమిటి?
కొత్తగా ECCE (Early Childhood Care and Education) వచ్చింది. ఇంతవరకు ఉన్న 13.77 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన స్రవంతి విద్యావ్యవస్థలో భాగం చేశాం. దీనితో ఏం జరిగింది? ఇంతవరకు తిండి పెట్టడం, నిద్ర పుచ్చడం అంటే, అంతా ఆరేళ్ల లోపు పిల్లల మానసిక భౌతిక వికాసానికి సరైన సమయంలో జాగ్రత్త తీసుకోవడం. దానికోసం కూడా ఆలోచించాలి. అది జరగనందువలన ఎంత నష్టం వాటిల్లుతుందో సైంటిఫిక్‌గా గుర్తించి, ఈ అంశాన్ని జోడించారు. కాబట్టి అంగన్‌వాడీలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం వల్ల ఇంకొక 24 లక్షల మంది టీచర్స్ తోడయ్యారు.
మాతృభాషలో విద్యాబోధన శాస్త్రీయమైన పద్ధతిని ఎంతమంది నిపుణులు చెబుతున్నా వ్యవస్థకు తలకెక్కడం లేదు. కొన్ని రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమమే ఉండాలని మంకుపట్టు పడుతున్నాయి. మాతృ భాషలో బోధన అనేది కనీసం ప్రాథమిక స్థాయిలో అయినా ఉండాలని కోరుకుంటున్న వాళ్లు తక్కువేమీ కాదు. దీని గురించి కొత్త విద్యావిధానం ఏం చెప్పింది?
ప్రాథమిక విద్య వరకే కాదు, అసలు 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న వాదనే మాది. నేనూ అదే చెప్పా. కానీ దురదృష్టం ఏమిటీ అంటే, మన వ్యవస్థలో విద్య ఉమ్మడి జాబితాలో ఉండిపోయింది. కొన్ని రాష్ట్రాలు వాళ్లు స్వేచ్ఛను అనుసరించి, ఇతర కారణాలతోను ఇంగ్లిష్ మీడియం అంటున్నారు. వాళ్లకి థియరీ తెలియక కాదు. పాపులారిటీ కోసం ఆలోచిస్తుంటారు. నిజానికి ఇప్పుడున్న విద్యా వ్యవస్థను నిర్వహించే వారంతా ఐఏఎస్ అధికారులే. మాతృభాష, దాని ప్రాధాన్యం, అందులో బోధన వంటి అంశాలలో ఇమిడి ఉన్న తాత్త్వికత ఏదీ వాళ్లకి తెలియదు.ఇంగ్లీషు మీడియం తప్ప మరేదీ తెలియక దాని వైపు మోజు చూపించి, వ్యవస్థను కూడా మభ్యపెడుతున్నారు. అయినా కూడా మాతృభాషలో బోధన అన్న అంశాన్ని కొన్ని రాష్ట్రాలయినా సానుకూల దృక్పథంతో ఉంటాయి. ప్రయోజనం పొందే యత్నం చేస్తాయి. ఉదాహరణకు ఒరిస్సా, బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఆ బాటలో ఉన్నాయి. కర్ణాటక కూడా ప్రయత్నిస్తున్నా, వాళ్లు ఇంగ్లీషు మీడియంకి వచ్చేశారు. ఇంకొక విషయం ఇది రికమెండరీయే గానీ, మేండేటరీ కాదు. అయినా మాతృభాషలో బోధన అన్న అంశాన్ని సానుకూలంగా కొందరైనా ఎందుకు తీసుకుంటున్నారంటే, భారతీయ భాషల మీద వెలుగు ప్రసరింప చేయడానికి ఇదొక పెద్ద అవకాశం. ఉదాహరణకు, ఈశాన్య భారత రాష్ట్రాలు. నేను పర్యటించినప్పుడు తెలిసింది, అక్కడ 180 భాషలున్నాయి. స్థానికంగా మాట్లాడే భాషలే అవన్నీ. వాటిని నిలబెట్టుకోవడానికి, వాళ్ల భాషల్లోనే వాళ్లకు పాఠాలు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. స్థానికంగా ఉన్నవారికే ఉపాధ్యాయులుగా తర్ఫీదు ఇస్తున్నారు. ఒక విధంగా ఆ భాషలకు పునర్ వైభవం వస్తుంది. దానితో పాటు ఇంతకాలం లేని లిపిని రూపొందించే అవకాశం కూడా వచ్చింది. కాబట్టి ఇది ఈశాన్య భారతానికి లబ్ధి చేకూరుస్తున్నది. అలాగే దేశంలోని ఇతర గిరిజన ప్రాంతాలకు కూడా ఇలాంటి లబ్ధి చేకూరుతుంది. వాళ్ల వాళ్ల భాషలు పునరుద్ధరించు కునేందుకు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించు కోవడానికి, భాషలు నేర్వడానికి అక్కడి వారు సిద్ధంగా ఉన్నారు. ఇది కూడా ఈశాన్య భారతంలోనే కనిపించింది కూడా. అక్కడ పెద్ద భాషా సదస్సు జరిగింది. సిక్కింతో పాటు, ఏడు ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు వచ్చారు. విద్యాశాఖ మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. లాంగ్వేజ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏ ప్రయోగం చేయడానికైనా ఈశాన్య భారతమే ప్రయోగశాలగా ఉపయోగపడాలని వారు కోరడం విశేషం. దీనివల్ల ఏ మాత్రం మంచి జరుగుతుంది? అనడం కంటే కూడా ఒకటి జరుగుతుందని ఆశించవచ్చు. భారతీయ భాషలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అంతవరకు చెప్పగలుగుతాను.
ఎంత అవాంఛనీయమంటే.. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఒక ఇన్విజిలేటర్ తాగి పరీక్ష కేంద్రానికి వచ్చాడని ఇటీవల వార్తాపత్రికలలో వచ్చింది. ఉద్యోగం నుంచి తొలగించారు. అలాంటి మనిషిని టీచర్‌గా ఎలా ఆమోదిస్తుంది సమాజం? పిల్లలకి ఎలాంటి సంకేతాలు వెళతాయి?
ఇప్పటివరకు అమలైన విద్యారంగ పద్ధతుల్లో పెద్ద లోపం-వ్యక్తిని తీర్చిదిద్దేవీ, అందుకుపకరించేవీ అయిన అంశాలపైన దృష్టే పెట్టలేదు. ఇప్పుడు విద్యావ్యవస్థ మారింది. కానీ మార్పులో భాగస్వాము లయిన వాళ్లందరికీ ఆ మార్పు గురించి పూర్తిగా తెలియాలని లేదు. మొన్న అక్టోబర్ 5న యునెస్కో నివేదిక వచ్చింది. దాని ప్రకారంగా చూసినట్లయితే సుమారు 25% మంది టీచర్స్ అసలు విధులకే వెళ్లటం లేదు. వ్యవస్థలో ఉండే లోపాలు, పాఠ్య ప్రణాళికలో ఉండే లోపాలను పట్టించుకునే వారు లేకపోవడం, అంతా రాజీ పడిపోతున్న కారణంగా ఇవన్నీ తలెత్తుతున్నాయి. ఉపాధ్యాయులకు సాధి కారిత ఉండాలి. వారిని బాధ్యత కలిగి ఉండేటట్టు మలచాలి. మోటివేట్ చేయాలి. అన్నిటికీ మించి ఉపాధ్యాయులను అప్‌డేట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ పిల్లల దగ్గర ఉండే సమాచారం టీచర్ దగ్గర కూడా ఉండడం లేదు. కానీ టీచర్ వ్యక్తిత్వం వల్ల ఆయనను గౌరవించి, విద్యార్థి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు తర్ఫీదు, మోటివేషన్… ఇవన్నీ ఎలా? అందుకు ఉన్న మార్గాలు ఏమిటి?
నేను మామూలుగా ప్రభుత్వంతో మాట్లాడుతూ చెప్పినదేమిటంటే, తర్ఫీదు కోసం మీ దగ్గర ఏమైనా వ్యవస్థ ఉందా? 1.5 కోట్ల ఉపాధ్యాయులకు మీరు ఎలా శిక్షణ ఇస్తారు? ఈ విషయం కంటే ముందు విద్యాభారతి ఈ విషయంలో ఏం చేస్తున్నదీ చెబుతాను. మా దగ్గర 1.75 లక్షల టీచర్స్ ఉన్నారు. వాళ్లందరికీ శిక్షణ కార్యక్రమం నేను ఏర్పాటు చేస్తున్నాను. ఈరోజు మీరు ఆలోచించే శిక్షణను మేము అప్పుడే మొదలెట్టేశామని ప్రభుత్వానికి చెప్పాం. వ్యక్తి నిర్మాణానికి సంబంధించినంత వరకు 24 అంశాలను మేం తయారు చేసి, దానికి కావలసిన సిలబస్, ఆక్టివిటీస్ అన్నీ డిజైన్ చేశాం. తర్వాత మా డొమైన్ ఒకటున్నది. 7 దశాబ్దాల నుండి మేము ఇసిసిఇ కూడా చేశాం. ఉపాధ్యాయ శిక్షణను నిరంతర పక్రియగా కొనసాగించడానికి గాంధీ ధామ్‌లో మా కేంద్రం ఉంది. అక్కడ ఉపాధ్యాయులు బృందాలుగా వెళ్లి శిక్షణ పొందుతారు. ఢిల్లీలోనూ ఒక కేంద్రం ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రతిచోటా కూడా పెద్ద పెద్ద శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. మేమంటే, మాకున్న ప్రత్యేకతలతో ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ఇతరులు చేయాలంటే చాలా కృషి ఉండాలి. సర్కార్ వారు సమగ్రంగా అమలు చేయకుంటే మిగిలిన విధానాల మాదిరిగానే కొత్త విధానం కూడా వృథా ప్రయత్నంగా ఉండిపోతుంది.
భాషల మధ్య అనుసంధానానికి, పరస్పరం గౌరవించుకోవడానికి కొత్త విద్యా విధానం ఏమైనా అవకాశం కల్పిస్తున్నదా?
ఇంతవరకూ అన్ని దేశ భాషలకు సమాన గౌరవం అన్న ఆలోచన రాలేదు. నేను మామూలుగా అడిగేవాడిని. నా ప్రశ్నలోని హేతుబద్ధతను నేడు అందరూ ఒప్పుకుంటున్నారు. అదేమిటంటే- దక్షిణాదిన దక్షిణ భారత హిందీ ప్రచారసభ పెట్టారు. ఉత్తర భారతంలో దక్షిణ భారత ప్రచార సభలు ఎందుకు పెట్టలేదు? అలా పెట్టినట్లయితే భారతీయ భాషల న్నింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నా రని అందరి దృష్టికి వస్తుంది. ఇలాంటి పని చేయకుండా అన్ని ప్రభుత్వాలు ఒకే విధంగా తప్పు చేశాయి. కాబట్టి భారతీయ భాషల కోసం ఒక సంఘం.. భారతీయ భాషలన్నింటికి ప్రాధాన్యమిచ్చే పద్ధతుల కోసం ఒక యోజన ఇప్పుడు జరుగుతున్నది. దానివల్ల ఒక భాషా ప్రాంతం వారు ఇంకొక ప్రాంతానికి వెళతారు. అటు నుంచీ, ఇటు నుంచీ వివిధ కార్యక్రమాలు రూపొందుతాయి.
మాతృభాషలో విద్యాబోధనను వెంటనే ఆశించ వచ్చునా?
దేశంలో వెంటనే మీడియం మారిపోతుందని నేను అనుకోవట్లేదు. మీడియం మారిపోయి మాతృ భాషలోనే బోధన అంతా జరగాలి అంటే దానికి రాష్ట్రాల సహకారమే ముఖ్యం. దానికంటే ముఖ్యమై నది- తల్లిదండ్రులలో చైతన్యం రావాలి. తల్లిదంద్రుల మద్దతు లేనిదే ఎవరూ ఏం చేయలేరు. కానీ చాలామంది తల్లిదండ్రులు భ్రమల్లో ఉన్నారు. కాబట్టి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయనిదే ఈ మార్పు సాధ్యం కాదు. కానీ రావలసి ఉన్న మార్పుకి ఈ ప్రయత్నం ఓ చిన్న అడుగని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు.
———————-
గతం అయోమయం
దేశానికి స్వాతంత్య్రం వచ్చినది మొదలు మెకాలే విద్యా విధానం మీద విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ దానిని మార్చే ప్రయత్నం జరగలేదు. నిజానికి ఆ విద్యావిధానమే కొనసాగా లని కొన్ని పార్టీలు, వాటిని ఆశ్రయించిన మేధావులు, విద్యావేత్తలు కూడా భావించడం ఇందుకు కారణం. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ/ఎన్‌డీఏ ప్రభుత్వం దేశ భవిష్యత్తును నిర్దేశించే ఈ రంగాన్ని సరిదిద్దడానికి శ్రీకారం చుట్టింది. మన పురాతన సంస్కృతిలో ఉన్న విద్యా విధానం వేరు. ముస్లింల ఏలుబడిలో రుద్దిన విద్య వేరు. ఇప్పుడు మనం అనుసరిస్తున్న విద్యావిధానానికి పునాదులు బ్రిటిష్ జాతి వేసినవే. భారతీయను మినహాయించిన ఈ విద్యావిధానాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మూడు వందల ఏళ్లుగా భారతదేశంలో ఇంగ్లిష్, క్రైస్తవ మత వ్యాప్తి ఆధారంగా జరిగిన విద్యా సంస్కరణల గురించి కొంచెం తెలుసుకోవాలి. మనదైన విద్యను, వృత్తులను నిర్మూలించిన ఘనత మిషనరీలదే.
ఈస్టిండియా కంపెనీ పాలనలో వచ్చిన చార్టర్ 1698 ప్రకారం మిషనరీలు తమ మత ప్రచారంతో పాటు విద్యను కూడా అందించాలి. కానీ మత పరంగా తటస్థంగా ఉండడం రాజకీయంగా చాలా అవసరమని భావించి ఈ చార్టర్ అమలుకు కంపెనీ పట్టుపట్టేది కాదు. పైగా కంపెనీయే పాఠశాలలు ప్రారంభించింది. మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ కాలంలో దేశంలో విద్యా బోధన సంస్కృతంలో జరగాలని కొందరు, పర్షియన్‌లో జరగాలని కొందరు వాదించారు. ఆంగ్లేయులు, వారి అభిమానులు మాత్రం ఇంగ్లిష్ మాధ్యమంగా జరగాలని కోరారు. ఈ వాదోపవాదాలలో ఒక ముఖ్య అంశం మరుగున పడింది. అది- మాతృభాషలో విద్యాబోధన. ఆ లోపమే ఇప్పటికీ కొనసాగుతున్నదన్న విమర్శ ఉంది. రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తలు దేశానికి ఆధునిక విద్య అవసరమని వాదించారు. ఇంగ్లిష్ విద్యతో భారతీయ సమాజం పునరుజ్జీవనం దిశగా ప్రయాణిస్తుందని భావించారు. ఆ నేపథ్యంలోనే 1823లో ప్రభుత్వ సలహాల కమిటీని నియమిం చారు. కొత్త విద్యావిధానం గురించి సిఫారసు చేయడమే దీని పని. ఈ కమిటీ అధ్యక్ష హోదాలోనే టీబీ మెకాలే భారతదేశం వచ్చాడు. ఇంగ్లిష్ విద్యకు ఓటేశాడు. విజ్ఞానార్జనకు భారతీయ భాషలు చాలవని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు, అరబిక్, సంస్కృతాలను కూడా పక్కన పెట్టమన్నాడు.
తరువాత చాల్స్ ఉడ్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. భారతదేశంలో విద్యా సంస్కరణలు తేవడం ఈ కమిటీ విధి. వంద పేరాలతో ఇతడు రూపొందించిన నివేదికను ‘మాగ్నాకార్టా ఆఫ్ ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ అన్నారు. ఐరోపా కళలు, సాహిత్యం, తత్త్వశాస్త్రం భారతదేశంలో బోధనాంశా లను చేసింది ఈ నివేదికే. ఎవరైనా కోరితే ఇంగ్లిష్, భారతీయ భాషలను కూడా చెప్పవచ్చు. 1857లో విశ్వవిద్యాలయాల ఏర్పాటు చట్టం వచ్చి మూడు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. మళ్లీ 1944లో జాన్ సార్జెంట్ నాయకత్వంలో విద్యా విధాన రూపకల్పనకు ఒక కమిటీ వచ్చింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం, భారత్ నుంచి బ్రిటిష్ జాతి నిష్క్రమించడం వంటి కారణాలతో దీనిని సరిగ్గా అమలు చేయలేదు.
స్వతంత్ర భారతదేశంలో చాలా కాలం తరువాత గాని విద్యా విధాన రూపకల్పనకు ప్రయత్నం జరగ లేదు. తరువాత సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండు సంఘాలను నియమించాలని నిర్ణ యించింది. ఒకటి విశ్వవిద్యాలయ విద్య గురించి, రెండు సెకండరీ విద్య గురించి. స్వరాజ్య సమరం సమయంలో తీసుకున్న నిర్ణయాలు, రాజ్యాంగ పరిషత్ ఆశయాల మేరకు ఆ రెండు సంఘాలను నియమించారు. 1948లో నియమించిన విశ్వ విద్యాలయాల కమిషన్ విద్య కోసం ఏర్పాటు చేసుకున్న కమిషన్ ఇదే. దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులు. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత విద్య ఉమ్మడి జాబితాలోకి వచ్చింది. 1952లో సెకండరీ విద్యా కమిషన్‌ను నియమిం చారు. దీనికి డా. లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షుడు. బహుళ ప్రయోజనాలు సాధించే విధంగా ఉన్నత పాఠశాలలు ఉండాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. 1960 సంవత్సరానికి కల్లా అందరికీ ఒకే ప్రాథమిక విద్య అన్న లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించారు. తరువాత 1964లో డీఎస్ కొఠారి కమిషన్ వచ్చింది. విద్యారంగంలో జాతీయ విధానం ఉండాలని ఈ కమిటీ సలహా ఇచ్చింది. ఆ ప్రకారమే మొదటి జాతీయ విద్యావిధానం 1968లో వచ్చింది. త్రిభాషా సూత్రం దీనితోనే వచ్చింది. 14 ఏళ్ల వరకు బాలబాలికలకు నిర్బంధ విద్యను కూడా ఇది ప్రతిపాదించింది. 1979లో డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, 1986లో మరొక జాతీయ విద్యా విధానం వచ్చింది. దీనికి మెరుగులు పెడుతూ వచ్చినదే 1996 నాటి విద్యావిధానం. ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాల కల్పనకు వచ్చినది ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ (1987). అందరికీ ప్రాథమిక విద్య అన్న ధ్యేయంతో 2000-2001 సంవత్స రంలో సర్వశిక్ష అభియాన్ విధానం వచ్చింది.
జాగృతి సౌజన్యంతో…