Home News భారత 15వ‌ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం

భారత 15వ‌ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం

0
SHARE

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్‌ హాల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు.

అంతకుముందు ద్రౌపది ముర్ము.. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో కలిసి పార్లమెంటు సెంట్రల్‌ హాలుకు చేరుకున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. ఆదివాసీ గ్రామంలో పుట్టి, రాష్ట్రపతి భవన్ వరకు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రం కాదని దేశ ప్రజల విజయమని ఆమె స్పష్టం చేశారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలతో తన రాజకీయం జీవితం ప్రారంభమైందని, 75 ఏళ్ల ఉత్సవాల వేళ ప్రథ‌మ పౌరురాలిగా ఉండడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

ఓ సాధారణ ఆదివాసీ అయిన తనను దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టారని గుర్తు చేస్తూ దేశంలో పేదలు కలలు కనొచ్చు.. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని.. అందుకు తానే ఒక మంచి ఉదాహరణ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

“ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు నాకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దేశంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నా” అని, గత రాష్ట్రపతులందరూ ఈ పదవికి వన్నె తెచ్చారని కొనియాడుతూ “రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి” అని ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా దేశప్రజలకు ద్రౌపది ముర్ము కార్గిల్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్‌ రంగాల్లో దేశం దూసుకెళ్తోందని చెబుతూ అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాల్సి ఉందని , ‘సబ్‌ కా ప్రయాస్‌ సబ్‌ కా కర్తవ్య్‌’ నినాదం ముందుకు వెళ్లాలని ఆమె చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ద్రౌపతి ముర్ము కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.