Home Hyderabad Mukti Sangram భాగ్య‌న‌గ‌ర్ (హైదరాబాద్) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న – ఆరవ భాగము 

భాగ్య‌న‌గ‌ర్ (హైదరాబాద్) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న – ఆరవ భాగము 

0
SHARE

vసంఘ స్వయంసేవకుల భాగస్వామ్యం (వరాడ్, మధ్య భారత ప్రాంతాలు)

-డా.శ్రీరంగ్ గోడ్బోలే

సంఘ నిర్మాత డాక్టర్ హెడ్గేవార్ ముందర హిందూ సంఘటన నిర్మాణం అనే దీర్ఘకాలీన లక్ష్యం వుంది. అలాంటి దైనందిన కార్యానికి సమర్పితమైన సంఘం ఆ సంఘటన శక్తిని నైమిత్తికమైన ఉద్యమాలలో  ఒడ్డడం అనేది డాక్ట‌ర్‌జీకి అంతగా రుచించలేదు. అందుకె సంఘాన్ని ఉద్యమాలకి దూరంగా ఉంచుతూ, స్వయంసేవకులు వ్యక్తిగతంగా వాటిలో పాల్గొనడానికి ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ళల్లో కూడా సంఘలో బాధ్యత ఉన్న వాళ్ళని వాటికి దూరంగా ఉంచారు. సంఘ కార్యంలో దేశభక్తి సంస్కారాన్ని సంతరించుకున్న స్వయంసేవకులు ఎలాంటి సంస్థాగత లాభాలను ఆశించకుండా, ఒక జాగృత, బాధ్యతాయుత హిందువుగా అందులో పాల్గొనాల‌ని వారు స్వయంసేవకులకి స్పష్టం చేసారు.

సంఘ స్వయంసేవక్ అంటే ఎవరు?

భాగ్య‌నగర్ నిరాయుధ ప్రతిఘటనలో పాల్గొన్న తెలిసినవారు, తెలియనివారందరి పట్ల కృతజ్ఞ‌తా భావం తెలుపుతూ… ఈ వ్యాసంలో కేవలం ఉద్యమంలో పాల్గొన్న సంఘ స్వయంసేవకుల గురించే మాత్రమే ప్రస్తావిస్తాం.  ఎందుకంటే ఈ విషయం సామాజిక సాహిత్యంలోనే కాదు సరికదా సంఘ సాహిత్యంలో కూడా ఎక్కడా లిఖించలేదు. ఇందులోని వివరాలు కూడా ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయన్న విషయాన్ని కూడా పాఠకులు గమనించగలరు.

ముందుగా “స్వయంసేవక్ అంటే ఎవరు” అనే విషయాన్ని చూద్దాం. “ఎవరైతే సంఘ శాఖలో నిలబడి ప్రార్థ‌న చేస్తారో, లేదా ఎవరైతే తనను తాను సంఘ స్వయంసేవక్ అనుకుంటారో” అనే స్పష్టీకరణ ఇక్కడ సరిపోదు. నిరాయుధ పోరాటపు ప్రముఖ నాయకుడు లక్ష్మణ బళవంత (అణ్ణాసాహేబ్) భోపట్ కర్ గారు మహారాష్ట్రలో సంఘ ప్రముఖుడు కావాలనే కోరిక డా. హెడ్గేవార్ గారికి చాలా ఉండేది. కానీ రాజకీయాలలో  ఉండడం వల్ల అణ్ణాసాహేబ్ గారే ఆ బాధ్యతని నిరాకరించారు. (సంఘ అభిలేఖాగార్, హెడ్గేవార్ లేఖన సంకలనం, నానా పాల్కర్ / హెడ్గేవార్ నోట్స్ – 4, 4_96). ఈ ఆందోళన ముఖ్య సూత్రధారి శంకర్ రామచంద్ర (మామా రావ్) దాతే, పూనా హిందూ మహాసభ ప్రముఖ కార్యకర్త, ఈయనతో 1933లో డాక్ట‌ర్ జీ  స్వయంగా సంఘ ప్రతిజ్ఞ చేయించారు.  హిందూ మహాసభలో వున్న దాదాపు కార్యకర్తలంద‌రూ సంఘ ప్రార్థన చేసిన వారే. చాలా చోట్ల సంఘచాలకులు హిందూ సభ బాధ్యతలను కూడా చేపట్టారు. డా.హెడ్గేవార్ గారు స్వయంగా నాగపూర్ హిందూ సభ ఉపాధ్యక్షులుగా వున్నారు. హిందూ మహాసభ సమ్మేళనాల‌కు హాజర‌వుతుండేవారు. అందుకని భోపట్ కర్, దాతే ప్రభృతులు, వేల హిందూ మహాసభ కార్యకర్తలంద‌రూ స్వయంసేవకులే అనడం సబబు కాదు. అలా అని సంఘం వల్ల‌నే ఈ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పటం కూడా సరికాదు కాదు .

సాతారా జిల్లా సంఘ చాలకులు శివరాం విష్ణు (భావూరావ్)మోదక్, జిల్లా కార్యవాహ అనంత సదాశివ్ (భిడే గురూజీ) లు, పోరాటంలో అగ్రభాగాన నిలిచారు, కానీ డాక్ట‌ర్ జీ మరణానంతరం వాళ్ళకి సంఘంతో ఎలాంటి సంబంధమూ లేదు. అలా అని వాళ్ళు చేసిన పోరాటాన్ని తగ్గించి మాట్లాడలేదు. అందువల్ల పోరాటం సమయంలో వాళ్ళు సంఘతో అనుబంధం కలిగి వుంటే వాళ్ళని ఈ వ్యాసంలో స్వయంసేవకుల శ్రేణిలోనే పరిగణించాము. 1949  ఆగస్టు 1న ఆమోదించి 1995లో సవరించిన సంఘ‌ సంవిధానంలో స్వయంసేవక్ నిర్వచనాన్ని గ‌మ‌నిద్దాం. “ఏ వ్యక్తి సంఘం ఆశయాలను, భావాలను ఆదరిస్తాడో, వాటిని సహజంగా ఆచరణలో పెడతాడో, శాఖా కార్యంలో పాల్గొంటాడో, అలాంటి 18ఏళ్ళు లేక అంతకన్నా ఎక్కువ వయసున్న హిందూ వ్యక్తి ఎవరైనా స్వయంసేవక్  అనబడతాడు”. ఇదే పరిభాషను ఈ వ్యాసంలో కూడా ఉపయోగించాము. ఇప్పుడు సంఘ జన్మస్థానమైన మధ్యభారతం, వర్హాడ్ ప్రాంతాల వివరాలను ఈ వ్యాసంలో చూద్దాం.

మధ్యప్రాతం ఇంకా వర్హాడ్ ప్రాంతాలలో పోరాటం ఆరంభం

1938 అక్టోబరు చివ‌ర్లో నిరాయుధ ప్రతిఘటన పోరాటానికి సన్నాహాలు వర్హాడ్ ప్రాంతంలో జోరందుకున్నాయి. నాందేడ్ కి చెందిన గోపాల శాస్త్రీదేవ్, పరత్ వాడాకి చెందిన డా. గణేశ్ మార్తాండ పింపర్ కర్ లు పర్యటించ‌సాగారు. డా. పింపర్ కర్ గారు, డా. హెడ్గేవార్ గారి కలకత్తాలో చదువుకున్నప్పటి మిత్రులు, సంఘ స్వయంసేవకులు కూడా (సంఘ అభిలేఖాగార్ , హెడ్గేవార్ లేఖనం , నానా పాల్కర్/హెడ్గేవార్ నోట్స్ -3,3_04). 1938 నవంబరు 17 నాడు నాగపూర్ నుండి పోరాటం మొదటి జట్టు ఔరంగాబాద్ వైపున‌కు బయలుదేరింది. (కేసరి, 18 నవంబర్ 1938). 1939 జనవవరి 5 నాడు ఏడుగురు సభ్యుల వర్హాడ్ యుద్ధ మండలి స్థాపించారు. అందులో అకోలాకి చెందిన మామా సాహెబ్ జోగ్ళేకర్ గారు సర్వాధికారి కాగా డా. లక్ష్మణ్ వాసుదేవ్ (దాదాసాహెబ్) పరాంజపే, డా.యాదవ్ శ్రీహరి (తాత్యాజీ) ఆణే గార్లు యుద్ధ మండలి సభ్యులు, సంఘ ప్రముఖ కార్యకర్తలు కూడా (కేసరి , 2మే 1939 ).

వీళ్ళల్లో ఆణే గారు డాక్ట‌ర్ జీ కి కలకత్తా నుండి మిత్రులు, వణీ సంఘచాలకులు కూడా. 1939 జనవరి 9 – 27 రోజుల్లో ఆకోలా, వర్హాడ్  నుండి ఒక్కొక్క జట్టు బయలు దేరింది. ఈ రెండింటిలో ఉన్న సభ్యులను నిజాం సంస్థానంలో కాలుపెట్టగానే చితకబాది బ్రిటిష్ ఇండియాలో వదిలేశారు. ఆ తరువాత 1939 ఫిబ్రవరి 5న మొదటి జట్టు ప్రాంతీయ హిందూ సభ కార్యకారి మండలి సభ్యులు డా.ల.వ .పరాంజపే గారి నేతృత్వంలో నాగపూర్ నుండి బయలుదేరింది.

శిబిరం,ఉద్యమకారుల వ్యవస్థ

సత్యాగ్రహం లో పాల్గొనేవారికి శిబిరాలలో వ్యవస్థ చేయబడేది. వాశింలోని శిబిర వ్యవస్థ ప్రముఖ్‌, వాశిం సంఘచాలకులు శంకర్ గో(అణ్ణా  సాహెబ్) డబీర్ , అధివక్తా నారాయణ రామచంద్ర (బాబా సాహెబ్) ధనాగరే, అధివక్తా క్రృష్ణ రావ్ దేశ్పాండే (పార్డీ – రిసోడ్ కర్), అధివక్తా బాళాభావు చించ ఆంబేకర్, బాబాసాహెబ్ జత్కర్, రుక్మాంగద హరిశ్చంద్ర (ఆబాసాహేబ్ దేశ్ పాండే) ఇత్యాదులు ఉన్నారు. బుల్ఢాణ జిల్లాలోని లోణార్, మోహకర్ లలోని శిబిరాల వ్యవస్థ హిందూసభ, సంఘ కార్యకర్త అయిన గంగాధర్ అనంత (రాజాభావు) దేశ్ పాండే సోనాట్ కర్, దాదాసాహేబ్ సోనాట్ కర్, లక్ష్మణరావు కాటే, త్ర్యంబక్ తాత్యా సావ్ జీ, నానా మోళ్ కర్, మంజిత్ రావ్ దేశ్ ముఖ్ రాజేగావ్ కర్, దాదాసాహెబ్ సోమణ్ దీక్షిత్ లు ఉన్నారు. ఖామగవ్ (జి.బుల్ఢాణ్)లోని శిబిరం వ్యవస్థలో స్థానిక సంఘ చాలకులు డా.ప్ర.మ.కాళే గారు ఉన్నారు. (ద.గ.దేశ్ పాండే  జాఫ్ రాబాద్ కర్, హైదరాబాద్, వర్హాడ్ ముక్తి సంగ్రామ్, నవభారత్ ప్రకాశన్ సంస్థా ముంబాయి, 1987 , పు. 85,86; కేసరి , 10 ఫిబ్రవరి 1939).

డా.పరాంజపే గారి ప్రతిఘటన

1930లో డా.హెడ్గేవార్ గారు‌ ఆటవిక సత్యాగ్రహం లో పాల్గొన్నప్పుడు , డా.పరాంజపే గారు సర్ సంఘచాలక్ బాధ్యత నిర్వహించారు. తన హోదాని పక్కన పెట్టి పరాంజపే గారు సంఘ శైశవదశ నుండి ఈ కార్యంలో సమర్పణ భావంతో పాలుపంచుకున్నారు. వారి దళంతో డా.హెడ్గేవార్ గారు ఆర్వి వరకు తోడు వచ్చారు. (దేశ్ పాండే , పు.87). ఇందులో 22 కార్యకర్తలు ఉండగా అందులో 12మందికి సంబంధించిన వివరాలు సంఘ అభిలేఖాగార్ అందుబాటులో ఉన్నాయి (సంఘ అభిలేఖాగార్ , హెడ్గేవార్ రాతలు, correspondence -c/Baganagar Nishstr pratikar 001)

డా.ల.వ.పరాంజపే గారి 22 మంది సత్యాగ్రహ సదస్యులలోని 12 మంది సంఘ స్వయంసేవకుల వివరాలు :

– డా. లక్ష్మణ వాసుదేవ్ పరాంజపే – నాగ్ పూర్
– డా.వా.గ.శింగణాపూర్ కర్ – నాగ్ పూర్
– నారాయణ గోవింద తుపటే – నిర్మల్ స్కూల్, నాగపూర్; ము. అసోలా , పో. లాఖాందూర్ తా. సాకోలి జి . భండారా
– అణ్ణా కాశీనాథ్ పురణకర్ — పాటణసావంగి , తా. సావనేర్ , జి. నాగపూర్
– బా.హ. వడేర్ – చాందా (ఇప్పటి చంద్రపూర్)
– హ.స.వారే – నాగపూర్
– గ. వా. దేవఘరే – నాగపూర్
– ద.వి. నాయీక్ – నాగపూర్
– ద. శ్రీ.ఘుడే – నాగపూర్
– మోరేశ్వర్ రామచంద్ర జోషి – పాటణసావంగి
– ప్రధాన
– సూత్రపూరకర్

ఫిబ్రవరి 12న నిజాము సంస్థానంలో ప్రవేశించగానే ఈ జట్టును నిర్బంధించారు. (కేసరి , 14 ఫిబ్రవరి 1939). 18 ఫిబ్రవరి నాడు, డా.పరాంజపే గారి జట్టులోని 18 మంది సత్యాగ్రహులకు ఒక్కొక్కరికి 18నెలల కఠిన కారావాస శిక్ష విధించారు. మార్చి 30న డా. పరాంజపే, శింగణాపూరకర్, పూరణకర్, జోషీ ఇత్యాదుల అభియోగంపై వాదన జరిగి అందులో నిర్దోషులుగా విడుదల చేయబడ్డారు. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారికి ఏప్రిల్ లో సన్మానాలు చేశారు. ఈ సంద‌ర్భంగా డా. పరాంజపే గారు “ఒకవేళ అవసరమైతే  మ‌రోసారి కూడా సత్యాగ్రహం చేయటానికి కూడా నేను సిద్ధం, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పోరాటాన్ని మనం తుదివరకూ కొనసాగించాల్సిందే, అయితే పోరాటంలో పాల్గొన్నానని తెలిసి కూడా ఆ మెజిస్ట్రేట్ నన్నెందుకు విడుదల చేసాడో అర్థం కావడంలేదు అని అన్నారు. (కేసరి , 14 , 25 ఏప్రిల్ 1939)

నాగపూర్ నుండి బయలుదేరిన మిగతా జట్లు

13 ఫిబ్రవరి 1939న సంఘం స్వయంసేవక్ మధుకర్ యాదోరావ్ ఘుయీ గారి ఆధ్వర్యంలో 20మంది ఉద్యమకారుల రెండో జట్టు నాగపూర్ నుండి బయలుదేరింది. (కేసరి, 1ఆగస్టు 1939). అందులో 13 మంది స్వయంసేవకుల వివరాలు సంఘ అభిలేఖాగారంలో నమోదై ఉన్నాయి. (సంఘ అభిలేఖాగార్, హెడ్గేవార్ లేఖనం, correspondence – C/Bhagyanagar nishastr pratikar 0001, 0002)

మధుకర్ యాదోరావ్ ఘుయీ గారి 20 మంది సత్యాగ్రహుల జట్టులోని 10 మంది సంఘ స్వయంసేవకుల వివరాలు :

– మధుకర్ యాదోరావ్ ఘుయీ – నాగపూర్
– నీలకంఠ మాధోరావ్ దంతాళే – నాగపూర్
– సర్దార్ జగత్ జీత సింహ – తినంఖేడా , తా. నరఖేడ్ జి. నాగపూర్
– పంజాబ్ రావ్ పాటీల్ – తినఖేడా
– రాజారాం దినకర్ టెకాడే – నాగపూర్
– మా.గో. రాజణేకర్ – నాగపూర్
– దామోదర్ గోపాళ భాగవత్కార్ (వయస్సు 25 ), కుట్టు వ్యవసాయం — బేలోన్ , తా. నరఖేడ్ జి. నాగపూర్
– విశ్వనాథ్ గంగారాం ఆర్ ఘోడే (వయస్సు 20) రైతు – బేలోన్
– శామారావు ఝోలబా (వయస్సు 20) కుట్టు పని – బేలోన్
– వ్యవహారే

పై జాబితాలోని సంఘ స్వయంసేవకులలో గౌరఖేడే , దంతాళే, భాగవత్ కార్, రాంజణేకర్, ఘుడే, నాయీక్, తుపటే, వారే, సర్దార్ జగత్ జీత సింహ మొదలైన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 3సంవత్సరాల కారాగార శిక్ష పడింది. వ్యవహారే గారికి ఎనిమిదిన్నర నెలల శిక్ష పడింది. బాబూరావు డోకేను నిఘాలో ఉంచారు. ( కేసరి, 30 మే 1939)

నాగపూర్ నుండి బయలుదేరిన 3వ జట్టు, 1939 ఫిబ్రవరి  20న సంఘ స్వయంసేవక్ డా. పవనీకర్ గారి అధ్యక్షతన బయలుదేరింది. ఇది సేలూ , పవనార్, వర్ధా, హింగణఘాట్, వరోడా , చాందా (వర్తమాన చంద్రపూర్)ల  గుండా హైదరాబాదు సంస్థానంలోకి చేరింది. (కేసరి, 24 ఫిబ్రవరి 1939). 1939 మార్చి 10న పవనీకర్ జట్టు అదుపులోకి తీసుకోబడింది. (కేసరి, 1 ఆగస్టు 1939). ఇందులో 30 మంది సభ్యులు ఉండగా అందులోని 13మంది స్వయంసేవకుల వివరాలు సంఘ అభిలేఖాగారంలో నమోదై ఉన్నాయి. (సంఘ అభిలేఖాగార్, హెడ్గేవార్ లేఖనం, correspondence – C/Bhaganagar Nishstr pratikar 0001,0002).

పవనీకర్ గారి 30మంది జట్టులోని 13 మంది స్వయంసేవకుల వివరాలు :

* డా. పవనీకర్
* లక్ష్మణ శంకర బేంద్రే(వయస్సు 22) — పింజణకామ్
* దేవీదాస్ నారాయణ కులకర్ణి (వయస్సు 22)– పింజణకామ్
* రామ సీతారామ డఫళే (వయస్సు 19)– ఆయుర్వేద మహావిద్యాలయ, మొదటి సంవత్సరం
* చింతామణ గోవింద శహాదాణి (వయస్సు 18)
* పురుషోత్తం ప్రభాకర దారవ్హేకర్ —  10వ తరగతి విద్యార్థి
* క్రిష్ణా గోవింద తాంబే
* గోవింద లక్ష్మణ చావకే
* పరమానంద శేఠ
* మారోతి శ్రావణ హరాళే
* గోపాళ రాయ రాత్రా
* లల్లూ దశరథ ఠాకుర్
పురుషోత్తం శ్రీధర్ పాండే

భయ్యాజీ దాణీ గారి పోరాటం

సంఘ సంస్థాప‌న సమావేశంలో పాల్గొన్న, రెండవ సరసంఘచాల‌క్ శ్రీ గురూజీ గోళ్వాల్కర్ ను సంఘ కార్యానికి జోడించిన, 1945 నుండి1956 వరకు గృహస్త ప్రచారకునిలా పనిచేసిన, 1962 నుండి 1965 వరకు సంఘ సర్ కార్యవాహగా బాధ్యత నిర్వహించిన ప్రభాకర్ బళవంత్ (భయ్యాజీ ) దాణీ గారికి సంఘలో ఒక విశేష స్థానం ఉంది.

1938  డిసెంబర్ లో సావర్కర్ గారి అధ్యక్షతన జరిగిన అఖిల భారత హిందూ మహాసభ సమ్మేళనాల   వ్యవస్థ అంతా  డా. హెడ్గేవార్ గారి మార్గదర్శనంలో సంఘ స్వయంసేవకులే చేసారు. ఈ సమ్మేళనాలలో చాలా మంది యువకులు, వృద్ధులు “మేము నిరాయుధపోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాం” అని ఎలుగెత్తి చెప్పారు. అందులో ప్రా.వి.ఘ. దేశపాండే , బాళశాస్త్రీ హరిదాస్, భయ్యాజీ దాణీ కూడా ఉన్నారు. (దేశపాండే, పు. 81). మార్చి 30న భయ్యాజీ దాణీ గారి నేతృత్వంలో బయలుదేరిన 19 మంది  పోరాటకారుల జట్టుకి వీడ్కోలు ఇవ్వడానికి నాగపూర్ లోని టౌన్ హాల్ లో శ్రీమంత రాజాబాళ చిట్నవీస్ గారి అధ్యక్షతన  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా జనం వచ్చారు. వేదికపై డా.హెడ్గేవార్ గారు, మధ్య ప్రాంత సంఘచాలక్ బాబాసాహెబ్ పాధ్యే, శ్రీమంత బాబాసాహెబ్ ఘటాటే, త‌దిత‌రులు ఉన్నారు. అధివక్తా విశ్వనాథ్ రావ్ కేళకర్, ప్రా. దేశపాండే , సాహిత్యాచార్య బాళశాస్త్రీ హరిదాస్ ఈ సభలో తమ  సందేశాలను ఇచ్చారు. భయ్యాజీ సందేశం తరువాత హిందూధర్మ విజయ నినాదాలతో సభ ముగిసింది. (కేసరి, 14 ఏప్రిల్ 1939). ఉమరఖేడ (జి. యవతమాళ)కి 3మైళ్ళ దూరంలో ఉన్న గంగా నది దగ్గర నుంచి నిజాం సంస్థానం ప్రారంభ‌మ‌వుతుంది. అక్కడి నుండే భయ్యాజీ వారి 19 మంది కార్యకర్తల జట్టు నిజాం సంస్థానంలో ప్రవేశించి పోరాటం చేసింది. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి సంవత్సరం పాటు కారాగార శిక్ష విధించారు. (కేసరి, 28 ఏప్రిల్ 1939).

1939 ఏప్రిల్ 28న ఉమరేడ్ లోని గాంధీచౌక్ లో నాగపూర్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు హరీక్రృష్ణ వర్మ గారి అధ్యక్షతన జరిగిన సభలో “భయ్యాజీ కి నిజాం విధించిన పదకొండున్నర నెలల శిక్షను విరోధిస్తూ అలాగే భయ్యాజీ చూపిన త్యాగము, శౌర్యములను ప్రశంసిస్తూ” రెండు ప్రస్తావనలు చేయబడ్డాయి. ఆసిఫాబాద్ జైలులో భయ్యాజీని కొట్టిన వార్త మే 6న బయట పడింది. ముగ్గురు ఉద్యమకారులను సంకెళ్ళతో బంధించార‌ని, వారికి ఒక్కపూట భోజనమే ఇస్తున్నార‌ని, అదికూడా పాడైపోయినద‌ని, దాంతో  వారు భోజనం తినటం మానేస్తున్నారన్న వార్త కూడా వెలువ‌డింది. (కేసరి,5 మే 1939 ).

వామనరావ్ హెడ్గెవార్ గారి ప్రతిజ్ఞా పత్రం

1939 ఏప్రిల్ 5న సంఘ స్వయంసేవక్, సాహిత్యాచార్యుడు బాళశాస్త్రీ హరదాస్ గారి నేతృత్వంలో నాగపూర్ నుండి ఒక బృందం బయలుదేరింది. ఏప్రిల్ 13న హరదాస్ గారు వారి బృందం ఔరంగాబాద్ లో సత్యాగ్రహం చేసారు. వారందరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత హిందూ మహాసభ, జనసంఘ్ నాయకులుగా ప్రఖ్యాతి పొందిన ప్రా. విష్ణువును శ్యామ్ దేశపాండే , వారితోపాటు ఉన్న ఏడుగురు ఉద్యమకారుల‌ను ఏప్రిల్ 16న హైదరాబాదు లో నిర్బంధించారు. వారందరికీ 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ జట్టులో పాండురంగ ఆసారాం సావర్కర్, వామన మోరేశ్వర హెడగేవార్ ఇద్దరూ సంఘ స్వయంసేవకులు. వామన రావు గారు డాక్ట‌ర్ జీ తమ్ముడి వరుస. 1944 – 47 వరకు నరసింగపుర, బిహారులో వీరు సంఘ ప్రచారకులుగా ఉన్నారు.

పాండురంగ పంత సావర్కర్, వామన రావు హెడ్గేవార్ లు, నిజాం జైలులో అనుభవాలను తమ ప్రతిజ్ఞా పత్రంలో రాసుకున్నారు. “నా పేరు పాండురంగ ఆసారాం సావర్కర్, నేను ప్రో. దేశపాండే గారి బృందంలో హైదరాబాదు సత్యాగ్రహంలో పాల్గొన్నాను. నన్ను హైదరాబాదులో 17/4/39 రోజున అరెస్టు చేసి, సంవత్సరం పాటు క‌ఠిన కారాగార శిక్ష విధించారు. అక్కడ మేము తినే అన్నంలో మాంసం ముక్కలు వచ్చాయి. మేము దీన్ని అధికారులకి చెప్పి ఎదిరించడం వల్ల 8 రోజులు (గంజీ) చీకటి గదుల్లో పెట్టారు. క్షమాపణ కోరాలని మ‌మ్మల్ని బలవంతం చేశారు. ప్రముఖులను ముందుగా విడుదల చేస్తున్నారు. ప్రో.దేశపాండే గారితో కూడా ఏదో అభిప్రాయభేదం వచ్చి వారిని, వారి అనుయాయులను 4రోజులు గంజీలో ఉంచారు. మాతో సంతకాలు తీసుకుంటున్నారు. మేము సంతకాలు చేయకపోతే మమ్మల్ని చావబాదుతున్నారు. కాళ్ళు చేతులకి సంకెళ్ళు బిగించి చీకటి గదిలో పడేస్తున్నారు. అన్నంలో మాంసం ముక్కలు రావడంతో 120మంది కార్యకర్తలు ఉపవాసం మొదలుపెట్టారు. అక్కడి అధికారితో ఏదో మాటపై ఘర్షణ పడ్డామనే నెపంతో నన్ను, హెడ్గేవార్ గారిని కొట్టారు. బలవంతంగా కాగితాలపై మా వేలిముద్రలు తీసుకున్నారు. మేము క్షమాపణ కోరలేద‌ని దరఖాస్తు పెట్టుకున్నా దాన్ని పట్టించుకోకుండా జైలులో చోటులేని కారణంగా మిమ్ములను బయటికి పంపేసారు. ఈ విధంగా ఎన్నో మోసాలు చేస్తూ సత్యాగ్రహులను బలవంతంగా బయటకు తోలేస్తున్నారు “. (కేసరి,9 జూన్ 1939).

కేళకర్, నాయీక్, ఆంబోకర్ ల ప్రతిఘటన

1939 మే 10న నాగపూర్ లోని టౌన్ హాల్ ప్రాంగణంలో డా.ముంజే గారి అధ్యక్షతన సుమారు 10వేల మంది హాజరైన సభలో నాగపూర్ సంఘ చాలకులు విశ్వనాథ్ వినాయక్ కేళకర్, ఉమరఖేడ్ హిందూ సభ నాయకులు, సంఘ కార్యకర్త అయిన నానా సాహెబ్ నాయిక్ గార్లకు వీడ్కోలు చెప్పారు. (కేసరి, 19 మే 1939). 1939 మే 16న పూనాకి చెందిన వినాయకరావు ఆప్టే గారికి రాసిన లేఖలో డాక్ట‌ర్ జీ ఇలా అంటారు – కానీ, 10వ తేదీ సాయంత్రం శ్రీ. విశ్వనాథ్ రావు కేళకర్, శ్రీమంత నానాసాహెబ్ నాయిక్ గార్ల బృందానికి వీడ్కొలు కార్యక్రమంలో నేను ఉండాల్సి ఉంది. కాబట్టి నా ఆరోగ్యానికి మంచిది కాకపోయినా ఈ రైలుకే నేను నాగపూర్ బయలుదేరవలసి వచ్చింది. నిర్ణయానుసారం వారందరూ సత్యాగ్రహానికి బయలుదేరారు”. (సంఘ అభిలేఖాగార్, హెడ్గేవార్ రాతలు, Dr. Hedgewar letters cleaned/May 1939 16.5.39 b). 200 మంది హిందూ మహాసభ ఉద్యమకారులతో కేళకర్  మే 13న నాగపూర్ నుండి ఔరంగాబాద్ కి వచ్చారు. 1939 మే 14న ఆంజనేయస్వామి ఆలయంలో వీరి ప్రసంగం నడుస్తూ వుండగా పోలీసులు వీరందరిని అదుపులోకి తీసుకున్నారు. ఔరంగ‌బాద్ జైలుకి వీళ్ళందరినీ తరలించారు (కేసరి, 16 మే 1939). 1939 మే 16న నాయిక్ గారు వారి సహచరులను సిర్ పూర్ లో బంధించారు. (కేసరి, 13 మే 1939).

న్యాయవాది నారాయణ కృష్ణాజీ (నానాజీ ) ఆంబోకర్ గారు మధ్యప్రాంత కేంద్ర 13వ‌ సర్వాధికారి అలాగే సావనేర్ సంఘ చాలకులు, వీరు జూన్ 10న తమ బృందంతో నాగపూర్ నుండి బయలుదేరారు. అంతకు ముందు రోజున టౌన్ హాల్ ప్రాంగణంలో డా. ల.వా. పరాంజపే గారి అధ్యక్షతన సుమారు 8, 9 వేల మందితో జరిగిన కార్యక్రమంలో ఆంబోకర్ గారు వారి జట్టుకి కూడా వీడ్కోలు చెప్పారు. ఇదే సమావేశంలో హిందూ సభ సంఘ కార్యకర్త అనంత సదాశివ్ (భిడే గురూజీ) గారికి వారు చేసిన పోరాటానికి సన్మానం చేశారు. ఇందులో డా.హెడ్గేవార్ గారు ఉన్నారు (కేసరి,6,9,20  జూన్ 1939). 17 జూన్ 1939 ఆంబోకర్ గారి జట్టు ఔరంగాబాద్ సుపారీ మారుతి వద్ద ప్రతిఘటన చేసారు . 12వందల మంది ముందు కొంతసేపు మాట్లాడిన తరువాత వారిని నిర్బంధించారు.

భాగ్య‌నగర్ ప్రతిఘటనలో 18మంది తమ ప్రాణాలను బలిదానం చేశారు. వాళ్ళల్లో డా. పవనీకర్ గారి బృందంలోని పురుషోత్తం ప్రభాకర్‌ దార్హవేకర్ అనే నాచణగావ (జిల్లా వర్ధా)కి చెందిన పదవతరగతి చదివే సంఘ స్వయంసేవక్ ఉన్నాడు. అతడి బలిదానాన్ని కేసరి పత్రిక ఈ విధంగా రాసింది. ఆసిఫాబాద్ జైలులో ఉన్న వర్ధా జిల్లా  నాఛణగావ్ కి చెందిన పోరాటకర్త శ్రీ పురుషోత్తమ ప్రభాకర్ దారవ్హేకర్ సందేహాస్పద స్థితిలో 17 జులై ఉదయం మరణించారు. పది రోజులుగా అనారోగ్యంతో ఉన్న అతన్ని జైలు డాక్ట‌ర్ ఒక్కసారి కూడా చూడకపోగా, అతడు మరణించే ముందు రోజున హైదరాబాదు వెళ్ళిపోయాడు. మృతుడి అన్నగారికి తంతి పంపి పిలిపించారు. 15న ఆయన పోలీసు స్టేషన్ కి , వెళితే పోలీసులు ఆయనను నానా హింసలు పెట్టారు. ఆ తరువాత ఊళ్ళోకి వెళ్ళినపుడు తమ్ముడి మరణవార్త తెలిసింది. అప్పుడు జైలుకి వివరాలకై వెళితే “హమ్ కుఛ్ నహీ జాన్ తే” అని కసిరికొట్టారు. కనీసం మరణ సమయంలో అతడితో ఉన్నవాళ్ళతో అయినా వివరాలు తెలుసుకుందామని ప్రయత్నిస్తే అది కూడా జరగనీయ లేదు (కేసరి,25 జులై 1939 ) .

మధ్యప్రాతం, వర్హాడ్ లోకి సంబంధించిన వివరాలు ఈ భాగంలో చూసాం, మిగతా ప్రాంతాల స్వయంసేవకుల గురించి తరువాతి భాగంలో చూద్దాం.

 Read Also : హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: మొద‌టి భాగం

హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: రెండవ భాగం

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – మూడ‌వ‌ భాగం

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – నాలుగవ భాగం

హైదరాబాదు (భాగ్యనగర్) నిరాయుధ ప్రతిఘటన – ఐద‌వ భాగం