Home Telugu Articles హేవిళంబికి స్వాగతం

హేవిళంబికి స్వాగతం

0
SHARE

కోయిల సుమధుర గానం… ఆలపించే వేళ..మావి చిగుర్ల వగరు… వేపపూత పరిమళాలతో ప్రకృతి పరవశించిన వేళ..

కొత్త ఆలోచనలకు, ఆశయాలకు శ్రీకారం చుడుతూ చైత్రశుద్ధ పాడ్యమి దినాన ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం శ్రీ హేవిళంబి నామ సంవత్స రానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో ఉగాది జరుపుకుందాం.

ఉగాది అంటే సంస్కృతీ వికాస పర్వదినం. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏ దేవీ దేవతలను పూజించే పండుగ కాదు. ఎవరికివారు తమ ఇష్టదైవాన్ని ఆరాధించవచ్చు. తెలుగు పంచాంగం ప్రకారం సంవత్సరంలో మొదటి మాసం మొదటి రోజున జరుపుకునే పండుగ ఉగాది. ఇది తెలుగువారి మొదటి పండుగ. భారతీయ ధర్మంలో, ఆచార వ్యవహారాలలో కాలగణనకు మూడు రీతులున్నాయి. అవి చంద్రమాన, సౌరమాన, బార్హస్పత్య మానాలు. మనం ముఖ్యమైన పండుగలను చంద్రమానానుసారంగానే జరుపుకుంటాం. అయితే సంక్రమణాల్లో ముఖ్యమైన ధనుస్సంక్రమణం, మకర సంక్రమణాలను సూర్యగమన ఆధారంగా జరుపుకుంటాం.

‘ఉగాది’ అనే మాట సంస్కృత శబ్ధం యుగాది నుంచి వచ్చినది. యుగాలు నాలుగు. అవి కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు. వాటి ప్రారంభ దినాలను యుగాదులుగా గుర్తిస్తారు. అయితే ఇక్కడ ఉగాది అంటే సంవత్సర ప్రారంభ దినం. ప్రభవ నుండి అక్షయ వరకు అరవై సంవత్సరాలున్నాయి. ఇవి పునరావృతం అవుతూ ఉంటాయి. అందులో హేవిళంబి ఒకటి. ఆంధ్రులు, మహారాష్ట్రీయులు, కన్నడిగులు చైత్రశుద్ధ పాడ్యమినే వారి నూతన సంవత్సర ప్రారంభ దినంగా పరిగణిస్తారు. ఇతర ప్రాంతాలలో వేరు వేరు దినాలలో వారి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

సృష్టి క్రమం ఎంత విచిత్రమైనదో, అంతే విశిష్టమైనది కూడా. శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలి మోడువారిపోతాయి. వసంత ఋతువు ప్రారంభం కాగానే చెట్లలో నవచైతన్యం వస్తుంది. వేపచెట్లు సుగంధిత పూలతో నవ వధువులా గోచరిస్తాయి. మామిడి చెట్లకు పిందెలు వచ్చి క్రమంగా కాయలుగా రూపాంతరం చెందుతాయి. ప్రకృతి కాంత ఆనందంతో నాట్యమాడుతుంది.

పేద, ధనిక భేదం లేక అన్ని కులాలవారు సమాన ఆనందానుభూతులతో ఆచరించే పర్వదినం ఉగాది. ఈ పండుగ కోసం ప్రజలు ఎదురుచూస్తారు. పండుగను స్వాగతించడానికి గృహాలను రమణీయంగా అలంకరించుకుంటారు. ఇల్లు అశుచిగా ఉంటే లక్ష్మీదేవి రాదని, ఇంట్లో బూజులు దులుపుతారు. చెత్త, పనికిరాని వస్తువులను తీసి వేస్తారు. గృహాలకు వెల్లవేస్తారు. ద్వారాలకు మామిడాకు తోరణాలు కడతారు. గుమ్మాలను పసుపుకుంకుమలతో అలంకరిస్తారు. బయట కళ్ళాపి జల్లి ముగ్గులు వేస్తారు. గృహంలోని పూజా గృహాన్ని విశేషంగా అలంకరిస్తారు. ఈ దినం సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి షోడశోపచార పూజ చేస్తారు.

నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. జలంలో గంగాదేవి ఉంటుంది అనేది శాస్త్రోక్తి. తెల్లవారు ఝామున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని, సున్నిపిండితో నలుగు పెట్టుకొని, కుంకుడు రసం లేదా శీకాయ రసంతో తలంటుకోవాలి. ఆ రోజున నూతన వస్త్రాలను ధరిస్తారు.

పిల్లలకు పండుగల సమయాల్లోనూ సత్సంప్రదాయాలు నేర్పడం పెద్దల విధి. భవిష్యత్‌ తరాలకు మన సంప్రదాయాలను తెలపడం, వాటిని మనం కాపాడుకోవటం మన కర్తవ్యం. నూతన వస్త్రాలు ధరించిన చిన్నవారు బొట్టు పెట్టుకొని పెద్దలకు నమస్కరించాలి. అలా బోధించి వారిచేత ఆచరింపజేయడం పెద్దల కర్తవ్యం.

సాధారణంగా పండుగ వచ్చిందంటే పిండివంటలు చేస్తారు. వాటిని మనం నిత్యం పూజించే దైవానికి నైవేద్యం పెట్టాలి. ఈ పండుగ నాడు మరొక ప్రత్యేకం ప్రసాదం చేస్తారు. దాన్ని ఉగాది పచ్చడి అంటారు.

అబ్జాదాన్‌ నింబ కుసుమం శర్కరామ్లఘృతైద్యుతమ్‌

భక్షితం పూర్వయామేతు తద్దివ్యం సౌఖ్యదాయకమ్‌

వేపపూత (పువ్వు), కొత్త బెల్లం (పంచదార), చింతపండు, నేయి, మిరియాలు ఉప్పు కలిపి చేసిన పదార్థాన్నే ఉగాది పచ్చడి అంటారు. ఈ పచ్చడిని ఇష్ట దైవానికి నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా తీసుకోవాలి. ఇది ఆరు రుచులతో కూడుకొని ఉన్నది. ఇది కష్టసుఖాల మిళితమైన మానవ జీవితానికి సంకేతంగా పేర్కొన్నారు. ఇది ఔషధీయుక్తమైనది. ఈ పచ్చడి తిన్నవారికి రోగశాంతి, వాతపిత్త దోషాలు తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నేటి వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తున్నది.

ఈనాటితో కొత్త పంచాంగం వస్తుంది. పురాతన కాలంలో కాగితాలు, ముద్రణ సౌకర్యం ఉండేవి కావు. శాస్త్రవేత్తలు తాళపత్రాల మీద ఘంటంతో వ్రాసేవారు. పండుగ నాడు మధ్యాహ్నం లేదా సాయంత్రం దేవాలయాలలో లేదా రచ్చబండ వద్ద కాని సిద్ధాంతులు ఆ ఊరి జనాలకు పంచాంగం చదివి వినిపించేవారు. ఇప్పుడు ముద్రితమైన పంచాంగాలు సులభంగా లభ్యమవుతున్నా పుర్వాచారం ప్రకారం పంచాంగ శ్రవణం జరుగుతోంది. పంచాంగంలో సంవత్సరంలో జరగబోయే శుభాశుభాలు, గ్రహణాలు ఎప్పుడు వస్తాయో, వారి వారి జన్మ లేదా నామ నక్షత్రాల ప్రకారం మాసఫలాలు, కందాయ ఫలాలు, ఆదాయం-వ్యయం, రాజపూజితం-అవమానం వంటి సమస్త విషయాలను సిద్ధాంతి ముఖతః తెలుసుకుంటారు. పంచాంగ శ్రవణం గంగా స్నానం చేసినంత పుణ్యప్రదమని శాస్త్రవచనం.

ఉగాది పండుగతో సంబంధం ఉన్న మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని పట్టాభిషేకం ఈ దినాన్నే జరిగింది. చక్రవర్తి విక్రమాదిత్యుడు రాజ్యాన్ని చేపట్టినది, శకకారుడైన శాలివాహనుడు కిరీటధారణ చేసినదీ ఈ రోజునే. ఆనాటి నుంచి శాలివాహన శకం అమలులోకి వచ్చింది. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండునందనుడు ధర్మరాజు హస్తినకు రాజైనదీ ఈ ఉగాది శుభదినాన్నే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు జన్మించినది కూడా ఉగాది రోజునే.

ఉగాదినాడు నూతన కార్యాలు ప్రారంభిస్తే అవి ఫలిస్తాయంటారు. సుఖసౌఖ్యాలకు పుష్టిగా ఇచ్చే పర్వదినం ఉగాది. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పి శ్రీహేవిళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.

– గుమ్మా ప్రసాదరావు

(జాగృతి సౌజన్యం తో)