Home News ఉమ్మడి పౌర స్మృతి త్వరలో అమలు చేయాలి –  VHP

ఉమ్మడి పౌర స్మృతి త్వరలో అమలు చేయాలి –  VHP

0
SHARE
ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని లా కమీషన్ పరిశీలనకు పంపడాన్ని విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ కార్య‌వ‌ర్గ సమావేశంలో ఈ విషయమై హర్షం వ్యక్తం చేశారు. లా కమిషన్ ఈ అంశంపై భాగస్వాముల నుండి అభిప్రాయాలను ఆహ్వానించడం సంతోషం కలిగించే విషయమని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అంత‌ర్జాతీయ కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షులు శ్రీ అలోక్ కుమార్ జీ అన్నారు. భారతీయ సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలు, సూచనలు సేకరించిన అనంతరం UCCని అమలు చేయాలన్నారు.
రాజ్యాంగంలోని 44వ అధికరణం అన్ని ప్రభుత్వాలను, భారత భూభాగం అంతటా పౌరులకు ఒకేవిధమైన ఉమ్మడి పౌర స్మృతి అమలుచేయాలని నిర్దేశిస్తుందని ఆయన అన్నారు.
“భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం, విధేయతతో” అన్న వాక్యంతో ప్ర‌మాణ స్వీకారం చేసిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మ‌డి పౌర స్మృతి ని తీసుకురాలేకపోవడం చింతించాల్సిన విషయమని శ్రీ అలోక్ కుమార్ అన్నారు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సరళా ముద్గల్ కేసులో తీర్పునిస్తూ, వీలైనంత త్వరగా UCC అమలులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిందని ఆయ‌న గుర్తు చేశారు. దేశంలోని అనేక హైకోర్టులు కూడా పదేపదే, వివిధ సందర్భాల్లో ఉమ్మ‌డి పౌర స్మృతి తప్పనిసరి అన్న విషయాన్ని ఉద్ఘాటించాయి. “మత వైవిధ్యాలను దాటి దేశ ప్రజలందరి మధ్య సామరస్యాన్ని ఉమ్మడి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం” 51A అధికరణం ప్రకారం పౌరులందరి ప్రాథమిక విధి అని కోర్టు గుర్తు చేసింది.
భారత్‌లో, పౌరులందరూ క్రిమినల్ చట్టాలు, ఆస్తి, కాంట్రాక్ట్, వాణిజ్య చట్టాలతో సహా సాధారణ చట్టాల పరిధిలో ఉంది. ఆ చట్టాలకు కట్టుబడి జీవిస్తారు. అలాంటి పరిస్థితిలో కుటుంబ చట్టాలు మాత్రమే మినహాయింపుగా ఉండాలని  భావించడానికి ఎటువంటి కారణం లేదని ఆయన అన్నారు.
ఒక మతానికి చెందిన వారి వ్యక్తిగత చట్టాలు మహిళల గౌరవం, సమానత్వం మొదలైన హక్కులను తీవ్రంగా కాలరాస్తున్నాయని నిర్వివాదంగా చెప్పవచ్చు, బహుభార్యత్వం, విడాకులు, వారసత్వాల గురించిన వారి నిబంధనలు ఆధునిక కాలం కంటే దాదాపు 1400 సంవత్సరాల వెనుకబడి ఉన్నాయి. అటువంటి వ్యక్తిగత చట్టాల కింద అనుసరించే పద్ధతులు, మన రాజ్యాంగం మహిళలకు సమాన పౌరులుగా ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే. అదేవిధంగా, పిల్లల హక్కులను కూడా ఉమ్మడి పౌర స్మృతి  కింద రక్షించాల్సిన అవసరం ఉంది. సమాజంలో వివిధ వర్గాలు అనుసరించే ఉత్తమ పద్ధతులు కలబోసి, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా లా కమిషన్ ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదాను త్వరలోనే సిద్ధం చేస్తుందని, భారత్‌లోని పౌరులందరికీ ఒకే విధమైన పౌర స్మృతిని త్వరగా అమలులోకి తీసుకురావాలని VHP ఉత్సుకత, విశ్వాసంతో ఎదురు చూస్తోంద‌ని అలోక్ జీ అన్నారు.