Home News మణిపూర్ అల్లర్లు మతపరమైనవి కావు – వనవాసి కళ్యాణ పరిషత్ సహ సంఘటనా మంత్రి

మణిపూర్ అల్లర్లు మతపరమైనవి కావు – వనవాసి కళ్యాణ పరిషత్ సహ సంఘటనా మంత్రి

0
SHARE

కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా మండుతోంది. ఈ ఘర్షణల నుండి లాభం పొందాలని కొన్ని విదేశీ శక్తులు కూడా ప్రయత్నిస్తున్నాయి. గొడవలను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క బాధితులకు సహాయం అందించడానికి వనవాసీ కళ్యాణ పరిషత్, ఆర్ ఎస్ ఎస్, సేవభారతి కృషిచేస్తున్నాయి. ఘర్షణలకు కారణం, పరిష్కారం, బాధితులకు సేవాకార్యక్రమాల గురించి వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత సహ సంఘటనామంత్రి శ్రీ సందీప్ కవీశ్వర్ జీ , విశ్వ సంవాద కేంద్ర తెలంగాణాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

ప్రశ్న: గత మూడు నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు మూల కారణం ఏమిటి?

జవాబు: ఈ అల్లర్లకు మూల కారణం ఒక్కటి మాత్రమేనని చెప్పలేము. ఇందులో రెండు, మూడు అంశాలు ఉన్నాయి. మైతేయిలు, కుకీలు వందల సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు. వీళ్లలో ఎవరూ బయటనుండి వచ్చినవారు కాదు. కొద్దిమంది కుకీలు పక్కనే ఉన్న మయన్మార్ నుండి వచ్చిన మాట నిజమేకానీ కుకీలంతా బయటనుండి వచ్చినవారేనని చెప్పలేము. కాబట్టి ఇది బయటనుండి వచ్చినవారి వల్ల వచ్చిన సమస్య అని అనుకోరాదు. ఇన్ని ఏళ్లపాటు కలిసిమెలిసి శాంతియుతంగా జీవించినవారి మధ్య గత 20, 30 ఏళ్లుగా ఘర్షణ చెలరేగడానికి కారణం ఏమిటన్నది ఆలోచించాలి. మైతేయిలకు ఆగ్రహం రావడానికి, కుకీలలో అసంతృప్తి చెలరేగడానికి రెండు, మూడు కారణాలు ఉన్నాయి. మయన్మార్ నుండి 50వేల మంది కుకీలు వచ్చిపడ్డారని, వాళ్ళు అడవులను ఆక్రమించుకున్నారని, మాదకద్రవ్యాల రవాణా చేస్తున్నారని, అక్రమ చొరబాటులు, తీవ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయని మైతేయిల ఆరోపణ. కుకీలకు చెందిన 27 వేర్పాటువాద సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం తమ కార్యకలాపాలు నిలిపివేస్తామని ఆ సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందం జరిగిన తరువాత ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు వారివారి కేంద్రాలలోనే ఉండాలి. కానీ కుకీల వైపు నుంచి అది జరగలేదు. మైతేయిలకు కూడా కె.ఎల్.ఫ్, పి.ఎల్.ఏ వంటి కొన్ని వేర్పాటువాద సంస్థలు ఉన్నాయి. కానీ ఇటీవల అల్లర్లకు కారణం వేరు. కొంతకాలంగా తమకు ఎస్.టి హోదా ఇవ్వాలని మైతేయిలు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్ట్ కూడా వారి డిమాండ్ నెరవేర్చాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ వాస్తవానికి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కోర్టులకు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అధికారం లేదు. ఆ అధికారం శాసన సభది. మొదట అసెంబ్లీ తీర్మానం ఆమోదిస్తుంది, తరువాత రిజిస్ట్రార్ తన ఆమోదం తెలుపుతారు, ఆ తరువాత గిరిజన కమిషన్ ముందుకు వెళుతుంది, కమిషన్ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు విషయాన్ని నివేదిస్తుంది, మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి రాష్ట్రపతి అనుమతి కోసం పంపుతుంది. చివరికి రాష్ట్రపతి ఆమోదంతో ఎస్ టి హోదా లభిస్తుంది. ఇది రాజ్యాంగ ప్రక్రియ. కోర్టు నేరుగా ఫలానా వర్గానికి ఎస్ టి హోదా ఇవ్వాలని ఆదేశించడానికి లేదు. కేవలం సూచన చేయవచ్చును, లేదా సలహా ఇవ్వవచ్చును. అంతేకాని వారం రోజుల్లో ఎస్ టి హోదా ప్రకటించాలని ఆదేశాలు జారీచేయడానికి వీలులేదు. కానీ కోర్టు అలా ఆదేశాలు జారీచేసింది. దానితో వేర్పాటువాద సంస్థలు, దేశవ్యతిరేక శక్తులు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ గొడవ ప్రారంభించాయి. మైతేయిలకు ఎస్ టి హోదా ఇవ్వడానికి వీలులేదని వాదించాయి. అయితే 90శాతం భూమి 40శాతం జనాభా ఉన్న వర్గాల చేతిలో ఉందని, 50శాతం జనాభా ఉన్న తమ వద్ద 10 శాతం భూమి మాత్రమే ఉందని మైతేయిలు అంటున్నారు. ఈ విషయం నిజమే. కానీ భూమిపై హక్కు ఇవ్వడానికి అందరికీ ఎస్ టి హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్టి హోదా మరొక పద్దతిలో కల్పించవచ్చును. ఈ విషయమై గొడవ ప్రారంభమైంది. మిగతా తెగలవారు దీనిని వ్యతిరేకించారు. మే, 3న మణిపూర్ లో అన్నీ తెగలవారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అది శాంతియుతంగానే సాగింది. సుడాచాంద్ పూర్ అనే కుకీ ఆధిక్యత కలిగిన ప్రదేశంలో మాత్రం హింస చెలరేగింది. అప్పటివరకూ కార్యకలాపాలు కట్టిపెట్టి అజ్ఞాతంలో ఉన్న కొన్ని వేర్పాటువాద సంస్థల కార్యకర్తలు ఆయుధాలు తీసుకుని హింసకు పాల్పడ్డారు. రెండు, మూడు రోజులపాటు ఈ హింసాత్మక ఘటనలు సాగాయి. ప్రభుత్వం అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే అక్కడితో పరిస్తితి అదుపులోకి వచ్చి ఉండేది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో హింస పెరిగిపోయింది. కొన్ని చర్చిలు, దేవాలయాలపై దాడులు జరిగాయి. కొన్ని హత్యలు జరిగాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన మహిళలపై అత్యాచార సంఘటన జరిగి నెల రోజులైన తరువాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అయితే ఈ సంఘటనలను ఆధారం చేసుకుని పరిస్థితులను మరింత దిగజార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి రెండు తెగల వారి మధ్య చర్చలు సాగాలి, సానుకూలమైన ధోరణి ఏర్పడాలి. చొరబాట్లు కేవలం కుకీల వల్లనే జరగడం లేదు. ముస్లిములు కూడా అక్రమంగా ప్రవేశిస్తున్నారు. వేర్పాటువాద కార్యకలాపాలకు, మాదకద్రవ్యాల రవాణాకు తమ వర్గాన్నే పూర్తిగా బాధ్యులను చేయకూడదని, నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించడంలో తమకు ఎలాటి అభ్యంతరం లేదని కుకీలు అంటున్నారు. కాబట్టి సమస్య హిందువులు, క్రైస్తవుల మధ్య తలెత్తిందని, దేవాలయాలు లేదా చర్చిలు మాత్రమే దాడులకు గురవుతున్నాయనే మాటలో యదార్ధం లేదు. ఇది రెండు తెగల మధ్య జరుగుతున్న వివాదం. అది కూడా భూమికి సంబంధించినది.

ప్ర. ఇది హిందువులు, క్రైస్తవుల మధ్య వివాదం కానప్పటికీ, దానిని అలా చూపడానికి క్రైస్తవ మిషనరీలు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

జ. విదేశీ శక్తులు ఈ వివాదంలో తలదూర్చాయన్నది స్పష్టమవుతోంది. కొందరు విదేశీ మిషనరీలు ఇక్కడికి వచ్చి సమస్యను మరింత పెంచడానికి ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం వాళ్ళని తిప్పి పంపింది. దానితో వాళ్ళు భారత్ లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు. కుకీ క్రైస్తవులపై మాత్రమే దాడులు జరుగుతున్నమాట వాస్తవమైతే మైతేయిలకు చెందిన చర్చ్ లపై కుకీలు ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే మైతేయి క్రైస్తవులు కుకీ చర్చ్ లను తగులబెట్టారు. దీనినిబట్టి ఇది రెండు తెగల మధ్య ఘర్షణ అని, హిందువులు, క్రైస్తవుల మధ్య గొడవ కాదని స్పష్టమవుతోంది.

ప్ర. ఈ గొడవలకు కారణం తమ అధిష్టానపు నిర్లక్ష్య ధోరణి అని మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు కదా. ఈ సంఘటనల వెనుక రాజకీయ పార్టీల పాత్ర ఏమిటి?

జ. ఈ వివాదాల్లో తల దూర్చి రాజకీయ ప్రయోజనాలు పొందాలని పార్టీలు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. మణిపూర్ లో అధికార పక్షమైన బిజిపి కి చెందిన ఒక ఎంపీ ఇల్లు తగలబెట్టారు. మిజోరాంలో కూడా ఇతర రాజకీయ నాయకులపై దాడులు జరిగాయి. కాబట్టి ఇది రాజకీయ వివాదం, ఘర్షణ కాదు. మూడు నెలలుగా హింస చెలరేగుతున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు తప్పక వస్తాయి. అయితే ఇది రాజకీయ క్రీడ అని అనుకోరాదు.

Also Read : మండుతున్న మణిపురం

ప్ర. దాడులకు పాల్పడుతున్న వారు ఆధునిక మారణాయుధాలను ఉపయోగిస్తున్నట్లు వివిధ వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. దీనికి కారణం ఏమిటంటారు?

జ. ఇంతకు ముందు చెప్పినట్లుగా కుకీలకు చెందిన వివిధ వేర్పాటువాద సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు వారి దగ్గర ఉన్న ఆధునిక మారణాయుధాలను స్థానిక పోలీస్ స్టేషన్ లలో అప్పగించారు. కానీ ఇప్పుడు వాటినన్నింటిని తిరిగి తీసుకున్నట్లు తెలుస్తోంది. మైతేయీ ల చేతిలో కూడా ఇలాంటి ఆయుధాలు కనిపిస్తున్నాయి. వేర్పాటువాద సంస్థల జోక్యం ఇరువైపులా పెరిగిపోవడంతో ఘర్షణ పెరిగింది. సాధారణ ప్రజానీకం, ముఖ్యంగా మణిపూర్ ప్రజలు, శాంతియుతంగానే జీవిస్తారు. వేర్పాటువాద సంస్థలు, కొన్ని విదేశీ శక్తుల జోక్యం వల్ల ఇలాంటి పరిస్తితి ఏర్పడింది. చైనా వంటి దేశాల హస్తం కూడా ఇందులో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

ప్ర. ఈ గొడవల వెనుక ఆర్.ఎస్.ఎస్, తదితర జాతీయవాద సంస్థల హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు?

జ. ఈ గొడవలకు ఆర్.ఎస్.ఎస్ కు సంబంధం లేదని క్రైస్తవ కుకీ నాయకులు కూడా వివిధ ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు. కరణ్ థాపర్ మొదలైనవారికి ఇచ్చిన ఇంటర్వ్యూ లలో కుకీ నాయకులు ఈ విషయం చెప్పారు. ఇది తమ రెండు తెగల మధ్య గొడవ అని, దీనికి ఆర్ ఎస్ ఎస్ తో ఎలాంటి సంబంధం లేదని అటు కుకీలు, ఇటు మైతేయిలు చెపుతున్నారు. అయితే అల్లర్లను అదుపుచేయడంలో వెనుకబడుతున్న ప్రభుత్వాన్ని మరింత విమర్శించేందుకు ఆర్ ఎస్ ఎస్ పేరును కొందరు తీసుకువస్తున్నారు తప్ప రెండు వర్గాల వారిలో ఎవరూ ఆర్ ఎస్ ఎస్ పేరును ప్రస్తావించడం లేదు. బయట మీడియాలో కొందరు ఇలాంటి ప్రచారం చేస్తుండవచ్చునుకానీ స్థానికులలో ఎవరు ఈ ఆరోపణ చేయడం లేదు. పైగా ఆర్.ఎస్.ఎస్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల కుకీలతోపాటు మైతేయీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర. అల్లర్లను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? ఇందుకు కారణమేమిటి?

జ. గొడవులు చెలరేగినప్పుడు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అవి వాటంతట అవే సమసిపోతాయని భావించింది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అల్లర్లను అదుపుచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సమస్య ఏమిటంటే ప్రతి గ్రామంలోను పోలీసు బలగాన్ని ఉంచలేరుకదా. పైగా ఈ పరిస్థితి నుండి ప్రయోజనం పొందాలనుకునే శక్తులు కొన్ని ఉంటాయి. అవి శాంతియుత స్థితి నెలకొనకుండా చూడాలనుకుంటాయి. కుకీలకు చెందిన 10 వేర్పాటువాద సంస్థలు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కొన్ని సంస్థలు తమకు ప్రత్యేక పాలనా వ్యవస్థ కావాలని, ప్రత్యేక జెండా, రాజ్యాంగం కావాలని పట్టుబడుతున్నాయి.

ప్ర. పరిస్థితిని శాంతపరచడానికి వనవాసి కళ్యాణ పరిషత్, ఆర్.ఎస్.ఎస్, సేవభారతి ఎలాంటి కృషి చేస్తున్నాయి?

జ. 270 సహాయ కేంద్రాల్లో 70 వేల మంది ఉన్నారు. అనేక చోట్ల కళ్యానాశ్రమం, సేవాభారతి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలాగే శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.